
బుల్లితెరపై బాలయ్య హీరోయిన్!
రక్తచరిత్ర, ధోనీ, లెజెండ్ సినిమాలు చూసినవాళ్లకి రాధికా ఆప్టేని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. అవ్వడానికి మహారాష్ట్ర అమ్మాయే అయినా, హిందీ సీమలో కంటే తెలుగువారికే ఎక్కువ తెలుసు రాధిక. ప్రస్తుతం బాలకృష్ణతో మరో సినిమా కూడా చేస్తోంది. అయితే జనాలు గుర్తుపట్టగలిగే పాత్రలే తప్ప, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయలేకపోయిందామె. నిరాశే చెందిందో, నటతృష్ణ తీర్చుకోవడానికి ఆరాటపడుతోందో తెలియదు కానీ... సీరియల్స్‌లో నటించడానికి అప్పుడే సిద్ధపడిపోయింది.
బర్ఫీ, లైఫ్ ఇన్ మెట్రో లాంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు తీయనున్న ‘చోకర్‌బాలి’ డైలీ సోప్‌లో ప్రధాన పాత్రలో కనిపించనుంది రాధిక. రవీంద్రనాథ్ ఠాగూర్ రచన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సీరియల్, గతంలో సినిమాగా కూడా వచ్చింది. అందులో ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు అదే పాత్రను సీరియల్‌లో రాధిక చేయబోతోంది. ఆమె పాత్ర పేరు వినోదిని.
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని, సమాజంలో అవమానాలు, ఇబ్బందుల పాలయ్యే పాత్ర. నటనకు బాగా ఆస్కారం ఉండటం... అనురాగ్ డెరైక్షన్లో, అది కూడా ఐశ్వర్య చేసిన పాత్రను చేసే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది రాధిక. మరి బుల్లితెర అయినా ఆమెకు తగిన గుర్తింపునిస్తుందో లేదో చూడాలి!