హ్యూమరం: చికుబుకు రైలు
ప్రపంచమే ఒక రైల్వేస్టేషన్. ఎక్కేవాళ్లు ఎక్కుతుంటారు, దిగేవాళ్లు దిగుతుంటారు. ఎక్కాల్సిన రైలు ఎక్కకుండా, తమది కాని స్టేషన్లో కొందరు దిగుతుంటారు. ఎక్కడికెళ్లాలో తెలియకుండా కనపడిన ప్రతి రైలూ తమదేనని కొందరు కంగారు పడుతుంటారు. ఎవడెంత గోల చేసినా రైలు మాత్రం కూతకొచ్చి వెళుతూ ఉంటుంది. నా చిన్నప్పుడు రాయదుర్గంలో ఒక చిన్న రైల్వేస్టేషనుండేది. బళ్లారి నుంచి రోజుకోసారి మాత్రమే రైలొచ్చేది. వచ్చిన రైలు వచ్చినట్టే వెనక్కి వెళ్లేది. మార్చుకునే వీల్లేదు కాబట్టి ఇంజన్ వెనక్కి పరిగెత్తేది. వెనక్కి వెళ్లే రైలు చూడటం అదే మొదలు, ఆఖరు. రైలయినా, జీవితమైనా ముందుకే వెళ్లాలి తప్ప వెనక్కి కాదు.
బ్రిటిష్ హయాంలో మొదటిసారి గుంతకల్లుకి రైలొచ్చినప్పుడు చుట్టుపక్కల పల్లెలన్నీ బళ్లు కట్టుకుని వెళ్లి చూశాయి. నిప్పులు మింగి పొగను వదిలే రైలును చూసి హడలి పరిగెత్తారట. ఇన్నేళ్ల తరువాత కూడా ఇంజన్లు మారాయే కానీ, రైళ్లేమీ మారలేదు. టైమ్‌కి రావు, పోవు. మా బంధువు ఒకాయనకి రైళ్లపైన మహా నమ్మకం. సాయంత్రం ఆరుగంటలకి రైలుంటే, నాలుగుకే స్టేషన్‌కి చేరుకుని కాలుగాలిన పిల్లిలా స్టేషనంతా తిరిగేవాడు. రైలొచ్చేసరికి ఒక్క దూకు దూకి సీట్లో కూచునేవాడు. కదలగానే నిద్రపోయేవాడు. ఆయన దిగాల్సిన స్టేషన్‌లో తప్ప అన్ని స్టేషన్లలో మేల్కొని బోర్డులు వెతికేవాడు. తాడిపత్రిలో దిగాల్సినవాడు గుత్తిలో దిగి బస్సులు పట్టుకుని చచ్చీచెడి ఊరికొచ్చేవాడు.
రిజర్వేషన్ బోగీలో మనుషులు కూడా రిజర్వ్‌డ్‌గానే ఉంటారు. జనరల్ బోగీలోనే వింతలూ విడ్డూరాలూ. ఒకర్నొకరు తోసుకుంటూ, ఒకరి నెత్తిన ఇంకొకరు కూడా కూచోవాల్సి వస్తుంది. ఇంత ఇరుకులో కూడా కొందరు పేకాడుతూ జోకర్ల కోసం వెదుకుతూ ఉంటారు. తమ సంచుల్ని ట్రంక్ పెట్టెల్ని ఇతరుల కాళ్లమీద పెట్టి, తమ కాళ్ల మీద తాము నిలబడేవారుంటారు. నరజల్మమిది అంటూ జీవన వేదాంతాన్ని బోధించే గాయకులు, చెనిక్కాయలు, బఠాణీలను పంటి కిందకి సరఫరా చేసే వర్తకులు, పాడేవాడికి లాభం, పాడనివాడిది లోభం అంటూ ఊరించే వేలం పాటదారులు, ప్రపంచాన్నంతా ఉచితంగా సందర్శించే సాధువులు... ఒకరా ఇద్దరా? జీవితంలో ఉన్న రంగులన్నింటినీ అద్దకంలో చూపించే కళాకారులు రైళ్లలో ఉంటారు.
కోటీశ్వరులైనా సరే రైళ్లలోనే ప్రయాణించాలని రాసిపెట్టినవాళ్లు టికెట్ కలెక్టర్లు. రైలు మొత్తం మీద బూటేసుకునేవాళ్లు బోలెడు మందున్నా కోటేసుకునేది వాళ్లు మాత్రమే. మా ఫ్రెండ్ దగ్గర పెళ్లినాటి కోటు ఉండేది. డబ్బులు లేనప్పుడల్లా కోటేసుకుని రెలైక్కి నాలుగు రాళ్లు పోగు చేసేవాడు. ఒకరోజు అసలు కోటుకి ఎదురై రైలుకి బదులు జైలుకెళ్లాడు. పలక చేతికిచ్చి ఫొటో తీశారు.
రైళ్లన్నీ ఒక్కలాగే ఉన్నా కొన్ని రైళ్లకు ఉత్సాహమెక్కువ. పట్టాలు దాటకుండా ప్రయాణించాలని చూస్తాయి. మనుషులైనా, రైళ్లయినా పట్టాలు దాటితే ప్రమాదమే!
- జి.ఆర్.మహర్షి