హెల్త్‌ ల్యాబ్‌ | Health Lab | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ల్యాబ్‌

Published Sun, Aug 6 2017 1:23 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

హెల్త్‌ ల్యాబ్‌

హెల్త్‌ ల్యాబ్‌

రాత్రిపూట అతిగా తింటే స్థూలకాయం
రోజులో పగటిపూట లేదా మధ్యాహ్నం వేళ కాస్త సుష్టుగా తిన్నా ఫర్వాలేదు గానీ, అదే పద్ధతిలో రాత్రిపూట కూడా భారీగా లాగించేస్తే స్వల్పకాలంలోనే స్థూలకాయం బారిన పడే ముప్పు ఉందని టెక్సాస్‌ వర్సిటీకి చెందిన  వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పగటివేళ తీసుకునే ఆహారంతో పోలిస్తే రాత్రిపూట తీసుకునే ఆహారంలో కనీసం 30 శాతం కేలరీలు తక్కువగా ఉండేట్లు చూసుకుంటే స్థూలకాయం ముప్పు ఉండదని టెక్సాస్‌ వర్సిటీ నిపుణుడు డాక్టర్‌ జోసెఫ్‌ టకాహషీ చెబుతున్నారు. అలా కాకుండా రాత్రిపూట కూడా కడుపు పట్టనంతగా భారీగా లాగించేస్తే బాడీక్లాక్‌పై ప్రభావం పడుతుందని, ఫలితంగా త్వరలోనే స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. లాబొరేటరీలో కొన్ని ఎలుకలపై పరీక్షలు జరిపిన తర్వాత రాత్రిపూట అతిగా తినే ఆహారం వల్ల స్థూలకాయం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని డాక్టర్‌ టకాహషీ వివరించారు.

గ్రీన్‌స్పాంజ్‌తో క్యాన్సర్‌ చికిత్స!
అలాస్కా తీరం వద్ద పసిఫిక్‌ మహాసముద్రంలో దొరికే గ్రీన్‌స్పాంజ్‌తో పాంక్రియాటిక్‌ క్యాన్సర్, ఓవేరియన్‌ క్యాన్సర్‌ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాస్కా వద్ద పసిఫిక్‌ మహాసముద్రంలో మంచులాంటి చల్లని నీటి అట్టడుగున గోల్ఫ్‌ బంతి పరిమాణంలో ఉండే ‘లాట్రంకలియా ఆస్టినీ’ అనే ఈ గ్రీన్‌స్పాంజ్‌ కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగపడుతుందని నేషనల్‌ ఓషానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఓఏఏ) శాస్త్రవేత్త డాక్టర్‌ డగ్లస్‌ డి మాస్టర్‌ తెలిపారు. క్యాన్సర్‌ చికిత్సలో గ్రీన్‌స్పాంజ్‌ ప్రభావంపై మరింతగా పరిశోధనలు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. డెట్రాయిట్‌ కేంద్రంగా పనిచేసే హెన్రీఫోర్డ్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, సౌత్‌ కరోలినా మెడికల్‌ వర్సిటీలు కొనసాగిస్తున్న ఈ పరిశోధనల్లో ఎన్‌ఓఏఏ భాగస్వామిగా ఉంటోందని చెప్పారు.

రెండు నెలలకో ఇంజెక్షన్‌తో హెచ్‌ఐవీకి చెక్‌
ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతుల్లో హెచ్‌ఐవీ సోకిన రోగులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సిందే. అయితే, ఇకపై ఆ బెడద ఉండదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. రెండు నెలలకో ఇంజెక్షన్‌... అంటే, ఏడాదికి ఆరు ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉన్నట్లయితే హెచ్‌ఐవీని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చని అమెరికన్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త తరహా ఇంజెక్షన్‌ను 286 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఇతర యాంటీ రిట్రోవైరల్‌ మందులేవీ తీసుకోకపోయినా, కేవలం రెండు నెలలకో ఇంజెక్షన్‌ తీసుకున్న ఈ రోగుల పరిస్థితి రోజువారీ మందులు తీసుకునే మిగిలిన హెచ్‌ఐవీ రోగుల కంటే మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజెక్షన్‌కు ప్రభుత్వ అనుమతి లభించి, మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే హెచ్‌ఐవీ రోగులకు రోజువారీ మందుల బెడద తప్పుతుందని వారు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement