ఒంటరితనంతో తరిగే ఆయువు!
స్థూలకాయం కంటే ఒంటరితనం ఆరోగ్యానికి మరింతగా చేటు చేస్తుందని, ఒంటరితనం కారణంగా ఆయువు తరిగిపోతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 45 ఏళ్ల వయసు పైబడిన వారిలో దాదాపు నాలుగు కోట్ల మంది ఒంటరిగా ఉంటున్నారని, వీరిలో చాలామందికి టీవీ చూడటం తప్ప వేరే కాలక్షేపం ఉండటం లేదని బ్రిగ్‌హామ్ యంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో తేలింది. కుటుంబ సభ్యులతో సంబంధాలు, కనీసం స్నేహితులు కూడా లేకుండా ఒంటరిగా కాలం వెళ్లబుచ్చేవారిలో డిప్రెషన్, మానసికమైన అలజడి వంటి లక్షణాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయని, ఇలాంటి వారు తేలికగా వ్యసనాల్లో కూరుకుపోతారని వెల్లడైంది.
దాదాపు 18 శాతం మంది అకాల మరణాల పాలవుతున్నారని ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత చాలామంది ఒంటరిగా మిగులుతున్నారని, ఆరోగ్యకరమైన వ్యాపకాలు, బంధుమిత్రులు, సామాజిక సంబంధాలు లేకుండా గడుపుతున్నారని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒంటరితనం మహమ్మారిలా విస్తరిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ హోల్ట్ లన్‌స్తాడ్ చెబుతున్నారు.