సెలబస్: స్వదండకం
కథ, మాటల రచయితగా, దర్శకుడిగా... తెలుగు, కన్నడం, తమిళ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు జనార్దన మహర్షి. కవిగా తన కలం నుంచి ఎన్నో అక్షర సుమాలను వెదజల్లారు. మహర్షి ఫ్లూటిస్ట్ కూడా! వీణ, వయొలిన్‌లపై సంగీతాన్ని పలికించే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి త్వరలో ఒక కచేరీ ఇవ్వాలన్నది ఆయన లక్ష్యం.
ప్రియాతి ప్రియమైన పద్మశ్రీ ‘భారతరత్న’ నాకు నేను రాసుకొను ప్రేమలేఖ ఇదే నా మొదటి ప్రేమలేఖ ఎవ్వరికీ రాయనేలేదింత దాకా. ‘నీ’ ప్రేమలో పడి ‘నాకే’ రాస్తున్నా. నన్నడిగారు... ‘నీకెవరంటే ఇష్టమని’ ‘నేనే’ అన్నాను. అంతేకదా... రాజకీయాలైనా రాసక్రీడలైనా, రచనలైనా, సం‘గీతా’లైనా అరువది నాలుగు కళల్లో ఎవడైనా నాకు ఇష్టంగా ఉండాలంటే ముందు వాటిని ఇష్టపడే నాకు నేను ఇష్టుడిగా ఉండాలి కదా!
‘ఎలా ఉన్నావ్’ అని అడిగాడతను
‘నువ్వెలా కోరుకుంటే అలా’ అన్నాను.
నాకు నేనెందుకింత ఇష్టమో చెప్పాను
ఎందుకంటే... నే స్వయంభుని
విల్లంభుని... హయంభుని... జయంభుని
నేను తెరిచిన నగలపెట్టెని
ఎవరైనా ధరించొచ్చు
కానీ నిష్ర్కమించేటప్పుడు
నేలపైన, నెలరాజు లాంటి
నన్నూ, పెట్టెని వదిలివెళ్లు.
పెకైళితే... నగల నగరమే ఉందిగా
సూర్యుడికీ చంద్రుడికీ
తెలీని సంధి సమయంలో
నేను భయాన్ని ఉరివేసి,
దుఃఖాన్ని ఎన్‌కౌంటర్ చేసి,
నిరాశకి తలకొరివి పెట్టాను.
ఇది మీకూను లాభసాటి.
తిరుగులేని ‘తిక్క’ నా సొంతం
గొడుగు తడుస్తుందని
వర్షంలో విప్పను
చెప్పు కాలుతుందని
ఎండలో తొడగను
ఎందుకిలా అంటే... అంటాను
‘చెప్పు’నేనే... ‘ముళ్లు’ నేనే... ‘వర్షం’ నేనే
తడిస్తే వచ్చే జలుబు నేనే.
మందు చిటీ రాసే వైద్యుణ్ని,
దాన్ని వాడక చింపే పేషెంట్‌ని,
అన్నీ నేనే... అదే ‘నువ్వే’నని!
హరిని... కరిని...
కరిమింగిన వెలగని
వెలగ మొలచిన చెట్టుని
పెరిగే దేహాన్ని,
తరిగే శరీరాన్ని
అన్నీ ‘నేనే’... ‘నువ్వే’నని.
అత్యధిక అపజయాలని
సాధించడంలో
నీ అంత విజయుడు లేడు
నేనెంత పాతాళంలో ఉన్నానంటే
భూమ్మీద ఉన్న మనుషులు
నాకు ఆకాశం ఎత్తులో ఉంటారు
ఆత్మహత్య చేసుకుందామనే
వాళ్లందరూ కూడా
నీతో నాలుగు నిమిషాలు
గడిపితే... వీడే
బతికేస్తున్నాడనే ధైర్యంతో
నిండు నూరేళ్లు మిగులుతారు.
ఆఖరుగా ఓ మాట.
నీకు నేను చెప్పేదేంటంటే...
‘‘ఇష్టం లేకపోతే... ఉలక్కు...
పలక్కు... అంతేగానీ కెలక్కు’’... అంతే
నేనెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటా.