
పథకం
కారు దిగి రైఫిల్‌తో నడుస్తూ అడవిలోకి వెళ్తూ దాన్లో రెండు గుళ్లని నింపాడు.
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 28
కారు దిగి రైఫిల్‌తో నడుస్తూ అడవిలోకి వెళ్తూ దాన్లో రెండు గుళ్లని నింపాడు. అతనికి అడపా దడపా రైఫిల్ పేలుతున్న శబ్దం వినిపించింది. దాన్ని బట్టి, తాజా బూటు ముద్రలని బట్టి ఇరవై నిమిషాల్లో క్లాక్స్‌టన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. రేండల్ మోర్గాన్ డిటెక్టివ్ కథా రచయిత. అతను సృష్టించిన డిటెక్టివ్ పాత్ర పేరు స్పడ్ మోరన్. అతను హంతకుల్ని సమర్థవంతంగా పట్టుకుంటూంటాడు. అలాంటిది తనే హత్య చేయాల్సి వస్తుందని రేండల్ ఎన్నడూ భావించలేదు. అంతే కాదు. తను అందుకు ఓ డిటెక్టివ్ సేవని తీసుకోవాల్సి వస్తుందని కూడా భావించలేదు.
‘‘వాళ్ళిద్దరూ రూమ్ నంబర్ ఇరవై ఏడులో ఉన్నారు’’ ప్రైవేట్ డిటెక్టివ్, రేండల్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
‘‘థాంక్యూ.’’
‘‘వాళ్లని కలిపి ఫొటో తీయమంటారా?’’ డిటెక్టివ్ ప్రశ్నించాడు.
‘‘అవసరం లేదు. మీ చెక్ రెండు రోజుల్లో పోస్ట్‌లో అందుతుంది. ఇక మీరు వెళ్లవచ్చు.’’
వెంటనే రేండల్ కారులో ఆ హోటల్‌కి చేరుకున్నాడు. బార్‌లో కూర్చున్న తన భార్య లోరెన్... ఆమె ప్రియుడు, తన మిత్రుడు అయిన క్లాక్స్‌టన్ కనిపించారు. వాళ్లు అప్పుడే హోటల్ గదిలోంచి బయటికి వచ్చి ఉంటారని భావించాడు. రేండల్ వారి దగ్గరికి వెళ్లాడు. వాళ్ల మీద అనుమానం లేనట్లుగా, అనుకోకుండా చూసినట్లుగా నటించాడు. తన భార్య భయపడింది కానీ క్లాక్స్‌టన్ భయ పడలేదని గుర్తించాడు.
తన మిత్రుడు క్లాక్స్‌టన్ ఆ రోజు వేటకి వెళ్తున్నాడని రేండల్ తన భార్య ద్వారా తెలుసుకున్నాడు. అతన్ని చంపదల్చుకున్న రేండల్... డిటెక్టివ్ కథా రచయితగా అప్పటికే ఓ పథకాన్ని ఆలోచించి ఈ అవకాశం కోసమే వేచి ఉన్నాడు. తన జేబులో రివాల్వర్, కొన్ని గుళ్లు ఉంచుకుని హంటింగ్ రైఫిల్‌ని తీసి కారులో దాచాడు. ఆ రైఫిల్ అమెరికన్ సైనికులు శత్రువుల నించి స్వాధీనం చేసుకున్న వియత్నమీస్ రైఫిల్.
చాలాకాలం క్రితం దాన్ని వేలం పాటలో కొన్నాడు క్లాక్స్‌టన్. దాన్ని అతను తనకి బహుమతిగా ఓ పుట్టినరోజున ఇచ్చిన సంగతి తన భార్యతో సహా ఎవరికీ తెలీదు. దాని గురించి పోలీసులు విచారిస్తే, అది క్లాక్స్‌టన్‌కి చెందినదనే తెలుస్తుంది.
అవసరమైన వస్తువుల్ని కారులో ఉంచుకుని మధ్యాహ్నం మూడు గంటలకి అద్దె కారులో ముప్పావు గంట దూరం లోని అడవికి బయదేరాడు రేండల్. కారుని పార్కింగ్ ఏరియాలో ఆపాడు. అతను ఊహించినట్లుగా క్లాక్స్‌టన్ కారు తప్ప ఇంకే కారూ లేదు. సమీప గ్రామంలో జరిగే సినిమా షూటింగ్ చూడటానికి అంతా వెళ్లారు. కారు దిగి రైఫిల్‌తో నడుస్తూ అడవిలోకి వెళ్తూ దాన్లో రెండు గుళ్లని నింపాడు. అతనికి అడపా దడపా రైఫిల్ పేలుతున్న శబ్దం వినిపించింది. దాన్ని బట్టి, తాజా బూటు ముద్రలని బట్టి ఇరవై నిమిషాల్లో క్లాక్స్‌టన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు.
తను రాసే కథలో అయితే, క్లాక్స్‌టన్‌కి తనకి సంభాషణ ఇలా సాగుతుంది అనుకున్నాడు.
‘‘క్లాక్స్‌టన్! నిన్ను చంపడానికి వచ్చాను.’’
‘‘నన్నా? లేళ్లనా?’’ క్లాక్స్‌టన్ నవ్వుతూ అడుగుతాడు.
‘‘మార్పు కోసం నిన్ను.’’
‘‘నాతో ఎందుకు జోక్ చేస్తున్నావు?’’
‘‘జోక్ కాదు. లోరెన్‌కి నీకు మధ్య జరిగే గ్రంథం గురించి నాకు తెలుసు.’’
బహుశా వారిద్దరి మధ్య పోట్లాట కూడా తను రాస్తాడు. చివరికి క్లాక్స్‌టన్‌ని విజయవంతంగా చంపుతాడు.
రేండల్ ఓ చెట్టు చాటు నించి క్లాక్స్‌టన్ ఛాతీకి రైఫిల్‌ని గురిపెట్టాడు. ఓ బండ రాయి మీద కూర్చుని కదలకుండా సిగరెట్ తాగుతున్న క్లాక్స్‌టన్ ఛాతిలో రెండు గుళ్లు దిగేలా కాల్చడం రేండల్‌కి తేలికైంది.
నెమ్మదిగా అతని దగ్గరికి నడిచి వెళ్లి కాలితో తన్ని చూశాడు. మరణించాడు. తనతో తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్‌లో అతని దుస్తులు విప్పదీసి వేశాడు. సమీపంలోని వాగులోకి అతని నగ్న శరీరాన్ని తోసేశాడు. అది మిసిసిపీ నదిలోంచి సముద్రంలోకి కొన్ని గంటల్లో వెళ్లిపోతుంది.
నీళ్లు పైనించి వాలుగా కిందకి ప్రవహిస్తూండ డంతో దారిలోని కొండ రాళ్లకి కొట్టుకుని ఆ శరీరం గుర్తుపట్టలేనట్ల్లుగా చిన్నాభిన్నం అవుతుంది. అతని రైఫిల్‌ని, సిగరెట్ పీకని చూసి, తర్వాత పోలీసులు క్లాక్స్‌టన్ వాగులో పడి మరణించి ఉంటాడని భావిస్తారు.
ఛాతిలోంచి రాలిన రక్తపు బొట్లు కొన్ని నేలమీద పడ్డాయి. అవి కనపడకుండా వాటి మీదకి బండరాయిని నెట్టాడు. కొద్ది దూరంలో కొండ మీంచి లోయలోకి ఆ దుస్తుల కవర్‌ని విసిరేసి తిరిగి పార్కింగ్ ప్లేస్‌కి చేరుకున్నాడు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని చూసి రేండల్ కొద్దిగా ఉలిక్కిపడ్డాడు.
‘‘మీ లెసైన్స్‌ని చూపించండి’’ పోలీస్ మర్యాదగా అడిగాడు.
రేండల్ తన భయాన్ని అణచుకుంటూ డ్రైవింగ్ లెసైన్స్ తీసి చూపించాడు.
‘‘నేనడిగింది ఇది కాదు. మీ హంటింగ్ లెసైన్స్‌ని.’’
‘‘నాకది లేదు.’’
‘‘అది లేకుండా వేటకి రావడం నేరం అని మీకు తెలీదా?’’... కాస్త సీరియస్‌గానే అన్నాడు పోలీస్. వెంటనే రేండల్ మొహం పాలిపోయింది.
‘‘మీరు రెండుసార్లు రైఫిల్ పేల్చిన చప్పుడు నాకు వినిపించింది.’’
‘‘ఉడతల్ని కాల్చాను.’’
‘‘ఈ అడవిలో ఉడతలు ఈ సీజన్‌లో ఉండవు. మీరు కాల్చింది జింకలనే కదా?’’
అవునన్నట్లుగా తల ఊపాడు.
‘‘పదండి. వాటిని స్వాధీనం చేసుకోవాలి. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి’’ అతను కోరాడు.
రేండల్‌కి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. కథలో ఇలాంటి సందర్భం వస్తే కొన్ని గంటల పాటు ఆలోచించి రేండల్ సరైన సమాధానం రాసేవాడు. కాని ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడు.
రేండల్‌కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
(జాన్ లట్జ్ కథకి స్వేచ్ఛానువాదం)