స్వర్గంలోని ‘హెవెన్‌స్టార్ లెవెన్‌స్టార్ పార్క్’ అది. పార్క్‌లో ఒక మూల బెంచీపై కూర్చొని ఎత్తిన సీసా దించకుండా చాలా సిన్సియర్‌గా మందు కొడుతున్నాడు దేవదాస్. అటువైపుగా వచ్చిన పార్వతి దేవదాస్‌ను చూసింది. ‘‘దేవదాను చూసి ఎన్ని దశాబ్దాలైందో!’’ అనుకుంటూ బెంచీ వెనక్కి వెళ్లి దేవదాస్ కళ్లు మూసి... ‘‘దేవదా... నేనెవరో చెప్పుకో చూద్దాం’’ అని చిలిపిగా అడిగింది. ‘‘నువ్వెవ్వరో చెప్పుకోలేనుగానీ... నువ్వు చేపలపులుసుతో భోజనం చేశావని మాత్రం చెప్పగలను. చేతులను మంచి సోప్‌తో కడుక్కొని ఉండాల్సింది’’ అన్నాడు దేవదాస్. ‘‘నేను ఏ పులుసుతో తింటే నీకేంగానీ...నేనెవరో చెప్పుకోచూద్దాం?’’ మరోసారి అడిగింది పార్వతి. ‘‘మందు కొడితే అద్దంలో నన్ను నేనే గుర్తు పట్టలేను. అలాంటిది ఈ సమయంలో వెనక నుంచి వచ్చి కళ్లు మూస్తే ఎలా గుర్తు పట్టగలను?’’ అన్నాడు దేవదాస్. ఇక లాభం లేదనుకొని అతని ముందుకు వచ్చి నిల్చుంది పార్వతి. ‘‘పారూ...నువ్వా!!’’ ఆశ్చర్యానందాలతో అరిచాడు దేవదాస్.
తమ చిన్నప్పటి విషయాలను గుర్తు తెచ్చుకొని ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ‘‘దేవదా... ఇంకా మందు కొడుతూనే ఉన్నావా! నన్ను మరిచిపోవడం కష్టంగా ఉందా?’’ సానుభూతిగా అడిగింది పార్వతి. ‘‘పిచ్చి పారూ....అప్పుడెప్పుడో సెవెంటీస్‌లోనే నిన్ను మరిచిపోయాను. కానీ మందును మాత్రం మరవలేకపోతున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘నన్ను మరిచిపోయినందుకు బాధ పడటం లేదు. ఈ కాల కూట విషాన్ని తాగుతున్నందుకు మాత్రం బాధ పడుతున్నాను. నా కోసం మందు మానలేవా?’’ ‘‘ఈరోజు నుంచే మానేస్తున్నాను’’ ఖాళీ అయిన సీసాను ముళ్లపొదల్లోకి విసురుతూ అన్నాడు దేవదాస్.‘‘దేవదా...నేనంటే ఎంత ప్రేమ నీకు?’’ పొంగిపోయింది పార్వతి. ‘‘ ప్రేమ కాదు... మలేరియా దోమ కాదు....నీ కోసం కాదు...ఆ మేనక కోసం మానేస్తున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘మేనక కోసమా!!!’’ నలుదిక్కులూ అదిరేలా ఆశ్చర్యపోయింది పార్వతి. ‘‘ఈ స్వర్గానికొచ్చాక తిలోత్తమతో త్రీ టైమ్స్ లవ్‌లో పడ్డాను. ఎప్పటిలాగే బ్రేకప్! ఇక పొరపాటున కూడా లవ్‌లో పడొద్దని డిసైడైపోయాను. అనుకున్నావు అని ఆగవు కొన్ని...అని ఎవరో అన్నట్లు.... విధివశాత్తు మళ్లీ ప్రేమలో పడిపోయాను. అదేలా జరిగిందంటే... ఒక రోజు నేను ఈ పార్క్‌లో కూర్చొని ఏమీ తోచక... ‘కళ్లు కళ్లు ప్లస్సు /వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్‌ఫాక్చ్‌వేషన్’ పాట పాడుకుంటున్నాను. అప్పుడే ఇటు వైపుగా వచ్చిన మేనక, తనను చూసే నేను పాడుతున్నట్లు టెంప్టయిపోయింది. ‘‘మీకు అంతగా నచ్చానా!’’ అంటూ నా దగ్గరకు వచ్చి సిగ్గుపడిపోయింది. ‘‘యా!’’ అని చిన్న అబద్ధం ఆడాను. అలా మేనక ప్రేమలో పడిపోయాను.
‘‘మేనూ...నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడిగాను. ‘‘తప్పకుండా. కానీ మీరు ముందు ఈ మందు కొట్టడం మానేయాలి’’ అని షరతు పెట్టింది. ‘‘ఆరోజు ప్రేమ కోసమే మందు కొట్టాను. ఈరోజు ప్రేమ కోసమే మానేస్తున్నాను. ఇక ముందు నైన్‌టీ ఎమ్.ఎల్ కూడా తీసుకొను’’ అని మాట ఇచ్చాను. ఇదే చివరిరోజు. ఇక ఎప్పుడూ మందు ముట్టను. ఎల్లుండి వాలెంటెన్స్ డే రోజు మా పెళ్లి ఘనంగా జరగనుంది. మన పొరుగు రాష్ట్రమైన నరకం నుంచి కూడా మా పెళ్లి చూడటానికి చాలామంది వస్తున్నారు’’ ఆనందంగా అన్నాడు దేవదాస్. ‘‘ఈరోజు గొప్ప శుభవార్త విన్నాను. తప్పకుండా నీ పెళ్లికి వస్తాను’’ అని చీరకొంగుతో ఆనంద భాష్పాలు తుడుచుకుంది పార్వతి. దేవదాస్ తన చేతికి ఉన్న వాచ్ చూసుకుంటూ... ‘‘పారూ... నా పెళ్లిలో కలుద్దాం’’ అని కోటు జేబులో రెండు చేతులను దూర్చి ‘ఒక మేనక కోసం.... టక్ టక్ టక్.... తిరిగాను స్వర్గం... లక్ లక్ లక్’’ అని పాడుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.
ఆరోజు వాలెంటెన్స్ డే. కొత్త పట్టుచీర కట్టుకొని ‘షాన్‌పారేషాన్’ ఫంక్షన్‌హాల్‌కు వెళ్లింది పారు. అక్కడ ఒక పురుగు కూడా లేదు. వెంటనే అక్కడి నుంచి ‘హెవెన్‌స్టార్ లెవెన్‌స్టార్’ పార్క్‌కు వెళ్లింది. పార్క్‌లో ఒక మూల కూర్చొని మందుకొడుతున్నాడు దేవదాస్. ‘‘పెళ్లని చెప్పావు... ఇక్కడున్నావేమిటి?’’ అడిగింది పార్వతి. ‘‘ఇంకెక్కడి పెళ్లి... క్యాన్సిల్ అయింది. అంతా ఆ తండ్రీకొడుకులే చేశారు’’ ఆవేదనగా అన్నాడు దేవదాస్. ‘‘వాళ్లెవరు?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘పృథ్వీరాజ్ కపూర్... ఆయన సన్ రాజ్‌కపూర్. ఏదో ఫంక్షన్‌లో రాజ్‌కపూర్ మేనకను చూసి పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టాడట. అప్పుడు పృథ్వీరాజ్‌కపూర్ మేనక తల్లి దగ్గరకు వెళ్లి ‘ఎలాగైనా సరే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి’ అని మ్యానేజ్ చేశాడు. ఆ మహాతల్లి ఓకే చెప్పింది. మా లవ్వులో నిప్పులు పోసింది’’ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు దేవదాస్.‘‘అసలు మేనక ఎలా ఒప్పుకుంది?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘ఆరోజు నువ్వు మీ నాన్న మాట కాదనలేక...నన్ను కాదన్నావు... ఈరోజు పారు వాళ్ల అమ్మ మాట కాదనలేక నన్ను కాదనుకుంది.... అంతే తేడా.... ఒక డాడీ, ఒక మమ్మీ నా జీవితాన్ని ఖాళీసీసా చేసేశారు! వోడ్కా మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇక ప్రేమ జోలికి ఎప్పుడూ వెళ్లను’’ నిర్వేదంగా అంటూ సిగరెట్ వెలిగించి పాట అందుకున్నాడు దేవదాస్...‘పారు లేదు/ పప్పు చారు లేదు/ మేను లేదు వాటర్‌క్యాను లేదూ/ వెలుతురే లేదు’ ఆ సమయంలోనే అటువైపుగా వస్తున్న రంభను చూసి సడన్‌గా పాట మార్చాడు దేవదాస్.‘కళ్లు కళ్లు ప్లస్సు/ వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్‌ఫాక్చ్‌వేషన్’... అని పాడటం మొదలు పెట్టాడు.‘‘మీకు అంతగా నచ్చానా!’’ సిగ్గుతో మెలికలు తిరిగింది రంభ.‘పిచ్చ పిచ్చగా నచ్చావు’ అన్నాడు దేవదాస్. పారు బిత్తర పోయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది!
– యాకుబ్ పాషా
స్వర్గంలో దేవదాస్
Published Sun, Feb 11 2018 12:17 AM | Last Updated on Sun, Feb 11 2018 12:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment