
నాకు అమ్మ తర్వాతే ఎవరైనా!
రిలేషణం - మదర్స్ డే స్పెషల్
ఓ తల్లి ప్రేమించినంతగా ఏ వ్యక్తీ మనల్ని ప్రేమించరు. తల్లి మాదిరిగా తన జీవితాన్ని మనకోసం ఎవరూ అంకితం చేయరు. తల్లిలాగా ఎవరూ త్యాగాలు చేయరు. అందుకే అమ్మ స్థానం ఎప్పుడూ అమ్మదే. అటువంటి అమ్మ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటాడు రణబీర్ కపూర్. కొడుకు తోడిదే ప్రపంచం అంటారు రణబీర్ తల్లి నీతూ కపూర్. ఈ తల్లీకొడుకుల అనురాగ మధురిమలు... మదర్స్‌డే సందర్భంగా...
చాలామంది నన్నడుగుతూ ఉంటారు... మీ అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారట కదా అని. అది అడగాల్సినంత పెద్ద విషయమా? పిల్లల మంచి కోసం కొన్నిసార్లు తల్లిదండ్రులు స్ట్రిక్ట్‌గానే ఉంటారు. అలానే అమ్మ కూడా. కానీ వాళ్లంతా అనుకునేంత మాత్రం కాదు. తను అలా కనిపిస్తుంది కానీ చాలా కూల్‌గా ఉంటుంది. సరదాగా ఉంటుంది. కబుర్లు చెబుతుంది. నవ్వుతుంది, నవ్విస్తుంది. నాతో షికార్లకు వస్తుంది. అన్నీ చేస్తుంది. అలా ఉండు ఇలా ఉండు అని చెబుతుందే తప్ప తన అభిప్రాయాలను నామీద రుద్దదు. అది తెలియక తను ప్రతిక్షణం నా చేయిపట్టుకుని నడిపిస్తుందని, రూల్స్ పెడుతుందని అనుకుంటూ ఉంటారు.
అమ్మను మించిన ఇంపార్టెంట్ వ్యక్తి ఎవ్వరూ నా జీవితంలో లేరు. తనకే నా మొదటి ప్రాధాన్యత. రేపు నా భార్యకి కూడా అదే చెప్తాను. అలా అంటే అమ్మ నవ్వుతూ ఉంటుంది. తనకి ఓపికి చాలా ఎక్కువ. చిన్నప్పుడు చాలా విసిగించేవాడినట. కానీ తను పెద్దగా ఎప్పుడూ కొట్టిన జ్ఞాపకం లేదు నాకు. మరీ అల్లరి చేస్తే తప్ప దెబ్బ వేసేది కాదు. సీరియస్‌గా చూసేది. క్షణాల్లో కూల్ అయిపోయి నవ్వేసేది. ఇప్పటికీ తనలో అదే ఓపిక. నా గురించి ఎవరైనా నెగిటివ్‌గా మాట్లాడినా చాలా నిబ్బరంగా సమాధానం చెబుతుంది.
నాకు ఏ అమ్మాయితో లింకుపెట్టి మాట్లాడినా, వార్తలు రాసినా నేనయినా కాస్త రియాక్టవుతాను గానీ తను పెద్ద పట్టించుకోదు. ఎవరైనా నిలదీసి అడిగినా కూడా నా కొడుకు గురించి నాకు తెలుసు అంటుంది తప్ప ఇలా ఎందుకు రాశారు అని ఎదురు ప్రశ్నించదు. అలా ఉండటం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు.
అమ్మలో నాకు అన్నిటికంటే నచ్చేది... అవతలి వారికి ఏం కావాలో వాళ్లు అడక్కుండానే అర్థం చేసుకోవడం. మనం ఏదైనా అడుగుదామనుకుంటే తనకి ఎలా తెలిసిపోతుందో ఏమో, ముందే అది రెడీ చేసేస్తుంది. ఎంతసేపూ నాన్న, అక్క, నేనే ప్రపంచం అన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు తాను హీరోయిన్‌ని అన్న విషయం తను మర్చిపోయిందేమో అనిపిస్తుంది నాకు. తన సినిమాలు చూసి నేను ఏదైనా కామెంట్ చేస్తే నవ్వేస్తూ ఉంటుంది. దేన్ని ఎలా తీసుకోవాలో తనకి బాగా తెలుసు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది తను. అందుకే... మా అమ్మ స్పెషల్. మా అమ్మ గ్రేట్. నా వరకూ మా అమ్మ ఈ ప్రపంచంలోనే బెస్ట్ అమ్మ!
తనకి స్వార్థమెక్కువ - నీతూకపూర్
రణబీర్ నా విషయంలో చాలా స్వార్థంగా ఉంటాడు. నా ప్రేమ తనకొక్కడికే సొంతం కావాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. చిన్నప్పుడయితే... ‘నీకు నేనంటే ఇష్టమా, అక్కంటే ఇష్టమా’ అని అడిగేవాడు. తనని ఏడిపించడానికి ‘అక్కంటేనే ఎక్కువ ఇష్టం’ అనేదాన్ని. నువ్వంటేనే ఇష్టం అని చెప్పేవరకూ వదిలేవాడు కాదు. చాలా అల్లరోడు. వాళ్ల టీచర్లు బోలెడన్ని కంప్లయింట్లు ఇచ్చేవారు. ఓసారి పాఠం వినట్లేదని క్లాసు నుంచి బయటకు పంపేశారు. క్లాసయ్యాక వీడు కనిపించలేదట.
కంగారుపడి వెతికితే... ఒకచోట పిల్లితో ఆడుకుంటూ కనిపించాడట. అమెరికా వెళ్లినప్పుడుఏం జరుగుతుందో చూద్దామని ఫైర్ అలారం మోగించాడు. పోలీసులు వచ్చి ఫుల్లుగా క్లాస్ తీసుకున్నారు. ఓసారి పని మనిషిని స్విమ్మింగ్ పూల్లోకి తోసేశాడు. ఎందుకలా చేశావని అడిగితే... ‘ఈత రాదు కదా, ఎలా బయటకు వస్తుందో చూద్దామని’ అన్నాడు కూల్‌గా. మేం సమయానికి చూశాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చాలా సెలైంట్‌గా ఉంటున్నాడు. నా దగ్గర మాత్రం బాగా మారాం చేస్తాడు. అప్పుడు చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. అయినా... బిడ్డ ఎంత ఎదిగినా తల్లికి చంటిపిల్లాడేగా!