శ్రీరంగని తీర్థం తీసుకోకుండా రామానుజునికి రోజు గడవదు. అదే కుట్రదారులకు అవకాశం ఇచ్చింది. ఓ రోజు రామానుజులు తీర్థం తీసుకోవడానికి రావడానికి ముందు పెరుమాళ్ల తీర్థపాత్రలో విషం కలిపారు. రోజూ తీర్థమిచ్చే అర్చకుడే ఆ రోజు కూడా ఇస్తున్నాడు. కాని ఏనాడు లేని విధంగా ఉద్ధరిణితో తీర్థం ఇస్తున్న చేతులు తీవ్రంగా వణకడాన్ని రామానుజులు గమనించారు. ‘‘ఏమి స్వామీ మీ చేయెందుకు వణుకుతున్నది’’ అని అడిగారు రామానుజులు. అర్చకుడు ఏమీ చెప్పలేకపోతున్నారు. స్వామి తీర్థంలోనూ విషం కలిపి ఉంటారని ఊహించి నవ్వుకున్నారు. అప్పడికే ఆయన ఈ హత్యా ప్రయత్నాలతో విసిగిపోయారు.శ్రీవారి పాదాలు తాకి పునీతమైన ఈ తీర్థం ఏ విషాన్నయినా కరిగిస్తుందని అనుకుంటూ ‘‘తీర్థం ఇవ్వండి. అందులో ఏమున్నాసరే’’ అన్నారు. ఆ అర్చకుడు తీర్థం ఇచ్చారు, వీరు స్వీకరించారు. దాని గురించి ఇక ఆలోచించకుండా దైనందిన కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. యతిరాజును విషం ఏమీ చేయలేకపోయింది. ప్రపీత విష తీర్థాంబః ప్రకటీకృతవైభవః అనే నామం రామానుజుని వేయినామాల్లో ఒకటైంది.
ఈ విషప్రయోగాలతో రామానుజులు కలత చెంది, భోజనం మాని ఉపవసించడం ఆరంభించారు. చికాకుతో శ్రీరంగానికి దూరంగా తిరువెళ్లరైకి వెళ్లి కొన్నాళ్లున్నారు. ఈ సంఘటనలు తెలిసి ఆందోళన చెందిన గోష్టీపూర్ణుల వారు తిరుగోష్టియూరు నుంచి హుటాహుటిన శ్రీరంగానికి వచ్చారు. ఆచార్యుల వారు వస్తున్నట్టు తెలిసి రామానుజులు ఎదురేగారు. కావేరీ నదీ సమీపాన ఇద్దరూ ఎదురు పడినారు. స్వామి కనిపించగానే రామానుజులు సాష్టాంగ దండ ప్రణామం చేసినారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఆచ్ఛాదన లేని ఛాతీతో కాలిపోతున్న ఇసుక మీద పడిపోయారాయన. ఎవరైనా సరే, ఆ విధంగా సాష్టాంగ పడితే వెంటనే లేపడమో, లేవమని చెప్పడమో పెద్దలు చేయవలసింది. కాని గోష్ఠీపూర్ణులవారు అట్లాగే చూస్తున్నారు. కిమ్మనరు. లెమ్మనరు. లెమ్మనేదాకా రామానుజులు లేవరు. ఆచార్యుని ప్రియశిష్యుడైన కిడాంబి ఆచ్చాన్ ఈ హింస తట్టుకోలేక పోయారు. గోష్టీపూర్ణుల మీద కోపం వచ్చింది. కాని ఏమీ అనలేరు. ఆయన్నేమైనా అంటే తమ గురువు రామానుజులు ఆగ్రహిస్తారు. తానే ఏదయినా చేయాలనుకున్నాడు. గోష్ఠీపూర్ణుల దగ్గరగా వచ్చి సూటిగా కళ్లలోకి కోపంగా చూసారు. అయినా మౌనంగానే ఉన్నారు. తానే ఆ ఇసుకమీద పడిపోయి రామానుజుల కిందకు దూరి తన వీపు మీద గురువుగారిని పడుకోబెట్టుకున్నారు.
గోష్ఠీపూర్ణులు అప్పుడు ‘‘లే నాయనా’’ అని ఇద్దరినీ లేవదీసారు. రామానుజులను ఆలింగనం చేసుకున్నారు. ‘‘స్వామీ ఇదేమిటి. రామానుజాచార్యులవారు ఏమి తప్పు చేసారని కాలే కావేరీ ఇసుకతిన్నల మీద కాలిపొమ్మని శిక్షించారు. ఆయన కుసుమకోమల శరీరం చూడండి ఎలా కందిపోయిందో. ఆ వేడి ఎవరైనా తట్టుకోగలరా, మరీ ఇంత కాఠిన్యమా?’’ అని ఆవేదన కలిసిన ఆవేశంతో ఆక్రోశించారు కిడాంబి. రామానుజుని పట్ల కిడాంబికి ఉన్న అపారమైన అనురాగానికి, ఆయన్ను రక్షించుకోవాలన్న తీవ్ర తపనకు, అందుకోసం ఏం చేయడానికైనా ముందుకు వచ్చే ఆయన సంసిద్ధతను చూసి గోష్టీపూర్ణులకు ఆనందం కలిగింది. ఓహో రామానుజుడికి ఇంత ప్రియశిష్యుడొకడున్నాడన్నమాట. ‘‘నాయనా కిడాంబి ఆచ్చాన్.. ఇక నీదే రామానుజుని బాధ్యతంతా. నీ వంటి త్యాగశీలి అయిన శిష్యుడి కోసమే వెదుకుతున్నాను. ఈ పరీక్ష రామానుజునికి కాదు. ఆయన్ను కంటికి రెప్పవలె కాపాడుకునే శిష్యుడిని కనిపెట్టడం కోసం, గురువు కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే నీవంటి ఆప్తుడిని కనుగొనడం కోసం. నువ్వు దొరికావు. నీవుండగా ఇక రామానుజుని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం రామానుజుని రక్షించుకోవాలి. ఎందుకంటే ఆయనే మన వైష్ణవ మతానికి రక్షకుడు, మోక్షమార్గ నిర్దేశకుడు. పాప పంకిలమైన కలికాలంలో దైవం వైపు మనుషుల్ని మళ్లించగల ఆచార్యుడు. నీవే స్వయంగా వస్తువులు కూర్చుకుని, తళిహ చేసి పెరుమాళ్లకు ఆరగింపు చేసి, ఆ భగవత్ప్రస్రాదాన్ని రామానుజునికి వడ్డించాలి. నిరంతరం ఆయనకు కాపాయంగా ఉండాలి. నీవే కాపాడుకోవాలి’’ అని గోష్ఠీ పూర్ణుల వారు కిడాంబిని ఆశీర్వదించారు.
‘‘నీవు గాక ఇంకెవరూ రామానుజునికి వండకూడదు. ఆహారం ఇవ్వకూడదు సుమా..’’ అని మరోసారి హెచ్చరించారు గోష్టీ పూర్ణులవారు. ఆ విధంగా కిడాంబి తన ఆచార్య నిష్టను చాటుకున్నారు.కిడాంబి గొప్ప విద్వాంసుడు. సంస్కృత భాషలో ఆయన పేరు ప్రణతార్తిహరాచార్యులు. ప్రణతి చేసిన వారి ఆర్తిని హరించేవారని అర్థం. ఆ తరువాత తళిహత్నం, పెరుమాళ్ల ప్రసాదం, రామానుజుని పాకశాల కైంకర్యం కిడాంబిదే. రామానుజులు మధూకరవృత్తి (యాచన) వదిలేసి కిడాంబి తళిహత్నం (వంట) మీదనే ఆధారపడేవారు. అందుకే రామానుజుని సహస్రనామావళిలో ‘‘ప్రణతార్తిహరాచార్య దత్తభిక్షైక భోజన’’ అనే మరో నామం చేరింది. కిడాంబితో సహా రామానుజుని ఆంతరంగికులు జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తున్నారు. రామానుజులకు ఇచ్చే ప్రతి పదార్థాన్ని, ద్రవాన్ని, ఫలాన్ని పరీక్షిస్తున్నారు. ఆయనకు సమీపంలో మెలిగే ప్రతివారి కదలికను పరిశీలిస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న శిష్యగణం స్వామిని కంటికి రెప్పలా కాచుకునే రక్షగణం వలె తయారైంది.
యజ్ఞమూర్తితో వాదంయజ్ఞమూర్తి ఒక మహాపండితుడు. అద్వైత వేదాంతంలో దిట్ట. తర్కశాస్త్రప్రవీణుడు. ఆయన శాస్త్ర చర్చలో ఓడించని పండితుడు లేడు. ప్రతిచోటా విజయపత్రాన్ని సాధించేవాడు. ఇక తనను జయించే వాడే లేడని ఆయనకు అహంకారం పెరిగింది. విస్తరిస్తున్న కీర్తితోపాటు నాకు సాటి నేనే అనే నమ్మకం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఆయన ఏకదండ సన్యాసి. యజ్ఞమూర్తి దృష్టిలో ఓడించవలసిన వారు ఇంక ఒక్కరు మిగిలారు. శ్రీరంగంలో త్రిదండి యతీశ్వరుడై జగద్గురువై ఆచార్యోత్తముడిగా భాసిస్తున్న రామానుజుడిని వాదంలో జయిస్తే ఇక తిరుగే లేదని అనుకుని శ్రీరంగానికి వచ్చారు. వేదాంత చర్చలో పోటీ పడడాన్ని శాస్త్రార్థం అంటారు. పెద్దమూటనిండా పుస్తకాలు తెచ్చుకుని వచ్చి రామానుజులతో ‘‘మీతో శాస్త్రార్థానికి వచ్చాను. నేను ఓడితే మీ మతం స్వీకరిస్తాను. మరి మీరు ఓడితే ఏం చేస్తారు’’ అని అడిగాడు. ‘‘గ్రంథసన్యాసం చేసి మౌనం వహిస్తాను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేసాడు రామానుజుడు. అంతా ఆశ్చర్యపోయారు. ఇదేం ప్రతిజ్ఞ. రామానుజులవారు గ్రంథ సన్యాసం చేస్తే ఇక ఈ శాస్త్రమంతా ఏమైపోవాలి. ఈ మతం ఏమైపోవాలి అని ఆందోళన చెందారు. మాయావాదంలో ఆరితేరిన యజ్ఞమూర్తి గర్వంగా వాదంలోకి దిగారు. 17 రోజుల పాటు వాదం సాగుతూనే ఉంది. రామానుజాచార్యులతో ఇన్ని రోజుల పాటు వాదించిన వారు మరొకరు లేరు. 17వ రోజున యజ్ఞమూర్తి వాదన పై చేయిలో ఉన్నట్టు కనిపించింది. సాయంత్రం తన పెరుమాళ్లు వరదరాజస్వామితో ‘‘ఆళ్వార్లనుంచి ఆళవందార్ దాకా ఇన్నాళ్లూ పెద్దలంతా తపోబలంతో నిర్మించుకున్న ఈ శ్రీ వైష్ణవాన్ని, నీ నామ రూప గుణ విభవ విభూతులనే నిత్య సత్యప్రకాశాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వదులుకునే పరిస్థితి నాకు రాకుండా రక్షించుకోవలసిన బాధ్యత మీకూ ఉంది స్వామీ’’ అని సంభాషించారు.
రాత్రి స్వప్నంలో వరదుడు కనిపించి ‘‘యామున మునీంద్రుని మనసెరిగిన శిష్యుడివైన నీకు, యామునుడి సిద్ధిత్రయాది గ్రంథాల్లో ఉన్న విజ్ఞానాన్ని వంట పట్టించుకున్న నీవు, చింతించే అవసరం ఉందా? ఏమో నీకు అత్యంత ప్రతిభావంతుడైన మరొక శిష్యుడు లభిస్తాడేమో’’ అన్నారు. దిగ్గున నిద్రలేచారు రామానుజులు. నూనె దీపం వెలుగులో సిద్ధిత్రయగ్రంథాలు తెరిచారు. కొన్ని పత్రాలు తిరగేసినారు. మరునాటి శాస్త్రార్థానికి సర్వం సన్నద్ధమైంది. ఆలోచనలు వెలిగాయి. లోలోన నవ్వుకుంటూ రామానుజులు నిద్రలోకి జారుకున్నారు. పద్దెనిమిదోరోజు... వివేకానంద ముఖారవిందుడైన రామానుజుని చూడగానే యజ్ఞమూర్తి మాయ మాయమైపోయింది. అనుమాన బీజం నాటుకుంది. అవిశ్వాసమై పెరిగింది. రామానుజుని మోములో ఏమిటీ కాంతి? అని ఆశ్చర్యపోయారు. చూపు మరలడం లేదు. ఆరోజు రామానుజుడు వాదం ఆరంభించిన కొద్దిసేపటికే ముగిసిపోయింది. పరమాత్మ స్వరూపాన్ని సైద్ధాంతికంగా నిరూపించిన తరువాత యజ్ఞమూర్తి పరాజయాన్ని అంగీకరించక తప్పలేదు. త్రిదండి సన్యాసం స్వీకరించారు. రామానుజునికి మరో పండిత శిష్యుడు లభించాడు. ఆయనకు అరుళాలప్పెరుమాళ్ ఎంబెరుమానార్ అనే నామాన్ని ప్రసాదించారు. విశిష్ఠాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడిగా తీర్చిదిద్దారు.
పేద శిష్యుడి పెద్ద గుణం, ధనిక శిష్యుని పేదరికం
ఓసారి రామానుజులు అష్టసహస్ర గ్రామానికి వస్తున్నారు. ఆ గ్రామంలో రామానుజునికి ఇద్దరు శిష్యులున్నారు. ఒకరు యజ్ఞేశుడు (యజ్ఞమూర్తి కాదు) మరొకరు వరదాచార్యుడు. యజ్ఞేశుడికి చాలా ధనం ఉంది. వరదుడు పేదవాడు. తాను వస్తున్నట్టు ఇద్దరికీ సమాచారం వెళ్లింది. రామానుజులు తన భవనానికి వస్తే స్వాగత సన్నాహాలు చేయడానికి సిద్ధం అన్నాడు యజ్ఞేశుడు. ఆ విషయం తెలియగానే రామానుజుడు శిష్యులతో ‘‘వరదుడి కుటీరానికి పదండి’’ అన్నారు. వరదుడు అప్పుడే భిక్షాటనకు వెళ్లాడు. ఇంట్లో వరదుడి భార్య ఉంది.రామానుజులవారు వస్తున్నారని ఆమె ఎంతగానో సంతోషించింది. కాని ఆమె బయటకు వచ్చి ఆచార్యునికి స్వాగతం చెప్పే స్థితిలో లేదు. తనకు ఒకే చీర ఉంది. ఆ చీరను అప్పుడే ఉతుక్కుంటున్నది. భర్త వచ్చేలోగా అది ఆరితే కట్టుకోవాలి. ఇప్పుడెట్లా. ఇంతలో గురువుగారు వచ్చిన సందడైంది. మూసి ఉన్న తలుపులకు ఆవల ఉన్నారు ఆచార్యులు. లోపల ఉన్న తను ఏ విధంగా స్వాగతం చెప్పాలో తెలియక ఆహ్వాన సూచనగా చప్పట్లు కొట్టింది. పరిస్థితిని రామానుజులు గమనించారు. తన శిరస్సుకు తలపాగా వలె కట్టుకున్న కాషాయ వస్త్రాన్ని తీసి కిటికీలోంచి లోనికి విసిరారు. దాన్నే చీరగా చుట్టుకుని ఆమె బయటకు వచ్చి నమస్కరించింది. కాళ్లు కడుక్కునేందుకు నీళ్లిచ్చి లోపల కూచునేందుకు ఆసనంగా ఒక చాపను పరిచింది. పూర్వజన్మపుణ్యాన గురువుగారు మా కుటీరాన్ని పావనం చేశారు. ఇంతకన్న ఆనందం ఏముంటుంది... కాని ఏం చేయడం? ధాన్యం కూడా లేదే, వారికి, శిష్యగణానికి సాపాటు ఏర్పాటు ఏ విధంగా చేయడం? ఇదివరకెవరో వైష్ణవ తదీయారాధన (భోజనం) కోసం దొంగతనాలైనా చేసేవారట. నేనేం చేసేది? ఈ వైష్ణవ స్వాములకు నేనెలా సాపాటు పెట్టేది. అని తపించసాగింది.
ఆ ఊళ్లో ఉన్న వైశ్యవర్తకుడి దగ్గరకు సరుకులకోసం పోయినప్పుడల్లా వంకర చూపులు చూసేవాడు. అవసరం ఉన్నా సరే అక్కడికి వెళ్లాలంటే ఆ చూపులకు భయపడేది. ఓ నిర్ణయానికి వచ్చి, ‘‘ఆచార్యా ఇప్పుడే వస్తాను. వెచ్చాలు తేవడానికి వెళ్తున్నాను. మీ అనుగ్రహంతో సరుకులు దొరుకుతాయనే అనుకుంటున్నాను’’ అని వెళ్లింది. ఆమె రాక చూసి వర్తకుడి మనసు కామంతో నిండిపోయింది. ‘‘మా ఆచార్యులవారు శిష్యులతో సహా వచ్చారు. వారికి సాపాటు పెట్టాలి. దయచేసి సరుకులు ఇవ్వండి మీ రుణం ఉంచుకోను. మీరు చెప్పినట్టు వింటాను’’. శెట్టిగారికి అర్థమైపోయింది. చాలా సంతోషంగా కావలసిన దానికన్న ఎక్కువ సరుకులే ఇచ్చారు. ఆచార్యుల సేవకు సరుకు దొరికిందన్న ఆనందంతో గుడిసెకు వెళ్లిందామె. ‘‘అమ్మా నీ చేతి వంట తినే భాగ్యం మాకుంది. స్నానానికి వెళ్లి వస్తాం తల్లీ’’ అని రామానుజులు శిష్యులతో సహా వాగు వైపు వెళ్లారు. స్నానం, సంధ్య, అనుష్టానం తిరువారాధనలు ముగించుకుని సాపాటుకు కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి వరదుడు వచ్చి ఆచార్యులను చూసి సాష్టాంగదండాలు సమర్పించి, భార్య అన్ని ఏర్పాట్లు చేయగలిగినందుకు వేయిదేవుళ్లకు దండాలు పెట్టుకున్నాడు. ‘‘నన్ను ధన్యుyì ని చేసావు, జ్ఞానమార్గాన్ని ఉపదేశించిన ఆచార్యుడే భగవంతుడు. వారి బృందానికి తదీయారాధన చేసే భాగ్యం కల్పించిన దేవతవు నీవు. ఏ విధంగానైనా గురువుకు ఆతిథ్యమివ్వగలిగే శిష్యుడే నిజమైన శిష్యుడు’’ అంటూ పరి పరి విధాలా భార్యను మెచ్చుకున్నాడు. ఇంతలో రామానుజుల వారు వరదుడి ఇంటికి వచ్చారని తెలిసి ఉళ్లో వాళ్లు చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ రామానుజులు అందరికీ తీర్థం ఉంచి ఆశీర్వదించారు. శెట్టి కూడా వచ్చారు. రామానుజుని దివ్యస్వరూపం చూసిన తరువాత వారి తీర్థం తీసుకుని ఆశీస్సులు పొందిన తరువాత, ఈ మహానుభావుడు స్వయంగా వరదుడి ఇంటికి వచ్చారంటే, సంపన్నుడైన యజ్ఞేశుడిని తిరస్కరించారంటే వరద దంపతులు ఎంత గొప్పవారో అర్థమైంది. రామానుజుల సమక్షంలో వరదుడి భార్య పాదాలపై పడి తన పాపపు చూపులకు పరితపించాడు. క్షమించమని వేడుకున్నాడు. తన ద్రవ్యం సద్వినియోగమైందని సంతోషించాడు. రామానుజుడి రాకతో తన సమస్య ఆ విధంగా పరిష్కారమైనందుకు వరదుడి భార్య ఆనందించింది. యజ్ఞేశుడికి గర్వభంగం అయిందని ఊళ్లో వాళ్లంతా అనుకున్నారు. ఆ విషయం యజ్ఞేశుడికి కూడా తెలిసింది. తన ఇంటికి రాకుండా రామానుజుడు తన యాత్ర కొనసాగించారని తెలిసి తన అహంకారానికి సిగ్గుపడ్డాడు.
కంటికి రెప్పలా కిడాంబి
Published Sun, Mar 11 2018 6:44 AM | Last Updated on Sun, Mar 11 2018 6:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment