ఇంతే తిన్నా... అంత లావా? | May 25th World Thyroid Day | Sakshi
Sakshi News home page

ఇంతే తిన్నా... అంత లావా?

Published Sat, May 19 2018 11:50 PM | Last Updated on Sun, May 20 2018 4:21 AM

May 25th World Thyroid Day - Sakshi

రోజూ తినే రొటీన్‌ తిండే తప్ప మరేమీ తినకపోయినా లావెక్కిపోతున్నారా..? రాత్రి బాగానే నిద్రపోయినా, పొద్దున్న కునికిపాట్లు తప్పడం లేదా..? చిన్నపాటి పనిచేసినా బాగా అలసిపోతున్నారా..? చిన్న చిన్న విషయాలకే చిరాకుపడిపోతున్నారా..? పని మీద దృష్టి సారించలేకపోతున్నారా..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే ఈ లక్షణాలు థైరాయిడ్‌ సమస్య కావచ్చు. థైరాయిడ్‌ సమస్యలేవైనా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో్ల తేలినా చాలా వరకు బెంబేలెత్తాల్సినంత పరిస్థితి ఏమీ ఉండదు. వైద్యుల సలహా మేరకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడుతూ, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు, హాయిగా సాధారణ జీవితం గడపవచ్చు.


ఇంతా చేసి ఇరవై గ్రాముల బరువు ఉండే చిన్న గ్రంథి. మెడ వద్ద వాయునాళం చుట్టూ ఆవరించుకుని సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అది స్రవించే హార్మోన్‌ కనీసం ఒక బిందువంత కూడా ఉండదు. దాని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా శరీరంలోని జీవక్రియల్లో పెనుమార్పులే సంభవిస్తాయి. పరిమాణానికి చిన్నదే అయినా, మనిషి ఆరోగ్యంలో కీలకమైన పాత్ర పోషించే ఆ గ్రంథి పేరు థైరాయిడ్‌. అది రోజు మొత్తంలో స్రవించే హార్మోన్ల పరిమాణం గ్రాములో దాదాపు 28 లక్షల వంతు మాత్రమే. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగిస్తే తలెత్తే సమస్యను హైపోథైరాయిడిజమ్‌ అంటారు.

థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేస్తే తలెత్తే సమస్యను హైపర్‌ థైరాయిడిజమ్‌ అంటారు. థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. వీరిలో దాదాపు 96 శాతం మంది హైపోథైరాయిడిజమ్‌ బాధితులే. ఇదివరకటి కాలంతో పోలిస్తే, ఇటీవలి కాలంలో థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. థైరాయిడ్‌ సమస్యలు ఇటీవలి కాలంలో మహమ్మారిలా విస్తరిస్తున్నాయని అంతర్జాతీయ వైద్య, ఆరోగ్య పరిశోధన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భారత్‌లోనైతే దాదాపు 32 శాతం జనాభా థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతున్నారు. మన దేశంలో దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ మంది థైరాయిడ్‌ బాధితులు ఉన్నారు. పురుషులతో పోలిస్తే ఎక్కువగా మహిళలే థైరాయిడ్‌ సమస్యల బారిన పడుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. థైరాయిడ్‌ బాధితుల్లో మహిళల సంఖ్య 60 శాతానికి పైగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

ఇవీ లక్షణాలు..
థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారిలో అత్యధికులు థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగించడం వల్ల ‘హైపోథైరాయిడిజమ్‌’తో సతమతమయ్యే వారే ఎక్కువ. హైపోథైరాయిడిజమ్‌ సోకినట్లు వెనువెంటనే గుర్తించడం కష్టమే. దిగువ వివరించిన కొన్ని లక్షణాలు వారాల తరబడి కనిపిస్తున్నట్లయితే, వైద్య పరీక్షలు జరిపించుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు మందులు వాడటం, ఆహారపు అలవాట్లలో మార్పులు పాటించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

రాత్రిపూట ఎనిమిది నుంచి పది గంటల సేపు పూర్తిగా నిద్రపోయినా, పగటి వేళలో కునికి పాట్లు రావడం లేదా మధ్యాహ్నం పూట తప్పనిసరిగా కునుకుతీయనిదే ఉండలేకపోవడం.
ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పు లేకపోయినా, అకస్మాత్తుగా బరువు పెరగడం, ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోవడం. త్వరగా అలసిపోవడం.
 భావోద్వేగాలు అదుపులో లేకపోవడం, త్వరగా చిరాకుపడటం, ఆందోళన, కంగారు, మానసిక కుంగుబాటు వంటి లక్షణాలతో సతమతం కావడం.
 హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం, లైంగిక ఆసక్తి సన్నగిల్లడం, మహిళల్లోనైతే రుతుక్రమం అస్తవ్యస్తం కావడం, ఒక్కోసారి వంధ్యత్వం కలగడం.
 కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అరచేతులు తిమ్మిరెక్కడం, పట్టులో బలం తగ్గడం.
  అరచేతులు, అరిపాదాలు చల్లబడటం.
 చర్మం పొడిబారడం, గోళ్లు చిట్లడం, జుట్టు రాలిపోవడం.
 జ్ఞాపకశక్తి క్షీణించడం, పని మీద ఏకాగ్రత కుదరకపోవడం.
 మలబద్ధకం.
  మెడ వద్ద వాపు ఏర్పడినట్లు కనిపించడం లేదా ‘డబుల్‌చిన్‌’ ఏర్పడటం, గొంతు బొంగురుగా మారడం.

ఇవీ కారణాలు
హైపోథైరాయిడిజమ్‌ లేదా హైపర్‌థైరాయిడిజమ్‌ సమస్యలే కాకుండా, ఒక్కోసారి థైరాయిడ్‌ గ్రంథిలో చిన్న చిన్న కణితులు ఏర్పడుతుంటాయి. అరుదుగా ఇలాంటి కణితులు థైరాయిడ్‌ కేన్సర్‌కు దారితీస్తాయి. థైరాయిడ్‌ గ్రంథిలో వాపు ఏర్పడటం వల్ల ‘థైరాయిడైటిస్‌’, థైరాయిడ్‌ గ్రంథి మెడవద్ద ఉబ్బిపోయినట్లుగా కనిపించే ‘గాయిటర్‌’ వంటి సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

 ♦ ఒక్కోసారి రోగ నిరోధక వ్యవస్థ తిరగబడటం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్‌ సమస్య తలెత్తుతుంది. వ్యాధులతో తలపడే యాంటీబాడీస్‌ సాధారణంగా వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులపై దాడి చేస్తాయి. అలా కాకుండా, శరీరంలోని జీవకణాలపైనే ఇవి దాడిచేయడం ప్రారంభించడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ తలెత్తుతూ ఉంటుంది. ఇలా తలెత్తే సమస్యను ‘ఆటో ఇమ్యూన్‌ హైపోథైరాడిజమ్‌’గా పరిగణిస్తారు.
కొన్ని రకాల మందులను వాడటం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తే అవకాశాలు ఉంటాయి. గుండెకు సంబంధించిన కొన్ని రకాల మందులు, హెపటైటిస్‌–బి, హెపటైటిస్‌–సి, కేన్సర్, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి వ్యాధుల చికిత్సలో భాగంగా వాడే మందుల వల్ల థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగిస్తుంది.
థైరాయిడ్‌ గ్రంథిలో చోటు చేసుకునే అసహజమైన పెరుగుదల, థైరాయిడ్‌ గ్రంథిని నియంత్రించే పిట్యూటరీ గ్రంథిలో కణితులు ఏర్పడటం వంటి సమస్యలు కూడా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తవచ్చు.
♦  అయొడిన్‌ లోపం వల్ల, జన్యు లోపాల వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల కూడా థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగించి, హైపోథైరాయిడిజమ్‌ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆహారంలో అయోడిన్‌ లోపిస్తే, టి–3, టి–4 హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి, థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగిస్తుంది.
థైరాయిడ్‌ గ్రంథిలో కేన్సర్‌ ఏర్పడినప్పుడు శస్త్రచికిత్స ద్వారా గ్రంథిని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితిలో కూడా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తుతుంది.
హైపోథైరాయిడిజమ్‌ ఉన్నట్లు తేలితే వైద్యుల సలహాపై జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులతో పాటు జీవనశైలిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.

ఇలా అదుపు చేయవచ్చు
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా హైపోథైరాయిడిజమ్‌ వల్ల తలెత్తే ఇబ్బందులను చాలా వరకు అదుపు చేయవచ్చు. థైరాయిడ్‌ పనితీరు మందగించినప్పుడు మీ జీవనశైలిలో మీరు చేపట్టాల్సిన మార్పులు...
థైరాయిడ్‌ సమస్యలు ఎదుర్కొనే వారికి నిద్రలో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారు రాత్రి నిద్రపోయినా, పగలు మగతగానే ఉంటారు. నాణ్యమైన నిద్ర పట్టకపోవడమే దీనికి కారణం. అందుకే నిద్రపోయే ముందు రిలాక్స్‌ కావడానికి ప్రయత్నించాలి. పడక గదిలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. శబ్దాలతో నిద్రకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి.
♦  హైపోథైరాయిడిజమ్‌ బాధితులకు భావోద్వేగాల్లో మార్పులు వస్తుంటాయి. ధ్యానం చేయడం, తేలికపాటి వ్యాయామం చేయడం, ఆహ్లాదభరితమైన సంగీతం వినడం వంటి చర్యల ద్వారా ఒత్తిడిని, మానసిక ఆందోళనను, కుంగుబాటును అధిగమించవచ్చు.
హైపో థైరాయిడిజమ్‌ బాధితులకు రోజంతా మందకొడిగా అనిపించడం సహజం. అలాగని స్తబ్దుగా ఉండిపోతే ఫలితం ఉండదు. శరీరానికి పని చెప్పాల్సిందే. నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం వంటి వాటితో పాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది.
హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారు ప్రత్యేకంగా పథ్యాలేవీ పాటించకపోయినా సమతుల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా ఉండేలా చూసుకోవడం మంచిది. హానికలిగించే చెడు కొవ్వులకు, చక్కెరకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమం.
 ఒకవేళ క్రీడాకారులకు హైపోథైరాయిడిజమ్‌ పరిస్థితి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వారు పూర్తిగా క్రీడలకు దూరం కావాల్సిన అవసరమేమీ ఉండదు గాని, అతిగా ప్రాక్టీస్‌ చేయడం, మితిమీరిన వ్యాయామం వంటివి తగ్గించుకోవాలి. తేలికపాటి వ్యాయామాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు.


హైపర్‌ థైరాయిడిజమ్‌
లక్షణాలు
♦  ఆకలి అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గిపోవడం.
 బాగానే తింటున్నా బరువు తగ్గిపోవడం.
నిద్రపోవడానికి తంటాలు పడాల్సి రావడం. తగినంత నిద్ర పట్టకపోవడం
 త్వరగా అలసట కలగడం.
ఒక్కోసారి తరచుగా మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం.
 గుండెదడ కలగడం, వేడిని తట్టుకోలేకపోవడం.
 ఎక్కువగా చెమటలు పట్టడం.
మహిళల్లోనైతే తగినంత రుతుస్రావం కనిపించకపోవడం.
♦  మానసిక ఆందోళన, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం.
 కండరాలు బలహీనపడటం.
సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణించడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
 అకస్మాత్తుగా కాళ్లు చేతులు చచ్చుబడటం.
వణుకు రావడం. దురదలు, దద్దుర్లతో బాధపడటం
 కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపించడం.
మందకొడిగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి.


అదుపు చేయడం ఇలా...
ఒకవేళ హైపర్‌థైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లయితే, ఆహారంలో మరిన్ని కేలరీలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బాగా ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, విటమిన్‌–డి ఉండే పాలు, గుడ్లు, మాంసం వంటి పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకుంటూ ఉండాలి.
కండరాలు త్వరగా క్షీణించిపోకుండా ఉండటానికి, వాటికి తగినంత సత్తువ ఇవ్వడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. హైపర్‌థైరాయిడిజమ్‌తో బాధపడేవారికి ముఖ్యంగా బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి.
♦  కనుగుడ్లు ముందుకు పొడుచుకు వస్తున్న పరిస్థితి ఎదురైతే, కళ్లలో వాపు తగ్గడానికి, తేమ ఆరిపోకుండా ఉండటానికి వైద్యుల సలహాతో ఐడ్రాప్స్‌ వాడటంతో పాటు, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గాగుల్స్‌ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
♦  పడుకునేటప్పుడు తల కాస్త ఎత్తుగా ఉండేలా దిండ్లు వాడటం మంచిది. దీని వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతో పాటు ఒంటిపై వాపులు ఏర్పడకుండా ఉంటాయి.
ఒత్తిడికి దూరంగా ఉండటం, సానుకూల దృక్పథం పెంపొందించుకోవడం కూడా ముఖ్యం. ధ్యానం, సంగీతాన్ని ఆలకించడం వంటి పనుల ద్వారా భావోద్వేగాల్లో అలజడి చాలావరకు సద్దుమణుగుతుంది.


నిర్ధారణ పరీక్షలు
టీ3, టీ4, టీఎస్‌హెచ్, ఎఫ్‌టీ3, ఎఫ్‌టీ4 అనే పరీక్షలు హార్మోన్‌ స్రావంలోని తేడాలను పరీక్షించి వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఈ పరీక్షలతో అది హైపర్‌ థైరాయిడిజమా, ప్రాథమిక హైపోథైరాయిడిజమా, లేక ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి హైపోథైరాయిడిజమా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఆటో యాంటీబాడీ పరీక్షలతో అది ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అవునో కాదో తెలుస్తుంది. కణితుల నిర్ధారణకు... ఎఫ్‌ఎన్‌ఏసీ (ఫైన్‌ నీడిల్‌ యాస్పిరేషన్‌ సైటాలజీ), బయాప్సీ వంటి పరీక్షల సహాయంతో కణితులు హానికరమైనవా, కాదా అన్నది తెలుసుకుంటారు. ఇతర హార్మోన్‌ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇతర పరీక్షలు


గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్‌ హార్మోన్‌ ప్రాధాన్యం
గర్భవతిగా ఉన్న సమయంలో తల్లిలోని థైరాయిడ్‌ హార్మోన్‌ బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థల పెరుగుదలకు దోహదపడుతుంది. తల్లికి థైరాయిడ్‌ లోపం ఉండి, చికిత్స చేయించకపోతే బిడ్డ మెదడు ఎదుగుదలలో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు తల్లికి తగిన మోతాదులో థైరాక్సిన్‌ మాత్రలు ఇవ్వడం ద్వారా బిడ్డకు కలిగే లోపాలను నివారించవచ్చు. ప్

రెగ్నెన్సీ సమయంలో తల్లి రక్తంలో టీఎస్‌హెచ్‌ మోతాదును తక్కువ స్థాయిలో ఉంచాలి. తల్లిలో థైరాయిడ్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉన్నట్లయితే అది బిడ్డ ఎదుగుదలను తగ్గించవచ్చు. అంటే  ఫీటల్‌ గ్రోత్‌ రెస్ట్రిక్షన్‌ రావచ్చన్నమాట. అందుకే ఇలాంటి సందర్భంలో యాంటీ థైరాయిడ్‌ మందులను తగిన మోతాదులో ఇస్తూ, తల్లిలో థైరాయిడ్‌ హార్మోన్‌ను సరిగా ఉండేలా నియంత్రించడం ద్వారా బిడ్డకు కలిగే దుష్ప్రభావాలను నివారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement