
ఐద్రూపాయల చిల్లర
అప్పటికి నేను డి.ఫార్మసీ డిప్లొమా పొందాను. ఒకరోజు ఫార్మసిస్ట్ ఉద్యోగానికి సంబంధించి, ఏలూరు జిల్లా పరిషత్ ఆఫీసులో ఇంటర్వ్యూకని బయలుదేరి, భీమవరం బస్టాండులో ఉదయం 6.30కు ఏలూరు బస్సెక్కాను. నా పక్క సీటులో ఒకతను కూర్చున్నాడు.
అప్పటికి నేను డి.ఫార్మసీ డిప్లొమా పొందాను. ఒకరోజు ఫార్మసిస్ట్ ఉద్యోగానికి సంబంధించి, ఏలూరు జిల్లా పరిషత్ ఆఫీసులో ఇంటర్వ్యూకని బయలుదేరి, భీమవరం బస్టాండులో ఉదయం 6.30కు ఏలూరు బస్సెక్కాను. నా పక్క సీటులో ఒకతను కూర్చున్నాడు. నేను ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో అని ఆలోచించుకుంటూ నా సర్టిఫికేట్స్, కాల్‌లెటర్ అన్నీ వరుసగా పెట్టి సర్దుకుంటున్నాను. పక్కన కూర్చున్నతను ‘ఇంటర్వ్యూకు వెళుతున్నారా?’ అని అడిగి, ‘మీకే నయం. కనీసం ఇంటర్వ్యూ అయినా వచ్చింది. నాకు ఏదీ లేదు’ అని విచారంగా అన్నాడు. ‘మీ క్వాలిఫికేషన్ ఏంటి?’ అని అడిగాను. దానికి బదులుగా, ‘ఎమ్మెస్సీ’ అని సమాధానమిచ్చాడు. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కాలక్షేపం చేశాం.
నేను మాట్లాడుతున్నాను గానీ, 9 గంటలకల్లా ఇంటర్వ్యూ జరిగే స్థలానికి చేరుకోగలనా అని ఆతృత ఎక్కువైంది. బస్సు దారిలోనే ఉంది. ప్యాసింజర్ కావటం వల్ల చాలాచోట్ల ఆగుతూ వెళుతున్నది. ‘మీరు తప్పకుండా సమయానికి చేరుకుంటారు’ అని అతను భరోసా ఇచ్చాడు. మాటల్లోనే ఏలూరు వచ్చింది. ఫైర్ స్టేషన్ దగ్గర దిగాం. అప్పటికి 8.45 అయింది. ఇంక పావుగంట టైం మాత్రమే ఉంది. బస్ దిగేటప్పుడు కండక్టర్ చిల్లర ఇవ్వాల్సొచ్చి, ‘మీ ఇద్దరూ చెరొక అయిదు రూపాయలు తీసుకోండి’ అని పది రూపాయల నోటు నా చేతిలో పెట్టాడు. నాకు టైమ్ అయిపోతుందన్న తొందరలో ఆఫీసు వైపు పరుగు తీశాను.
ఇంటర్వ్యూ ముగిసింది. హాలు బయటకు వచ్చేసరికి బస్సులో నా పక్కన కూర్చున్నతను గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. ‘ఇదేంటి మీరిక్కడ ఉన్నా’రని అడిగితే, ‘మీరు నాకు అయిదు రూపాయలు ఇవ్వాలి కదా’ అని, ‘ఏం లేదు, నేను ఇక్కడి నుండి పక్క ఊరు వెళ్లాలి. చార్జీలకు అయిదు రూపాయలు తక్కువగా ఉన్నాయి. అందుకని... ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఎవరినీ అడగలేం కదా!’ అనేసరికి, నా మనసు వేదనతో నిండిపోయింది. వెంటనే నేను పది రూపాయలు తీసి అతనికి ఇచ్చాను. అతను తీసుకోలేదు. పక్కనున్న కిళ్లీ కొట్టులోకెళ్లి చిల్లర మార్చి, నాకు అయిదు రూపాయలిచ్చేసి, గుడ్‌బై చెప్పి వెళ్లిపోయాడు. ఇది జరిగి చాలా కాలమైంది.
- బద్దే ప్రకాష్ భీమవరం, ప.గో.