
విశ్లేషణం: విప్లవాత్మక సృజనజీవి...
‘‘నేనంటే చాలామందికి నచ్చకపోవచ్చు... వాళ్లు నన్ను విమర్శించవచ్చు, అది వాళ్లిష్టం. కానీ నేనెలా ఆలోచిస్తానో మరొకరికి ఎలా తెలుస్తుంది? నా మనసులో ఏముందో వారెలా విశ్లేషిస్తారు?’’ అని ఓ సందర్భంలో వర్మ మండిపడ్డారు. ఆయన లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్, జీవనశైలి ద్వారా ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా తెలుసుకోవచ్చు, విశ్లేషించవచ్చు.
స్వార్థపర తత్త్వవేత్త...
వర్మ మాట్లాడుతున్నప్పుడు కాళ్లు కుదురుగా ఉండవు... వాటిని షేకాడిస్తుంటాడు. స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. వీటినిబట్టి వర్మది అనుభూతి ప్రధాన వ్యక్తిత్వమని చెప్పవచ్చు. తనకెలాంటి సెంటిమెంట్సూ లేవని వర్మ పదేపదే చెప్పినా... ఆయన భావోద్వేగాలకే అధిక ప్రాధాన్యమిస్తాడు... అయితే అది తన ఫీలింగ్స్‌కు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన దృష్టిలోనే చూస్తుంటాడు. నా పాయింట్ ఏంటంటే... అంటూ తన వాదనను వినిపిస్తుంటారు. దీన్నే ‘ఫస్ట్ పర్సెప్చువల్ పొజిషన్’ అంటారు. ఈ పొజిషన్‌లోనే ఆగిపోయినవారు ప్రపంచానికి పచ్చి స్వార్థపరులుగా కనిపిస్తారు. తను స్వార్థపరుడినని కూడా వర్మ ఓపెన్‌గా అంగీకరిస్తాడు. అంతేకాదు స్వార్థమే పరమార్థం అని సిద్ధాంతీకరిస్తాడు. కానీ వర్మ మాటలను నిశితంగా గమనిస్తే ఆయన తరచూ ‘ఫిఫ్త్ పర్సెప్చువల్ పొజిషన్’ నుంచి ప్రపంచాన్ని చూస్తుంటాడనే విషయం తెలుస్తుంది.
ఇది సుప్రీమ్ పొజిషన్, గాడ్ పొజిషన్. ఈ దృక్కోణంలో ప్రపంచాన్ని చూసేవారు తత్త్వవేత్తలు లేదా మహాగురువులవుతారు. ‘నేను’ అనే మాటను కాస్త పక్కన పెట్టి గమనిస్తే... ఆయన మాటల్లో ఓ గురువు కనిపిస్తాడు. అతని మాటల్లో సత్యం అర్థమవుతుంది. ఓషో రజనీష్, యూజీ కృష్ణమూర్తిలానే వర్మ ఆలోచనలు కూడా విధ్వంసకరంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను ప్రేమించాలి లేదా ద్వేషించాలి, మధ్యస్థంగా ఉండటం కుదరదు. ఎందుకంటే ఆయన వ్యక్తులను ప్రశ్నించడు, వారిలోని ప్రాథమిక భావనలను ప్రశ్నిస్తాడు, వారి ఆలోచనలోని లోపాల్ని ఎత్తి చూపుతాడు, వారున్న కంఫర్ట్ జోన్స్‌ను బద్దలు కొడతాడు. అది నచ్చినవారు ‘భక్తుల’వుతారు, నచ్చనివారు శత్రువులవుతారు.
ఆయన చేతులూ మాట్లాడతాయి...
మాట్లాడేటప్పుడు వర్మ తరచూ చూపుడువేలును తలకు ఆనించుకుంటాడు. ఎదుటివారిని అతను విశ్లేషిస్తుంటాడనే విషయాన్ని ఇది వెల్లడిస్తుంది. తానెంత ఓపెన్‌గా మాట్లాడినా ఒక్కోసారి తన భావాలను దాచుకునే ప్రయత్నం చేస్తాడని పెదవులకు వేళ్లు/చేయి అడ్డుగా పెట్టుకోవడం వల్ల తెలుస్తుంది. వర్మ నోటితోనే కాదు చేతులతోనూ మాట్లాడతాడు. అదెలాగంటారా? వర్మ మాట్లాడేటప్పుడు ఆయన చేతులు, వేళ్ల కదలికలను గమనిస్తే మీకే తెలుస్తుంది. మాటలకు, చేతుల కదలికలకు మధ్య అద్భుతమైన లయ కనిపిస్తుంది. దీన్నిబట్టి మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడనే విషయం మనకు తెలుస్తుంది.
ఈ క్షణంలోనే జీవిస్తా...
సమాజం గురించి నేనెప్పుడూ ఆలోచించను. అందులో ఉన్నాను కాబట్టి ఆ చట్టాలను గౌరవిస్తాను, ఆచరిస్తాను. నాకు నచ్చిందే నేను చేస్తాను... అనడంలో వర్మలోని వ్యక్తివాదం వెల్లడవుతుంది. అలాగని ఇతరులను గౌరవించడనుకుంటే పొరపాటే. ఇతరులను చాలా గౌరవిస్తాడు... అయితే అది తన జీవితంలో చొరబడనంతవరకూ మాత్రమే. ఆయన వ్యక్తులకన్నా, సంఘటనలకన్నా.. ఆలోచనలు, అనుభూతుల గురించే ఎక్కువగా మాట్లాడతాడు. సినిమాకన్నా అది క్రియేట్ చేసే ఫీలింగ్, ఎమోషన్ నాకు ముఖ్యం అని చెప్తాడు. పెళ్లెప్పుడు చేసుకున్నానో నాకు గుర్తులేదు... రేపేం చేస్తానో నాకే తెలియదు... ఇప్పుడేం చేస్తానన్నదే నాకు ముఖ్యం... అన్నప్పుడు ఆయన ఈ క్షణంలోనే జీవిస్తాడనే విషయం తెలుస్తుంది. ‘లివ్ నౌ’ అన్నదే అనేక తత్త్వాల సారాంశం. రామ్ గోపాల్ వర్మ చేసేదీ అదే.
- విశేష్, సైకాలజిస్ట్