
సంధ్యవేళ. ఆరున్నర దాటుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ముందు ధబ్బుమని శబ్దమైంది. అక్కడున్న కొందరు ఉలిక్కిపడ్డారు. మూడంతస్తుల ఆ బిల్డింగ్ పైనుండి ఎవరో కిందపడ్డారు. మెయిన్ గేటు దగ్గరవున్న కొందరు పారిశుద్ధ కార్మికులు పరిగెత్తుకొచ్చారు. మర్రిచెట్టు చప్టా మీద కూర్చుని సిగరెట్ తాగుతున్న కమిషనర్ డ్రైవర్ అసదుల్లా ఖాన్ సిగరెట్టు అవతల పారేసి హడావుడిగా వచ్చాడు.శ్రావణి శరీరం నేల మీద పడివుంది. కపాలం పగిలి మెదడు కనిపిస్తూ ఉంది. నెత్తుటి మడుగులో ఆమె శవం చూసేవారికి భయం కలిగిస్తోంది. ఆమె కమిషనర్ పర్సనల్ అసిస్టెంట్. డ్రైవర్ అసదుల్లా ఖాన్ కమిషనర్ చాంబర్‌లోకి పరిగెత్తాడు. కమిషనర్ శాంతి శరణ్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.‘‘సార్! శ్రావణి బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.’’ రొప్పుతూ చెప్పాడు డ్రైవర్. ‘‘వాట్..?’’ అదిరిపడుతూ అన్నాడు కమిషనర్. రిసీవర్ క్రెడిల్ చేసి హడావుడిగా వెళ్లాడు. శ్రావణి శవం చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ చాలామంది వెళ్లిపోయారు. కొద్దిమంది పెండింగ్ పని చేసుకుంటూసీట్లలో ఉన్న వాళ్లు వార్త విని పరిగెత్తుకొచ్చారు. కాసేపటికి అంబులెన్స్ వచ్చింది. ఆమె శరీరాన్ని ఎక్కించి పంపించారు. అప్పటికే ఆమెలో ప్రాణం లేదు. పద్ధతి ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విషాదభరితమైన వాతావరణం నెలకొని ఉంది. ఆఫీస్ స్టాఫ్, స్వీపర్లు వగైరా వర్కర్లు హాస్పిటల్ ఆవరణలోని కారిడార్లలో, బైట చెట్ల కింద గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.శ్రావణి తండ్రి రాఘవయ్య మున్సిపాల్టీ ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తూ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. కారుణ్య నియామకం కింద శ్రావణికి ఉద్యోగం ఇచ్చారు. ఆమె గ్రాడ్యుయేట్. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసింది. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అందులో మానేసింది.ఆమె ఉద్యోగంలో చేరి ఏడేళ్లయింది. కొంతకాలం జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. కంప్యూటర్ కోర్సులు చేసి అందులో ప్రావీణ్యం సంపాదించింది. తర్వాత కమీషనర్‌కి పర్సనల్ అసిస్టెంట్ అయింది. చాలా మంచిదనీ, సహాయ గుణం కలదనీ పేరు తెచ్చుకుంది. ఆమె అర్ధంతరంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.శ్రావణి తల్లి నిర్మలమ్మ గోడు గోడున ఏడుస్తోంది. ఆమె దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారు ఓదారుస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ తర్వాత ఆమె శవాన్ని అప్పగించారు. శ్రావణి అంత్యక్రియలు జరిగిపోయాయి.ఇన్‌స్పెక్టర్ చక్రపాణి, ఎస్సై రసూల్ మున్సిపాల్టీ ఆఫీసుకి చేరుకున్నారు. కమిషనర్ శాంతి శరణ్ చాంబర్‌కి వెళ్లారు. ఆయన చాలా విచారంగా కనిపించాడు. శ్రావణి రోజులో ఆఫీసు సమయం ఆయన దగ్గరే గడుస్తుంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఆఫీసు పనుల్లో సహకరించే అమ్మాయి ఆమె.
‘‘సార్! శ్రావణి సూసైడ్ ఎందుకు చేసుకుని ఉంటుంది? మీరేమైనా చెప్పగలరా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్ చక్రపాణి. ‘’నాకు అదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. నాకు తెలిసి ఆమెకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేవు. ఆమె తండ్రి ఉన్నప్పుడు సంపాదించింది ఏం లేదు. అతను తాగుబోతు అని చెప్తారు. నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చి మూడేళ్లే.’’ ‘‘ఐసీ!’’‘‘తండ్రి డెత్ బెనిఫిట్స్, కొంత బ్యాంక్‌లోన్‌తో ప్రశాంతినగర్‌లో ఒక ఫ్లాట్ తీసుకుంది. ఆమెకు తల్లి ఒక్కతే. ఇంకెవరూ లేరు. ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి? అఫ్‌కోర్స్ తల్లి ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉండొచ్చు.’’ అన్నాడు శాంతి శరణ్. ‘‘ఆమెకు ఇరవై ఏడేళ్లు వచ్చాయి. పెళ్లెందుకు చేసుకోలేదంటారు? లవ్ ఎఫైర్స్ ఏమైనా ఉండి ఉంటాయా? లవ్ ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకుని ఉంటుందా?’’‘‘మేబీ.. మేనాట్‌బీ. ఎందుకంటే ఆమె పర్సనల్ విషయాలు నాకు తెలీవు. మా మధ్య ఆఫీసు విషయాలే ఉంటాయి!’’ చెప్పాడు కమిషనర్. ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఇద్దరూ చాంబర్ బైటకు వచ్చారు. ‘‘సార్! మఫ్టీలో మన కానిస్టేబుల్స్ నాగరాజు, యాదయ్య మున్సిపాల్టీ సిబ్బంది దగ్గర శ్రావణి విషయాలు సేకరించడానికి తిరుగుతున్నారు. గంటలో ఏమైనా క్లూ దొరుకుతుందేమో తెలుసుకుని వస్తాను.’’ అన్నాడు ఎస్సై రసూల్. చక్రపాణి తలూపాడు. తర్వాత పొర్టికోలోకి వచ్చిన పోలీస్ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయాడు.
రసూల్ మున్సిపాల్టీ ఆవరణలో ఉన్న మర్రిచెట్టు చప్టా దగ్గరికి బయల్దేరాడు. అక్కడ కొందరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిలో ఇద్దరు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్. వారు ఏదో పనిమీద వచ్చిన వారిలా స్టాఫ్‌తో మాటలు కలిపారు. శ్రావణి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు చక్రపాణి. నిర్మలమ్మను కలుసుకున్నాడు. ఇరవై ఏడేళ్ల అందమైన యువతి, జాబ్ చేస్తున్నది అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకున్నదంటే ఏదో తీవ్రమైన, బలమైన కారణం ఉండి ఉంటుంది. ఆమె దగ్గర సూసైడ్ నోట్ వంటిది ఏమీ దొరకలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. కుటుంబంలో గొడవలు లేవు. ఆమెకు జీవితం మీద విరక్తి చెందడానికి కారణాలేవీ కనబడలేదు. ఏదైనా లవ్ ఎఫైర్? అది ఫెయిలైందా? అదే తెలుసుకోవాలి. ప్రేమ భగ్నమైతే జీవితం మీద విరక్తి కలగడం, చావాలనిపించడం సహజం. ‘‘సార్! మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోమని పోరుతూనే ఉన్నాను. ‘అమ్మా! నేను చనిపోతే ఒంటరిదానివవుతావు. నేను బాగా ఉండగానే పెళ్లి చేసుకో’ అని సతాయిస్తున్నాను. ‘నువ్వెక్కడ పోతావు? నీకంటే నేనే ముందు పోతాను. నువ్వు నూరేళ్లు బతుకుతావు’ అనేది పిచ్చితల్లి.’’ అంటూ నిర్మలమ్మ కూతుర్ని తలుచుకుని ఏడ్చింది. ‘‘శ్రావణికి పెళ్లి ఇష్టం లేదని మీకేమైనా అనుమానం ఉందా?’’ ప్రశ్నించాడు చక్రపాణి. ‘‘పెళ్లికి ముందు బాగా సెటిలైపోవాలి. తొందరేంటి? పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు అనేది.’’ చెప్పింది నిర్మలమ్మ.‘‘సొంత ఇల్లుంది. నెలనెలా జీతం వచ్చే మంచి జాబ్ ఉంది. సెటిలైనట్టేగా? ఇంకేంటి?’’‘‘కాదండీ! శ్రావణికి పెద్ద కోరికలున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలి. తర్వాతే పెళ్లి అనేది.’’‘‘విల్లానా? గేటెడ్ కమ్యూనిటీలోనా? మినిమమ్ కోటి రూపాయలు కావాలిగదా!’’‘‘సార్! ఆ మాటే నేనూ అన్నాను. అమ్మా! ఈ ఫ్లాట్ అమ్మేద్దాం. నా దగ్గర కొంత డబ్బుంది. లోన్ తీసుకుందాం అనేది.’’‘‘ఏమీ అనుకోకండి. మీ అమ్మాయికి జీతంకాక పై సంపాదన ఏమైనా ఉండి ఉంటుందా?’’‘‘అనుకోవడానికి ఏముందండీ! అప్పుడప్పుడు డబ్బు తెస్తుండేది. మనం అడగనవసరం లేదమ్మా! నజరానాలు వాళ్లే ఇస్తారు అని నవ్వేదండీ.’’‘‘శ్రావణికి సంబంధించిన డైరీలు కానీ, డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవ్వండి. ఆమె మరణానికి సంబంధించిన క్లూ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం.’’నిర్మలమ్మ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఒకటి తెచ్చి ఇచ్చింది.‘‘సార్! ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఈ ఫోన్ ఇంట్లోనే ఉంచుతుంది. వేరే ఫోన్‌తో ఆఫీస్‌కి వెళ్తుంది. రెండు ఫోన్లు ఎందుకమ్మా? అంటే కావాల్లే అమ్మా అనేది.’’ చెప్పింది నిర్మలమ్మ. శ్రావణి ఇంట్లో వాడుకునే స్మార్ట్‌ఫోన్ తీసుకుని ఆఫీస్‌కి బయల్దేరాడు ఇన్‌స్పెక్టర్ చక్రపాణి.
శ్రావణికి కాంట్రాక్టర్ భానుప్రకాశ్‌తో గాఢమైన స్నేహం ఉందనీ, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ, మున్సిపాల్టీ స్టాఫ్, వర్కర్లు అంతరంగ సంభాషణల్లో ఎస్సై రసూల్‌కి వెల్లడించారు. అప్పుడప్పుడు కమిషనర్ వెళ్లిపోయాక, శ్రావణి భాను ప్రకాశ్ కారులో వెళ్లడం చూశామని కొందరు చెప్పారు.భాను ప్రకాశ్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. అనుభవం గడించాక మున్సిపాల్టీలో కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డాడు. శ్రావణితో సన్నిహిత సంబంధాలున్నాయని తెలుసుకున్నాక స్టేషన్‌కి పిలిపించారు. ‘‘చెప్పండి భానుప్రకాశ్! శ్రావణి ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటారు? మీకు ఆమెతో క్లోజ్ రిలేషన్ ఉందని మాకు సమాచారం ఉంది.’’ అన్నాడు చక్రపాణి, తన ఎదురుగా కూర్చున్న భాను ప్రకాశ్‌తో. భాను ప్రకాశ్ చాలా నిబ్బరంగా కనిపించాడు. అతనిలో ఆందోళన, తడబాటు ఏమాత్రం లేవు. ‘‘సార్! ఆ విషయంలో నేనేమీ చెప్పలేను. నేను శ్రావణితో రిలేషన్‌లో ఉన్న మాట నిజమే. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. కానీ శ్రావణికి పెద్ద ఆశలుండేవి. ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలనేది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం. ‘తొందరేంటి? పెళ్లికి ముందే లైఫ్ బాగుంటుంది. ఆ తర్వాత రొటీన్‌లో పడిపోతాం. పిల్లలు పుట్టాక లైఫ్‌లో థ్రిల్ ఏముంటుంది?’ అనేది.’’ చెప్పాడు భాను ప్రకాశ్. ‘‘అంతేనా? లేక మీ పెళ్లికి నిర్మలమ్మ ఏమైనా అభ్యంతరం పెడుతున్నదా?’’‘‘అటువంటి ప్రాబ్లమ్ వస్తే మేం సివిల్ మ్యారేజ్ చేస్కుందాం అనుకున్నాం. ఆమె తల్లి వల్ల ప్రాబ్లమ్ ఉన్నట్టు శ్రావణి ఎప్పుడూ అనలేదు సార్.’’ చెప్పాడు భాను ప్రకాశ్. చక్రపాణి అతనితో మాట్లాడుతుండగా ఎస్సై రసూల్ వచ్చి శ్రావణి స్మార్ట్‌ఫోన్ అందించి నిలబడ్డాడు. తనతో ఏదో చెప్పబోతున్నాడని చక్రపాణి గ్రహించాడు. శ్రావణి విషయంలో ఏదైనా క్లూ దొరికితే చెప్పమని భాను ప్రకాశ్‌ని పంపించివేశాడు చక్రపాణి.
మర్నాడు కమిషనర్ శాంతి శరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘శాంతి శరణ్ గారూ! చెప్పండి శ్రావణిని ఎందుకు మేడమీద నుంచి తోసేసి హత్యచేశారు?’’ఏసీపీ అడిగిన ప్రశ్నకు అతనికి ముచ్చెమటలు పడుతున్నాయి. కాదనడానికి ఛాన్స్ లేదు. శ్రావణి స్మార్ట్‌ఫోన్‌లో రికార్డయిన దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక నోరు విప్పక తప్పలేదు. ‘‘బ్లాక్‌మెయిల్ సార్..’’ అన్నాడు శాంతి శరణ్. ‘‘బ్లాక్‌మెయిలా?’’‘‘అవును సార్! శ్రావణి కనిపించేంత అమాయకురాలు కాదు. తన స్నేహితురాలంటూ సురేఖను పరిచయం చేసింది. ఆమె మోడలింగ్ చేసేది. మిస్ ఇండియా అవార్డ్ కొంచెంలో తప్పిపోయిందని చెప్పేది. సురేఖ చొరవగా నన్ను లొంగదీసుకుంది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. శ్రావణికి డబ్బు ఆశ చాలా ఎక్కువ. నేను అప్పుడప్పుడూ బిల్డర్స్ దగ్గరా, కాంట్రాక్టర్ల దగ్గరా నజరానాలు ఇప్పించేవాడిని. ఆ చిన్న చిన్న మొత్తాలు ఆమెకు తృప్తి కలిగించేవి కావని పసిగట్టలేకపోయాను. ఒక పెద్ద వెంచర్‌లో నాకు భారీగా డబ్బు ముట్టింది. శ్రావణి అందులో సగం ఇమ్మని అడిగింది. ఇవ్వకపోతే సురేఖతో ఉన్న ఇంటిమేట్ సీన్స్ అన్నీ నా భార్యకు చూపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. ఆమెలో ధనదాహం నాకు కోపం తెప్పించింది. మాకు ఎప్పుడూ బిల్డర్స్‌తో డీలింగ్సే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను బ్లాక్‌మెయిల్‌కి లొంగితే, అది అప్పటితో పోదు. ఇక తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. ఆ రోజు డబ్బు ఇస్తాను రమ్మని టెర్రస్‌పైకి తీసుకెళ్లాను. చీకటి పడ్డాక టెర్రస్‌పైన బిల్డర్స్‌తో రహస్య సమావేశాలు మామూలే. పైన కుర్చీలు, టేబుల్ వంటివి వేసి ఉంటాయి. శ్రావణి నా ఆలోచన పసిగట్టలేకపోయింది. మాటలు చెబుతూ ఆమెను కిందకు నెట్టేసి నా చాంబర్‌కి వెళ్లిపోయాను. ఎవరూ చూడకపోవడం అదృష్టం అనుకున్నాను.’’ చెప్పాడు కమిషనర్ శాంతి శరణ్.
- వాణీశ్రీ
Comments
Please login to add a commentAdd a comment