
వంగభూమిని విభజిస్తున్నట్టు అక్టోబర్ 16, 1905న వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రకటించాడు. శ్వేతజాతి మీద అప్పటికీ నమ్మకంతోనే ఉన్న ఆ కొద్దిమంది భారతీయులు కూడా భగ్గుమన్నారు. వలస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఒక విస్తృత ప్రజా ఉద్యమానికి తొలిసారి జాతి సమాయత్తమైంది. కవులు, కళాకారులు, మేధావులు, మధ్యతరగతి ప్రజలు అంతా ఆ రోజున బెంగాలీలతో పాటు, దేశవ్యాప్తంగా ఉపవాస దీక్ష చేపట్టారు. హిందువులు, ముస్లింలు ఒకరి చేతికి ఒకరు రాఖీలు కట్టుకుని, ఐక్యతను చాటారు. బిపిన్‌చంద్రపాల్, అరవింద్ ఘోష్, చిత్తరంజన్ దాస్ వంటివారితో పాటు కొన్నివేల మంది గంగానదిలో స్నానం చేసి, ప్రభుత్వం వంగదేశ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేవరకు ఉద్యమం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అన్ని వేల మంది తరలివచ్చిన ఆనాటి ఆ చరిత్రాత్మక ఘట్టంలో ఒక్క వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా కనిపించారు. చిన్న గావంచా కట్టుకుని గంగలో స్నానించి, ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడతానని ప్రతిన పూనారు. కానీ, ఆయన తెల్ల జాతీయుడు. ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది స్టేట్స్‌మన్’ సహాయ సంపాదకుడు. పేరు బెంజిమన్ గై హార్నిమన్. అనిబీసెంట్‌తో పోల్చుకుంటే, భారత స్వాతంత్య్రోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్రకు చరిత్రలో పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఆ మాటకొస్తే చాలామంది భారతీయుల త్యాగం కూడా చరిత్ర పుటలలో కానరాదు. కానీ భారతీయ ఆంగ్ల జర్నలిజం మీద ఆయన వేసిన ముద్ర మాత్రం విశేషమైనది. పోతాన్ జోసెఫ్, సయీద్ హుసేన్, ఆర్‌కే కరంజియా వంటివారు ఆయనతో కలసి పనిచేశారు. బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్‌షా మెహతా, మోతీలాల్, ఎంఏ జిన్నా, అనిబీసెంట్, సరోజినీ నాయుడు వంటి వారితో ఆయన భుజం భుజం కలిపి భారత స్వాతంత్య్రోద్యమంలో నడిచారు. నాటికీ నేటికీ కూడా ప్రపంచం నివ్వెరపోయే ఘటన– జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ. అది జరిగిన ఐదారు వారాలకు గాని పంజాబ్ నుంచి మిగిలిన భారతదేశానికి వార్త చేరలేదు. నాడు అంత దారుణంగా పత్రికల నోరు నొక్కింది బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితులలో హార్నిమన్ ఆ ఘోరాన్ని ఇంగ్లండ్‌లోని లేబర్‌పార్టీ పెద్దలకు రహస్యంగా చేరవేసి సంచలనం సృష్టించారు. అందుకు హార్నిమన్(1873–1948) ఇక్కడ చెల్లించిన మూల్యం చిన్నదేమీ కాదు. అందుకే ఆయనను నాటి మహోన్నత స్వాతంత్య్రోద్యమ రథసారథులు మనసారా ‘భారత జాతి మిత్రుడు’ అని పిలుచుకున్నారు.
హార్నిమన్ ఇంగ్లండ్‌లోని ఒక ఉన్నత కుటుంబంలో పుట్టారు. ససెక్స్‌లోని డవ్‌కోర్ట్ ఆయన జన్మస్థలం. తండ్రి విలియం. తల్లి సారా. విలియం బ్రిటిష్ నౌకా దళంలో పెద్ద ఉద్యోగి. పోర్ట్స్‌మౌత్‌లోను, మిలటరీ అకాడమీలోను హార్నిమన్ చదువుకున్నారు. హార్నిమన్ మరొక వృత్తేదీ స్వీకరించినట్టు కనిపించదు. 1894లోనే ఆయన పోర్ట్స్‌మౌత్ నుంచి వెలువడిన ఈవెనింగ్ మెయిల్ పత్రికలో మొదట పనిచేశారు. తరువాత డెయిలీ క్రానికల్, మాంచెస్టర్ గార్డియన్ వంటి విఖ్యాత పత్రికలలో కూడా ఆయన పనిచేశారు. ఆ రోజులలో చాలామంది ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వచ్చి ఉద్యోగాలు చేసేవారు. ఆ విధంగానే హార్నిమన్ కలకత్తా నుంచి వెలువడే ‘ది స్టేట్స్‌మన్’ పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరి, తరువాత సహాయ సంపాదకుడయ్యారు. ఇదంతా 1905కు కొద్దిగా ముందు జరిగింది.
ఫిరోజ్‌షా మెహతా బొంబాయి హైకోర్టులో పెద్ద న్యాయవాది. వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. తొలితరం మితవాద కాంగ్రెస్ నాయకులలో అగ్రగణ్యుడు. 1913లో ఆయన స్థాపించినదే ‘బాంబే క్రానికల్’. ఆనాడు ఎంతో ప్రభావం చూపుతున్న ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు దీటుగా ఉండే విధంగా ఒక పత్రికను స్థాపించాలని ఫిరోజ్‌షా గట్టిగా భావించారు. దాని ఫలితమే ‘బాంబే క్రానికల్’ స్థాపన. స్టేట్స్‌మన్ వంటి పెద్ద పత్రిక నుంచి బాంబే క్రానికల్‌కు హార్నిమన్ మారడం వెనుక పెద్ద కథే ఉంది. హార్నిమన్‌ను సంపాదకునిగా నియమించమని గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ కలసి ఫిరోజ్‌షాకు సిఫారసు చేశారు. బెనర్జీ అయితే, ‘నాలాగే మంచి భారతీయుడు’ అని కితాబు కూడా ఇచ్చారు. ఫలితం– బాంబే క్రానికల్ వంటి చరిత్రాత్మక పత్రికకు హార్నిమన్ తొలి సంపాదకుడయ్యారు. ఫిరోజ్‌షా మెహతాతో పాటు ఆ ఇద్దరు కాంగ్రెస్ ప్రముఖులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని హార్నిమన్ వమ్ము చేయలేదు. పత్రికకు ఎంతో పేరు వచ్చింది. దానికి నిదర్శనం– హార్నిమన్ మీద నీచమైన ఆరోపణలు చేసే స్థితికి పోటీ పత్రికలు దిగిపోయాయి. వర్లీ అనేచోట హార్నిమన్ ఒంటరిగా ఉండేవారు. కేరళ నుంచి వచ్చిన ఒక ముస్లిం, తమిళనాడు నుంచి ఒక హిందూ యువకుడు కూడా ఆయన అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. బీచ్‌లో వాకింగ్‌కు వెళ్లినప్పుడు తారసపడినవారే వీరు. నిజానికి ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన పేద కుటుంబాల పిల్లలు. కానీ దయతో ఇద్దరికి హార్నిమన్ తన అపార్ట్‌మెంట్‌లో నీడనిచ్చారు. వీరితో హార్నిమన్ స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడని వదంతులు లేవదీశారు. దీని మీదే హార్నిమన్ పరువునష్టం కేసు వేస్తే, జిన్నా వాదించారు. జిన్నా, ఫిరోజ్‌షా మెహతా, హార్నిమన్ ప్రతి క్రిస్మస్ సెలవులకి పూనాలో కలసి ఉండేవారు. అక్కడ ఫిరోజ్‌షా మెహతాకు సొంత భవనం ఉండేది. హార్నిమన్‌కూ, భారత స్వాతంత్య్రోద్యమ నేతలకు అంత సన్నిహిత సంబంధాలు ఉండేవి.
హార్నిమన్ హోమ్‌రూల్ లీగ్ ఉపాధ్యక్షుడు. అనిబీసెంట్ అధ్యక్షురాలు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఆయన తన బాంబే క్రానికల్ ద్వారా, బహిరంగ సభల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేశాడు. ఈ చట్టం ఎంత కఠినమైనదో చెప్పడానికి మాటలు చాలవు. ఇలాంటి చట్టాన్ని వ్యతిరేకించినందుకు తమ జాతికి చెందిన వాడైనప్పటికీ హార్నిమన్ వైఖరి ప్రభుత్వానికి మింగుడుపడ లేదు. శ్వేతజాతి అధికారాన్ని ప్రశ్నించినవారు, వ్యతిరేకించినవారు బ్రిటిష్ జాతీయులైనా సరే, ఈస్టిండియా కంపెనీ గానీ, బ్రిటిష్ రాణి పాలన గానీ ఏనాడూ క్షమించలేదు. భారతదేశంలో తొలి పత్రికను (బెంగాల్ గెజెట్) స్థాపించిన జేమ్స్ అగస్టస్ హికీ కంపెనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. ఈయనను హఠాత్తుగా ఇంగ్లండ్ పంపించే శారు. అక్కడ ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
సరిగ్గా అదే రీతిలో హార్నిమన్‌ను బాంబే ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఇంగ్లండ్‌కు పార్సెల్ చేసింది. ఏప్రిల్ 13, 1919న అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమైన (వైశాఖి ఉత్సవం కోసం) నిరాయుధులైన జనం మీద జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. 1650 రౌండ్లు కాల్చారు. 379 మంది మరణించినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఈ వార్త బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టింది. హార్నిమన్‌ను ఈ ఉదంతం బాగా కదిలించింది. ఈ దురంతానికి సంబంధించిన ఫొటోలు, కథనం అత్యంత రహస్యంగా ఇంగ్లండ్ పంపించాడు. అక్కడ లేబర్ పార్టీకి అనుకూలమైన డెయిలీ హెరాల్డ్ పత్రికలో అచ్చయ్యేటట్టు చేశాడు.
బహుశా ఇది జరిగిన కొద్దిరోజులకే అతడిని పక్కా ప్రణాళికతో బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ జార్జి లాయిడ్ అరెస్ట్ చేయించాడు. అప్పుడే హార్నిమన్ ఒక శస్త్ర చికిత్స చేయించుకుని వర్లీలోని తన అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతిలో ఉన్నాడు. ఒక అర్ధరాత్రి ఆ అపార్ట్‌మెంట్ మీద దాడి జరిగింది. బాంబే నగర యాక్టింగ్ పోలీస్ కమిషనర్ (సీఐడీ ఇన్‌స్పెక్టర్) నాయకత్వంలో ఒక పోలీసు బృందం లోపలికి ప్రవేశించింది. వారి వెంట ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. ఆ వైద్యులు హార్నిమన్‌ను పరీక్షించి తరలించవచ్చునని నిర్ధారించారు. కొద్ది నిమిషాలు సమయం ఇచ్చి, వెంటనే బట్టలు మార్చుకుని రమ్మన్నారు పోలీసులు. అలాగే కావలసిన వస్తువులు సర్దుకోవడానికి కొన్ని నిమిషాలు సమయం ఇచ్చారు. కిందకి తీసుకువెళ్లి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు. అక్కడ నుంచి నేరుగా నౌకాశ్రయానికి తీసుకువెళ్లి లండన్ వెళుతున్న తకాడా అనే నౌక ఎక్కించారు. ఈ దారంతా కూడా నిఘా ఏర్పాటయింది. బాంబే నగరంలో ఆనాడు హార్నిమన్‌కు అంత పలుకుబడి ఉండేది. పైగా ఫిరోజ్‌షా మెహతా మరణించిన తరువాత ‘బాంబే క్రానికల్’ నిర్వహణ బాధ్యత జిన్నా స్వీకరించారు. అది కూడా ప్రభుత్వం భయపడడానికి ఒక కారణం. హార్నిమన్ ఎక్కిన ఓడ బయలు దేరిన సంగతి తెలిసిన తరువాతే గవర్నర్ జార్జి లాయిడ్ ఊపిరి పీల్చుకున్నాడట. మళ్లీ 1929లో ఆయన భారత దేశానికి వచ్చి తిరిగి సేవలు ఆరంభించాడు. తరువాతి కాలంలో ప్రఖ్యాత పత్రికా రచయిత ఆర్‌కె కరంజియా, హార్నిమన్, దినకర్ నాద్‌కర్ణిలతో కలసి బ్లిట్జ్ పత్రికను ప్రారంభించారు.
జలియన్‌వాలా దురంతం మీద హార్నిమన్ ఒక పుస్తకమే రాశారు. దాని పేరు ‘బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది అమృత్‌సర్ మేసకర్’. ఈ పుస్తకాన్ని 1984లో భారతదేశంలో పునర్ ముద్రించారు కూడా. ఎలాంటి దేశం మీద, ఎలాంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్న ప్రజల మీద తెల్ల జాతీయులు దాష్టీకం చేస్తున్నారో, జలియన్‌వాలా బాగ్ కాల్పుల వంటి రాక్షసకృత్యానికి పాల్పడ్డారో ఆయన అందులో ఎంతో అద్భుతంగా వర్ణించారు. పత్రికా రచయితగా, వక్తగా, రాజకీయ కార్యకర్తగా, హక్కుల స్పృహ ఉన్న వ్యక్తిగా హార్నిమన్ తన విశిష్టతను, తన కలం ప్రతిభను ఇందులో దర్శింపచేశారు. ఇలాంటి దారుణం, అంటే జలియన్ వాలా బాగ్ దురంతం వంటిది– మరొకటి ప్రపంచంలో లేదని ఆయన రాశారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్, బెల్జియం దేశాల మీద జర్మనీ సాగించిన అకృత్యాల స్థాయిలోనే జనరల్ డయ్యర్ నాయకత్వంలోని బలగాలు ‘బాగ్’లో రక్తపాతం సృష్టించాయని నిర్మొహమాటంగా చెప్పారు.
బ్రిటిష్ ప్రభుత్వం తన అధీనంలో ఉన్న వలస దేశాలన్నింటిని మొదటి ప్రపంచ యుద్ధంలోకి దించింది. కానీ ఆ యుద్ధం తరువాత ఆర్థికంగా భారత్ పతనమైన స్థాయిలో మరో దేశమేదీ పతనం కాలేదని కూడా హార్నిమన్ చెప్పారు. భారతీయులు నిరంతరం దారిద్య్రంతో బాధపడుతూ ఉంటారనీ, ఈ స్థాయి దారిద్య్రం మరో చోట ఉండదనీ ఆయన వాపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి అత్యంత ఎక్కువ లాభాలు గడించేది. దోపిడీ సాగించేది. అయినా రాణి ప్రభుత్వం భారతదేశ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఎంత దారుణంగా ఉండేవో, భారతీయుల సంక్షేమానికి ఎంత తక్కువ ఖర్చు చేస్తున్నదో కూడా వివరించాడు. 1927లో ఒక గుమాస్తాకు కలకత్తా, బొంబాయి వంటి నగరాలలో నెలకు ఇస్తున్న జీతం 10 పౌండ్లు. ఒక మిల్లు కార్మికుడికి దక్కుతున్న వేతనం మూడు పౌండ్లు. గని కార్మికులకు ఇంకా తక్కువ. భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకోవడమే కాదు, పౌరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్న సంగతిని కూడా వెల్లడించాడు. రాజనీతి గురించి ప్రపంచానికి నీతులు చెప్పే ఇంగ్లండ్ భారతదేశంలో పత్రికల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో కూడా బహిర్గతం చేశాడు. 1947లో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం అధీనం నుంచి విముక్తమైన గొప్ప దృశ్యాన్ని హార్నిమన్ వీక్షించారు. ఆ మరుసటి సంవత్సరం కన్నుమూశారు.
డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment