చల్లని కాఫీ | Cold coffee: Funday story of the week | Sakshi
Sakshi News home page

చల్లని కాఫీ

Published Sun, Oct 5 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

చల్లని కాఫీ

చల్లని కాఫీ

ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెనూ అంతా తరచి చూసి, ‘డెవిల్స్ ఓన్’ కోల్డ్ కాఫీ వన్ బై టు ఆర్డర్ చేయడంతో బేరర్ నిష్ర్కమించాడు. కాసేపు సమయంపై మౌనం స్వారీ చేసింది. ‘‘ఏ లాట్ కెన్ హాపెన్ ఓవర్ ఏ కాఫీ’’ - కాఫీ తాగే వ్యవధిలో గానీ, ఇక్కడ కాఫీ తాగటం వల్ల గానీ చాలా జరగవచ్చును అని పైవాక్యం తర్జుమా చేసుకుంటూ సదరు కాఫీషాపులోనికి అడుగపెట్టావు. నీకు కాఫీ తాగటం కొత్త కాదు. కాఫీ డే లాంటి ఖరీదైన కాఫీ షాపులూ కొత్త కాదు. కానీ, ఒక్కడివే రావడం కొత్త. ఒక స్త్రీ రమ్మంటే కాఫీ షాపుకి రావడం కొత్త. వచ్చి, ఆమెకోసం ఎదురుచూస్తూ కూర్చోవడం మరీ కొత్త! ఆమెను నువ్వు ఏడాదిగా ఎరిగినప్పటికీ ఏనాడూ ఆమెను కాఫీ షాప్‌కు నువ్వు తీసుకుని వెళ్లలేదు. నీ హాస్పిటల్‌లో ఓ నర్సుగా పరిచయమైన ఆమెను, నువ్వు చాలా గాఢంగా ప్రేమించావు. ఆమె కూడా నీ ప్రేమను అర్థం చేసుకుంది. ఇద్దరూ ఒకటౌదామనుకున్నారు. కానీ ఒకటవ్వగలరా?
   
 ఖాళీగా కూర్చుంటే బాగుండదని ‘బెల్జియం ఛాకో షాట్’ ఆర్డర్ ఇచ్చావు. ఈరోజు ఆదివారం సాయంత్రం కావడం చేత కాఫీడే యువతీ యువకులతో కళకళలాడుతుంది. ఒక్కసారి కాఫీ షాప్‌లో కూర్చున్నవారందరినీ పరిశీలనగా చూశావు. లింగ భేదం చూసే కళ్లకే గానీ జీన్స్ ప్యాంట్లకు, టీ షర్టులకు ఉండదు. నేటి ట్రెండ్‌కు ప్రతిబింబాలైన క్యాప్షన్లేవో టీషర్టులపై కొలువుదీరి నీవంటి రసజ్ఞుల చూపులను తమవైపునకు లాక్కుంటున్నవి. లెవీస్, పెపె, కిల్లర్, లీ కూపర్ తదితర జీన్సుల చిరుగుల్లోంచి నవీన నాగరికత ఉబికి పొంగుతోంది. నియాన్ బల్బుల కాంతి, చెవి పోగుల మెరుపును మరింత మెరుగ్గా చూపుతుంది. తలకు పెట్టిన బ్రెలిక్రీం స్పైక్స్‌ను బలంగా నిలబెట్టేందుకు మరింత దోహదపడుతుంది.
 
 హెయిర్ స్ప్రేల గుబాళింపో, డియోడ్రెంట్ల పరిమళమో తెలియదు గానీ వేల తుమ్మెదల దప్పిక తీర్చే సౌరభమేదో కాఫీ షాప్‌ను ఆవరించుకుంది. నిత్యం తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెతస్కోపు పెట్టుకు తిరిగే నీకు, వీళ్ల వేషధారణ కృత్రిమంగా తోచడంలో వింత లేదు. మందులు, ఇంజెక్షన్లు, సెలైన్లు, స్పిరిట్ల వాసనలు నిండిన నీ ముక్కుపుటాలు ఈ సుగంధ వీచికలను ఎక్కించుకుంటాయా?
 ఏదో ఆలోచనల్లో ఉన్న నువ్వు, నువ్వార్డరిచ్చిన ‘బెల్జియన్ చాకో షాట్’ రాకతో ఈ లోకంలోకి వచ్చావు. ఇంకా ఆమె రాలేదు. అసహనంగా నీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసి మెసేజ్ ఇన్‌బాక్స్ తెరిచావు. ‘‘సారీ రామ్! మూడు రోజులుగా నిన్ను కలవడం గానీ, ఫోన్‌లో మాట్లాడటం గానీ, నీకు మెసేజ్ చేయడం గానీ కుదర్లేదు. రేపు సాయంత్రం ఆరింటికి గచ్చిబౌలి కాఫీడేకి రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి’’ ఆమె పంపిన అదే మెసేజ్‌ను నిన్నటి నుండి ఎన్నిసార్లు చదువుకున్నావో లెక్కేలేదు. టైం ఏడైంది. ఆమె ఇంకా రాలేదన్న అసహనంతో నీకు బీపీ పెరుగుతుండగా కాఫీడే తలుపు, నీ గుండె గవాక్షం ఒకే మాటు తెరుచుకున్నవి.
 
 రోమన్ల ప్రేమదేవత వీనస్, కాపర్ సల్ఫేట్ రంగు చీర కట్టుకుని వస్తున్నట్లుగా ఆమె ముగ్ధలా నడుస్తూ వచ్చి నీ టేబుల్‌లో నీ ముందు సీటుని ఆక్రమించుకుంది. ఆమె దర్శనంతో నీ బీపీ నార్మల్‌కు చేరింది. కళ్లు అరమోడ్పులయ్యాయి. ఆమె ఇంట్లో ఏం జరిగి ఉంటుందో నువ్వు ఊహించగలిగినా ‘‘ఏం జరిగిం’’దని ప్రశ్నించావు. ఆమె మౌనం వహించడంతో మళ్లీ అదే ప్రశ్న సంధించావు. ‘‘మన విషయం మా ఇంట్లో తెలిసిపోయిం’’దని చెప్పింది. ‘‘ఓస్! అంతేనా! ఎప్పటికైనా తెలియాల్సిందే కదా’’ అని తేలికపడ్డావు.

 ‘‘నన్ను ఎన్నెన్ని మాటలన్నారో తెలుసా?’’- నీ నిర్లిప్తత ఆమెకు నచ్చలేదు. ‘‘మా ఇంట్లోవాళ్లు నన్ను అంతకంటే ఎక్కువ అన్నారు. నేనేమైనా నీలా బాధపడ్డానా?’’ ఆమె పట్ల నీలో ఏ సానుభూతీ లేదు.‘‘అంటే! మీ ఇంట్లో కూడా మన విషయం తెలిసిపోయిందా?’’ ఆమె అమితమైన ఆశ్చర్యం ఒలకబోసింది. ‘‘తెలిసిపోవడమేవిటి? తెలియజెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇంట్లోవాళ్లందరినీ పిలిచి చెప్పాను’’ - నీ ముఖంలో ఏ భావమూ లేదు. ‘‘అప్పుడే ఎందుకు చెప్పావు? కొన్నాళ్లు ఆగి చెప్పాల్సింది’’ - మెనూ చూస్తూ ఆమె మెల్లగా పలికింది. ‘‘ఇంకెన్నాళ్లు? మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. ఈ ఒంటరి జీవితం నావల్ల కాదు’’ - నీ దవడ కండరం బిగుసుకుంది. ‘‘ఇంతకూ మన విషయం తెలిశాక మీ ఇంట్లోవాళ్లు ఏమన్నారు?’’ - ఆమెలో ఆసక్తి వెల్లివిరిసింది. ‘‘మా ఇంటి పరువు తీశానన్నారు. నా ఆస్తి కోసం నువ్వు నన్ను వలలో వేసుకున్నావన్నారు. ఇకపై నలుగురిలో వాళ్లు తల ఎత్తుకు తిరగలేమన్నారు.

ఇంకా చాలానే అన్నార్లే’’ - ముఖం వికారంగా పెట్టావు. ‘‘మా ఇంట్లో కూడా సేమ్ టు సేమ్’’ - ఆమె గలగలా నవ్వేసరికి నువ్వు కూడా శృతిగా నవ్వావు.  ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెనూ అంతా తరచి చూసి, ‘డెవిల్స్ ఓన్’ కోల్డ్ కాఫీ వన్ బై టు ఆర్డర్ చేయడంతో బేరర్ నిష్ర్కమించాడు. కాసేపు సమయంపై మౌనం స్వారీ చేసింది. నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ టేబుల్‌పై నువ్వు దరువేస్తుంటే ఆమె - ‘‘శేఖర్ కూడా ఇలాగే దరువేసేవాడు’’ అంది. ‘‘శేఖర్ పోయి ఇన్నేళ్లయినా నీకు అతను ఇంకా గుర్తున్నాడా?’’ అడగకూడని ప్రశ్న అడిగి తప్పుచేశావు. ‘‘ఏం? నీకు నీరజ గుర్తులేదా?’’ ఆమె ఈ ప్రశ్న నిన్ను అడుగుతుందని నీకు తెలుసు.  ‘‘ఎందుకు గుర్తులేదు? ఆమె ఉన్నన్ని రోజులు నా జీవితం కలర్‌ఫుల్‌గా ఉండేది. దురదృష్టవశాత్తూ ఆమెను దేవుడు తీసుకుపోయాడు. తర్వాత నువ్వు పరిచయమయ్యావు. నీలో ఆమెను వెతుక్కుంటున్నాను’’ వెర్రిగా నవ్వావు.  ‘‘నాకు కూడా అంతే! శేఖర్ అచ్చం నీలాగే ఉండేవాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, శేఖర్ చనిపోలేదు.

నీ రూపంలో బతికే ఉన్నాడని’’ - అనురాగం నిండిన ఆమె చూపులు నీ గుండెల్లో నాటుకున్నాయి. ‘‘అందుకే మనం పెళ్లి చేసుకోవాలి. మనం కోల్పోయిన ప్రేమను తిరిగి పొందాలి’’ నీ చెయ్యి ఆమె చేతిని సుతారంగా నిమిరింది.  ‘‘మరి మన ఇళ్లలో ఒప్పుకోవడం లేదు!’’ అమాయకత్వం నింపుకున్న ఆమె కళ్లు నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ‘‘ఒప్పుకోకపోతే పోనీ! మన అవసరాలు వాళ్లకు అక్కర్లేకపోతే వాళ్లూ మనకు అక్కర్లేదు’’ నిశ్చయంగా ధ్వనించిన నీ గొంతులో ఏదో చిన్న వణుకు.  ఆమె ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీ బేరర్ చేతుల్ని రెక్కలుగా చేసుకుని ఎగిరివచ్చి నీ టేబుల్‌పై వాలింది. ‘‘శేఖర్‌కు కూడా నీలాగే కోపం ఎక్కువ కానీ మనసు మంచిది. నీకంటే ముందు నా జీవితంలో నన్ను అతను ప్రేమించినంత ఇంకెవ్వరూ ప్రేమించలేదు’’ కాఫీ సిప్ చేస్తూ అంది. ‘‘మా ఇంట్లోనూ అంతే! నీలాగా నన్నెవరూ ప్రేమించలేదు. అందరికీ నేను తెచ్చే డబ్బే కావాలి. నేను తిన్నానా, లేదా? ఉన్నానా, పోయానా ఎవరికీ అక్కర్లేదు. కనీసం నాతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడే తీరిక కూడా ఎవరికీ ఉండదు’’ - కాఫీలో షుగర్‌తో పాటుగా కోపం కూడా కలుపుతూ చెప్పావు.
 
 ‘‘రేపు మన పెళ్లయ్యాక కూడా నామీద ఇలాగే కోప్పడతావా?’’ ఆమె సందేహం సబబుగానే తోచింది నీకు. ‘‘ఛ! ఛ! నీమీద ఎందుకు కోప్పడతాను? నీతో చాలా సరదాగా ఉంటాను. వారానికి రెండు సినిమాలు చూద్దాం. రోజు విడిచి రోజు రెస్టారెంట్‌కు వెళ్దాం. నెలకోసారి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దాం’’ - ఆమె ఇష్టంతో పనిలేనట్లుగా చెప్పుకుంటూ పోతున్నావు. ‘‘సరే. నీ ఇష్టం. కానీ నువ్వు స్మోకింగ్ మానెయ్యాలి. ఆదివారం మాత్రమే వోడ్కా తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. నేను చేసిన వంట ఎలా ఉన్నా మెచ్చుకుంటూ తినాలి’’ ఆమె స్వరంలో అధికారం ధ్వనించడం నీకు నచ్చింది.
 
 ‘‘సరే మేడమ్! నువ్వు ఎలా చెప్తే అలా. నీ సీరియళ్లు నువ్వు రోజూ చూసుకోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం నీకు రిమోట్ ఇవ్వను. ఇంతకూ మనం ఏ టీవీ కొందాం? కొత్తగా వస్తున్న ఎల్‌ఈడీ కొందామా?’’ - ఆమె సమాధానం కోసం నీ చెవులు ఎదురుచూస్తున్నాయి. ‘‘ఆలూ లేదు. చూలూ లేదు. అప్పుడే టీవీ గురించి ఎందుకు?’’ - ఆమె తియ్యగా విసుక్కుంది. ‘‘ఆలి ఉంది. ఆ రెండోది కూడా.’’ మిగిలిన వాక్యం పూర్తిచెయ్యకుండా కాఫీతో పాటు మింగేశావు. ‘‘ఛీ ఛీ! సిగ్గులేకపోతే సరి. పెళ్లీడుకొచ్చిన మనవలను పెట్టుకుని కూడా ఇలాంటి ఆలోచనలేవిటో!’’ నువ్వు మర్చిపోయినా ఆమె నీ వయస్సును గుర్తుచేసింది. సరే మేడమ్! నువ్వు ఎలా చెప్తే అలా. నీ సీరియళ్లు నువ్వు రోజూ చూసుకోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం నీకు రిమోట్ ఇవ్వను. ఇంతకూ మనం ఏ టీవీ కొందాం? కొత్తగా వస్తున్న ఎల్‌ఈడీ కొందామా?
 
 ‘‘అబ్బా! అక్కడికి తమరేదో యవ్వన ప్రాదుర్భావ దశలో ఉన్నట్లు! నీకు ఇంజనీరింగ్ చదువుతున్న ముగ్గురు మనవరాళ్లున్నారన్న సంగతి మర్చిపోయావేమో!’’ ఆమెను ఉడికిద్దామన్న నీ ప్రయత్నం ఫలించింది. కాఫీడేలో అందరూ మిమ్మల్నే గమనిస్తున్నారని నువ్వు చూడలేదు. నీకు అక్కర్లేదు కూడా. ఆమెతో ఉన్నంతసేపూ అనవతరంగా ఆమె ప్రేమను పొందాలన్న ఆబ నీది. ‘‘ఏవిటో! మన రోజుల్లో కాఫీ చల్లారిపోతే డబ్బులిచ్చేవాళ్లం కాదు. ఈ రోజుల్లో డబ్బు ఇచ్చి మరీ కోల్డ్ కాఫీ కొంటున్నాం! హా! హా! హా!’’ నీ హాస్య చతురతకి ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ‘‘ఇంక వెళ్దామా? తొమ్మిది కావస్తుంది’’ బిల్ కట్టేసి ఆమె వాచీ చూసుకుంది. రెండు మూడు గంటలుగా కూర్చోడం మూలాన నీ కాళ్లు పట్టేసినా నెమ్మదిగా లేచి నుంచునే ప్రయత్నం చేశావు. నీ నడక మొదలైంది. ఊతం లేనిదే నీవు నడవలేవు! ఓ చెయ్యి నీ చేతి కర్రపైన! రెండవది ఆమె భుజంపైన! నీ నడక సాగుతుంది. నీదే కాదు, తోడున్న ఏ నడకా ఆగిపోదు...
 శతమానం భవతిః
 - రిషి శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement