ఆడదానిగా పుట్టినందుకు గర్వపడతా!
ఇంటర్వ్యూ
మంచి ఒడ్డూ పొడవూ ఫిట్‌నెస్‌తో చెక్కిన శిల్పంలా కనిపించే శిల్పాశెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఆమె తనువు మాత్రమే అందమైనది కాదు. ఆమె మనసూ అందమే. ఆమె భావాలు ఇంకా అందమైనవి. తనలోని ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల చూస్తే... ప్రతి అమ్మాయీ ఇలానే ఉండాలి అన్న అభిప్రాయం కలుగుతుంది. శిల్ప గురించి మరిన్ని తెలుసుకుందామా!
* ఏం చేసినా పక్కాగా ప్లాన్ చేసుకుని చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు. నటన, మోడలింగ్, పెళ్లి, వ్యాపారం... ఏదీ ఓ ప్రణాళిక లేకుండా చేయలేదు. అదే నన్ను ఈ రోజు సెలెబ్రిటీ స్టేటస్‌లో నిలబెట్టిందని కచ్చితంగా చెప్పగలను.
* ఎంత మోడ్రన్ ఉమన్‌ని అయినా దేవుడు, విధి వంటి వాటిని నమ్ముతాను. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ అష్టకష్టాలు పడిందట. నాలుగో నెల వచ్చేవరకూ అసలు గర్భం నిలుస్తుందని అనుకోలేదట. ఎనిమిదో నెలలో ఉన్నప్పుడు మెట్ల మీది నుంచి పడిపోయిందట. తను, నేను ఇద్దరం చనిపోతామని అందరూ అనుకున్నారట. అయినా తన ప్రాణాలు నిలిచాయి. నాకూ ఏమీ కాలేదు. అంటే మమ్మల్ని ఏదో శక్తి కాపాడిందనే కదా! మా విధి రాత మరోలా రాసుందనేగా!
* నా కొడుకు వివాన్‌ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణమే నా జీవితంలో అన్నిటికంటే గొప్ప క్షణం. అమ్మ కావడంలో ఉన్న ఆనందమే వేరు. ఇప్పుడు వాడే నా జీవితం అయిపోయాడు. వాడితో ఉన్నంతసేపూ నాకు సమయమే తెలియడం లేదు.
* ఈ మధ్య ఆడపిల్లలు కెరీర్‌ను నిర్మించుకోవడంలో మునిగిపోయి ఆలస్యంగా తల్లులవుతున్నారు. అదంత మంచిది కాదు. నేను 37 యేళ్ల వయసులో తల్లినయ్యాను. అదృష్టంకొద్దీ నేను, నా బిడ్డ బాగున్నాం. కానీ అందరి విషయంలో అలా జరగదు. కాబట్టి రిస్క్ తీసుకోవద్దు.
* నన్ను ఎప్పుడూ అందరూ అడిగే ప్రశ్న... ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారు అని! దానికి కారణం మంచి ఆహారం, తగినంత వ్యాయామం. వాటి విషయంలో నేనస్సలు కాంప్రమైజ్ అవ్వను.
* యోగా సాధన చేయడం మొదలు పెట్టాక శారీరకంగాను, మానసికంగాను కూడా నాలో మార్పులు వచ్చాయి. ఫిట్‌నెస్ పెరిగింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించడం లాంటివి అలవడ్డాయి. అయితే అందరూ అనుకున్నట్టు నేను అందాన్ని కాపాడుకోవడానికి యోగా మొదలు పెట్టలేదు. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది. అది నయం కాని ఆరోగ్య సమస్య. యోగా చేస్తే కాస్తయినా ఫలితం ఉంటుందన్నారని మొదలెట్టాను. కానీ దానివల్ల ఉన్న ఇంకెన్ని లాభాలు ఉన్నాయో తెలిశాక ఇక వదిలి పెట్టలేకపోయాను.
* ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలి అంటే కావలసినది నిబద్ధత. సంతోషంగా ఉండాలి అంటే ఉండాల్సింది తృప్తిపడే తత్వం. పనిని మనస్ఫూర్తిగా చేస్తే విజయం వరిస్తుంది. ఉన్నది చాలని లేనిదాని కోసం వెంపర్లాడకుండా ఉంటే మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రెండు విషయాలూ తెలుసుకుంటే జీవితం సఫలమవుతుంది. ఇదే నా లైఫ్ ఫిలాసఫీ.
* నాకు డెరైక్షన్ చేయాలని ఉంది. కాకపోతే అందుకు నేను సూట్ కానేమోనని నా అనుమానం. ఎందుకంటే నేను చాలా హైపర్‌గా ఉంటాను. చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతాను. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఎదుటివాళ్లను డీల్ చేయలేరు. దర్శకులంటే మిగతా టెక్నీషియన్లను, నటీనటులను అందరినీ మేనేజ్ చేయాలి కదా! అది నేను చేయలేనేమోనని ఓ చిన్న డౌట్!
* ఏ స్థాయికి వచ్చినా, ఎంత సాధించినా ఆడది అనగానే ఓ చిన్నచూపు ఇప్పటికీ సమాజంలో ఉందని అనిపిస్తుంది నాకు. అమ్మాయి అనగానే ఏదో లోకువగా చూస్తారు. తను ఎంత సాధించినా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బయటకు వచ్చి ఏదైనా చేయాలని తపించే అమ్మాయిల గురించి మరీ త్వరగా కామెంట్ చేసేస్తుంటారు. అసలు అలా ధైర్యంగా అన్నీ సాధించగలుగుతున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
అంతేకానీ ఏదో రకంగా నెగిటివ్ కామెంట్లు చేసి, పిచ్చి రాతలు రాసి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అసలు నేను ఆడదానిగా పుట్టినందుకే ఎంతో గర్వపడుతూ ఉంటాను. అందుకే ఎవరైనా మహిళలు గడప దాటి బయటకు వచ్చి ఏదైనా సాధిస్తే వాళ్లమీద నాకు ఎంతో గౌరవం కలుగుతుంది!