మనిషి తత్వాన్ని.. మనస్తత్వాన్ని చాటి చెప్పే అరుదైన పాటల్లో ‘జగమంత కుటుంబం..’ పాట తప్పకుండా అగ్రస్థానంలో ఉంటుంది.
పాటతత్వం
పాట: జగమంత కుటుంబం నాది..
సినిమా: ‘చక్రం’
గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: చక్రి
‘‘మనిషి తత్వాన్ని.. మనస్తత్వాన్ని చాటి చెప్పే అరుదైన పాటల్లో ‘జగమంత కుటుంబం..’ పాట తప్పకుండా అగ్రస్థానంలో ఉంటుంది. మనిషి స్వార్థజీవి.. ఈ జగమంతా, ఈ జీవితమంతా తనదే అనుకుంటాడు. కానీ, చివరికి ఏకాకిగా కాలం చేయాల్సిందే. ఈ జీవితం నీది కాదు.. లోకానిది. బతికిన కొన్నాళ్లైనా నలుగుర్నీ నవ్వించాలని, మరణించిన తర్వాత నలుగురూ మన గురించి మాట్లాడుకోవాలని చెప్పే పాట ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు, చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్. ప్రభాస్ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చక్రం’. చక్రి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ‘జగమంత కుటుంబం..’ పాటతత్వం గురించి మహిత్ మాటల్లో...
‘జగమంత కుటుంబం..’ పాట ఎక్కడ వినిపించినా మనసంతా అటువైపు పరుగులు తీస్తుంది. ఆ పాటలోని ఆవేదన అటువంటిది. అన్నయ్య సంగీతం అందించిన పాట ఇది అని చెప్పడం లేదు. బిడ్డను కన్నప్పుడు పడే పురిటినొప్పుల ప్రసవ వేదన ఎలా ఉంటుందో.. ప్రతి పాట వెనుకా కవి అటువంటి ఆవేదనను అనుభవిస్తాడు. ఈ పాటలో శాస్త్రిగారి ఆవేదన కనిపిస్తుంది.
పల్లవి: జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది
ఈ శ్వాస ఇక నీది కాదు.. పొమ్మంటున్న తరుణాన ఎలాంటి దృశ్యాలు కళ్ల ముందు తారసపడతాయో ఈ పాటలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఈ జగమంతా.. అన్నింటిలో మనిషే ఉన్నాడనిపిస్తుంది. ఏదీ వదులుకోవడానికి మనిషి మనసు ఇష్టపడదు. కానీ, వదులుకోక తప్పదు. ఆత్మ ఏకాకి కాక తప్పదు. శ్వాస వదలక తప్పదు. బతికినంతకాలం మన చుట్టూ ఎందరు ఉన్నా.. చివరకి ఏకాకిగా జీవితానికి ముగింపు పలకక తప్పదు.
చరణం 1: కవినై కవితనై.. భార్యనై భర్తనై (2)
మల్లెల దారిలో.. మంచు ఎడారిలో (2)
పన్నీటి జయ గీతాల.. కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ.. నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం.. కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని.. మాటల్ని పాటల్ని.. రంగుల్నీ రంగవల్లుల్ని..
కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని ॥
మనిషి అనేవాడు సకల కళా వల్లభుడు. ఇల్లూ.. ఇల్లాలు.. పిల్లలు.. ఆస్తి.. అంతస్తులు.. అన్నీ తనవే అనుకుంటాడు. మనిషి తత్వమే అంత. అది మంచిదే. కానీ, చివరకు మిగిలేది ఏంటి? అనేది పల్లవిలో చెప్పారు. మనిషి ఎప్పుడూ జీవితం మల్లెల దారిలా ఉంటుందనుకుంటాడు. కలలు కంటుంటాడు. పైకి చల్లగా ఉన్నా లోపల మంటలు రగిలించే ఎడారి తోవ ఈ జీవితం. కష్టసుఖాలు.. కన్నీరు.. పన్నీరు.. ఒకదాని తర్వాత ఒకటి వస్త్తూనే, పోతూనే ఉంటాయి. ఏవీ శాశ్వతం కాదు. అశాశ్వతమైనది ఉంటే అది నువ్వే. నువ్వు ఈ భూమ్మీద ఉండవు. నువ్వు చేసే మంచి మాత్రమే మిగులుతుంది.
చరణం 2:
మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై (2)
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ.. నాతో నేను రమిస్తూ
ఒంటరినై ప్రతి నిమిషం.. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల.. హరిణాల్ని హరిణాల.. చరణాల్ని చరణాల.. చలనాన కనరాని.. గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని ॥
మనం ఒకటి తలిస్తే, విధి మరొకటి రాస్తుంది. మంటల మాటున వెన్నెల, వెన్నెల మాటున మంటలు.. ఎప్పుడు ఏది ఎదురవుతుందో? ఎవరూ చెప్పలేరు. నువ్వు బతికున్నంత కాలం మాత్రమే నువ్వు కోరుకున్నది సాధించుకోగలవు. మరణించిన తర్వాత తోటి మనిషి ప్రేమను పొందాలంటే మనలో దివ్యజ్యోతిని మనమే వెలిగించుకోవాలి. ఎప్పుడు ఆరుతుందో తెలియనిది ఈ జీవనజ్యోతి. ఆ జ్యోతి ఆరక ముందే నలుదిక్కులు జీవనజ్యోతి వెలిగించు అన్న మహోన్నత తత్వాన్ని ఈ చరణం ప్రబోధిస్తుంది.
చరణం 3:
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప వూరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి.. నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి.. నా హృదయములో ఇది సినీవాలి
॥
మనిషికి హృదయమే లోగిలి. ఆ హృదయంలో తరిగిపోని ప్రేమానురాగాలు ఉంటాయి. ఎన్నో ఎన్నెన్నో బడబాగ్నులు ఉంటాయి. వాటి నడుమ సాగే ప్రయాణమే ఈ జీవితం. గాలి పల్లకీలో ప్రయాణించే పాట వంటిది. మన గొంతులో ఆ పాట ఎప్పుడు ఆగుతుందో? చెప్పడం కష్టం. అంటే ఈ జీవితం ఎప్పుడు మూగబోతుందో? ఎవ్వరూ ఊహించలేరు. మూగబోయిన నాడు మిగిలేది మన హృదయం పంచిన ప్రేమానురాగాలే.
పాట రాయడానికి సిరివెన్నెలగారు ఎన్ని ప్రసవ వేదనలు అనుభవించారో నాకు తెలీదు. ఆయన గురించి మాట్లాడేంత అర్హత ఉందో? లేదో? కూడా నాకు తెలీదు. శాస్త్రిగారు రాసిన పాటలో భావం చెడకుండా చక్రి అన్నయ్య అద్భుతమైన ట్యూన్ అందించారు. ఈ పాట స్వరపరిచినప్పుడు అన్నయ్య ఎంత తృప్తి పొందారో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయే పాట ఇది. అన్నయ్య మన మధ్య లేరనే విషయన్ని నా మనసు ఇప్పటికీ అంగీకరించదు. ఈ పాట రూపంలో బతికే ఉంటున్నారని అనుకుంటున్నాను. ఈ పాటతత్వం గురించి చెప్పే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నాను.
ఇంటర్వ్యూ : సత్య పులగం
- మహిత్‌నారాయణ్, సంగీత దర్శకుడు