అలల పందిరి | In the morning, sitting in front of the canvas from engaging in the hallway | Sakshi
Sakshi News home page

అలల పందిరి

Published Sat, Jan 17 2015 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

అలల పందిరి

అలల పందిరి

ఉదయం పదిన్నర దాటి ఉంటుంది. లేక ఎక్కువయినా ఉండొచ్చు. నా చేతికి గడియారం పెట్టుకునే అలవాటు లేదు. హాలులో గోడ గడియారం ఉంది. అది పని చేయడం మానేసి ఆరు నెలలు అయి ఉంటుంది.
ఆ రోజు ఉదయం నుండే హాలులో కేన్వాస్ ముందు కూర్చుని పనిలో నిమగ్నమయ్యాను. స్పష్టమయిన ఆలోచన ఉంది. సంవత్సరం నుండి ఆ ఆలోచన తిరుగుతున్నా ఆ రోజే కూర్చుని మూడువంతుల పని ముగించాక అక్కడక్కడా మార్పులు చేస్తే బావుంటుందనిపించింది. పని ఆగింది.
 
టీ కాచుకుని తాగి సిగరెట్ వెలిగించాను. మా ఇంటి వారెవరికీ నా పెయింటింగ్ మీద ఆసక్తి లేదు. అరవయ్యేళ్ళ వయసు దాటిన నన్ను ఈ విషయంలో నా మానాన నన్ను వదిలిపెట్టినట్టే. నా పనిలో జోక్యం కలిగించుకోరు. నేను వేసే బొమ్మలు వాళ్లకు అర్థం కావు. చెప్పాలి. ఇప్పటికి మూడుసార్లు సిటీలో కళామందిర్‌లో నా బొమ్మల ప్రదర్శన జరిగింది. అన్నీ కావుగాని కొన్ని అమ్ముడయ్యాయి. కొన్ని ఆసక్తి ఉన్న వాళ్లకు ఇచ్చాను. ఒక్కటి మటుకు మిగిలిపోయింది. దానితోనే సతమతమవుతుంటాను.
 
విశ్వవిద్యాలయానికి అవతల నాకు మరో ఇల్లు ఉంది. ఈ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదట్లో నా భార్య పిల్లలు ఈ ఇంట్లోనే ఉండేవాళ్లు. పిల్లలు పెద్దవాళ్లవుతుంటే ఇల్లు చిన్నది కావడం మొదలయింది. విశ్వవిద్యాలయం దగ్గర ఇల్లు కట్టుకున్నాక అందరం అక్కడకు మారాం. పాత ఇల్లు అమ్మలేదు. స్టూడియోగా ఉపయోగించుకుంటున్నాను. ఉదయం ఉపాహారం చేశాక పాత ఇంటికి వచ్చి కేన్వాస్‌ల ముందు కూర్చుంటాను. విసుగేసినప్పుడు నా మినీ లైబ్రరీలోంచి ఏ పుస్తకాన్నయినా తీసుకుని చదువుకుంటాను.

నా భార్యకు వీలుంటే మధ్యాహ్నం భోజనం చేయడానికి ఏదయినా టిఫిన్‌లో పెట్టి ఇస్తుంది. వీలుకానప్పుడు ఈ ఇంట్లో నేనే ఏదయినా వండుకుంటాను. ఇంట్లో బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు అన్నీ ఉన్నాయి. ఫ్రిజ్ ఉంది. నాలుగయిదు పాలపేకట్లు ఎప్పుడూ ఉంచుకుంటాను. రోజులో నాలుగయిదు సార్లయినా టీ కాచుకుని తాగుతుంటాను. సాయంత్రం కొద్దిసేపు బీచ్‌లో కూర్చుని చీకటి పడే సమయానికి కారులో విశ్వవిద్యాలయం దగ్గర ఇంటికి వెళ్ళిపోతుంటాను. ఎప్పుడో తప్ప నా దినచర్యలో మార్పు ఉండదు.
 
ఎండ కిటికీ ఎక్కింది. చేస్తున్న పని ఆపి సిగరెట్ వెలిగిద్దామనుకునేంతలో వీధి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. సామాన్యంగా ఈ ఇంటికి ఎవరూ రారు. స్నేహితులకు కూడా నేను ఇక్కడ ఉంటానని తెలియదు. ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటాను.
 లేచి తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తెరిచాను. పై మెట్టు మీద భుజాలనిండా పైట కప్పుకుని ఆమె నిలబడి ఉంది. ఆమె మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటున్న సంగతి మినహా ఆమె గురించి ఏమీ తెలియదు. నలభై సంవత్సరాలుండొచ్చు. అందం వయసు మీదే ఉంది. సాదా చీరలో ఉంది.
 
‘‘నమస్కారమండీ’’ అంది.
 ‘‘నమస్కారమమ్మా’’ అన్నాను.
 ఆమె కన్నా ఇరవై సంవత్సరాలు పెద్దవాడిని.
 ‘‘నేను ఎదురింట్లో ఉంటాను...’’ ఆగింది. మాటలు నీరసంగా ఉన్నాయి. ఆ ఇల్లు ఆమె సొంతమో, అద్దెకు ఉంటుందో తెలియదు. ఏదో అడగడానికి వచ్చింది. వచ్చాక అడగడానికి మొహమాటం అడ్డం వస్తూ ఉండొచ్చు. ఆమె డెలికసీని తప్పిస్తూ, ‘‘అడుగమ్మా... నాకు నీ అంత కూతురుంది’’ అన్నాను.
 
‘‘మీరు ఏమనుకోకపోతే... మీ దగ్గర ఎంతో కొంత బియ్యం ఉంటే ఇవ్వగలరా...?’’ ఆమె ఏదో చెప్పబోతోంది. వినాలనిపించలేదు. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారేమో నాకు తెలియదు. నాకు అనవసరమయిన విషయం. ఆమె ఏ పరిస్థితిలో ఉండి బియ్యం అడిగి ఉంటుందో అర్థం చేసుకోగలను.
 
‘‘తప్పకుండా’’ అని వంటగది వైపు నడిచాను. ఉదయమే అయిదు కిలోల బియ్యం తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఇష్టమయిన వంట చేసుకుని తింటుంటాను. బియ్యపు సంచి తీసుకువచ్చి ఆమెకు ఇస్తున్నప్పుడు ఆమె కళ్లు కృతజ్ఞతతో తడిచాయి.
 ‘‘వీలయినంత త్వరలో తిరిగిచ్చేస్తాను...’’ అని దుఃఖంతో నిండిన స్వరంతో అంటోంటే ఆమె మాటలకు అడ్డుతగిలి, ‘‘తొందరేమీ లేదమ్మా’’ అని జేబులోంచి వెయ్యి రూపాయల నోటు తీసి ఇచ్చాను. తీసుకుంది.

ఆమె పేరు అడుగుదామనుకునేంతలో మెట్లు దిగి వెళ్లిపోయింది. రోడ్డు త్వరత్వరగా దాటి వాళ్ళింట్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూస్తుందని అనుకున్నాను. చూడలేదు. తలుపు మూసి పడక కుర్చీలో కూర్చుని సిగరెట్ ముట్టించాను. నా ధ్యాస చిత్రం మీదకు మళ్లింది. సంతృప్తికరంగా చిత్రం వచ్చే వరకు సిగరెట్లు కాలుస్తుంటాను. సిగరెట్లు తాగడం ఎప్పటికప్పుడు మానేయాలనుకుంటాను. మానలేను. మా పిల్లల ముందు సిగరెట్లు తాగను.
 మరుసటి రోజు నుండి నా ఇంటి ముందు గోడ పక్కగా కారు ఆపి దిగబోతూ ఆమె ఇంటి వైపు చూశాను. వీధి తలుపు మూసి ఉంది.

కిటికీ తలుపులు తెరిచివున్నాయి. కొత్త ఆలోచన వచ్చింది. కారు దిగి నా ఇంట్లోకి వెళ్లి బల్ల మీదున్న రఫ్‌బుక్ అందుకుని పెన్సిల్‌తో నాకు వచ్చిన ఆలోచనకు స్కెచ్ గీశాను. అలా చేయకపోతే మర్చిపోతాను. ఒహపట్టాన గుర్తురాదు.
 
రెండు వారాలు గడిచాక ఆమె మళ్లీ వచ్చింది. లోగడ తీసుకున్న బియ్యం తిరిగి ఇచ్చేందుకేమో అనుకున్నాను. కాదు. ఖాళీసంచి నాకు అందిస్తూ, ‘‘మళ్లీ మీకు ఇబ్బంది పెడుతున్నాను...’’ అంది. మునుపటి మొహమాటం కనిపించలేదు. చక్కగా నవ్వింది. ఆమెకు ఏం కావాలో నాకు అర్థమయింది. ఆమె రావచ్చేమో అనుకున్నాను కాని వస్తుందని ఊహించలేదు.
 ఈసారి మునుపు ఇచ్చిన బియ్యం కన్నా ఎక్కువే ఇచ్చాను. కూరగాయలు, రెండు పాలపేకట్లు, డజను కోడిగుడ్లు కూడా ఇచ్చాను.
 
‘‘ఇవన్నీ ఎందుకండీ?’’ అంది కాని తీసుకుంది. వెళ్లిపోవడానికి ఒక మెట్టు దిగి, ఏదో ఆనబోయింది కాని అనలేదు. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు పేరు అడగడం మర్చిపోయానే అనుకున్నాను.
 దాదాపు పూర్తి చేసిన చిత్రంలో చిన్న మార్పు చేశాను. సంపూర్ణత వచ్చిందనిపించింది. చిత్రానికి ఏం పేరు పెట్టాలో తోచడం లేదు. చిత్రం ఒకసారి చూస్తే సాదాగా ఉంటుంది. మరోసారి చూసినప్పుడు నిగూఢత కనిపిస్తుంది. స్టేజి మీద ఆమె ఉంటుంది. థియేటర్‌లో లైట్లన్నీ ఆర్పబడి ఉంటాయి. ఒక్క లైటు మటుకు ఆమె మీద ఫోకస్ చేయబడి ఉంటుంది. తెరలు మెల్లగా పైకి లేస్తుంటాయి. ఒక చేత్తో ఆమె తెర తీయవద్దని, మరొక చేత్తో తీయమని సంజ్ఞలు చేస్తుంటుంది. అంతే.
 
నెలరోజుల తర్వాత నా చిత్రప్రదర్శన కావ్య రెసిడెన్సీలో ఏర్పాటు చేసినప్పుడు ఆమె రాకకు ఆశ్చర్యం వేసింది. నా గురించి ఆమెకు తెలుసని నేను అనుకోలేదు. నల్ల చారలున్న తెల్లచీరలో మనిషి చాలా అందంగా ఉన్నట్లనిపించింది. వయసు కనబడడం లేదు. నన్ను ఆమె చూడలేదు. ఆమె ఒక్కొక్క బొమ్మ చూస్తూ మధ్యమధ్యలో సెల్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. వెళ్లి ఆమెను పలకరిద్దామనుకునేంతలో ఎవరో నన్ను పిలిచి పక్కకు తీసుకువెళ్లి మాట్లాడి తిరిగి హాల్లోకి వచ్చేసరికి ఆమె కనబడలేదు. వెళ్ళిపోయినట్టుంది. బాల్కనీలోకి వచ్చి కిందకు చూశాను. ఆమె తలవంచుకుని బయటకు వెళ్తోంది.
ఆమె పేరు అడుగుదామనుకునేంతలో మెట్లు దిగి వెళ్లిపోయింది. రోడ్డు త్వరత్వరగా దాటి వాళ్ళింట్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపు చూస్తుందని అనుకున్నాను. చూడలేదు.
 
వారం గడిచాక ఆ సాయంత్రం బీచ్‌లో ఎప్పుడూ కూర్చునే చోట కూర్చున్నాను. సూర్యుడు కనుమరుగయ్యాడు. కాని వెలుగు తగ్గలేదు. వర్షం వచ్చేట్టుగా ఉంది. వస్తే బావుణ్ణు. వర్షంలో తడవడం నాకు ఇష్టం. సమయం ఎంతయిందో తెలియదు. కొద్దిసేపు కూర్చున్నాను. కారుమేఘాలు చెల్లాచెదరయ్యాయి.

లేచి రోడ్డుపక్కగా పార్క్ చేసిన నా కారు వైపు వస్తోంటే కాలిబాట మీద ఆమె నాకు ఎదురయింది. పలకరిద్దామనుకుని ఆగిపోయాను. పక్కనే ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఒకతను నడుస్తున్నాడు. ఇద్దరి చేతుల్లో ఐస్‌క్రీం కోన్లు ఉన్నాయి. అతనామెకు తినిపిస్తున్నాడు. ఆమె అతనికి తినిపిస్తోంది. అతను ఆమెకు భర్తగా అనిపించలేదు. వయసులో ఆమెకంటే చిన్నవాడిలా ఉన్నాడు. ఆమె అంత అందంగా లేడు.
 
కాలిబాట దిగి వాళ్లకు దారి ఇచ్చాను. బీచ్‌లో ఇటువంటి దృశ్యాలు చూడడం కొత్తేమీ కాదు. కారులో కూర్చుని స్టార్ట్ చేస్తోంటే ఆమె వెనక్కి తలతిప్పి నా వైపు చూసింది. వాళ్ల పక్కనుండి కారు తీసుకువెళ్తూ వాళ్ల వైపు చూడలేదు. ఆ రాత్రి అన్నం కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఆమె చూపులు గుర్తుకువచ్చాయి.
 
చిన్నచిన్న పనులు ఉన్నందున స్టూడియో ఇంటికి వెళ్లడం కుదరలేదు. వారం తర్వాత వెళ్లి, ఇంటి బయట కారు పార్క్ చేసి, ప్రహరీ గోడ ఇనుప తలుపు తెరచుకుని మెట్లు ఎక్కి ఇంటి తలుపు తాళం తీస్తుండగా, ‘‘హలో’’ అన్న పిలుపు విని వెనక్కి తిరిగాను. ఆమె! ఆమె చేతిలో సంచి ఉంది. ‘‘మీ బియ్యం’’ అంది. మరో మాట అనలేదు. నా ముఖంలోకి కూడా చూడలేదు. చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయింది. బియ్యం తిరిగి ఇచ్చేసినందుకు నాకు బాధ అనిపించలేదు. కానీ ఆమె మాట తీరుకు నొచ్చుకున్నాను. తలుపు దగ్గరగా వేసి సోఫాలో కూర్చున్నాను. కిటికీ తలుపులు తెరవాలని కూడా అనిపించలేదు.
 
ఇంటి తాళం చెవి తీయని సంగతి గుర్తుకువచ్చి, లేచి తలుపుతెరచి తాళం గుత్తి జేబులో వేసుకుంటూ ప్రహరీ గోడ తలుపువైపు చూశాను. అడుక్కుతినే బక్క మనిషి అటూ ఇటూ చూశాడు. తలుపుపక్కనే ఉన్న నన్ను గమనించలేదనుకుంటాను. ఆమె వదిలివెళ్ళిన బియ్యపు సంచి ఎత్తి భుజాన పెట్టుకుంటున్నప్పుడు ప్రహరీ గోడకు ఉన్న మేకు సంచికి తగిలి కింద కన్నం పడింది. అది అతను గమనించినట్టు లేదు. వేగంగా నడవడం మొదలెట్టాడు. అతన్ని వారించలేదు. పరుగెత్తితే బక్క ప్రాణం కింద పడిపోతుంది. చిరుగులోంచి బియ్యం కారిపోతోంది.  
- బి.పి. కరుణాకర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement