
కొత్త దారిలో ప్రజ్ఞాసింగ్...
ఆదర్శం
జీవితం బహుచిత్రమైనది. ‘ఇక అంతా మంచే జరుగుతుంది’ అనే నమ్మకంలో నుంచి పుట్టిన చిరునవ్వు పెదవుల మీద ఉండగానే... వెయ్యి రాక్షస హస్తాలతో చెడు ఎదురొస్తుంది. భయపడి బిక్కచచ్చేవాళ్లు ఉంటారు. జీవితం నుంచే పారిపోయే వాళ్లు ఉంటారు. కొందరు మాత్రం అదే చిరునవ్వుతో రాక్షసత్వానికి సవాలు విసురుతారు. జీవితాన్ని కొత్తగా వెలిగించుకుంటారు. ఆ మహా వెలుగు వారికి మాత్రమే కాదు... ఎందరో బాధితులకు దారి చూపుతుంది.
ఏప్రిల్ 2006. వారణాసి నుంచి ఢిల్లీకి రైల్లో వెళుతున్నారు ప్రజ్ఞాసింగ్. రెండు వారాల క్రితమే ఆమెకు పెళ్లయింది. ఢిల్లీలోని ఒక కంపెనీలో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావడానికి బయలుదేరారు. ఆమె మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. తన ముందు పూలదారి ఒకటి కనిపిస్తుంది. తీయటి ఆలోచనలతో ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టింది... మంచి నిద్రలో ఉన్నప్పుడు ప్రజ్ఞాసింగ్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రజ్ఞా దూరపు బంధువు. తన కంటే పది సంవత్స రాలు పెద్దవాడు. ‘నిన్ను ఇష్టపడుతున్నాను.
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్రజ్ఞాకు ప్రపోజ్ చేశాడు. ప్రజ్ఞాతో పాటు, ఆమె తల్లిదండ్రులు కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అవమాన భారంతో అతడు ప్రజ్ఞాపై విపరీతమైన కసి పెంచుకున్నాడు. ఆ కసి అతడిని రాక్షసుడిగా మార్చి యాసిడ్ దాడికి పాల్పడేలా చేసింది. ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి. ప్రజ్ఞా రూపం పూర్తిగా మారిపోయింది. ఎడమ కన్ను బాగా దెబ్బతింది. కుడికంటి చూపు మందగించింది.
ఒక దశలో ఇల్లు దాటి బయటికి రావడానికి భయపడేది. తనను తాను బతికున్న శవం అనుకునేది. చదువులో, సృజనాత్మక విషయాలలో ప్రతిభావంతురాలైన ప్రజ్ఞా ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో పీజీ, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో ఏంబీఏ చేశారు.
తన భవిష్యత్ గురించి కన్న అందమైన కలలన్నీ మసకబారిపోయాయి. కొద్దికాలం తరువాత ఆమె నిరాశ అనే చీకట్లలో నుంచి బయటకు వచ్చారు. భవిష్యత్ గురించి ఆలోచించారు. తనను తాను ఉత్సాహపరచు కున్నారు.యాసిడ్ దాడి జరగడానికి ముందు ప్రజ్ఞా
ప్రజ్ఞాకు అన్ని విధాలా అండగా నిలబడ్డాడు భర్త సంజయ్‌సింగ్. ‘‘ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. నాకు అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచారు’’ అని భర్త సంజయ్ గురించి ప్రశంసపూర్వకంగా చెబుతారు ప్రజ్ఞా. యాసిడ్ దాడికి గురైన మహిళలకు అండగా నిలవడానికి 2013లో బెంగళూరులో ‘అతిజీవన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఆమె. యాసిడ్ దాడికి గురైన ఎందరో మహిళలకు ‘అతిజీవన్’ నుంచి అన్ని రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తున్నారు.
అందరూ ఆమెను ‘అక్క’ అని ఆత్మీయంగా పిలుస్తుంటారు. ‘‘యాసిడ్ దాడికి గురైన బాధితులను నా కుటుంబ సభ్యుల మాదిరిగానే భావిస్తాను. ఆశ్చర్యంగా చూస్తారనో, వెక్కిరిస్తారనో తమ అమ్మాయిని కొందరు తల్లిదండ్రులు బయటికి పంపించరు. అలాంటి వారితో ప్రత్యేకంగా మాట్లాడి మార్పు తెస్తున్నాను. నా జీవితం నుంచి వారికి ఎన్నో ఉదాహరణలు చెబుతున్నాను’’ అంటారు ప్రజ్ఞా.
బాధితులకు ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు, స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన నైతికస్థైర్యాన్ని కూడా ఇస్తుంది ‘అతిజీవన్’. ఎందరో యాసిడ్ బాధితులు ‘అతిజీవన్’ ఆసరాతో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. ‘అతిజీవన్’ ప్రధాన లక్ష్యాలలో ఒకటి ‘స్కిన్ డొనేషన్’, ‘స్కిన్ బ్యాంకింగ్’ గురించి స్పృహను పెంచడం. అవగాహన కలిగించడం. కెమికల్, ఎలక్ట్రికల్, రేడియేషన్... వంటి వాటివల్ల చర్మం దెబ్బతిన్న వారికి, కాలిన గాయలకు గురైన వారికి స్కిన్‌బ్యాంక్‌లో స్టోర్ చేసిన స్కిన్ ఉపయోగపడుతుంది.
యాసిడ్ బాధితులకు మరింతగా సహాయపడేందుకు ముంబైలోని ‘నేషనల్ బర్న్స్ సెంటర్’తో కలిసి పనిచేస్తున్నారు ప్రజ్ఞాసింగ్. ‘‘స్కిన్ డొనేషన్ గురించి స్పృహ కలిగించే ప్రచారాన్ని నిర్వహించినప్పుడు... అదేమిటి? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కొద్దిమంది వైద్యులకు కూడా స్కిన్ బ్యాంకింగ్ గురించి సరియైన అవగాహన లేదు. స్కిన్‌డొనేషన్ కూడా ఐ డోనేషన్‌లాంటిదే’’ అంటున్నారు ప్రజ్ఞా. తాను కొత్తదారిలో నడవడమే కాదు... ఎందరికో దారి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె.