తెలుగులో వచ్చిన సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాల్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ ఈ సినిమా నుంచి పుట్టిన ఫార్ములాతోనే లెక్కలేనన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...
సీతారామయ్యగారింట్లో పెళ్లి హడావుడి అప్పటికే మొదలైపోయింది. ఇంట్లో వాళ్లంతా ఏదో ఒక పనిలో పడిపోయి బిజీబిజీగా కనిపిస్తున్నారు. గేటుముందు ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. ‘‘ఎంతైందీ?’’ అంటూ ట్యాక్సీకి డబ్బులిచ్చి లగేజీ సర్దుకుంటోంది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్లంతా ‘ఎవరా?’ అనుకుంటూ ఆ అమ్మాయినే చూస్తూన్నారు. ‘‘ఇది సీతారామయ్యగారి ఇల్లే కదండీ?’’ అడిగింది ఆ అమ్మాయి కాస్త బెరుకుగానే. ‘‘అవునమ్మా!’’ అంది ఆ ఇంటి ఆడపడుచు. ‘‘నేను సీతారామయ్యగారి మనవరాలిని. అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తిగారి అమ్మాయిని..’’ ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంది. ఆ ఇంటి ఆడపడుచుతో పాటే పక్కనే నిలబడి ఈ మాటలన్నీ విన్న ఒక పిల్లాడు ఇల్లంతా ఆ మాటను వినిపించాడు. ఆ ఇంట్లో ఇప్పుడు హడావుడి ఇంకాస్త ఎక్కువైంది. ‘‘అమ్మా, నాన్నా?’’ అడిగింది ఆడపడుచు. ‘‘రాలేదండీ! నాన్నకు తీరుబాటు కాలేదు. అమ్మ.. నాన్నతో ఉండకపోతే, వీలుకాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్లమని పంపారు.’’ సీతారామయ్య బయటికొచ్చి ఆ అమ్మాయిని చూశాడు. మనవరాలిని చూసిన సంతోషం అతనిలో కనిపిస్తున్నా, దాన్ని దాచేస్తూ గంభీరంగా చెప్పాడు – ‘‘వచ్చిన బంధువులకు ఇంట్లో సదుపాయాలు అవీ సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్యగారింట్లో జరుగుతున్న పెళ్లి’’.
సీతారామయ్య మనవరాలు రావడంతోనే ఇంట్లో అందరికీ నచ్చేసింది. ఇట్టే కలిసిపోయింది. ‘‘నాన్న నన్ను ‘నాన్నా నాన్నా’ అని పిలుస్తాడు నానమ్మా!’’ అని మనవరాలు చెప్తూ పోతుంటే సీతారామయ్యకు, ఆయన భార్యకు కళ్లలో నీళ్లు తిరిగాయి. కొడుకు గుర్తొచ్చాడు. ఎప్పుడు ఇల్లు వదిలేశాడతను? ఆ భార్యాభర్తలిద్దరూ ఇప్పటికీ కొడుకును తల్చుకోని రోజంటూ లేదు. మనవరాలు సీత పందొమ్మిదేళ్ల వయసు వచ్చిందాక ఎలా ఉందో కూడా వాళ్లు చూడలేదు. సీతను ఇలా ఇప్పుడు చూస్తూండడం వాళ్లకు సంతోషంగా ఉంది. సీతరామయ్యకు మాత్రం కొడుకు రాలేదనే కోపం, బాధ అలాగే ఉంది. అందుకే మనవరాలితో మాట్లాడటానికి కూడా ఇష్టంగా లేడు. కానీ ఆమె చేష్టలు, ఇంట్లో అందరితో ఇష్టంగా కలిసిపోవడం, ఏదో ఒకలా తనతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం సీతారామయ్యకు తెలీకుండానే మనవరాలిని దగ్గర చేస్తున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చేసింది. సీతారామయ్య ఇంట్లో పెళ్లి కాబట్టి ఊరంతా ఒకదగ్గర చేరినట్టుంది పెళ్లి మండపమంతా. సీతారామయ్య తన మనవరాలైన పెళ్లికూతురుకు పదివేలు కట్నం చదివించాడు. అలాగే సీత కూడా నాన్న తరపున కట్నం చదివించింది. పదివేల డాలర్లు. ‘‘మీరు పదివేలు చదివిస్తే, మీ వాడు పదివేల డాలర్లు చదివించాడు. అంటే మీకంటే పదిహేడు రెట్లు ఎక్కువ.’’ అన్నాడు పెళ్లిలో సీతరామయ్య పక్కనే కూర్చున్న ఓ పెద్దమనిషి. ‘‘ఎంతెక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరూ అంతే. అదో గొప్పా!?’’ అంటూ కొట్టిపారేశాడు సీతారామయ్య. ఆ మాటలను వింటూ తాతయ్యనే చూస్తూ కూర్చున్న సీత చిన్నగా నవ్వింది.
పెళ్లి అయిపోయింది. సీతంటే ఇప్పుడు ఇంట్లో అందరికీ ఇష్టం. సీతారామయ్య కూడా మనవరాలిని మూడు రోజులకు మించి దూరం పెట్టలేకపోయాడు. ఆయనే సీతను దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టి ‘‘నువ్వు నా మనవరాలివి.’’ అన్నాడు. సీత ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా తిరుగుతూ గట్టిగా అరిచి చెప్పింది – ‘‘తాతయ్య నాకు ముద్దు పెట్టాడు’’. రోజులు గడుస్తున్నాయి. పందొమ్మిదేళ్లు ఈ ప్రపంచాన్ని చూడని సీత ఇప్పుడిదే ప్రపంచంగా గడిపేస్తోంది. సీతరామయ్యకూ ఇదంతా ఓ కలలా ఉంది. సీత వచ్చాక ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో, అంత సంతోషంగా ఉన్న ఒకరోజు. అమెరికా నుంచి సీతారామయ్య కొడుకు శ్రీనివాసమూర్తి స్నేహితుడు వివేక్ సీతను చూడ్డానికి వచ్చాడు. సీతారామయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. సీతకు కబురెళ్లింది. పొలం చూసొస్తానని వెళ్లిన సీత పరిగెత్తుకుంటూ వచ్చింది. సీతారామయ్య, ఆయన భార్య, వివేక్ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. సీత కంగారు పడిపోతోంది. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. గట్టిగా అరిచినట్టు అడిగింది – ‘‘ఎవ్వరూ ఏం మాట్లాడరే!’’. ‘‘నువ్వు ఆడిన నాటకానికి ఇంకా మేం నీతో మాట్లాడాలా?’’ సీతారామయ్య గట్టిగా అడిగాడు. ‘‘నాటకమా?’’ అమాయకంగా నటిస్తూ అడిగింది సీత. ‘‘ఆయన అన్నీ వివరంగా మాతో చెప్పారు.’’ అంది సీతారామయ్య భార్య, వివేక్‌ను చూపిస్తూ. సీతలో కంగారు ఇంకా పెరిగిపోయింది. ‘‘చెప్పేశారా?.. అంకుల్..?’’‘‘అదీ.. సీతా..’’ వివేక్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘బాబూ! మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి.’’ అన్నాడుసీతారామయ్య. వెంటనే సీతవైపు చూస్తూ.. ‘‘ముందు నాకు సమాధానం చెప్పవే సీతా! ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది?’’ అడిగాడు. ‘‘తాతయ్యా! అదీ..’’ సీత తడబడుతోంది.
‘‘హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే, నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడొస్తున్నాడు.’’తాతయ్య మాటలు వింటున్న సీత కంగారంతా ఎగిరిపోయింది. పొలం దగ్గర్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినప్పట్నుంచి ఉన్న కంగారు అది. వివేక్ ఎక్కడ నిజం చెప్పేశాడో అని. కానీ వివేక్ నిజం దాచేశాడు. సీతారామయ్యకు చెప్పిన చిన్న అబద్ధంతోనే ఆ నిజాన్ని దాచేశాడు. ఆ అబద్ధం అప్పటికి సీత కళ్లలో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కానీ నిజం.. నిజం ఏదో ఒకరోజు చెప్పాల్సి రావొచ్చు. కొడుకు ఎప్పటికీ రాడని తెలిస్తే, ఆ రోజు సీతారామయ్య ఏమవుతాడో!!
Comments
Please login to add a commentAdd a comment