వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మంత్రి సత్యకుమార్ అనుచరుల దాడి
కార్యకర్తలను పరామర్శించేందుకు సబ్‌జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
సబ్‌జైలు వద్ద ఆయన వాహనాలను అడ్డుకొని, దాడులు చేసిన మంత్రి అనుచరులు
బీజేపీ నాయకులకు అండగా కూటమి నాయకులు
ఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ విలేకరి రమేష్ పై పోలీస్ లాఠీలతో దాడి
దాడిని ఆపే ప్రయత్నం చేయని పోలీసులు
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అనుచరుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మంత్రి అనుచరుడు హరీ‹Ùకుమార్ నేతృత్వంలో వందలాది గూండాలు, వారికి వత్తాసు పలుకుతున్న కూటమి పార్టీల నాయకులతో కలిసి సోమవారం పట్టణంలో వీరంగం సృష్టించారు. వారి దాడిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్‌నాథ్‌రెడ్డి, సాక్షి టీవీ విలేకరి సండ్ర రమే‹Ùతో పాటు శీలా విజయ్ కుమార్ అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.
ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లెలో ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై.. అక్రమ కేసులతో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం మ«ధ్యాహ్నం ధర్మవరం సబ్‌జైలుకు వెళ్లారు. కేతిరెడ్డి ఆయన వాహనాన్ని తానే నడుపుతుండగా, ఆయన డ్రైవర్ రామాంజి మరో వాహనంలో ఉన్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న హరీష్‌కుమార్ నేతృత్వంలోని గూండాలు వారి వాహనాలను అడ్డుకున్నారు.
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రైవర్ రామాంజిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో రామాంజి అక్కడి నుంచి వాహనంలో వెళ్లిపోయారు. అంతటితో ఆగని బీజేపీ, కూటమి శ్రేణులు సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారు. కేతిరెడ్డి సబ్‌జైలులో ఉండగా లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.
వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్‌నాథ్‌రెడ్డి, కార్యకర్త శీలా విజయ్‌కుమార్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ సండ్ర రమే‹Ùపైనా పోలీసు వద్దనున్న లాఠీలను లాక్కుని మరీ బీజేపీ నాయకులు దాడి చేశారు. అనంతరం కేతిరెడ్డి కాన్వాయ్‌లోని పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు.
చోద్యం చూసిన పోలీసులు
మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. అంత గొడవ జరుగుతున్నా అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాలేదు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మరికొందరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ భద్రత మధ్య కేతిరెడ్డిని ఇంటికి తరలించారు.
ధర్మవరంలో దౌర్జన్యకర సంస్కృతికి బీజం వేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ప్రశాంతతకు పేరొందిన ధర్మవరంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడుల సంస్కృతికి బీజం వేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌జైలు ఘటనల అనంతరం ఆయన ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల్లో మంత్రి సత్యకుమార్ అనుచరులు, కూటమి పార్టీల నాయకుల దందాలు, దౌర్జన్యాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులను పరామర్శించేందుకు తాను ఐదుగురితో కలసి సబ్‌జైల్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు తన డ్రైవర్ రామాంజిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బీజేపీతోపాటు కూటమి పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారన్నారు. దివ్యాంగుడు, ఆరోగ్యం సరిగా లేని అమర్‌నాథ్‌రెడ్డిని, విజయ్‌ని దారుణంగా కొట్టారన్నారు.
దాడిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌పైనా పోలీస్ లాఠీలతో కొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రాలేదని, పోలీసు స్టేసన్ కూడా సబ్ జైలు పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మూడు గంటల పాటు పోలీసులు వారి దౌర్జన్యాలకు పూర్తిగా సహకరించారన్నారు. ధర్మవరంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంత్రి సత్యకుమార్ తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు.
ధర్మవరంలో శాంతి నెలకొల్పేందుకు తమ ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులో ఉంచామని, ఇప్పుడు అదే తప్పని తేలిందని కేతిరెడ్డి అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సైతం వేలాది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధర్మవరం వస్తామంటూ ఫోన్లు చేసినా శాంతింపజేశామన్నారు. కూటమి నేతలకు తగిన సమయంలో సమాధానం చెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment