Health Lab
-
ఒంటరితనంతో తరిగే ఆయువు!
స్థూలకాయం కంటే ఒంటరితనం ఆరోగ్యానికి మరింతగా చేటు చేస్తుందని, ఒంటరితనం కారణంగా ఆయువు తరిగిపోతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 45 ఏళ్ల వయసు పైబడిన వారిలో దాదాపు నాలుగు కోట్ల మంది ఒంటరిగా ఉంటున్నారని, వీరిలో చాలామందికి టీవీ చూడటం తప్ప వేరే కాలక్షేపం ఉండటం లేదని బ్రిగ్హామ్ యంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో తేలింది. కుటుంబ సభ్యులతో సంబంధాలు, కనీసం స్నేహితులు కూడా లేకుండా ఒంటరిగా కాలం వెళ్లబుచ్చేవారిలో డిప్రెషన్, మానసికమైన అలజడి వంటి లక్షణాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయని, ఇలాంటి వారు తేలికగా వ్యసనాల్లో కూరుకుపోతారని వెల్లడైంది. దాదాపు 18 శాతం మంది అకాల మరణాల పాలవుతున్నారని ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత చాలామంది ఒంటరిగా మిగులుతున్నారని, ఆరోగ్యకరమైన వ్యాపకాలు, బంధుమిత్రులు, సామాజిక సంబంధాలు లేకుండా గడుపుతున్నారని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒంటరితనం మహమ్మారిలా విస్తరిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ హోల్ట్ లన్స్తాడ్ చెబుతున్నారు. -
హెల్త్ ల్యాబ్
రాత్రిపూట అతిగా తింటే స్థూలకాయం రోజులో పగటిపూట లేదా మధ్యాహ్నం వేళ కాస్త సుష్టుగా తిన్నా ఫర్వాలేదు గానీ, అదే పద్ధతిలో రాత్రిపూట కూడా భారీగా లాగించేస్తే స్వల్పకాలంలోనే స్థూలకాయం బారిన పడే ముప్పు ఉందని టెక్సాస్ వర్సిటీకి చెందిన వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పగటివేళ తీసుకునే ఆహారంతో పోలిస్తే రాత్రిపూట తీసుకునే ఆహారంలో కనీసం 30 శాతం కేలరీలు తక్కువగా ఉండేట్లు చూసుకుంటే స్థూలకాయం ముప్పు ఉండదని టెక్సాస్ వర్సిటీ నిపుణుడు డాక్టర్ జోసెఫ్ టకాహషీ చెబుతున్నారు. అలా కాకుండా రాత్రిపూట కూడా కడుపు పట్టనంతగా భారీగా లాగించేస్తే బాడీక్లాక్పై ప్రభావం పడుతుందని, ఫలితంగా త్వరలోనే స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. లాబొరేటరీలో కొన్ని ఎలుకలపై పరీక్షలు జరిపిన తర్వాత రాత్రిపూట అతిగా తినే ఆహారం వల్ల స్థూలకాయం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని డాక్టర్ టకాహషీ వివరించారు. గ్రీన్స్పాంజ్తో క్యాన్సర్ చికిత్స! అలాస్కా తీరం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో దొరికే గ్రీన్స్పాంజ్తో పాంక్రియాటిక్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాస్కా వద్ద పసిఫిక్ మహాసముద్రంలో మంచులాంటి చల్లని నీటి అట్టడుగున గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉండే ‘లాట్రంకలియా ఆస్టినీ’ అనే ఈ గ్రీన్స్పాంజ్ కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగపడుతుందని నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) శాస్త్రవేత్త డాక్టర్ డగ్లస్ డి మాస్టర్ తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో గ్రీన్స్పాంజ్ ప్రభావంపై మరింతగా పరిశోధనలు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. డెట్రాయిట్ కేంద్రంగా పనిచేసే హెన్రీఫోర్డ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, సౌత్ కరోలినా మెడికల్ వర్సిటీలు కొనసాగిస్తున్న ఈ పరిశోధనల్లో ఎన్ఓఏఏ భాగస్వామిగా ఉంటోందని చెప్పారు. రెండు నెలలకో ఇంజెక్షన్‌తో హెచ్ఐవీకి చెక్ ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతుల్లో హెచ్ఐవీ సోకిన రోగులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సిందే. అయితే, ఇకపై ఆ బెడద ఉండదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. రెండు నెలలకో ఇంజెక్షన్... అంటే, ఏడాదికి ఆరు ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉన్నట్లయితే హెచ్ఐవీని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చని అమెరికన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త తరహా ఇంజెక్షన్‌ను 286 మంది హెచ్ఐవీ పాజిటివ్ రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఇతర యాంటీ రిట్రోవైరల్ మందులేవీ తీసుకోకపోయినా, కేవలం రెండు నెలలకో ఇంజెక్షన్ తీసుకున్న ఈ రోగుల పరిస్థితి రోజువారీ మందులు తీసుకునే మిగిలిన హెచ్ఐవీ రోగుల కంటే మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజెక్షన్‌కు ప్రభుత్వ అనుమతి లభించి, మార్కెట్లో అందుబాటులోకి వస్తే హెచ్ఐవీ రోగులకు రోజువారీ మందుల బెడద తప్పుతుందని వారు అంటున్నారు. -
వయసును తగ్గించే మాత్ర!
వయసు తగ్గించే మాత్రను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న సైంటిస్టులకు తమ పరిశోధనలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు డచ్ సైంటిస్టులు. ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఎలుకలపై చేస్తున్న ప్రయోగాల ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నా యని పేర్కొంటున్నారు అక్కడి సైంటిస్టులు. కారణం... వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు ఊడిపోవడం, చర్మం వదులు కావడం, కిడ్నీ వంటి అవయవాల పనితీరు తగ్గడం మార్పులు కనిపిస్తుంటాయన్న విషయం తెలిసిందే. సరిగ్గా వయసు మీరుతూ ఇలాంటి లక్షణాలు ఉన్న కొన్ని ఎలుకలను ఎంచుకున్నారు ఎరాస్మస్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన నిపుణులు. కాస్త వయసు మీరిన ఆ ఎలుకలకు ఫోక్సో–4 పెపై్టడ్ అనే మందును ఇవ్వడం మొదలుపెట్టారు. మందుతీసుకున్న ఎలకలకు 10 రోజుల తర్వాతి నుంచే గుణం కనిపించడం మొదలైంది. మూడు వారాల తర్వాత అవి మొదటి కంటే మరింత ఫిట్‌గా కనిపించడం మొదలుపెట్టాయి. ఇక ఒక నెల తర్వాత కిడ్నీ పనితీరు బాగా లేని ఎలకల మూత్రపిండం బాగుపడటం కనిపించింది. ఫోక్సో–4 అనే ఈ పదార్థాన్ని రూపొందించడానికి నాలుగేళ్లుకు పైగా పట్టింది. ఎలుకలకు మాత్రమే ప్రస్తుతం ఆ కాంపౌండును ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. వృద్ధాప్యం వస్తున్న కొద్దీ తమను తాము నాశనం చేసుకునే కణాలు... ఆ పనికి పాల్పడకుండా ఉండేలా చేసేందుకు ఈ మందు దోహదపడుతోంది. ఒక కణంలో తమను తాము నాశనం చేసుకునేందుకు ఉపయోగపడే పి–53 అనే పదార్థం ఉంటుందట. ఫోక్సో–4 అనే మందు కణంలోకి ప్రవేశించి, పి–53 అనే పదార్థం పనిచేయకుండా చేస్తుంది. తద్వారా ఏజింగ్ ప్రక్రియలో కణం మరింతగా నాశనం కాకుండా కాపాడుతుంటుంది. అయితే ప్రస్తుతం ఫోక్సో–4 లో మందును మనుషులపై ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి మరింత వ్యవధి అవసరమంటున్నారు పరిశోధకులు. ఆ మూడు వ్యాయామాలు చాలు! గుండె జబ్బులను నివారించడానికి చాలా మంది చాలా చాలా రకాల సూచనలూ, సూత్రాలూ, సిద్ధాంతీకరణలు చేస్తుంటారుగానీ... కేవలం మూడంటే మూడు రకాల వ్యాయామాలతో గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన నిపుణులు. వారు తమ పేషెంట్లకు ఇస్తున్న తాజా సలహాలో మూడు అంశాఉ ఉన్నాయి. అవి... వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), తాయ్–చీ వ్యాయామం, తేలికపాటి ఇంటి పనులు చేయడం. గుండెజబ్బుల నివారణకు ఫిజీషియన్ ఇచ్చే 10 రకాల మందులకు ఈ మూడు వ్యాయామాలు మంచి ప్రత్యామ్నాయం. ఇవి కేవలం గుండెజబ్బుల నివారణలోనే కాకుండా, జీవన నాణ్యత మరింత మెరుగుపడటానికి కూడా ఉపయోగపతాయట. ‘‘ఇంటి పనులంటే మరీ పెద్ద పెద్ద పనులు వద్దు. మీ పక్క మీరు పరచుకోవడం, నిద్ర లేచాక పక్కబట్టలు మడట పెట్టడం, కొద్దిగా నడవడంతో పాటు వీలైతే డాన్స్ చేయడం. ఫార్మల్ వ్యాయామాల కంటే ఇవి చాలు మీ గుండెజబ్బులను నివారించడానికి’’ అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జీరియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డేనియల్ ఫోర్మన్. అన్నట్టు గుండెజబ్బుల నివారణలో మన యోగాకు కూడా మంచి ప్రాధాన్యం ఉందంటూ కితాబిస్తున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణుల బృందం. -
లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు
హెల్త్ ల్యాబ్ లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు గోడమీద ఎర్రగా ఫోకస్‌లా పడుతుండే ‘లేజర్ పాయింటర్’తో పిల్లలు ఆడుకుంటూ ఉండటం తరచూ చూస్తుంటాం. సాధారణంగా మీటింగ్స్‌లో ఏదైనా విషయాన్ని వివరించేందుకు దీన్ని ఒక ‘పాయింటర్’ను ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ఇది అంత కీడు చేయదని అందరిలోనూ ఒక భావన. అయితే ఈ ‘లేజర్ పాయింటర్’ పిల్లల చూపును దెబ్బతీయవచ్చని ఇటీవల కొన్ని కేసుల అధ్యయనం తర్వాత తెలిసింది. ఈ పాయింటర్ నుంచి వచ్చే కాంతి రెటీనాను దెబ్బతీస్తుందని అమెరికాలోని మిన్నెయాపోలిస్కు చెందిన కంటివైద్య నిపుణుడు డాక్టర్ డేవిడ్ అల్మెడియా పేర్కొన్నారు. గతంలో పదిలక్షల మందిలో ఒకరిలో మాత్రమే లేజర్ పాయింటర్ వల్ల కలిగే దుష్ర్పభావాలు కనిపిస్తాయని అనుకునేవారు. అయితే ఇటీవల ఒక అధ్యయనంలో వీరి సంఖ్య చాలా ఎక్కువని తేలింది. గతంలో లేజర్ పాయింటర్ నుంచి వచ్చే కాంతి 1 నుంచి 5 మిల్లీవాట్లు మాత్రమే ఉంటున్నందున ఇది కంటికి అంతగా ప్రమాదం చేయదని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ కాంతి వల్ల కూడా ప్రమాదం ఉంటుందని ఇటీవలి అధ్యయనాలలో తేలింది. ‘‘ఇటీవల ఇలాంటి పాయింటర్లను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. ఆన్లైన్లో అవి తేలిగ్గా లభ్యమవుతున్నాయి. వాటిపై అదుపు కూడా ఏమీ లేదు. దాంతో ఇలా రెటీనాపై దుష్ర్పభావం పడ్డ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అంటున్నారు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్‌కు చెందిన బ్లాంటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్తాల్మాలజీ విభాగం డిప్యూటీ చైర్పర్సన్ డాక్టర్ చార్మెస్ వైకాఫ్. -
భవిష్యత్తులో బొద్దింక పాలు?
హెల్త్ ల్యాబ్ బొద్దింక క్షీరదం కాదు. కానీ వరి, సోయా బీన్స్, హెంప్ల నుంచి పాల వంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లే... బొద్దింక నుంచి కూడా పాలను తీయగలిగితే..! అది భవిష్యత్తులోని కొన్ని ఆహార అవసరాలు తీరుస్తుందనే ఆశతో ఉన్నారు పరిశోధకులు. ‘పసిఫిక్ బీటిల్ కాక్రోచ్’ (డిప్లోప్టెరా పంక్టేటా) అనే బొద్దింకలలో ఒక ప్రజాతి అయిన దీని నుంచి పాల నుంచి సేకరించే అవకాశాలను వెతుకుతున్నారు. తన పిల్లలకు జన్మనిచ్చాక, వాటిని సాకడం కోసం ఇది పాలవంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రజాతికి చెందిన బొద్దింకలు. ఆ ద్రవంలో చక్కెర, కొవ్వులు, ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ వంటివి ఎక్కువని తేలింది. దీని నుంచి లభ్యమయ్యే క్యాలరీలు కూడా ఎక్కువే. దాంతో ఈ తరహా ఆహారం (న్యూట్రిషన్) కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇదే విషయం ఐయూసీఆర్జే అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యింది. బొద్దింకల నుంచి పాల సేకరణ అనేది ఇప్పుడు సేకరిస్తున్న పాల (డెయిరీ) ఉత్పాదనలా జరగడానికి ఆస్కారం లేదు. ఆ ద్రవంలోని రసాయనాల సమ్మేళనాలను పరిశీలించి, ఆ కెమికల్ కాంపౌండ్లనే మళ్లీ పరిశోధనశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేయాలనీ, ఆ ఫార్ములా తెలిశాక పులియడానికి ఉపయోగపడే ‘ఈస్ట్’జీవులను ఇప్పుడు సృష్టిస్తున్నట్లుగానే బయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఇది ఒక ఎత్తయితే ఆ ఉత్పాదనను ప్రజలు ఆదరిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న.