వయసును తగ్గించే మాత్ర!
వయసు తగ్గించే మాత్రను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న సైంటిస్టులకు తమ పరిశోధనలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు డచ్ సైంటిస్టులు. ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఎలుకలపై చేస్తున్న ప్రయోగాల ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నా యని పేర్కొంటున్నారు అక్కడి సైంటిస్టులు. కారణం... వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు ఊడిపోవడం, చర్మం వదులు కావడం, కిడ్నీ వంటి అవయవాల పనితీరు తగ్గడం మార్పులు కనిపిస్తుంటాయన్న విషయం తెలిసిందే.
సరిగ్గా వయసు మీరుతూ ఇలాంటి లక్షణాలు ఉన్న కొన్ని ఎలుకలను ఎంచుకున్నారు ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన నిపుణులు. కాస్త వయసు మీరిన ఆ ఎలుకలకు ఫోక్సో–4 పెపై్టడ్ అనే మందును ఇవ్వడం మొదలుపెట్టారు. మందుతీసుకున్న ఎలకలకు 10 రోజుల తర్వాతి నుంచే గుణం కనిపించడం మొదలైంది. మూడు వారాల తర్వాత అవి మొదటి కంటే మరింత ఫిట్‌గా కనిపించడం మొదలుపెట్టాయి. ఇక ఒక నెల తర్వాత కిడ్నీ పనితీరు బాగా లేని ఎలకల మూత్రపిండం బాగుపడటం కనిపించింది. ఫోక్సో–4 అనే ఈ పదార్థాన్ని రూపొందించడానికి నాలుగేళ్లుకు పైగా పట్టింది.
ఎలుకలకు మాత్రమే ప్రస్తుతం ఆ కాంపౌండును ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. వృద్ధాప్యం వస్తున్న కొద్దీ తమను తాము నాశనం చేసుకునే కణాలు... ఆ పనికి పాల్పడకుండా ఉండేలా చేసేందుకు ఈ మందు దోహదపడుతోంది. ఒక కణంలో తమను తాము నాశనం చేసుకునేందుకు ఉపయోగపడే పి–53 అనే పదార్థం ఉంటుందట. ఫోక్సో–4 అనే మందు కణంలోకి ప్రవేశించి, పి–53 అనే పదార్థం పనిచేయకుండా చేస్తుంది. తద్వారా ఏజింగ్ ప్రక్రియలో కణం మరింతగా నాశనం కాకుండా కాపాడుతుంటుంది. అయితే ప్రస్తుతం ఫోక్సో–4 లో మందును మనుషులపై ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి మరింత వ్యవధి అవసరమంటున్నారు పరిశోధకులు.
ఆ మూడు వ్యాయామాలు చాలు!
గుండె జబ్బులను నివారించడానికి చాలా మంది చాలా చాలా రకాల సూచనలూ, సూత్రాలూ, సిద్ధాంతీకరణలు చేస్తుంటారుగానీ... కేవలం మూడంటే మూడు రకాల వ్యాయామాలతో గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన నిపుణులు. వారు తమ పేషెంట్లకు ఇస్తున్న తాజా సలహాలో మూడు అంశాఉ ఉన్నాయి. అవి... వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), తాయ్–చీ వ్యాయామం, తేలికపాటి ఇంటి పనులు చేయడం.
గుండెజబ్బుల నివారణకు ఫిజీషియన్ ఇచ్చే 10 రకాల మందులకు ఈ మూడు వ్యాయామాలు మంచి ప్రత్యామ్నాయం. ఇవి కేవలం గుండెజబ్బుల నివారణలోనే కాకుండా, జీవన నాణ్యత మరింత మెరుగుపడటానికి కూడా ఉపయోగపతాయట. ‘‘ఇంటి పనులంటే మరీ పెద్ద పెద్ద పనులు వద్దు. మీ పక్క మీరు పరచుకోవడం, నిద్ర లేచాక పక్కబట్టలు మడట పెట్టడం, కొద్దిగా నడవడంతో పాటు వీలైతే డాన్స్ చేయడం. ఫార్మల్ వ్యాయామాల కంటే ఇవి చాలు మీ గుండెజబ్బులను నివారించడానికి’’ అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జీరియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డేనియల్ ఫోర్మన్. అన్నట్టు గుండెజబ్బుల నివారణలో మన యోగాకు కూడా మంచి ప్రాధాన్యం ఉందంటూ కితాబిస్తున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణుల బృందం.