డాక్టర్‌ రిషి | Funday :seen is yours tittle ours | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రిషి

Published Sun, Aug 5 2018 1:18 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

Funday :seen is yours tittle ours - Sakshi

తెలుగులో చిన్న బడ్జెట్‌ సినిమాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. మంచి సందేశాన్నిస్తూ, ‘అవార్డు సినిమా’గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

రిషి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతనికి చుట్టూ సమస్యలే కనిపిస్తున్నాయి. దేనికీ ఒక పరిష్కారం కనిపించడం లేదు. ఆ రాత్రి వేళ, చీకట్లో కలిసిపోయిన ఆ చెట్టునీడ కింద కూర్చొని ఉన్న రిషీకి, తన పక్కన్నే కూర్చున్న వ్యక్తి అక్కణ్నుంచి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తోంది – ‘బీ పాజిటివ్‌’.  ఎగిరి గంతేశాడు రిషి. పరిష్కారం దొరికింది. కార్తీక్‌ది, తనదీ బీ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌. అంటే కార్తీక్‌కు తన గుండె సరిపోయే అవకాశం ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి చెక్‌ చేయించాడు. సరిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన గుండెను డొనేట్‌ చేస్తూ సంతకం చేశాడు. రిషి ఆలోచనలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి.   కార్తీక్‌ ఎప్పుడు పరిచయం తనకు?  రిషి ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న రోజులు. ప్రేమించిన అమ్మాయి పూజ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోతోందంటే ఆగలేకపోయాడు. ఫ్రెండ్స్‌ అందరినీ ఒక గ్యాంగ్‌గా తీసుకెళ్లి ఎంగేజ్‌మెంట్‌ను అడ్డుకున్నాడు. పూజ నాన్నతో గొడవ పడ్డాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి, ఒకరి చేతులు ఇంకొకరి చేతుల్లోకి తీసుకొని బయటపడ్డారు. రిషికి అప్పటికి తాను చేస్తున్న పెద్ద అడ్వెంచర్‌ ఇదని తెలుసు. 

ఫ్రెండ్స్‌ అంతా కలిసి హైదరాబాద్‌కి తిరిగొస్తున్న సమయంలో బస్‌లో కార్తీక్‌ను మొదటిసారి చూశాడు రిషి. ఆయాసంతో కొట్టుకున్నాడు కార్తీక్‌. వయసు పదేళ్లు కూడా ఉండదు. ‘‘అమ్మా! నొప్పి..’’ అంటూ అమ్మ పక్కనే సీట్లో అలాగే కూలబడి కొట్టుకున్నాడు. రిషి లేచి కార్తీక్‌ని చూశాడు. ‘‘రిషీ! ఎక్కడికి? మనకు వైద్యం అందించడానికి లైసెన్స్‌ లేదు.’’ అంది పూజ, రిషి కార్తీక్‌ దగ్గరికి వెళుతుంటే ఆపుతూ. 
‘‘లేదు మనం వెళ్లాల్సిందే!’’ అంటూ కదిలాడు రిషి. కార్తీక్‌ను దగ్గరకు తీసుకున్నాడు. ఛాతీపై నొక్కుతూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆయాసం తగ్గింది. కదలిక లేకుండా పడుకున్నాడు కార్తీక్‌. ‘‘బాబు కోమాలోకి వెళ్లాడు.’’ అంటూ అంబులెన్స్‌కు కాల్‌ చేశాడు రిషి. హాస్పిటల్‌లో చేర్చుకోవడానికి డ్యూటీ డాక్టర్లు కూడా లేరు. ఇంకా ఫైనలియర్‌ కూడా పూర్తి చేయని రిషికి, ఒక పేషెంట్‌ని ఇలా అడ్మిట్‌ చేసుకోకూడదని, ట్రీట్‌మెంట్‌ ఇవ్వకూడదని తెలుసు. కానీ తప్పలేదు. ఆ రాత్రంతా నిద్రపోకుండా కార్తీక్‌కు పరీక్షలు చేస్తూనే ఉన్నాడు. కార్తీక్‌కు కాలేజీ డీన్, ప్రొఫెసర్ల నుంచి పోరు మొదలైంది. ఎంబీబీఎస్‌ పూర్తి చేయకముందే వైద్యం ఎలా చేస్తావంటూ గొడవ చేశారు. ‘‘యూ థింక్‌ యూకెన్‌ హీల్‌ పీపుల్‌?’’ అడిగాడు ప్రొఫెసర్‌. ఆయనంటే ఆ కాలేజీలో అందరికీ గౌరవం, భయం. ‘‘అబ్సల్యూట్లీ!’’ ధీమాగా సమాధానమిచ్చాడు రిషి. 

డీన్, ప్రొఫెసర్‌ కాసేపు గుసగుసగా మాట్లాడుకొని, ‘‘ఓకే! ఇది మీకు ప్రాజెక్టు అసైన్‌మెంట్‌గా ఇస్తున్నా. నెలరోజుల్లోపుగా కేసు మొత్తం స్టడీ చేసి మాకు రిపోర్ట్‌ ఇవ్వాలి. మా అందరినీ ఆ రిపోర్ట్‌తో సాటిస్‌ఫై చేయాలి. చేయలేకపోతే నువ్వు మెడిసిన్‌ ఇంకో ఇయర్‌ కంటిన్యూ చేయాలి. యూ గేమ్‌?’’ రిషి ఆలోచనల్లో పడ్డాడు. కాకపోతే ఈ ఛాలెంజ్‌ గురించి కాదు అతను ఆలోచిస్తున్నది. కార్తీక్‌ ఆ నెల రోజులైనా బతుకుతాడా అని.  ‘‘నీకింకో ఛాయిస్‌. సారీ చెప్తున్నట్టు రాసిస్తే, మొదటి తప్పు కింద ట్రీట్‌ చేసి వదిలేస్తాం.’’ ఆలోచనల్లో పడ్డ రిషీని కదిలిస్తూ చెప్పాడు డీన్‌. పూజ సహా, చుట్టూ ఉన్నవాళ్లంతా ‘రిషీ! సారీ చెప్పు.’ అని రిషిని కదిలిస్తున్నారు. రిషి కొద్దిసేపు ఏం మాట్లాడకుండా ఆలోచించి, ‘‘నేను ఒప్పుకుంటున్నాను. రిపోర్ట్‌ సబ్‌మిట్‌ చేస్తాను. కానీ నెలలో కాదు, వారంలో!’’ అన్నాడు. డీన్, ప్రొఫెసర్‌ షాక్‌కు గురైనట్టు చూస్తూ ఉండిపోయారు.  కార్తీక్‌కు చెయ్యాల్సిన టెస్టులన్నీ చేసి, చెప్పినట్టే వారానికి రిపోర్ట్‌తో తిరిగొచ్చాడు రిషి. రిపోర్ట్‌ మొత్తం చదివిన టీమ్, ‘‘సో, ఏం సజెస్ట్‌ చేస్తావు?’’ అనడిగింది.‘‘హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఒక్కటే సొల్యూషన్‌’’ చెప్పాడు రిషి. ‘‘గుండెమార్పిడా? అతనికి కేవలం ఏడేళ్లు. ఆర్‌ యూ ష్యూర్‌? నీ కెరీర్‌ రిస్క్‌లో ఉంది.’’ చివరి మాట నొక్కిపట్టి చెప్పాడు ప్రొఫెసర్‌. ‘నాకు తెలుసు.’ అని ధీమాగా తలూపాడు రిషి. రిషికి కార్తీక్‌ కేసును డీల్‌ చేసే అవకాశమిచ్చింది టీమ్‌. రిషితో పాటు అతని ఫ్రెండ్స్‌ అందరికీ ఊహించనంత దగ్గరైపోయాడు కార్తీక్‌. కార్తీక్‌ అల్లరి కూడా వాళ్లందరికీ ఆనందమే. కానీ ఆ ఆనందం, ఆ అల్లరీ ఎక్కువ రోజులు అలా ఉండటం లేదు. ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతున్నాడు కార్తీక్‌.
 
రిషికి భయం పెరిగిపోతోంది. టెన్షన్‌ ఎక్కువైపోతోంది. కార్తీక్‌కు గుండె కావాలి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గుండె ఎక్కణ్నుంచి వస్తుంది? ఎవరు దానం చేస్తారు? ఆ సమస్యకు తోడు కొత్తగా ఇంకో సమస్య అతని ముందుకొచ్చి నిలబడింది. ‘‘బ్రెయిన్‌ ట్యూమర్‌. ట్యూమర్‌ పక్కనే బ్లడ్‌ క్లాట్‌ అయింది. డబ్లీ డేంజరస్‌.’’ తల తిరిగి పడిపోయిన రిషీ రిపోర్ట్స్‌ చూసి డాక్టర్‌ చెప్పిందీ మాట. ‘‘ఎన్నాళ్లు?’’ అడిగాడు రిషి.‘‘రేపు.. ఎల్లుండి? మ్యాగ్జిమమ్‌ మూడు నెలలు.’’ ‘‘నేను చనిపోతున్నా. అంతేగా!’’ అభావంగా చెప్పాడు రిషి. అప్పట్నుంచి తన సమస్యలకు పరిష్కారాలే లేవని తిరుగుతున్నాడు. పరిస్థితులను తిట్టుకుంటున్నాడు. అలాగే దేవుడ్ని కూడా! ‘బీ పాజిటివ్‌’. తన పక్కన్నే కూర్చున్న వ్యక్తి ఈ మాట చెప్పకపోయి ఉంటే, కార్తీక్‌ ఈరోజు తన గుండెను దానం చేసి, ఆ గుండెతో కార్తీక్‌ను బతికించవచ్చన్న ఆలోచన చేసేవాడు కాదు. ఇంత ప్రశాంతంగా ఇలాగతాన్ని తల్చుకునేవాడూ కాదు. కానీ కార్తీక్‌కు ఇప్పటికిప్పుడే గుండె కావాలి. రిషి చనిపోయేంతవరకూ ఆ పసివాడు ఆగలేకపోవచ్చు. రిషి ఒక ఆలోచన చేశాడు. చుట్టూ ఉన్న వాళ్లు వారించినా, చట్టం ఒప్పుకోకపోయినా, సమాజం ఆందోళన పడ్డా, కార్తీక్‌ కోసం ఆ పని చేయాలనుకున్నాడు, చావు తనని పిలవకముందే తానే చావును వెతుక్కుంటూ వెళ్లాలని. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement