తమ్ముడు వండితే చక్కగా లాగిస్తా! | Interesting facts about Priyanka Chopra | Sakshi
Sakshi News home page

తమ్ముడు వండితే చక్కగా లాగిస్తా!

Published Sun, May 4 2014 11:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

Interesting facts about Priyanka Chopra

 

అన్న అయితే అండగా ఉంటాడు. తమ్ముడైతే అండ కోరుకుంటాడు. సిద్ధార్థ అలా కోరుకున్నప్పుడు అక్క ప్రియాంక అతడి వెంట నిలబడింది. ప్రోత్సహించింది. అది ఆ తమ్ముడు మర్చిపోలేదు. తమ్ముడినైనా అన్నలా జీవితాంతం నీకు అండగా ఉంటానంటూ అక్కయ్యకు మాటిచ్చాడు. అక్క కోసం ఏం చేసేందుకైనా సిద్ధమంటాడు. అందుకే... అక్కాతమ్ముళ్ల అనుబంధానికి అసలైన నిర్వచనంగా వాళ్లిద్దరినీ చూపిస్తారంతా!
 
 
 ఏ ఆడపిల్ల అయినా తన అన్నను చూసుకుని చాలా ధైర్యంగా ఉంటుంది. నాకు అన్న లేడు. తమ్ముడున్నాడు. వయసులో చిన్నవాడు కనుక తమ్ముడంటున్నాను కానీ అన్నకంటే ఎక్కువ భరోసా ఇస్తాడు. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రద్ధ చూపిస్తాడు. తను ఉంటే బాగుణ్ను అని నేననుకునేలోపు నా దగ్గరుంటాడు.
 
 మా తమ్ముడు సిద్ధార్థ అంటే నాకు ప్రాణం. చిన్నప్పట్నుంచీ వాడిని బాగా ముద్దు చేసేదాన్ని. తను నాకంటే  ఏడేళ్లు చిన్నవాడు. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు పుట్టాడు. బొద్దుగా, క్యూట్‌గా ఉండేవాడు. మొదట్నుంచీ చాలా కామ్‌గా కూడా ఉండేవాడు. మగపిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారని అంటారు. కానీ సిద్ధూ అలా కాదు. నేను కాస్త తుంటరిదాన్ని కానీ తను చాలా బుద్ధిమంతుడు. సెలైంట్‌గా తన పని తాను చేసుకుపోతుంటాడు. సింపుల్‌గా ఉంటాడు. తనది ఎంత మంచి మనసంటే... తన ఎదురుగా ఎవరు బాధపడినా వాడి కళ్లు చెమరుస్తాయి. వెంటనే వాళ్లని ఓదార్చడానికో, సాయం చేయడానికో రెడీ అయిపోతాడు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.
 
 అయితే వాడిలో నాకు నచ్చని లక్షణం ఒకటుంది. మరీ ఎమోషనల్‌గా ఉంటాడు. ఎవరైనా చిన్న మాట అన్నా హర్ట్ అయిపోతాడు. తను నమ్మినవాళ్లు ఎవరైనా అబద్ధం చెప్పినా, కాస్త మోసగించినా ఎంతగానో ఫీలైపోతాడు. అది మంచి పద్ధతి కాదని ఎంత చెప్పినా వినడు. మనల్ని బాధపెట్టేవాళ్ల గురించి పట్టించుకోవడం అనవసరం, మనల్ని ప్రేమించేవాళ్లను గుర్తు తెచ్చుకుని సంతోషపడటం ఉత్తమం అన్నది నా పాలసీ. అది వాడికి అర్థమవదు. చెప్పినప్పుడు సరే అంటాడు కానీ మళ్లీ మామూలే.
 
 
 సినిమాల్లోకి వచ్చాక వాడితో గడిపే సమయం తగ్గిపోయింది. దానికి తోడు తను చదువుకోవడానికి విదేశాలకు వెళ్లిపోవడంతో కాస్త దూరం పెరిగింది. అయితే ఏ మాత్రం చాన్స్ దొరికినా కలిసేవాళ్లం. తన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌కి నేను స్విట్జర్లాండ్ వెళ్లాను కూడా. నన్ను అక్కడ చూడగానే ఎంత సంతోష పడిపోయాడో!
 
 ఇక రాఖీ పండుగ వచ్చిందంటే సందడే సందడి. నేను పొద్దునే లేచి, వాడినీ లేపి రాఖీ కట్టేస్తాను. నిజానికి నాకు ఇరవైమంది వరకూ కజిన్స్ ఉన్నారు. చిన్నప్పట్నుంచీ వాళ్లందరికీ రాఖీలు కట్టేదాన్ని. తర్వాత బిజీ అయిపోయి పోస్ట్‌లో పంపించడం మొదలుపెట్టాను. అయితే ఎంతమందికి కట్టినా... మా తమ్ముడి దారి వేరు, తనకు రాఖీ కట్టడంలో ఉండే ఆనందం వేరు.
 
 సిద్ధూకి మొదట్నుంచీ వంట చేయడం చాలా ఇష్టం. అందుకే చెఫ్ అయ్యాడు. అద్భుతంగా వండుతాడు. నాకు థాయ్ ఫుడ్ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరతాయి. అందుకే నాకోసం తను థాయ్ స్పెషల్ కర్రీ చేసి పెడుతుంటాడు. భలే ఉంటుంది రుచి! ఇంకా రక రకాల వంటకాలు చేసి రుచి చూపిస్తుంటాడు. నేను ఫుల్‌గా లాగించేస్తాను. ఏ అక్కకి ఆ అదృష్టం దొరకుతుంది చెప్పండి!
 
 సిద్ధూకి పోయినేడు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. తను కర్ణికను ప్రేమించాడు. తన ప్రేమను మేమందరం అంగీక రించాం. మా తమ్ముడు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నన్ను కంటికి రెప్పలా చూసుకునే నాన్న మమ్మల్నందరినీ వదిలి వెళ్లిపోయారు (ప్రియాంక తండ్రి డాక్టర్ అశోక్‌చోప్రా, పోయినేడు జూన్‌లో క్యాన్సర్‌తో మరణించారు). ఇక అమ్మకి, నాకు ఉన్న తోడు, ధైర్యం సిద్ధూనే. నాకు తెలుసు... నాకోసం ఎప్పుడు ఏం చేయడానికైనా తను సిద్ధంగా ఉంటాడని!
 
 సిద్ధార్థ చోప్రా స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చేశాడు. ప్రస్తుతం ఓ ప్రముఖ హోటల్‌లో చీఫ్ షెఫ్‌గా పని చేస్తున్నాడు. స్వతహాగా కాస్త సిగ్గరి అయిన సిద్ధార్థ... ఎప్పుడైనా అక్కతో పాటు పార్టీలకు వస్తాడు తప్ప ఇండస్ట్రీకి, సినీ జనానికి కాస్త దూరంగానే ఉంటాడు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement