మనుషులకు, మూగజీవులకు మధ్య ఉండేది జీవవైవిధ్యంలాంటి స్నేహం. అందుకేనేమో తరచు వాటి స్వభావాలను మనుషులకూ అన్వయించి మాట్లాడుతుంటాం. monkey business అనే మాట ఇలాంటి అన్వయమే. అల్లరిచిల్లరి వ్యవహారాన్ని, అంగీకారయోగ్యం కాని ప్రవర్తననీ ‘మంకీ బిజినెస్’ అంటారు. The teacher suspected that there had been some monkey business going on in the class. Dog అనే మాటతో అయితే ఇలాంటివి సవాలక్ష ఉన్నాయి. dog eat dog (స్వార్థం కోసం దేనికైనా వెనకాడని లోకమిది అని చెప్పడం), put on the dog (మన గురించి మనం గొప్పగా భావించుకుని అలా ప్రవర్తించడం, మనకంత సీన్ లేకపోయినా), every dog has its day (ప్రతి ఒక్కరికీ ఒక మంచిరోజు వస్తుందని చెప్పడం), give a dog a bad name (కొత్త ఆరోపణను మోపడానికి పాత తప్పును ఎత్తిచూపడం.
‘కుక్కను కొట్టి చంపాలంటే ముందుగా అది పిచ్చిదని ప్రచారం చేయాలి’ అనే అర్థంలో ఈ మాట మన వాడుకలో ఉంది), why keep a dog and bark yourself? (పనివాణ్ణి పెట్టుకుని కూడా మళ్లీ నువ్వే ఆ పని చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నించడం), you can't teach an old dog new tricks (అలవాట్లను ఒక పట్టాన మార్చలేమని చెప్పడం), the hair of the dog (రాత్రి తాగిన మందు ఎక్కువై ఉదయాన్నే తలంతా భారంగా ఉండి, మోకాళ్లు గుంజేస్తుంటే ఆ బాధను తగ్గించుకోడానికి మళ్లీ సేవించే పిసరంత మద్యమే... ది హెయిర్ ఆఫ్ ది డాగ్), love me, love my dog (నన్ను ఇష్టపడితే నాలోని లోపాలను కూడా ఇష్టపడాలి అని చెప్పడం), see a man about a dog (ఎక్కడికి వెళుతున్నదీ, ఎందుకు వెళుతున్నదీ చెప్పకుండా ‘ఇప్పుడే వచ్చేస్తాను’ అని చెప్పడం.
ఉదా: టాయ్‌లెట్‌కు వెళ్లవలసి వస్తే I have just got to see a man about a dog. I will be back in a minute అనొచ్చు), sick as a dog (విపరీతంగా వాంతి అయితే ఇలా అంటారు), tail wagging the dog (కుక్క... తోకని కాకుండా, తోకే కుక్కని ఊపుతుందని చెప్పడం. చెప్పిన మాట వినకుండా పిల్లలు పెద్దవాళ్లను ఒక ఆట ఆడిస్తున్నా కూడా అది టెయిల్ వ్యాగింగ్ ది డాగ్ కిందికే వస్తుంది), work like a dog (ఒళ్లు హూనమయ్యేలా పనిచేయడం). A dog in the manger అంటే గడ్డివాములో కుక్కతంతు. తను తినదు, తినడానికి వచ్చే గేదెల్ని తిననివ్వదు. మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారు. వాళ్లు ప్రయోజనం పొందరు. పొందేవాళ్లను పొందనివ్వరు. manger అంటే పశువులకోసం దాణా వేసి ఉంచే పెట్టె. దీనిని ‘మేంజర్’ అని పలకాలి.కోతులు, కుక్కలు కొంతవరకు అయ్యాయి కనుక ఇప్పుడు పులులు, సింహాల దగ్గరి వెళ్దాం.
Beard the lion అనే ఒక మాట ఉంది. సింహం గుహలోకి వెళ్లి జూలు పట్టి లాగడం లాంటిదిది. ముఖ్యమైన స్థానంలోని వ్యక్తులను నేరుగా వారున్న చోటికే వెళ్లి కలిసి, వారికి నచ్చని విషయం గురించి మాట్లాడడాన్ని beard the lion (in his / her den) అంటారు. ఇక్కడ beard అంటే గడ్డం కాదు, సంద ర్శించడం. ఇలాంటి దుస్సాహసాన్ని lion-hearted పీపుల్ మాత్రమే చేయగలరు. లయన్ హార్టెడ్ అంటే మాంచి ధైర్యస్థులని.
ఇక tiger దగ్గరికి వద్దాం. ఈ పదంతో ఇంగ్లిషులో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ లేవు. Paper tiger అనే మాట మాత్రం తరచు వినిపిస్తుంటుంది. కాగితం పులి అని దీని అర్థం. పైకి గంభీరంగా, ప్రమాదకరంగా కనిపిస్తూ లోపల మామూలుగా ఉండే మనుషులను, దేశాలను ఉద్దేశించి ఇలా అంటారు. ప్రధానంగా దీనిని నెగటివ్ సెన్స్‌లో వాడతారు.
Work like a dog అనే మాట ఉన్నట్లే... do (all) the donkey work అనే పలుకుబడి ఉంది. దీనర్థం బోరింగ్ జాబ్ అని. అలాగే S talk the hind leg(s) off a donkey అంటే... తెరిపిలేకుండా అదే పనిగా వాగుతుండడం. hind legs అంటే వెనక కాళ్లు. hind ని ‘హైండ్’ అని పలకాలి. ఇంతకీ వాగుడుకి, గాడిద వెనక కాళ్లకీ సంబంధం ఏమిటి? అసలీ వ్యక్తీకరణ ఎలా పుట్టుకొచ్చింది? స్పష్టమైన ఆధారాల్లేవు. గాడిదలు సాధారణంగా వెనక కాళ్లపై కూర్చోవు. వాటిని అలా కూర్చోబెట్టడానికి తల ప్రాణం తోకకు వస్తుందట. గంటల తరబడి గాడిద వెనక కూర్చొని వాటి కాళ్లను క న్విన్స్ చెయ్యాలన్న వ్యంగ్యార్థంలోంచి ఈ ఫ్రేజ్ వచ్చిందని చెబుతారు. ఎవరినైనా, ఏ విషయంలోనైనా ఒప్పించడానికి అదేపనిగా వాళ్ల చెవులను వాయగొట్టడాన్ని ‘టాక్ ది హైండ్ లెగ్స్ ఆఫ్ ఎ డాంకీ’ అనడం ఇందుకేనేమో. Donkey years అనే మాట కూడా ఇలాగే వచ్చి ఉండాలి. దీర్ఘకాలం అనే అర్థంలో. అయితే అవి years కాదు, ears అనే భాషావేత్తలూ ఉన్నారు. ears కాలక్రమంలో years అయ్యాయని ఇంకో అభిప్రాయం.
భాషణం: ‘ఇప్పుడే వచ్చేస్తాను’ అని వెళ్లిపోతే?
Published Sun, Nov 10 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement