అంత అందమైన అమ్మాయిని చూడటం అదే మొదటిసారి. అంటే ఇంతకు ముందు అందమైన అమ్మాయిల్ని చూళ్లేదని కాదు, కానీ ఇంత అందంగా, అద్భుతమైన శిల్పం చెక్కినట్టు, ఎక్కడా అంగుళంలో వెయ్యోవంతు కూడా కొలత తప్పకుండా... అప్సరసలు కూడా ఇంత అందంగా ఉండరేమో! సాయం సంధ్యలో సముద్రపు ఒడ్డున కూచుని ఎగసిపడే అలల్ని చూస్తూ... పక్కనే ఎవరో కూచోవడంతో తల తిప్పి చూసి... తర్వాత తల తిప్పుకోలేక... ఎంత అవస్థో కదా! ఓవైపు ఆడపిల్ల మొహం వైపు తదేకంగా చూడకూడదన్న సంస్కారం వెనక్కి లాగుతుంటే మరోవైపు ఈ అతిలోక సౌందర్యాన్ని వీక్షించడంలో ఓ క్షణం కోల్పోయినా జీవితం వృథా అనిపిస్తోంది. ఆమె కూడా తల తిప్పి నావైపు చూసింది. తిడుతుందేమోనన్న భయంతో చూపులు మరల్చబోతూ ఆమె పెదవుల మీద పూసిన మనోహరమైన నవ్వు చూసి ఆగిపోయాను. ‘‘హలో... ఏమిటలా చూస్తున్నారు? అబద్ధం చెప్పకండి. నాకు తెలుసు మీరెందుకలా చూశారో’’ అంది. ఓవైపు గొంతు తడారిపోయి తొట్రుపాటు... మరోవైపు తనే పలకరించినందుకు ఒంట్లో అలల్లా కదులుతున్న పులకింత. ‘‘మీకు తెలుసున్నారుగా... ఇంకా చెప్పడం దేనికి?’’ అన్నాను. ‘‘మీరేం చెప్తారో విందామని’’ ‘‘రోజూ మీరు అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నప్పుడల్లా మీరనుకునేదే నా జవాబు కూడా’’ ‘‘అదే సమస్య. అద్దం మాట్లాడదుగా... దానికే మాటలు వస్తే ఎంత బాగుండేదో కదా. మీకొచ్చుగా... చెప్పండి’’ ‘‘పొగడ్తలు వినడం చాలా ఇష్టంలా ఉందే’’ ‘‘పొగడ్తలంటే ఇష్టపడని అమ్మాయిలు కూడా ఉంటారా?’’ అంటూ మరోసారి నవ్వింది. ప్రతి ఆదివారం సాయంత్రం ఈ బీచ్ ఒడ్డున కూచుని సముద్రంలో పొంగుతున్న అలల్ని చూడటం ఓ ఏడాది నుంచి నా అలవాటు. కానీ ఈ అమ్మాయిని ఎప్పుడూ చూసినట్టు గుర్తు లేదు.
‘‘మీరీ బీచ్‌కి రెగ్యులర్‌గా వస్తుంటారా?’’ అని అడిగాను.‘‘లేదు. ఇదే మొదటిసారి రావడం’’‘‘అలానా... అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు బీచ్‌కి వచ్చిన మొదటి రోజే మీ పరిచయభాగ్యం కలిగింది. ఇంతకూ మీ పేరేమిటో చెప్పలేదు’’‘‘మీరడగలేదుగా’’ అంటూ నవ్వింది. ‘‘నా పేరు లిఖిత’’‘‘స్వీట్ నేమ్. నా పేరు సునీల్. ఇక్కడే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్‌ని. మరి మీరు?’’‘‘అన్నప్రాశననాడే ఆవకాయ తినిపిస్తారా ఏమిటి?’’ తొందరెందుకు? మళ్లీ కలుస్తాంగా’’‘‘ఎప్పుడు?’’‘‘వచ్చే ఆదివారం. ఇక్కడే’’ ఆమె లేచి కదుల్తున్న అలలా వెళ్లిపోయింది.ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఆరాటం... సోమవారం తర్వాత ఆదివారం వస్తే ఎంత బావుండునో కదా అనే ఆశ. నిజంగానే వస్తుందా... ఒకవేళ రాకపోతేనో అనే అనుమానాలు... ఆదివారం రానే వచ్చింది. అప్పటి వరకు రోజులు యుగాల్లా గడిపితే ఈ రోజు మాత్రం నిమిషాలే యుగాల్లా సుదీర్ఘంగా సాగి బాధిస్తున్నాయి. బీచ్‌లో ఎదురుచూస్తూ కూచున్నప్పుడు క్షణాలు యుగాల్లా... లిఖిత వచ్చింది. ఎన్ని కబుర్లో. ఆమె అందమైన నవ్వుల్ని మధ్య మధ్యలో ఆస్వాదిస్తూ... అలాంటి ఎన్ని ఆదివారాలు అందమైన అలల్లా వచ్చి వెళ్లాయో... లిఖితను చూడకుండా ఉండలేని పరిస్థితి. రోజులో అధికభాగం లిఖితను కలవరిస్తూ... పలవరిస్తూ... నేను ప్రేమలో పడ్డానని అర్థమైంది. మొదట నన్నాకర్షించింది ఆమె అందమే అయినా నన్ను కట్టి పడేసింది మాత్రం ఆమె తెలివి, వాక్చాతుర్యం.‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నానో రోజు.‘‘సారీ, నేను పెళ్లికి యోగ్యురాల్ని కాను’’ లిఖిత మొహంలో సముద్రమంత ఉదాసీనత...
‘‘నీకేం తక్కువ? ఎందుకలా అనుకుంటున్నావు?’’ అన్నాను ఆశ్చర్యపోతూ.‘‘నేను తల్లిని కాలేను. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అవసరమైన యుటెరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్ లాంటి అవయవాలు నాలో లేవు’’‘‘నీకెలా తెలుసు? డాక్టర్లు చెప్పారా? ఎప్పుడు చెకప్ చేయించుకున్నావు? పెళ్లి కాకముందే పిల్లల గురించి ఎందుకు డాక్టర్లని కన్సల్ట్ చేశావు?’’ అని అడిగాను.విషాదంగా నవ్వి ‘‘డాక్టర్లు చెప్పలేదు. నాకు తెలుసు’’ అంది.‘‘అదే ఎలా తెలుసు?’’ కొద్దిగా చిరాగ్గా అడిగాను.‘‘నన్నడగొద్దు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను’’ అంటూ నేను పిలుస్తున్నా వినకుండా ఇసుకలో లుప్తమైపోతున్న అలలా వేగంగా వెళ్లిపోయింది.నేనీ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాను. ప్రేమంటే ఆమెలోని ఉత్తమ లక్షణాల్ని ఇష్టపడటమే కాదు, లోపాల్ని కూడా అంగీకరించాలి కదా. పిల్లలు లేకున్నా పర్లేదు. కంటేనే పిల్లలా... పెంచినామన పిల్లలవుతారు. ఏ అనాథాశ్రమం నుంచో ఓ ఆడపిల్లని తెచ్చి పెంచుకుంటే చాలు. మాకు పిల్లలు లేని లోటు తీరటంతో పాటు ఆ పిల్లకు తల్లి ప్రేమనూ తండ్రి ప్రేమనూ అందించవచ్చు.ఆదివారం కలుసుకున్నప్పుడల్లా ‘‘పిల్లలు పుట్టకున్నా పర్లేదు. మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాను.లిఖిత నావైపు ఆరాధనగా చూసింది. ‘‘మీ వాళ్లతో వచ్చి మాట్లాడనా? మన మధ్య ప్రేమ చిగురించి ఇన్ని నెలలైనా నువ్విప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ ఇల్లెక్కడ?’’ అని అడిగాను.
‘‘సారీ... ఇంత క్రితం కూడా నువ్వు చాలాసార్లు అడిగావు. నేను చెప్పలేదు. చెప్పలేను కూడా’’‘‘అనాథవా?’’‘‘ఓ రకంగా అంతే. మరో రకంగా కాదు’’‘‘అర్థంకాని ప్రహేళికలా మాట్లాడతావెందుకు?’’‘‘నేను నిజంగానే ఓ పజిల్ని కాబట్టి’’‘‘సరే, అవన్నీ నీ వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు మన పెళ్లి జరగాలంటే నీ వైపు బంధువులెవరైనా ఉండాలిగా’’‘‘బంధువులు ఎవ్వరూ లేరు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు.తప్పించుకుని వచ్చేస్తా’’‘‘తప్పించుకుని రావడమేంటి? అంటే ఎవరైనా నిన్ను నిర్బంధించారా? అదే నిజమైతే ఇలా ప్రతి ఆదివారం బయటికి స్వేచ్ఛగా ఎలా రాగలుగుతున్నావు?’’లిఖిత మొహంలో దిగులుఅరణ్యంలా విస్తరించడం గమనించాను. ఓసారి తల తిప్పి వెనక్కి చూసింది. ఆమె కళ్లలో బెదురు...‘‘నేను స్వేచ్ఛగా తిరుగుతున్నానని అనుకుంటున్నావా? లేదు. నాకు స్వేచ్ఛ లేదు. బందీని. నా ప్రతికదలికనీ రెండు జతల కళ్లు గమనిస్తూ ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న పంజరంలో పక్షిని నేను’’ ఆమె సన్నగా ఏడుస్తోంది.‘‘నాకు అర్థమయ్యేలా చెప్పు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుందాం.నువ్వు గూండాల చెరలో ఉన్నావా? మాఫియా గ్యాంగ్ ఏదైనా నిన్ను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోందా?’’‘‘లేదు. అలాగని నేను స్వతంత్రురాల్ని కూడా కాదు’’‘‘అబ్బా... మళ్లీ పజిల్’’‘‘దయచేసి ఇంక నన్నేమీ అడక్కు. పెళ్లి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. ఎలా రావాలో ఎవరి దృష్టి నుంచి తప్పించుకు రావాలో అదంతా నా సమస్య’’ అంది స్థిరంగా.‘‘సరే. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ వేయను. వచ్చే ఆదివారం ఉదయం నా గదికి వచ్చేయి. పెళ్లి చేసుకుందాం. నా అడ్రస్ కాగితం మీద రాసిస్తాను’’ అంటూ పెన్ను తీయబోతుంటే లిఖిత వారించింది.‘‘వద్దు. చెప్పు చాలు. గుర్తు పెట్టుకుంటాను’’ మళ్లా వెనక్కి తిరిగి భయం భయంగా చూస్తూ అంది.నేనూ వెనక్కి తిరిగి చూశాను. ఆదివారం కాబట్టి గుంపులు గుంపులుగా మనుషులు ఉన్నారు. ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప మావైపు పత్తేదారు కళ్లతో చూస్తున్న శాల్తీలెవ్వరూ కనిపించలేదు.అడ్రస్ చెప్పాక ‘‘తప్పకుండా వస్తాను’’ అనేసి వెళ్లిపోయింది.ఆదివారం రోజు... ఉదయం నుంచి ఉత్కంఠ... నిన్న రాత్రి నిద్రపడితే ఒట్టు. ఎడతెరిపిలేని ఆలోచనలు... ఉదయం ఐదింటికే లేచి కూచున్నా. సమయం ముందుకు కదలడం లేదన్న అసహనం. అశాంతిగా గదంతా ఏ వందసార్లు తిరిగుంటానో.పదయింది... పదకొండు... పన్నెండు... లిఖిత జాడ లేదు. నేను అడ్రస్ రాసివ్వకుండా చెప్పి తప్పు చేశానేమో! ఒకట్రెండు కొండ గుర్తులైనా చెప్పి ఉండాల్సింది. డోర్ నంబర్లో చాలా అంకెలున్నాయి. మర్చిపోయిందో ఏమో! వీధిలోకొచ్చి నిలబడ్డాను. కాళ్లు నొప్పెడుతున్నాయి. ఎన్ని గంటల నుంచి నిలబడి ఉన్నానోఏమో... మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. లిఖిత రాలేదు.తన దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఓ రోజు నేను కొనిస్తానన్నా విన్లేదు. తనకిష్టం ఉండదని చెప్పింది. ఇప్పుడు తను రాకపోవడానికి కారణమేమిటో తెలిసే అవకాశం లేదు. ఆదివారం వరకు ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని ఎదురు చూశాను. ఆదివారం సాయంత్రం బీచ్‌లో తన కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశాను. రాలేదు. ఆ ఆదివారమే కాదు, ఆ తర్వాత వచ్చిన ఆదివారాలప్పుడు కూడా లిఖిత బీచ్‌కి రాలేదు.
చిక్కని చీకటిలాంటి నిరాశ. ఇంక ఎప్పటికీ వెల్తురనేదే కనిపించదా అనే నిస్పృహ... దుఃఖం దట్టమైన కీకారణ్యంలా నన్ను తనలోకి లాక్కుంటోంది. లిఖిత ఏమైంది? మెరుపులా మెరిసి మరుక్షణంలో మాయమైపోయినట్టు... మోసం చేసిందా? లేదు. చాలా అమాయకమైన పిల్ల. స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. తన ప్రేమ నిజమైనది. మరి ఎందుకు రాలేదు? ఎవరో తనను గమనిస్తూ ఉంటారని చెప్పిందిగా.వాళ్లేమైనా కట్టడి చేశారా? లిఖిత క్షేమంగా ఉందా? అసలీ ఊళ్లోనే ఉందా లేక ఎక్కడికైనా తీసుకెళ్లిపోయారా? నిరంతరం ఇవే ఆలోచనలు... మనశ్శాంతి కరువైంది. ఆదివారం సాయంత్రాలు బీచ్ ఒడ్డున పిచ్చోడిలాతిరగటం మాత్రం మానలేదు.ఓ ఆదివారం ఉదయం ఉరుములేని మెరుపులా లిఖిత నా రూమ్‌లో ప్రత్యక్షమైంది. భుజాల చుట్టూ గులాబి పూల డిజైన్ ఉన్న షాల్ కప్పుకుని... అందంగా ఉండే మొహం నిండా ఆందోళన...‘‘ఇన్నాళ్లూ ఏమైపోయావు?’’ అంటూ ఉద్విగ్నంగా అడిగాను.‘‘అవన్నీ చెప్పేంత సమయం లేదు. తొందరగా బయల్దేరు. మనం ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం’’ అంది.ఆమె కళ్లలో భయం నగ్నంగా...‘‘ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లగలం? ఎక్కడికని వెళ్లగలం?’’‘‘నాకు తెలియదు. కానీ వెళ్లిపోక తప్పదు. నా కోసం వెతుకులాట మొదలైంది. నేను కనిపిస్తే బతకనివ్వరు.చంపేస్తారు.’’‘‘ఎవరు వాళ్లు?’’ మనం పోలీస్ స్టేషన్‌కెళ్దాం.’’‘‘లాభం లేదు. లీగల్‌గా నేను వాళ్ల ప్రాపర్టీ. వాళ్లు నన్ను ఏమైనా చేసుకునే అధికారం ఉంది. చంపినా ముక్కలు ముక్కలుగా నరికినా పోలీసులు కూడా జోక్యం చేసుకోలేరు’’‘‘మనం ఉంటున్నది సభ్య సమాజంలో... అడవిలో కాదు. నువ్వు మేజర్‌వి. నీ ఇష్టమొచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.’’‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నన్ను గమనించడానికి నియమించబడ్డ వ్యక్తికి తెలిసిపోయింది. మనం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం కూడా అతను స్పష్టంగా విన్నాడు. అందువల్లనే మరునాడు నన్ను గదిలోంచికదలనీయకుండా బంధించారు.’’‘‘అదెలా సంభవం? మనం ఆ రోజు పెళ్లి గురించి మాట్లాడుకున్న సమయంలో చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరం వరకు ఎవ్వరూ లేరుగా’’ అన్నాను.‘‘నాకు తెలియకుండా నా జడపిన్నులో మైక్రో ట్రాన్స్‌మీటర్ అమర్చారు. నన్ను బంధించిన రోజు నా రక్షకుడితో బాగా గొడవ పడ్డాను. నాకు ప్రేమించే హక్కు లేదా అని అడిగాను. లేదన్నాడు. నన్ను నీకు దగ్గర చేయడంలో ఉద్దేశం నేను మానసికంగా పరిపక్వత సాధించానా లేదా, శారీరకంగా పరిపూర్ణతను పొందానా లేదా అనేది నిర్ధారించుకోవడానికి పెట్టిన పరీక్ష మాత్రమేనట. నేను మగవాళ్లని ఎంత త్వరగా ప్రేమలో పడేయగలిగితే అంత గొప్పగా సఫలీకృతురాలినైనట్టు లెక్క. వాళ్లు చేస్తున్న ప్రయోగాల్లో ఆఖరి మజిలీని నేను’’‘‘అదేం పరీక్ష? ఏం ప్రయోగాలు? నాకర్థం కావడంలేదు. మీ నాన్న ఏమైనా సైకాలజీ ప్రొఫెసరా? ఆడపిల్లల మనస్తత్వం మీద రీసెర్చ్ చేస్తున్నాడా?’’‘‘నాన్న కాదు. రక్షకుడు.. నేను నిన్ను ప్రేమలో పడేయాలి తప్ప నేను ప్రేమలో పడకూడదట. పెళ్లి మాటే తల్చుకోకూడదట. నేను పారిపోతానేమోనని కుర్చీకితాళ్లతో కట్టేసి, గదిలో పెట్టి తలుపేశారు.ఎలాగోలా తాళ్లు విప్పదీసుకుని, తలుపు తెరుచుకున్న వెంటనే అతన్ని పక్కకు నెట్టేసి బయటికి పరుగెత్తాను. కొంత మంది నా వెంట పడ్డారు. వాళ్లకు దొరక్కూడదని చాలా వేగంగా పరుగెత్తాను. అందులో ఒకడు నా మీదికి కత్తి విసిరాడు.’’
నాకు చప్పున భయమేసింది. ‘‘కత్తి విసిరాడా? ఎంతటి దుర్మార్గుడు... నీకు తగల్లేదు కదా’’ అన్నాను కంగారుపడుతూ.‘‘నా మెడకు గురిచూసి విసిరాడు. అదృష్టం. గురి తప్పింది. లేకపోతే మెడ తెగి పడిపోయి ఉండేది’’ విషాదంగా నవ్వింది.‘‘వాళ్లు ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటల్ని మైక్రో ట్రాన్స్‌మీటర్ ద్వారా విని ఉంటే నా గది ఎక్కడో తెలిసిపోయి ఉండాలిగా’’‘‘తెలుసు... ఒకసారి ఎవర్నో పంపించి నీ అడ్రస్ కరెక్టో కాదో సరిచూసుకున్నారు కూడా. అందుకే చెప్పేది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్లిపోవాలి. వాళ్లు ఏ క్షణమైనా ఈ గదికి రావొచ్చు’’‘‘రానీయ్. వాళ్ల సంగతేంటో తేల్చుకుంటాను. చుట్టుపక్కల ఉన్న వాళ్లందర్నీమనకు రక్షణగా పిలుస్తాను. నీ మీద కత్తి విసిరిన దుర్మార్గుడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాను’’ అన్నాను ఆవేశంగా.‘‘లాభం లేదు. నా విషయంలో ఈ చట్టాలు వర్తించవు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల రక్షణ కోసం కొత్త చట్టాలు చేసే వరకు వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు.’’‘‘మళ్లా పజిల్ భాషలో మాట్లాడుతున్నావు. వాళ్లేమైనా దివి నుంచి దిగొచ్చినా దేవతలా లేక వేరే గ్రహం నుంచి మన భూమి పైకొచ్చిన ఏలియన్సా?’’‘‘రెండూ కాదు. వాళ్ల ఉద్దేశంలో నాకు తెలివుండాలి కాని మనసుండకూడదు. అందులో ప్రేమలాంటి అనుభూతులు ఉండకూడదు’’‘‘నిన్నేమైనా మరబొమ్మనుకుంటున్నారా?’’‘‘మాటల్తో సమయం వృథా చేయకుండా నన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపో. దూరంగా.. వీళ్లకు అందనంత దూరంగా... ప్లీజ్... బయల్దేరు. నీ వాదనలు నా విషయంలో పనికి రావు’’ అంటూనే ఆమె ఓ చేత్తో నా బట్టల్ని సూట్‌కేసులో సర్దసాగింది.‘‘ఎందుకు పనికి రావు? నువ్వూ మనిషివే. వస్తువు కాదు’’ అన్నాను కోపంగా.ఆమె భుజాల్ని కప్పి ఉన్న షాల్ కిందికి జారిపోయింది. అప్పుడు గమనించాను. ఆమెకు కుడిచేయి లేదు.ఎవరో తెగ్గొట్టేశారు. కానీ రక్తం కారటం లేదు. భుజంలోంచి ఏవో వైర్లు తెగిపోయి వేలాడుతున్నాయి. వాటి వైపు ఆశ్చర్యంతో అపనమ్మకంతో చూస్తున్న నా వైపు తిరిగి లిఖిత అంది. ‘‘ఎందుకంటే నేను మనిషిని కాదు కాబట్టి. నేను ఆండ్రాయిడ్ మరబొమ్మనే, కానీ హృదయం ఉన్న మరబొమ్మని’’ మళ్లా షాల్‌ని తన తెగిపోయిన చేయి కన్పించకుండా భుజాల చుట్టూ కప్పుకుని ఒంటి చేత్తో సామన్లు సర్దడంలో లీనమైపోయింది.
∙
నాకూ ఓ మనసుంది
Published Sun, Dec 2 2018 2:19 AM | Last Updated on Sun, Dec 2 2018 2:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment