ఆయన్ని కలిశాకే కథ మొదలైంది! | karunakaran first mocvie tholiprema | Sakshi
Sakshi News home page

ఆయన్ని కలిశాకే కథ మొదలైంది!

Published Sun, Dec 29 2013 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

ఆయన్ని కలిశాకే కథ మొదలైంది!

ఆయన్ని కలిశాకే కథ మొదలైంది!

 తొలియత్నం
 
ప్రేమ...
 యవ్వనపు వీధుల్లో భావోద్వేగాలు నేర్చుకునే తొలి భాష.
 హృదయపు గోడలపై ఊహలు రాసుకునే తొలి కవిత.
 తొలిప్రేమ... ఒక జీవితకాలపు అనుభవం.
 ఒక జీవితానికంతా గుర్తుండిపోయే జ్ఞాపకం.
 కనే ప్రతి కలనూ, కదిలే ప్రతి కదలికనూ అందంగా జన్యుపటంలో నిక్షిప్తం చేసే వర్ణ రసాయనం.
 మనసుకు కాలమిచ్చే ఈ కానుకను ఒక కథలా మలిచి వెండితెరపై
 దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన కవి... కరుణాకరన్.
 విశ్వజనీనమైన ఈ ‘తొలిప్రేమ’ చుట్టూతా అల్లుకున్న ఆయన అనుభవాలే ఈవారం ‘తొలియత్నం’
 
 
 క్లుప్తంగా కథేంటి... అడిగారు పవన్.
 కథ అడిగితే నేను కవిత చెప్పా.
 ‘నేను  ప్రేమించిన అమ్మాయి నా పక్కనే ఉంది
 కానీ బాధగా ఉంది.
 ఎందుకంటే ప్రేమ లేదు.
 ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్లిపోయింది.
 కానీ బాధ లేదు.
 ఎందుకంటే ప్రేమ ఉంది.’
 ఒక్క క్షణం తనేం మాట్లాడలేదు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తేరుకుని ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్, మనం సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నాం అన్నారు. ఆ క్షణం నాకు మాటలు రాలేదు. అక్కడి నుంచి సరాసరి ట్యాంక్‌బండ్‌కు వెళ్లిపోయాను. ఒక బెంచ్ మీద కూర్చుని మనసులో గడ్డకట్టిన బాధ కరిగిపోయేవరకు కసిదీరా ఏడ్చాను. నా కళ్లలో నిండిన నీళ్లతో ఎదురుగా హుస్సేన్ సాగర్ ప్రవాహం మసకబారింది.
 తమిళనాడులోని రామేశ్వరం దగ్గర దేవకొట్టైలో నా ప్రయాణం మొదలైంది. చదువు లేకపోతే ఏమీ లేదని అమ్మ ఎప్పుడూ చెప్పేది. పాలిటెక్నిక్ తరువాత సినిమా మీద ఇష్టంతో చెన్నైకి వచ్చేశాను. అప్పటికి సినిమాకు సంబంధించి నాకే పరిచయాలూ లేవు. ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి. ఈ ఆలోచనలతోనే మూడేళ్లు గడిచిపోయాయి. తరువాత ఎన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసినా, అవి ఏదో ఒక రకంగా మధ్యలోనే ఆగిపోయేవి. నేను పనిచేసిన ఏ సినిమా పూర్తి కాలేదు. దాంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యాను.
 మద్రాసులో ఉన్నంత కాలం రోజూ పొద్దున్నే కొడంబాకం బ్రిడ్జి మీదకు నడుచుకుంటూ వెళ్లేవాణ్ని. సరిగ్గా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు 3335 కార్‌లో ఇళయరాజాగారు, ఏడు గంటలకు హోండా కార్ నం.1లో చిరంజీవిగారు వెళ్లేవాళ్లు. వాళ్ల కార్లు వెళ్లేదాకా అలా చూస్తూ, అప్పుడు నా రోజును మొదలుపెట్టేవాణ్ని. మద్రాస్ జీవిత పోరాటంలో నేను అలిసిపోకుండా నిరంతరం స్ఫూర్తి నింపినవాళ్లు ఆ ఇద్దరూ. జీవితం అలా సాగుతున్నప్పుడు ఒకరోజు మా నాన్నగారు పిలిచారు. అమ్మ నీ గురించి చాలా బెంగపడుతోంది. మా మున్సిపల్ ఆఫీస్‌లో నీకో ఉద్యోగం పెట్టిస్తాను అన్నారు. సినిమా తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాను. అప్పుడు మా నాన్న, చూడు కరుణా! ఇప్పటికీ నీ జీవితంలో ఐదేళ్లు ఎలాంటి ఉపయోగం లేకుండా, అవెలా గడిచాయో తెలీకుండా పోయాయి. నిజంగా సినిమా నీ జీవిత గమనమైతే, ఇప్పటినుంచీ ప్రతిరోజూ ఎలా గడిచిందో రాసుకో. అప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది అన్నారు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపించాయి.
 
 కదిర్‌గారు ‘ప్రేమదేశం’ తీస్తున్నారని తెలిసి నేను మీ దగ్గర పనిచేస్తానని అడిగాను. ఎన్నోసార్లు తిరిగితే చివరకు ఆయన దగ్గర క్లాప్‌బాయ్‌గా అవకాశం దొరికింది. ఆయనకు నా పని, క్రమశిక్షణ నచ్చి అదే సినిమాకు నన్ను కో-డెరైక్టర్‌ని చేశారు. అది నాపై నాకు ఆత్మవిశ్వాసం కలిగించిన క్షణం. ‘ప్రేమదేశం’ సంచలన విజయం తరువాత కూడా నా దగ్గర ఎలాంటి కథ లేదు. ఒకరోజు దీపావళి పండుగకు బస్సు దిగి మా ఊళ్లోకి నడుస్తున్నప్పుడు ఆ చీకట్లో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. చీకట్లో మతాబులు కాలుతున్నప్పుడు ఆ వెలుగు రవ్వల మధ్య ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ క్షణం ఒక అద్భుతమైన కవితలా నా మనసులో గాఢంగా ముద్రించుకుంది. దాని చుట్టూతా నా జీవితంలో, నా స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను తీసుకుని కథ అల్లుకున్నాను. మొదటినుంచీ నా మిత్రుల ప్రేమకు సంబంధించి నేను ఇన్‌వాల్వ్ అయ్యేవాణ్ని. అవన్నీ గుర్తు చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను.
 
 కథ పూర్తయిన తరువాత మద్రాస్‌లో వందమంది నిర్మాతలకు పైగా కథ వినిపించాను. రెండున్నర గంటలపాటు ప్రతి సీన్ వివరంగా చెప్పేవాణ్ని. అందరూ చేద్దాం, చూద్దాం అన్నారే తప్ప అడుగు ముందుకు పడలేదు. ఒకరోజు పాండీ బజార్‌లో సినిమా మ్యాగజైన్‌లో పవన్ కల్యాణ్ ఫొటో చూశాను. చూడగానే నా కథకు అతనే కరెక్ట్ అనిపించింది. అతనెవరని ఆరా తీస్తే, చిరంజీవిగారి తమ్ముడని తెలిసింది. మద్రాస్‌లో ఉన్న వాళ్ల బంధువు ద్వారా ప్రయత్నిస్తే చాలా రోజులకు ఆయన అపాయింట్‌మెంట్ దొరికింది. ఆ క్షణంతో నా పదేళ్ల పోరాటానికి ఒక ముగింపు దొరికింది.
 
 సినిమా ముందురోజు ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి, ‘‘కరుణాకర్! సినిమాకు చాలా ఖర్చు పెడుతున్నాం. మొదటిరోజు నువ్వు సరిగ్గా తీయకపోతే వేరే డెరైక్టర్‌ను పెట్టుకుంటా’’నన్నారు. దాంతో నేను  కంగారు పడిపోయాను. కో-డెరైక్టర్ రంగరాజ్‌గారు మాత్రం ‘‘కరుణాకర్ టెన్షన్ పడకు. తాజ్‌మహల్ ఒక్కరోజు కట్టలేదు. మొత్తం సినిమా కూడా ఒకే రోజులో తీయలేం. మొత్తం స్క్రిప్ట్ మనసులో పెట్టుకోకుండా ఈ రోజేం తీయాలో అదే ఆలోచించు’’ అన్నారు. మొదటి సీన్ పవన్ కల్యాణ్ మంచంలో పడుకున్నప్పుడు, ముఖం మీద నుంచి తల్లి దుప్పటిలాగే షాట్ తీశాను. ఆ షాట్‌నే మొదటి సీన్‌గా తీయాలని పట్టుబట్టి తీశాను. ఎందుకంటే శివాజీ గణేశన్ మొదటి సినిమా మొదటి షాట్ కూడా ఇలాగే తీశారనే సెంటిమెంట్‌తో నేనూ అలాగే చేశాను.
 
 సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేశాయి. సినిమా మొత్తంలో చివరి వరకు ఒకరిని ఒకరు ఎక్కడా ముట్టుకోకుండా, ప్రేమను వ్యక్తీకరించుకోకుండా చాలా హృద్యంగా కథ నడుస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు పవన్ దగ్గరికెళ్లి, హీరోయిన్ మీ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని ఎమోషనల్‌గా ఏడుస్తుందని చెప్పాను. కీర్తిరెడ్డి దగ్గరకు వెళ్లి మీరు ఏడుస్తూ పవన్ దగ్గరకు వెళ్లి నుదుటి మీద ముద్దు పెట్టుకోండని చెప్పాను. ఈ విషయం పవన్‌కు తెలిస్తే, అతను కొంచెం ఇబ్బందిపడతాడు, కాబట్టి చెప్పకుండా చేస్తున్నామని చెప్పాను. ఆ సీన్‌లో కీర్తిరెడ్డి సడన్‌గా తన నుదుటిమీద ముద్దుపెట్టుకోవడంతో పవన్‌కు ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆశ్చర్యంలో ఉండిపోయారు. తరువాత విషయం అర్థమయ్యాక, ఎంత గొప్పగా తీశావ్ కరుణా అని మెచ్చుకున్నారు. ఒకసారి ‘ఏమి సోదరా’ పాట పూర్తయ్యాక, మాంటేజ్ షాట్స్ చూడటానికి పవన్ కల్యాణ్‌ను పిలిచాను. చూసి ఆయన నన్ను గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి డిన్నర్‌కు తీసుకెళ్లారు. ఈ కథకు ఉత్ప్రేరకంగా నిలిచిన దీపావళి సీన్‌ను ఛోటా కె.నాయుడు చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాకు పనిచేసిన మహిదర్‌గారు బిజీగా ఉండటంతో ఈ సీన్‌ను ఛోటా కె.నాయుడుగారు చిత్రించారు.
 
 కొడెకైనాల్‌లో కార్ యాక్సిడెంట్ సీన్ తీస్తున్నప్పుడు రోప్ తెగిపోయి లోపల ఉన్న హీరో హీరోయిన్ల డూప్‌లు చిన్న లోయలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు పవన్ వెంటనే కిందకు దూకి లోపల ఉన్న వాళ్లను రక్షించారు. అలా ఏ విషయంలోనైనా ఆయన ముందుండి నన్ను నడిపించారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, కారణం కేవలం పవన్ కల్యాణ్.
 
 ‘నా మనసే’ పాట తీస్తున్నప్పుడు ఒకరోజు మాకు మ్యూజిక్ అందుబాటులో లేదు. నేను నోటితో రిథమ్స్ పాడుతుంటే, పవన్
 అప్పటికప్పుడు భరతనాట్యం స్టెప్స్ వేశారు.
 
  కె.క్రాంతికుమార్‌రెడ్డి
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement