సంకల్పమే శ్వాసగా! | International Day of Persons with Disabilities, 3 December | Sakshi
Sakshi News home page

సంకల్పమే శ్వాసగా!

Published Sun, Nov 27 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

సంకల్పమే శ్వాసగా!

సంకల్పమే శ్వాసగా!

డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినం
జీవితానికి ఒక ప్రణాళిక ఉండాలి. లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని జయించాలనే తపన ఉండాలి.ఆ తపన లేని వారికి అణువంత సమస్య కూడా కొండంత కనిపించి వెనక్కి తగ్గుతారు. తపన ఉన్నవాళ్లకు కొండంత సమస్య కూడా అణువంతైనా ప్రభావం చూపదు! ఈ కోవకు చెందిన వ్యక్తి అహ్మదాబాద్(గుజరాత్)కు చెందిన హరీష్ కుమార్.
 
పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు హరీష్ (కుడి చేయి దిగువభాగం పుట్టుకతోనే లేదు). తనకు రెండు చేతులు లేకపోవడం గురించి హరీష్‌కు బాధగా ఉండేది. అయితే అది కొంతకాలం వరకు మాత్రమే... ఆ తరువాత దాన్ని అధిగమించాడు. చదువులో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఐఐటి, ఢిల్లీ నుంచి యంటెక్ పూర్తిచేశాడు. ఆ తరువాత... పద్దెనిమిది సంవత్సరాల పాటు టెలికామ్ సెక్టార్‌లో జనరల్ మేనేజర్‌తో సహా రకరకాల హోదాల్లో పనిచేశాడు. ఒకసారి మిత్రుడు ఒకరు హరీష్‌కు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ పుస్తకం ఇచ్చాడు.
ఆ పుస్తకంలో దీపా మాలిక్ గురించి చదివి ఉత్తేజితుడయ్యాడు హరీష్. సై్పన్ సర్జరీ జరిగిన దీపా మాలిక్ డ్రైవింగ్‌లో రికార్డులు సృష్టించారు. రోజువారి యాంత్రిక జీవితంలో పడి తనకు ఇష్టమైన డ్రైవింగ్‌ను మరిచిపోయిన విషయం హరీష్‌కు అప్పుడు గుర్తుకువచ్చింది. మనసు మళ్లీ డ్రైవింగ్ వైపు లాగింది. తాను కూడా దీపామాలిక్ మాదిరిగా రికార్డ్ సృష్టించాలనే కోరిక పెరిగింది. 
 
అలా... తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు హరీష్.
28 రాష్ట్రాల గుండా 15,963 కిలోమీటర్ల దూరాన్ని 29 రోజులలో ఒక మామూలు కారులో కవర్ చేసిన  ‘ఫస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్ పర్సన్’గా డ్రైవింగ్‌లో  నేషనల్ రికార్డ్ సృష్టించాడు. ఆ తరువాత... 6,000 కిలోమీటర్లను (అహ్మదాబాద్- ఢిల్లీ- కోల్‌కతా-చెన్నై- ముంబాయి-అహ్మదాబాద్) 129 గంటల్లో పూర్తిచేసి మరో రికార్డ్ నెలకొల్పాడు. ఈ రెండూ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుచేసుకున్నాయి. ఈ రెండు విజయాలు తన మనసుకు ఎంతో తృప్తినిచ్చాయి. ఆ తరువాత మళ్లీ... కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించాడు హరీష్ కుమార్. ఆ సమయంలో చాలామంది వికలాంగులు హరీష్‌ను సంప్రదించారు.‘‘మీలాగే రికార్డ్‌లు నెలకొల్పాలని ఉంది. డ్రైవింగ్ అంటే ఇష్టం. కానీ డ్రైవింగ్ రాదు. నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చేవి. అవమానాలు ఎదురయ్యేవి.’’ అనేవారు. వారి ఆవేదన హరీష్‌ను ఆలోచింపచేసింది.
 
వారి కోసం ఏదైనా చేయాలనిపించింది.
డ్రైవింగ్ లెసైన్స్ కోసం తాను ఎంత ఇబ్బంది పడింది, ఎందరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది... ఒక్కటొక్కటిగా గుర్తుకొచ్చింది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి, డ్రైవింగ్ లెసైన్స్ పొందడానికి  ఎవరూ ఇబ్బందులు, అవమానాలు పడొద్దు అని... వికలాంగుల కోసం మన దేశంలో తొలి డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. దీనికి ముందు ప్రభుత్వ అధికారులను కలుసుకున్నాడు. వారు చెప్పిన విషయం షాకింగ్‌గా అనిపించింది. వికలాంగుల కోసం మన దేశంలో ఒక్క డ్రైవింగ్ స్కూలు కూడా లేదు!‘ఇది సిగ్గుపడాల్సిన విషయం’ అనిపించింది. ఏమైతేనేం... హరీష్ కోరికను మన్నించి వికలాంగుల కోసం ‘డ్రైవింగ్ స్కూల్’ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మొదటిసారి 150 మంది చేరి డ్రైవింగ్ నేర్చుకొని లెసైన్సులు కూడా పొందారు.
 
వికలాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ‘ఎబిలిటీ ఆన్ వీల్స్’ అనే పుస్తకం కూడా రాశాడు హరీష్ కుమార్.  ఈ పుస్తకంలో... స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నవారి పట్టుదల, నైపుణ్యాల గురించి వివరంగా రాశాడు. మరిన్ని నగరాలలో వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్‌లు ఏర్పడాలని, ఏర్పాటు చేయాలనుకునేవారికి తన సహయ సహాకారాలు ఉంటాయంటున్నారు హరీష్ కుమార్.హరీష్ కుమార్ ‘డ్రైవింగ్ స్కూల్’ వినూత్న ఆలోచన ఎందరిలోనో ఆత్మవిశ్వాసం నింపడమే కాదు...ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.‘డ్రైవింగ్’ అనేది మనకు సంబంధించిన విషయం కాదనుకునేవారిని దగ్గరికి తీసుకొని వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
‘మేము సైతం’ అంటూ అణువణువూ సంకల్పబలాన్ని నింపుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement