అమ్మా రంగ‌స్థ‌లం నీకు శ‌త‌కోటి చ‌ప్ప‌ట్లు | Funday cover story of the week | Sakshi
Sakshi News home page

అమ్మా రంగ‌స్థ‌లం నీకు శ‌త‌కోటి చ‌ప్ప‌ట్లు

Published Sun, Mar 24 2019 12:12 AM | Last Updated on Sun, Mar 24 2019 12:12 AM

Funday cover story of the week  - Sakshi

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. నాటక రంగానికి ఇదివరకటి కాలంలో విశేషమైన ఆదరణ ఉండేది. చాలామంది కళాకారులు రంగస్థలాన్నే నమ్ముకుని జీవిక సాగించేవారు. సినీరంగం ఊపిరి పోసుకున్న తొలినాళ్లల్లో కూడా నాటకాలకు బాగానే ఆదరణ ఉండేది. తొలితరం సినీ జనాలందరూ రంగస్థలం పునాదుల మీదుగానే సినీరంగంలో తమదైన ముద్ర వేశారు. తెలుగు నాటకరంగం సమాజంపై చూపిన ప్రభావం సామాన్యమైనది కాదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక సంస్కరణ ఉద్యమాలకు నాటక రంగం వెన్నుదన్నుగా నిలిచింది. తెలుగునాట గొప్పగా జనాదరణ పొందిన నాటకాలు చాలానే ఉన్నాయి. రంగస్థలంపై అసాధారణంగా రాణించిన నటీనటులు అనేకులు ఉన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాటక రంగం గురించి కొన్ని విశేషాలు...

ప్రపంచవ్యాప్తంగా నాటకాలు ఉండేవి. ఆధునిక వినోద సాధనాలేవీ లేని రోజుల్లో నాటకాలే జనాలకు వినోదం కలిగించేవి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నాటికే నాటక ప్రక్రియ ఉనికిలో ఉండేది. ప్రాచీన గ్రీకు, రోమన్‌ సామ్రాజ్యాల్లో విరివిగా నాటక ప్రదర్శనలు జరిగేవి. ప్రపంచంలోనే తొలి నాటక ప్రదర్శనఇప్పటి వరకు లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు కళాకారుడు థెస్పిస్‌ మరికొందరితో కలసి తొలిసారిగా రంగస్థలంపై నటనా ప్రదర్శన చేశాడు. బహుశ అదే చరిత్రలో తొలి నాటక ప్రదర్శన కావచ్చని అంచనా. ఏథెన్స్‌లోని డయోనిసియా నగరంలో థెస్పిస్‌ ప్రదర్శనలకు విపరీతమైన జనాదరణ ఉండేది. ఆయన తన బృందంతో కలసి ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. నాటకాలకు అవసరమైన దుస్తులు, మాస్క్‌లు, అలంకరణ సామగ్రి గుర్రపు బగ్గీల్లో వేసుకుని తిరుగుతూ ఒక్కొక్క చోట కొన్నాళ్లు మకాం వేసి నాటకాలను ప్రదర్శించేవాడు. థెస్పిస్‌ మార్గంలోనే తర్వాతి కాలంలో ఈషిలస్, సోఫోక్లెస్, యూరిపిడెస్‌ వంటి వారు నాటకాలను స్వయంగా రచించి, ప్రదర్శించేవారు. వారంతా ఎక్కువగా విషాదాంత నాటకాలనే ప్రదర్శించేవారు. అప్పట్లో నాటక పోటీలు కూడా జరిగేవి. ఈషిలస్‌ రచించి, ప్రదర్శించిన ‘ది పర్షియన్స్‌’ నాటకానికి డయోనిసియా నగరంలో క్రీస్తుపూర్వం 472లో జరిగిన పోటీలో మొదటి బహుమతి లభించింది. ఇప్పటికీ మిగిలి ఉన్న అత్యంత పురాతన నాటక ప్రతి ‘ది పర్షియన్స్‌’ కావడం విశేషం. విషాదాంత నాటక పోటీలు క్రీస్తుపూర్వం 534 నాటి నుంచే జరిగేవని ప్రాచీన గ్రీకు ఆధారాల ద్వారా తెలుస్తోంది. విషాదాంత నాటకాలు విరివిగా ప్రచారంలో ఉన్న కాలంలోనే కొందరు వ్యంగ్య నాటకాలు, హాస్యభరిత నాటకాలు కూడా వేసేవారు. వ్యంగ్య నాటక పోటీలు క్రీస్తుపూర్వం 501 నాటి నుంచి, హాస్యనాటక పోటీలు క్రీస్తుపూర్వం 487 నుంచి జరిగేవి. ప్రాచీన రోమన్‌ సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నుంచి నాటక ప్రదర్శనలు జరిగేవి. రోమన్‌ సామ్రాజ్య విస్తరణ ఫలితంగా క్రీస్తుపూర్వం 270–240 నాటికి గ్రీకు భూభాగంలో గ్రీకు నాటకాలతో పాటే రోమన్‌ నాటకాల ప్రదర్శనలు కూడా జరిగేవి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికి రోమన్‌ రచయితలు బృందాలుగా ఏర్పడి నాటకాలు రాసేవారు. గ్రీకుల జీవనశైలిని ఎద్దేవా చేస్తూ ప్లాటుస్, టెరెన్స్‌ అనే రోమన్‌ రచయితలు రాసిన ‘ఫ్యాబులా పాలియాటా’ అనే నాటక ప్రతి ఇప్పటికీ మిగిలి ఉంది. ఈ జంట రచయితల్లో ప్లాటుస్‌ ఎక్కువ ప్రసిద్ధి పొందాడు. అతడు రాసిన మరో ఇరవై నాటకాలు కూడా ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ప్రధాన నటుడు తన పాత్రను అభినయిస్తుండగా, వెనక నుంచి కొందరు వంత పాడే ‘కోరస్‌’ పద్ధతికి రోమన్‌ నాటకకర్తలు క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే స్వస్తి చెప్పారు. నాటకంలోని కథను సన్నివేశాలుగా, అధ్యాయాలుగా విభజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆధునిక నాటక పద్ధతికి నాటి రోమన్‌ నాటక పద్ధతే మూలంగా చెప్పుకోవచ్చు.

మన దేశంలో ప్రాచీన నాటకాలు
ప్రాచీన గ్రీకు, రోమన్‌ నాటకరంగాలు వేళ్లూనుకున్న కొద్ది కాలానికే మన దేశంలో సంస్కృత నాటక రంగం ఊపిరి పోసుకుంది. భారత భూభాగంపై అలెగ్జాండర్‌ దండయాత్ర తర్వాతనే గ్రీకుల ప్రభావంతో ఇక్కడ నాటకరంగం మొదలైందనే వాదన కూడా ఉంది. సంస్కృత నాటకాల ప్రదర్శన క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికి మొదలైంది. క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నుంచి పదో శతాబ్ది వరకు బాగా వ్యాప్తి చెందింది. సంస్కృత వ్యాకరణకర్త పతంజలి భాష్యంలో నాటక ప్రస్తావన కనిపిస్తుంది. పతంజలి భాష్యం క్రీస్తుపూర్వం 140 ఏళ్ల నాటిది. నాటక లక్షణాలను సూత్రబద్ధంగా చేస్తూ భరతముని ‘నాట్యశాస్త్రం’ రచించాడు. కేవలం రంగస్థలం గురించి మాత్రమే కాకుండా, నటన, రంగాలంకరణ, సంగీతం, నాట్యం, ఆహార్యం, అలంకరణ, నాటక సంస్థల నిర్వహణ, నాటక పోటీలు, ప్రేక్షకులు వంటి అంశాలపై విపులంగా వివరించిన తొలిగ్రంథం భరతముని రచించిన నాట్యశాస్త్రం. సంప్రదాయ సంస్కృత నాటకాల్లో నాయక, నాయిక, విదూషక పాత్రలు ప్రధానంగా ఉండేవి. క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం వంటి సంస్కృత నాటకాలు ప్రసిద్ధి పొందాయి. తర తరాల పాటు ఇవి ప్రదర్శనలకు నోచుకున్నాయి. మన నాటక రంగానికి చెందిన ప్రాచీన యుగంలో కాళిదాసుతో పాటు భాసుడు, అశ్వఘోషుడు, దండి వంటి కవులే కాదు, హర్షవర్ధనుడు వంటి రాజులు కూడా సంస్కృతంలో నాటక రచన చేశారు. 

భారత దేశంపై ముస్లింల దండయాత్రలు మొదలైన తర్వాత సంస్కృత నాటకాల ప్రాభవం చాలావరకు తగ్గింది. కొందరు ముస్లిం పాలకుల హయాంలో నాటక ప్రదర్శనలపై పూర్తి నిషేధం ఉండేది. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్ది నుంచి పంతొమ్మిదో శతాబ్ది మధ్యకాలంలో ప్రాంతీయ భాషల్లో నాటక రచన, ప్రదర్శనలు పుంజుకున్నాయి. మధ్యయుగంలో భవభూతి నాటకకర్తగా ప్రసిద్ధి పొందాడు. ఆయన రచించిన ఉత్తర రామచరితం, మాలతీ మాధవం వంటి నాటకాలు ప్రసిద్ధి పొందాయి. మధ్యయుగాల నాటికి ప్రాంతీయ భాషలు పుంజుకోవడం, జన సామాన్యానికి సంస్కృత నాటకాలు అర్థం కాకపోవడంతో సంస్కృత నాటక ప్రదర్శనలు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అదే కాలంలో భక్తి ఉద్యమం మొదలైంది. జన సామాన్యానికి అర్థమయ్యే భక్తి కావ్యాలను గానం చేసే రంగస్థల ప్రక్రియ మొదలైంది. దాంతో సంస్కృత నాటకాల కంటే రంగస్థలంపై ప్రదర్శించే భక్తి గీతాల గానానికి, ఆ గానానికి అనుగుణంగా తన్మయంతో చేసే నాట్యానికి జనాదరణ పెరగింది. 

రంగస్థలంపై ఆధునికతకు నాంది
బ్రిటిష్‌ హయాంలో భారతీయ రంగస్థలంపై ఆధునికతకు నాంది ఏర్పడింది. బెంగాలీ రచయిత మైకేల్‌ మధుసూదన్‌ దత్‌ 1860లో రచించిన ‘బురొ షాలిఖేర్‌ ఘరె రొవా’ను తొలి భారతీయ ఆధునిక నాటకాల్లో ఒకటి. అదే ఏడాది మరో బెంగాలీ రచయిత దీనబంధు మిత్రా ‘నీలదర్పణ్‌’ నాటకాన్ని రాశారు. ఇది విరివిగా ప్రదర్శనలకు నోచుకుంది. నీలిమందు సాగు ఫలితంగా రైతుల జీవితాల్లో కలిగిన సంక్షోభాన్ని కళ్లకు కట్టేలా రచించిన ‘నీలదర్పణ్‌’ బెంగాల్‌ అంతటా అమిత జనాదరణ పొందింది. ఈ నాటకాన్ని గిరీష్‌చంద్ర ఘోష్‌ బెంగాల్‌ అంతటా విరివిగా ప్రదర్శించారు. ఆధునిక బెంగాలీ నాటక రచయితల్లో రవీంద్రనాథ్‌ టాగోర్‌ బాగా ప్రసిద్ధి పొందారు. ‘విశ్వకవి’గా ప్రసిద్ధి పొందిన రవీంద్రనాథ్‌ టాగోర్‌ కవిత్వంతో పాటు కథలు, నాటకాలు కూడా రాశారు. ఆయన రచించిన నాటకాల్లో ‘చిత్రాంగద’, ‘డాక్‌ఘర్‌’, ‘రాజా’, ‘రక్త కరాబి’ వంటి నాటకాలు పేరు పొందాయి. 

పద్యనాటకాల వైభవం
ఆధునిక కాలంలో తెలుగునాట నాటక ప్రదర్శన ప్రారంభమైన తొలినాళ్లలో పద్యనాటకాలే ప్రభంజనం కొనసాగించాయి. వివిధ నాటక బృందాలు ఊరూరా తిరుగుతూ పద్యనాటకాలను ప్రదర్శించేవి. అమిత జనాదరణ పొందిన పద్యనాటకాల్లోని పద్యాలు ఆ తర్వాతి కాలంలో తీసిన పౌరాణిక సినిమాలకూ పాకాయంటే నాటి పద్యనాటకాల ఘనతను అర్థంచేసుకోవచ్చు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ‘గయోపాఖ్యానం’, తిరుపతి వెంకటకవులుగా ప్రసిద్ధి పొందిన జంట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి రచించిన ‘పాండవ ఉద్యోగం’, ‘పాండవ విజయం’, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన ‘సత్య హరిశ్చంద్ర’, కొప్పరపు సుబ్బారావు రచించిన ‘తారాశశాంకం’, ముత్తరాజు సుబ్బారావు రచించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ వంటివి బాగా జనాదరణ పొందాయి. 

తెలుగునాట నాటకరంగం
తెలుగునాట నాటకరంగం ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చిందనే దానిపై కచ్చితమైన ఆధారాలేవీ అందుబాటులో లేవు. అయితే, నన్నయ కాలానికే నాటకాలు విరివిగా ఉండేవని చెప్పవచ్చు. మహాభారత అవతారికలో నన్నయ ‘రసాన్విత కావ్యనాటకముల్‌ పెక్కుజూచితి’ అని చెప్పడమే ఇందుకు ఆధారం. పదహారో శతాబ్ది నాటికి చిందుభాగవతం, యక్షగానం వంటి రంగస్థల ప్రక్రియలకు, వీధినాటకాలకు జనాదరణ ఉండేది. కాకతీయుల కాలంలో వినుకొండ వల్లభరాయుడు రచించిన ‘క్రీడాభిరామం’ వీధినాటకమే. అప్పట్లో ప్రదర్శించిన యక్షగానాలు, వీధినాటకాలు ఎక్కువగా సంస్కృతంలో రచించినవే. ఆధునికకాలంలోనే తెలుగు భాషలో నాటక రచన మొదలైంది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం ‘మంజరీ మధుకరీయం’. కోరాడ రామచంద్రశాస్త్రి ఈ నాటకాన్ని 1860 ప్రాంతాల్లో రాశారు. బ్రిటిష్‌ హయాంలో దేశంలోని విశ్వవిద్యాలయాలు ఏర్పడటం, ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడటం వల్ల ఆ ప్రభావంతో తెలుగులో కూడా నాటక రచన విరివిగా కొనసాగింది. కోరాడ రామచంద్రశాస్త్రితో పాటు కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి వంటి వారు తెలుగునాట తొలినాళ్లలో నాటక రచనకు ఆద్యులు. కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ల పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు తదితరులు నాటక ప్రదర్శనకు ఆద్యులుగా చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో ఎక్కువగా సంస్కృత నాటకాల అనువాదాలు వచ్చేవి. కొందరు ఇంగ్లిష్‌ నాటకాలను కూడా అనువదించారు. పురాణగాథల ఆధారంగా రూపొందించిన పద్యనాటకాలు విపరీతంగా జనాదరణ పొందేవి. ఆ నాటకాల్లోని పద్యాలు నిరక్షరాస్యులైన ప్రేక్షకులకు కూడా కంఠోపాఠంగా ఉండేవి. వడ్డాది సుబ్బారాయుడు తెలుగు నాటకాల్లో పద్యపఠనాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ‘వేణీ సంహారం’ అనే పద్యనాటకాన్ని రాశారు. అనతి కాలంలోనే పద్యాలకు రాగాలు తోడయ్యాయి. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకాన్ని 1872లో పరవస్తు వెంకట రంగాచార్యులు తెలుగులోకి అనువదించారు. షేక్‌స్పియర్‌ రచించిన ‘జూలియస్‌ సీజర్‌’ నాటకాన్ని వావిలాల వాసుదేవ శాస్త్రి తెలుగులోకి ‘సీజరు చరితము’ పేరుతో అనువదించారు. ఇంగ్లిష్‌ నాటకాన్ని తెలుగులోకి అనువదించిన తొలి రచయితగా మాత్రమే కాకుండా, తెలుగులో తొలి సాంఘిక నాటకాన్ని రచించిన ఘనత కూడా వావిలాల వాసుదేవ శాస్త్రికే దక్కుతుంది. ఆయన రచించిన ‘నందకరాజ్యం’ తెలుగులో తొలి సాంఘిక నాటకం.

పరిషత్తులూ ప్రయోగాలూ 
కృష్ణా ప్రాంతంలో 1913లో తొలిసారిగా నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. అనతికాలంలోనే ఈ నాటక పోటీలు దేశమంతా వ్యాపించాయి. తెనాలిలో 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఏర్పడింది. పరిషత్తు పోటీల్లో ప్రదర్శించే నాటకాలకు అనేక నిబంధనలు ఉండేవి. ముఖ్యంగా ఐదేళ్ల కిందట రచించిన నాటకాలను పరిషత్తుల్లో ప్రదర్శించరాదు. అందువల్ల పరిషత్‌ పోటీల కోసం ప్రత్యేకంగా నాటక రచన చేయడం మొదలైంది. ఒక నటుడు, ఒక నటి ఒక నాటకంలో లేదా ఒక నాటికలో మాత్రమే నటించాలి. స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలి. నాటక రంగానికి పరిషత్తులు చాలావరకు ఊతమిచ్చాయి. స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలనే నిబంధన అప్పట్లో కొంత ఇబ్బందిగానే ఉండేది. నాటకరంగంలో అప్పట్లో స్త్రీలు ఎక్కువమంది ఉండేవారు కాదు. దానివల్ల కొందరు స్త్రీపాత్రలు లేని నాటకాలను ప్రత్యేకంగా రాసి, ప్రదర్శించేవారు. కన్యాశుల్కం వచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత గాని తెలుగులో సాంఘిక నాటకాలు ఊపందుకోలేదు. తెలుగు సాంఘిక నాటకాల్లో ఆత్రేయ రచించిన ‘ఎన్జీవో’, ‘కప్పలు’, ‘మాయ’, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన ‘మా భూమి’, భమిడిపాటి రాధాకృష్ణ రాసిన ‘కీర్తిశేషులు’, యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన ‘కుక్క’ వంటి నాటకాలు ప్రసిద్ధి పొందాయి. సాంఘిక నాటకాల వ్యాప్తికి ప్రజా నాట్యమండలి వంటి సంస్థలు ఎనలేని కృషి చేశాయి. ఎన్‌.ఆర్‌.నంది 1964లో రాసిన ‘మరో మొహెంజదారో’ తెలుగు నాటకాల్లో ప్రయోగాత్మక నాటకాల ఒరవడికి నాంది పలికింది. నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1998 నుంచి నంది నాటకోత్సవాలను ప్రారంభించింది. సినిమాలు, టీవీ, ఇంటర్నెట్‌ ప్రభావం ఎంతగా ఉన్నా, నేటికీ నాటకరంగం మనుగడ సాగిస్తూనే ఉంది.
– పన్యాల జగన్నాథదాసు

విలక్షణ ప్రదర్శనల సురభి నాటక సంఘం
తెలుగు రంగస్థల చరిత్రలో సురభి నాటక సంఘానికి ప్రత్యేక స్థానం. సినిమా తెరలపై చూపించే చిత్రవిచిత్రాలన్నీ రంగస్థల వేదికపైనే ప్రదర్శించడం ‘సురభి’ నాటకాల ప్రత్యేకత. ‘సురభి’ నాటకాలు ఈనాటికీ తమ ప్రత్యేకతను కాపాడుకుంటూనే ఉన్నాయి. వనారస గోవిందరావు, వనారస చిన్న రామయ్య 1885లో కడప జిల్లా చక్రాయపేట మండలంలోని సురభి రెడ్డివారిపల్లెలో ‘శ్రీ శారదా వినోదిని నాటక సభ’ను ప్రారంభించారు. కాలక్రమేణా ఇది సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి పొందింది. అనతికాలంలోనే ఇది విస్తరించి యాభై బృందాలుగా విస్తరించింది. సురభి నాటక బృందాల్లో అన్నింటి కంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలిని 1937లో వనారస గోవిందరావు ఐదో కూతురైన సుభద్రమ్మ, ఆమె భర్త ఆర్‌.వెంకటరావు స్థాపించారు. ఇప్పటికీ ఈ సంస్థ నాటకాలను ప్రదర్శిస్తూనే ఉంది. 
(కవర్‌ ఫొటోలు సురభి నాటక ప్రదర్శనలోని దృశ్యాలు)

బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకంలోని...తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్‌ సాగి రావేరికేసరికేపాటు విధించినో విధి యవశ్య ప్రాప్త మద్దానినెవ్వరు దప్పించెదరున్నవాడనని గర్వంబేరికిన్‌ గాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్‌ గాలానుకూలంబుగన్‌’మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌నా యిల్లాలని నాకుమారుడని ప్రాణంబుండునందాకనెంతోయల్లాడిన యీ శరీరమిపుడిందు గట్టెలంగాలుచోనా యిల్లాలును రాదు పుత్రుండును దోడైరాడు తప్పింపగన్‌ వంటి పద్యాలు కూడా ఊరూరా మార్మోగేవి. సినిమా రంగం ఇంకా ఊపిరిపోసుకోని కాలంలో తెలుగునాట పద్యనాటకాలకే విశేష ఆదరణ ఉండేది. వాటిలో నటించే నటులకు ఇప్పటి సినీనటుల స్థాయిలోనే జనాభిమానం ఉండేది.

సంస్కరణ ఉద్యమాలకు ఊతమిచ్చిన నాటకాలు
తెలుగు నాట సంచలనం సృష్టించిన ఆధునిక సాంఘిక నాటకం ‘కన్యాశుల్కం’. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం మొదటి కూర్పు 1897లో ముద్రితమైంది. దీని రచన 1892లోనే జరిగింది. అదే ఏడాది విజయనగరం మహారాజా పోషణలోని జగన్నాథ నాటక విలాస సంస్థ ఈ నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించింది. నాటి సాంఘిక దురాచారంపై వ్యంగ్యాస్త్రంగా సంధించిన ‘కన్యాశుల్కం’ తెలుగునాట అమిత జనాదరణ పొందింది. దేశంలో తెలుగు ప్రజలు ఉండే ప్రతిచోటా లెక్కకు మిక్కిలిగా ప్రదర్శనలకు నోచుకుంది. చాలా నాటక సమాజాలు ఈ నాటకాన్ని ప్రదర్శించాయి. చాలామంది ఈ నాటకం ద్వారానే ప్రసిద్ధిలోకి వచ్చారు. ‘కన్యాశుల్కం’లోని కొన్ని సంభాషణలు జాతీయాలుగా స్థిరపడ్డాయి. ‘కన్యాశుల్కం’ నాటకానికి వందేళ్లు పూర్తయినా, ఈనాటికీ ఈ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉండటం విశేషం. ‘కన్యాశుల్కం’ పూర్తిగా వాడుక భాషలో రాసిన నాటకం. సంస్కరణ ఉద్యమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో వచ్చిన నాటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ‘కన్యాశుల్కం’ నాటకానికే మొదటి స్థానం దక్కుతుంది. సంస్కరణ ఉద్యమ నేపథ్యంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కాళ్లకూరి నారాయణరావు రచించిన ‘వరవిక్రయం’, ‘చింతామణి’, ‘మధుసేవ’ కూడా గొప్ప ఆదరణ పొందాయి. 

ఆనాటి  రంగస్థల ప్రముఖులు
ఆనాటి రంగస్థల ప్రముఖుల్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు ‘ఆంధ్రనాటక పితామహుడు’గా ప్రసిద్ధి పొందారు. బళ్లారిలో 1886లో ‘సరస వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని నెలకొల్పి విరివిగా నాటకాలను ప్రదర్శించారు. ఆయన రచించిన వాటిలో ‘చిత్ర నళినీయం’, ‘ప్రమీలార్జునీయం’, ‘రోషనారా శివాజీ’, ‘పాదుకా పట్టాభిషేకము’ వంటివి ప్రసిద్ధి పొందాయి. కన్నడ, ఇంగ్లిషు భాషలలో కూడా ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటక రచన చేశారు. నాటక రచనతో పాటు రంగస్థల దర్శకుడిగా, నటుడిగా కూడా ప్రసిద్ధి పొందారు. రంగస్థల నటుడిగా సుప్రసిద్ధి పొందిన బళ్లారి రాఘవ ఆయన మేనల్లుడే. బళ్లారి రాఘవ వృత్తిరీత్యా న్యాయవాది అయినా, ఆయనకు చిన్ననాటి నుంచి నాటకరంగంపై మక్కువ ఉండేది. పన్నెండేళ్ల వయసులో తొలిసారి రంగస్థలంపై నటించిన రాఘవ, బళ్లారిలో షేక్‌స్పియర్‌ క్లబ్‌ స్థాపించారు. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో దేశ విదేశాల్లో విరివిగా నాటకాలను ప్రదర్శించారు. గాంధీజీ, రవీంద్రనాథ్‌ టాగోర్‌ వంటి ప్రముఖుల ప్రశంసలను పొందిన గొప్ప నటుడు బళ్లారి రాఘవ. ఆయన తర్వాతి కాలంలో ఈలపాట రఘురామయ్యగా ప్రసిద్ధి పొందిన కల్యాణం రఘురామయ్య దాదాపు అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందారు. పద్యనాటకాల్లో ఆయన భావాత్మకంగా పద్యాలు పాడే తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేది. రవీంద్రనాథ్‌ టాగోర్‌ ఆయనను ‘రంగస్థల కోకిల’గా అభివర్ణించారు. స్థానం నరసింహారావు స్త్రీ పాత్రల అభినయంలో ప్రసిద్ధి పొందారు. ఆనాటి నటుల్లో కపిలవాయి రామనాథశాస్త్రి, బందా కనకలింగేశ్వరరావు, పీసపాటి నరసింహమూర్తి, పువ్వుల సూరిబాబు, డి.వి.సుబ్బారావు, గోవిందరాజుల వెంకటసుబ్బారావు, వడ్లమాని విశ్వనాథం, మాధవపెద్ది వెంకటరామయ్య తదితరులు అనేకులు రంగస్థలంపై తమదైన ముద్రవేశారు.  అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రసిద్ధులైన వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య వంటి వారు నాటకాలు వేశారు. చిత్తూరు నాగయ్య, కస్తూరి శివరావు, సీహెచ్‌.నారాయణరావు, వేమూరి గగ్గయ్య, సీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, యడవల్లి సూర్యనారాయణ, టి.కనకం, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సీనియర్‌ శ్రీరంజని, లక్ష్మీరాజ్యం «వంటి తొలితరం సినీ ప్రముఖులందరూ నాటక నేపథ్యం నుంచి వచ్చిన వారే. వీరి తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య, రేలంగి వెంకటరామయ్య, నాగభూషణం, సావిత్రి, జి.వరలక్ష్మి తదితరులు చాలామంది నాటకాలు వేసిన వారే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement