భవిష్యత్తులో బొద్దింక పాలు?
హెల్త్ ల్యాబ్
బొద్దింక క్షీరదం కాదు. కానీ వరి, సోయా బీన్స్, హెంప్‌ల నుంచి పాల వంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లే... బొద్దింక నుంచి కూడా పాలను తీయగలిగితే..! అది భవిష్యత్తులోని కొన్ని ఆహార అవసరాలు తీరుస్తుందనే ఆశతో ఉన్నారు పరిశోధకులు. ‘పసిఫిక్ బీటిల్ కాక్రోచ్’ (డిప్లోప్టెరా పంక్టేటా) అనే బొద్దింకలలో ఒక ప్రజాతి అయిన దీని నుంచి పాల నుంచి సేకరించే అవకాశాలను వెతుకుతున్నారు. తన పిల్లలకు జన్మనిచ్చాక, వాటిని సాకడం కోసం ఇది పాలవంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రజాతికి చెందిన బొద్దింకలు. ఆ ద్రవంలో చక్కెర, కొవ్వులు, ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ వంటివి ఎక్కువని తేలింది.
దీని నుంచి లభ్యమయ్యే క్యాలరీలు కూడా ఎక్కువే. దాంతో ఈ తరహా ఆహారం (న్యూట్రిషన్) కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇదే విషయం ఐయూసీఆర్‌జే అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యింది. బొద్దింకల నుంచి పాల సేకరణ అనేది ఇప్పుడు సేకరిస్తున్న పాల (డెయిరీ) ఉత్పాదనలా జరగడానికి ఆస్కారం లేదు. ఆ ద్రవంలోని రసాయనాల సమ్మేళనాలను పరిశీలించి, ఆ కెమికల్ కాంపౌండ్‌లనే మళ్లీ పరిశోధనశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేయాలనీ, ఆ ఫార్ములా తెలిశాక పులియడానికి ఉపయోగపడే ‘ఈస్ట్’జీవులను ఇప్పుడు సృష్టిస్తున్నట్లుగానే బయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఇది ఒక ఎత్తయితే ఆ ఉత్పాదనను ప్రజలు ఆదరిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న.