
డోరేమాన్ చెవులేమయ్యాయి?
డోరేమాన్... పిల్లిలా కనిపిస్తుంది. పిల్లి కాదు. మరబొమ్మలా ఉంటుంది. కానీ మనిషిలా స్పందిస్తుంది. మనిషికంటే ఎక్కువ శక్తులున్నట్లు వ్యవహరిస్తుంది. ఈ పాత్ర ఇప్పటికి కాదు, భవిష్యత్తు కాలానిది. నిజమే డోరేమాన్ పుట్టిన రోజు 2112వ సంవత్సరం, 9వ నెల, 3 తేదీ. డోరేమాన్ బరువు సుమారు 130 కిలోలు. పొడవు 130 సెంటీమీటర్లు. గంటకు నూట ముప్పై కిలోమీటర్ల దూరం పరుగెడుతుంది. ఇంతకీ దీనికి ఒక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది తెలుసా?
మీరు ఊహించింది నిజమే! డోరేమాన్‌కి చెవులుండవు. ఆ చెవులను ఎలుక కొరికేసింది. అందుకే డోరేమాన్‌కి ఎలుకలంటే కోపం, భయం కూడా. డోరేమాన్‌కు ఇష్టమైన ఆహారం డోరాయాకీ. తియ్యని గింజలతో చేసిన పేస్టును బన్నులో కూరితే అదే డోరాయాకీ. ఇంతకీ భవిష్యత్తులో ఎప్పుడో... పుట్టాల్సిన డోరేమాన్ ఇప్పుడెందుకు కనిపిస్తోందంటారా? తాతగారి కోసం వర్తమానంలోకి వచ్చి జీవిస్తుంటుంది. ఇంతకీ ఆ తాత ఎవరో తెలుసా? మనకు డోరేమాన్‌లో తప్పనిసరిగా కనిపించే అబ్బాయి నోబిత.