ఆయన పేరు బంక సంగీతం కుమార్. వీరి నాన్న పేరు బంక అప్పారావు. ఈయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలో రెండుసార్లు చెవికి సర్జరీ కూడా అయింది. సంగీతంపై తనకున్న వీరాభిమానానికి గుర్తుగా కొడుక్కి ‘సంగీత కుమార్’ అని పేరు పెట్టి మురిసిపోయేవాడు.‘‘నీకు అక్షరాలు రాకపోయినా ఫరవాలేదు. సరిగమలు వస్తే చాలు’’ అంటుండేవాడు కొడుకుతో.సంగీతంకుమార్‌కి మాత్రం ‘సంగీతం’ తప్ప ప్రపంచంలోని ప్రతి విషయమూ ఆసక్తికరమే.కొడుకు అనాసక్తిని గమనించిన తండ్రి....‘‘నువ్వు సంగీతం నేర్చుకొని కచేరి ఇవ్వకపోయావా...నా శవాన్ని కళ్ల జూస్తావు’’ అని ఒక ఫైన్‌మార్నింగ్ వార్నింగ్ ఇచ్చాడు.దీంతో...‘30 రోజుల్లో సంగీతం’ క్లాసులకు వెళ్లాడు సంగీతం కుమార్. ఆ మరుసటిరోజు నగరంలో ‘కళాతృష్ణ’ ఆడిటోరియంలో అరంగేట్రానికి పూనుకున్నాడు.రసజ్ఞులైన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.కచేరి మొదలైన పావుగంటలోనే...టీవీలో బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ ఆడిటోరియంలో ఉగ్రవాదుల బాంబుదాడి’పూర్తి వివరాలు ఇంకా తెలియకముందే టీవీలో మరోవైపు చర్చాకార్యక్రమం మొదలైంది.‘‘ఈ ఉగ్రవాదం ఉంది చూశారు...’’ అని ఒకాయన అందుకున్నారు.‘‘ఏం చూడమంటారు నా బొంద....ఇన్ని రోజులు కళ్లు మూసుకున్నారా! పట్టపగలు నట్టనడివీధిలో ఆడిటోరియంలో ఉగ్రవాదులు బాంబు దాడి చేస్తే...చట్టం ఏం చేస్తుంది? అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? గుర్రు పెట్టి నిద్రపోతున్నాయా!’’‘‘నిద్రపోవడం మీ పార్టీ వాళ్ల పేటెంట్.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ప్రశాంతంగా ఉందా? మా పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంతిభద్రతలు సవ్యంగా లేవని పాత న్యూస్‌పేపర్లను తిరిగేస్తే అర్థమవుతుంది’’ ‘‘మిమ్మల్ని వాళ్లు, వాళ్లని మీరు తిట్టడం సమస్యకు పరిష్కారం కాదు. అందరం కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం వెదకాలి ఈలోపు బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ బాంబుదాడి ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. ఒక్కరిద్దరూ మాత్రం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయింది’ బాంబుస్క్వాడ్ రంగంలోకి దిగింది.
ఉగ్రవాదులు ఆర్‌డీఎక్స్ వాడారా? ఇతర పేలుడు పదార్థాలు వాడారా? అనేదాని గురించి లోతుగా దర్యాప్తు జరిగింది. కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. మిస్టరీ వీడలేదు. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిది ప్రభుత్వం. రెండు రోజులు తరువాత జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్యాప్తు అధికారులు ప్రకటించిన విషయాలు ఇలా ఉన్నాయి...‘‘అందరూ అనుకున్నట్లు కళాతృష్ణలో ఉగ్రవాదుల బాంబుదాడి జరగలేదు. ఏ ఉగ్రవాద కుట్ర కూడా ఇందులో లేదు. ఈ విధ్వంసానికి మూలకారణం ఎవరో తెలుసా? సంగీత కుమార్...సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తే విద్వాంసుడు అవుతాడు...పైపైన నేర్చుకొని కచేరీలు ఇస్తే విధ్వంసుడు అవుతాడని చరిత్ర మరోసారి నిరూపించింది. తన తండ్రి బలవంతం మేరకు హడావుడిగా సంగీతం నేర్చుకొని, అంతకంటే హడావుడిగా కచేరి ఏర్పాటు చేశాడు కుమార్. ఈయన సంగీతం ధాటికి ప్రేక్షకులు తాళలేకపోయారు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారు.సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు... దీనిసంగతేమిటోగానీ... కుమార్ సంగీతం ధాటికీ హాలు పూర్తిగా దెబ్బతింది. పైనున్న ఫ్యానులు ఊడిపడి ప్రేక్షకుల తలలకు గాయాలయ్యాయి....’’టీవీలో దర్యాప్తు అధికారుల ప్రెస్‌మీట్‌ను చూసి కుప్పకూలిపోయాడు బంక అప్పారావు.‘‘పదితరాలకు సరిపడే ఆస్తులు సంపాదించాను. కానీ ఏంలాభం? నా కోరికను నెరవేర్చుకోలేకపోతున్నాను.నా కొడుకు కచేరి చేయాలనేది నా చిరకాల కోరిక.ఇక ఇప్పుడు వాడి కచేరి చూడడానికి ఎవరు వస్తారు? ప్రాణాలు ఎవరు పణంగా పెడతారు. అయ్యో దేవుడా...నాకు ఎంత పెద్ద శిక్ష విధించావయ్యా’’ అని మంచం పట్టాడు అప్పారావు.మంచానా పడ్డ అప్పారావును తిరిగి మామూలు మనిషిని చేయడానికి దేశవిదేశాలనుంచి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించారు. ఏవేవో వైద్యాలు చేశారుగానీ ఏవీ వర్కవుట్ కాలేదు. చైనా వైద్యుడు డా.కుంపె డాంగ్ ఇలా అన్నాడు...‘‘నాయనా కుమారూ...మనోవ్యాధికి మందులేదు. నువ్వు కచేరి చేయాలనేది ఆయన కోరిక. అది చేస్తేగానీ మీ నాయిన మళ్లీ మామూలు మనిషి కాలేడు’’అప్పుడు కుమార్ అసిస్టెంట్ ఇలా ఆందోళనగా అరిచాడు...‘‘అయ్యగారు కచేరి చేయకపోతే...పోయేది పెద్ద అయ్యగారు మాత్రమే.చేస్తే...పోతారు....అందరూ పోతారు...నాతో సహా’’
‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు. మంచం పట్టిన అప్పారావు...చచ్చి శ్మశానానికి వెళ్లాడా? లేక కోలుకున్నాడా? సంగీతకుమార్ కచేరి చేశాడా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో...’’ హెచ్చరించాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు గొంతు విప్పాడు....వారం తిరగకముందే అప్పారావు భేషుగ్గా కోలుకున్నాడు.దీనికి కారణం కుమార్ సంగీత కచేరి చేయడం. విశేషం ఏమిటంటే...కచేరి పూర్తయేంత వరకు పిన్‌డ్రాప్ సైలెన్స్. ఒక్కరూ సీట్లో నుంచి లేవలేదు. కచేరి బ్రహ్మాండంగా విజయవంతమైంది’’‘‘అంటే...సంగీత కుమార్ సంగీతంలో ప్రావీణ్యం సాధించాడా?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘ప్రావీణ్యమా పాడా!’’‘‘మరి ఎలా?’’‘‘చెబుతావిను. సంగీతకుమార్‌కి టెక్ నాగలింగం అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతనికి టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది. సైన్స్ పత్రికలు రెగ్యులర్‌గా చదువుతుంటాడు. ఆమధ్య ఒక ఆర్టికల్ చదివాడు. బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కర్ణకఠోర శబ్దాలను నిరోధించే త్రీడి టెక్నాలజీని తయారుచేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో విమాన,హెలికాప్టర్లు, డ్రోన్‌లు...మొదలైన వాటి నుంచి భీకరశబ్దాలు వినిపించకుండా నిరోధించవచ్చు. ఈ ఆర్టికల్ చదివిన వెంటనే ‘లడ్డూ కావాలా నాయనా’ అని నాగలింగం మెదడులో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అంతే...బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి టెక్నాలజీని కళాతృష్ణ ఆడిటోరియంలో వాడారు. దీంతో...కుమార్ కచేరి ఇస్తున్న మాటేగాని...అతని నోటి నుంచి ఒక్క శబ్దం కూడా ప్రేక్షకమహాశయులకు వినిపించలేదు. అలా కథ సుఖాంతమైంది’’ అని చెప్పాడు విక్రమార్కుడు.
– యాకుబ్ పాషా
నగరంలో ఒకరోజు...
Published Sun, Mar 24 2019 12:06 AM | Last Updated on Sun, Mar 24 2019 12:06 AM
Comments
Please login to add a commentAdd a comment