
నిను కనలేని కనులుండునా కన్నయ్యా....
పాట నాతో మాట్లాడుతుంది
ఉభయకుశలోపరి - అది - ఇదీ లేకుండా ‘‘నా గీతావళి ఎంతదూరం ప్రయాణం చేసినా అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను నిప్పుల్ వోసి హేమంతభామా గాంధర్వ వివాహమాడెదను ద్రోమణ్యుష్ణ గోళమ్ముపై ప్రాణాకాశనవారుణాస్ర జలధారల్ చల్లి చల్లార్చెదన్’’ చింతలతోపులో కురియుచిన్కులకున్ - తడిముద్దయైన బాలింతయొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్ - బొంతలు లేవుకప్పుటకు - బొంది హిమంబయిపోవునేమొ సాగింతును రుద్రవీణ పైనించుక వెచ్చని అగ్నిగీతముల్.
పద్యాలు వినిపించి సినీగీతాలు రాయకముందే జైలుగోడల పైన స్వాతంత్య్ర యుద్ధ పద్యాలు రాసిన - రుద్రవైణికుడు నా తండ్రి దాశరథి. అంది దాశరథి పాట. అవును కండగల పద్యం. కలకండలాంటి భావగీతం - కర్రూర కళికలాంటి సినీగీతం - బాలగీతం - ఏదైనా ఏకకాలంలో రాయగలిగిన దాశరథి.
‘ఇంతకు నీవే పాటవు’
నేను ‘కన్నయ్య’ పాటను అంది - అరుదైన ఇతివృత్తం నాది అన్న ఆత్మవిశ్వాసంతో ఓహో....
చిత్రం ‘నాదీ ఆడజన్మే’ పాడింది సుశీల - నటించింది మహాభినేత్రి సావిత్రి - సంగీతం ఆర్.సుదర్శనం. కథాపరంగా నల్లని అమ్మాయ్ సావిత్రి. అవమానాలకు గురి అవుతూంటుంది. ఆ బాధ కృష్ణ భగవానుని ముందు తెలియపరచాలి.
పాట తేటతనం తెలిసినవాడు కనుక ‘కృష్ణయ్యా నల్లని కృష్ణయ్య’ అని కాకుండా ‘కన్నయ్యా నల్లని కన్నయ్యా’ అంటూ పల్లవి తొలిపాదం కదిలింది. తెల్లని కాగితం వేదికపై నీలి సిరాక్షరి నర్తకీమణిలాగా నల్లని కన్నయ్య నీవు నల్లగున్నావని నిను చూడకుండా ఉంటారా ఎవరైనా అనే భావాన్ని... ‘నిను కనలేని కనులుండునా’ అని రెండో పాదం కదిలింది. ఇంక దర్శకుడు తెలిపిన కథానుగుణభావాన్ని...
నిను ప్రేమింతురే - నిను పూజింతురే
నను కనినంత నిందింతురే.... నిందింతురే ‘రే’ అక్షరం పెట్టడంలో ఎంత ఔచిత్యమో... నిందిస్తున్నారు అనే వేడుకోలుతో పాటు నిందిస్తారెందుకు అనే ప్రశ్న కూడా సంధించాడు. పద సంధానం తెలిసిన కవి సవ్యసాచి కదా దాశరథి. ఇక ఆపైన ‘నా గుణం తెలుసుకోని ఇంట నన్ను ఎందుకు పడవేశావు - నన్ను వెలిచేయాలనుకునే వారికి నన్నెందుకు బలిచేశావు. నీకేం సిరివుంది చూసుకుని మురిసిపోడానికి ‘సిరి’ అంటే సంపద అనే కాదు శ్రీమహాలక్ష్మి నిన్నూ నీ రంగునీ, నీ గుణాన్ని అర్థం చేసుకునే నీ అర్ధభాగం ఉంది. మంచి గుడి ఉంది. ఆ గుడిలో నీకు మంచి స్థానం ఉంది. ఇంక నాలాంటి దీనురాలిపై నీకెందుకుంటుంది దృష్టి అనే ఒక నిష్ఠూర భావనతో గుణమెంచలేనింట పడవేతువా - నను వెలివేసె వారికె బలిచేతువా సిరి చూసుకుని నీవు మురిసేవయా - మాచి గుడి చూసుకొని నన్ను మరిచేవయా-
ఇంక రెండో చరణంలో...
బంగారు రంగు కాకుండా బంగారం లాంటి మనసిచ్చావు. అందమైన శరీరపు వన్నెలేకుండా అందమైన గుణమిచ్చావు. ఈ మనసు - గుణము సాధారణమైన కళ్లకు కనిపించేవి కావు పైగా నల్లని రంగు పులిమి వెక్కిరింపుల మధ్య వేసి ఎలా బతుకమంటావు -
‘‘బంగారు మనసునే ఒసగినావు అందు. అందాల గుణమునే పొదగినావు మోముపై నలుపునే పులిమినావు ఇట్లు - నన్నేల బతికింపదలచినావు అని ముగించి దేవుడి పాటలలో ఒక అపూర్వ ఇతివృత్తంతో రాసి మరపురాని పాటగ మిగిలించాడు నా తండ్రి’’ అని... వస్తా అశోక్‌తేజా అంటూ ఏ నల్లనయ్య గుడిగంటల నాదాలలోకో వినీనమైంది ఆ పాట.