అంధులకు దారిచూపే పాదరక్షలు!
భలేబుర్ర
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పయి కోట్ల మంది అంధులు ఉన్నారు. వెంట ఎవరూ లేకుండా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంతో కష్టపడుతున్నారు. అది చూసిన ఇద్దరు యువకులు... అందరిలాగే అంధులు కూడా తేలికగా ఎక్కడికి కావాలన్నా వెళ్లిపోగలిగేలా చేస్తే బాగుండనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయోగాలు చేశారు. చివరకు అంధులకు దారిచూపే పాదరక్షలకు రూపకల్పన చేశారు.
ఢిల్లీకి చెందిన విద్యార్థులు అనిరుధ్ శర్మ, క్రిస్పియన్ లారెన్స్ రూపొందించిన ఈ పాదరక్షలకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ప్రశంసలు లభించాయి. యంత్రాలపై నిరంతరం ప్రయోగాలు సాగించే అనిరుధ్‌శర్మ ఒకసారి కుతూహలం కొద్దీ ఒక మిత్రుడి షూస్‌లో వైబ్రేటర్ ఉంచి చూశాడు. అప్పుడు మెదిలింది అతడిలో ఆలోచన. వైబ్రేటర్‌తో పనిచేసే పాదరక్షలు అంధులకు బాగా ఉపయోగపడగలవని అనుకున్నాడు. తోటి మిత్రుడు లారెన్స్‌తో కలసి ఈ ప్రయోగాన్ని కొనసాగించి, ఎట్టకేలకు అంధులకు దారిచూపే పాదరక్షలను రూపొందించాడు. వీటికి ‘లే చల్’ అని పేరు పెట్టాడు.
సాదాసీదా షూస్‌లాగానే కనిపిస్తాయి ఇవి. వాటిలో ఒక వైబ్రేటింగ్ యూనిట్, ఒక చిప్, రీచార్జబుల్ బ్యాటరీ ఉంటాయి. బ్యాటరీని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటకు తీసి, తిరిగి రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ పాదరక్షలు ధరించిన వారిని నిర్ణీత గమ్యానికి సురక్షితంగా చేరుస్తాయి. దారిలో వచ్చే అడ్డంకులను గుర్తించి, ఎటువైపు మళ్లితే క్షేమమో, ఎక్కడెక్కడ మలుపులు తిరగాలో వైబ్రేటర్ ద్వారా సంకేతాలు ఇస్తాయి ఈ బూట్లు.