గెలుపు | Special admiration To Selected story | Sakshi
Sakshi News home page

గెలుపు

Published Sun, Jul 24 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

గెలుపు

గెలుపు

ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ
పనికి, అలసటకి ఏనాడూ భయపడలేదు శిరీష. ఆఫీసు పని పట్ల వ్యతిరేకతా లేదు. ఎటొచ్చీ వ్యక్తిగత జీవితంలోకి చొరబాటునే వ్యతిరేకిస్తోంది. దానివల్లే కష్టమంతా. ఉద్యోగం పోతుందని భయం వుందా అంటే... ఉంది. అది తనకే కాదు. ఎవరికేనా, ఎప్పుడేనా జరగవచ్చు. కానీ తన విషయంలో మెడమీద కత్తి లాంటి పరిస్థితి.
 
ప్రాజెక్ట్ వెంటనే మరో ప్రాజెక్ట్... తరచుగా ప్రయాణాలు, సరిగా నిద్ర లేని రాత్రులు... పని చాలా ఎక్కువగా, ఒత్తిడిగా వుంటోంది శిరీషకి. ఈ ఐటీ రంగంలో ఇవన్నీ వుంటాయని తెలుసు. తెలిసే భరిస్తోంది. కానీ, ఇది సహజంగా ఏర్పడ్డ పరిస్థితి కాదు. కావాలని సృష్టిస్తున్నది. దానికి కారణం ఎవరో కూడా తెలుసు. త్రినాథ్. ఆ కంపెనీ సర్వ అధికారాలు చేతిలో ఉన్న త్రినాథ్.
 
పనికి, అలసటకి ఏనాడూ భయపడలేదు శిరీష. ఆఫీసు పని పట్ల వ్యతిరేకతా లేదు. ఎటొచ్చీ వ్యక్తిగత జీవితంలోకి చొరబాటునే వ్యతిరేకిస్తోంది. దానివల్లే కష్టమంతా. ఉద్యోగం పోతుందని భయం వుందా అంటే... ఉంది. అది తనకే కాదు. ఎవరికైనా, ఎప్పుడైనా జరగవచ్చు. కానీ తన విషయంలో మెడమీద కత్తి లాంటి పరిస్థితి. అధికారం చేతిలో వున్న త్రినాథ్‌తో పోరాటం.
 
ఏమైనా, రోజు ఆహ్లాదంగా వుండటం లేదు. ఆఫీసంటేనే, శరీరంలోని నరాలన్నీ ముడిపడినట్టు, కడుపులో ఏదో అయిష్టత కలయ తిరుగుతున్నట్లు అసౌకర్యం శిరీషకి. మనసు, శరీరం కూడా బావుండటం లేదు.
 అసలు విషయంలో గందరగోళమేం లేదు. తన ఉద్దేశం ఏమిటో, తనకేం కావాలో శిరీషతో సూటిగానే చెప్పాడు త్రినాథ్. ఆ విషయమే కాదు, త్రినాథ్ అలా చెప్పటమే అయిష్టమనిపించింది శిరీషకి.
 
త్రినాథ్ చెప్పింది కొత్తగా వుంది. అంతకుముందు అలాంటి కోరికల గురించి ఎప్పుడూ వినలేదు శిరీష.
 ఆ రోజు... చాలా నెలల క్రితం... త్రినాథ్ కేబిన్‌లో వుంది శిరీష. ఇంక ఎవరూ లేరు. ఇద్దరే ఉన్నారు. సాయంత్రం... టీ తాగుతున్నారు. అకస్మాత్తుగా ఆ విషయం మాట్లాడాడు త్రినాథ్.
 
‘‘మన ఉద్యోగాలలో టెన్షన్ వుంటుంది. ఎంతో స్ట్రెస్ వుంటుంది. అది నీకూ తెలుసు. ఎంతో కష్టపడి, జీవితంలో ఎన్నింటినో వదులుకుని, ఓ పొజిషన్ సాధిస్తాం. ఆ పొజిషన్‌ని ఎంజాయ్ చెయ్యటం నా ధ్యేయం. నువ్వంటే నాకు ఇష్టం. అంతకన్నా ఎక్కువగా మోహం, పేషన్. నాతో కలిసి టైమ్ గడుపు. డిన్నర్స్, పార్టీలు, ఏదైనా ఊళ్లు వెళ్లటం... అలా నీ నుంచి నాకు సెక్సేం వద్దు. కావల్సిందల్లా చనువుగా ఉండటం, కొంత స్పర్శ, కొన్ని కౌగిలింతలు, కొన్ని కిసెస్. అంతే!’’
 
త్రినాథ్ అదే ధోరణిలో అలా చెప్పాడు. దానివల్ల అతని స్ట్రెస్ రిలీజ్ అవుతుందన్నాడు. జీవితం ఎంజాయింగ్‌గా వుంటుందన్నాడు. ఉద్యోగ జీవితంలోని కష్టానికి ఈమాత్రం రిలీఫ్ తప్పు లేదన్నాడు. దీనికి శిరీష అంగీకరించనందుకు, ఆమెకి ఎదురయ్యే కష్టాలేమిటో చెప్పాడు. అంగీకరిస్తే ఎన్నో ఫేవర్స్, సౌకర్యాలు. శిరీష రోజూ స్కూటర్ మీద ఇరవై అయిదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటి నుంచి ఆఫీసుకి వస్తుంది. ఒక్కోసారి ఇల్లు చేరటానికి రాత్రి పదకొండవుతుంది. శిరీష ఒప్పుకుంటే ఈ శ్రమే ఉండదు. ఇంటి నుంచి తీసుకొచ్చి మళ్లీ దింపటానికి కారు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే పనిచేసే వీలు... ఇలా చాలా సౌకర్యాలు. అయినా శిరీష ఒప్పుకోలేదు. కష్టానికే సిద్ధపడింది.
 
‘‘నువ్వు అనుభవం లేనిదానివి కావు. అయినా ఆ అనుభవం నేను అడగటం లేదు. ఎందుకు నీకింత పంతం. నేను చెప్పినట్టు విను. సుఖపడు. ఏదోనాటికి నువ్వే ఒప్పుకుంటావు. నాకు ఆ నమ్మకం వుంది. మీ ఇంటి పరిస్థితి, నీ కమిట్‌మెంట్స్ నాకు తెలుసు. ఇంత మంచి జీతం వచ్చే ఉద్యోగం వదులుకోలేవు. ఎప్పటికైనా నా పంతమే నెగ్గుతుంది’’ అని అవకాశం దొరికినప్పుడల్లా చెపుతూనే ఉన్నాడు త్రినాథ్.
 
నిజమే, త్రినాథ్ చెప్పినట్టు తను అనుభవం లేనిది కాదు. శ్రీధర్‌తో ఏడాది పాటు సహజీవనం చేసింది. అందువల్లే మోజుగా వున్నప్పుడు మగవాడి నైజానికి, మోజు తగ్గిన తర్వాత మగవాడి నైజానికి మధ్య వున్న తేడా తెలిసింది. కొత్తలో శ్రీధర్ వేరు. ఏడాది తిరిగేటప్పటికి అతని సున్నితత్వం, నైసిటీస్ అన్నీ అంతరించిపోయాయి. మామూలుగా పెళ్లి చేసుకోవటం కన్నా, కలిసుండి సాధించుకోగలిగిన దగ్గరతనం ఎక్కువన్న భ్రమ తొలగిపోయింది. శ్రీధర్‌తో అలా ఉండి, విడిపోయినందువల్ల త్రినాథ్ చెప్పినట్టు చెయ్యాలనేం లేదు. పాత విలువలు పలచబడ్డాయి. కొత్త విలువలు పూర్తిగా నిలదొక్కుకోలేదు. ఇదో సంధి కాలం. ఆడ, మగ సంబంధాల విషయంలో, ఇది మరింత నిజం. ఈసారి తనెవరికైనా దగ్గరైతే, తొందరపాటుతోనో, ఒత్తిడితోనో కాకూడదు. పరిపూర్ణ విశ్వాసంతో జరగాలి.
 
దేనికోసమో చేసుకునే ఒప్పందంలా, త్రినాథ్ ప్రపోజల్ అసలు నచ్చలేదు. అతని వింత కోరికలూ అయిష్టమే. ‘నిన్ను వేటాడుతూ వుంటాను, కానీ చంపను. చంపుతానేమో అన్న భయంతో హింసిస్తుంటాను’ అని పిల్లి ఎలుకతో సంప్రదించినట్టుంది, త్రినాథ్ వ్యవహారం.
 శిరీష అయిష్టత, అసమ్మతి త్రినాథ్‌కి తెలుసు. అయినా అతని ధీమా అతనిది. చేతిలో వున్న అధికారం మీద విశ్వాసం. అది ఎటువంటివారినైనా లొంగ దీస్తుందన్న నమ్మకం. అందుకే రకరకాల పనులతో హింసిస్తూనే ఉన్నాడు.
   
శిరీష తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేదు. అలా అని భరించనూ లేదు. శారీరకంగా, మానసికంగా రోజురోజుకీ బలహీనపడుతోంది. ఇది గమనిస్తూనే ఉన్నాడు త్రినాథ్.
 శిరీష బలహీనపడుతున్న కొద్దీ, తను గెలుపుకి దగ్గరవుతున్నట్టే అన్నది త్రినాథ్ నమ్మకం. అతని వింత సంతోషం రోజురోజుకీ పెరుగుతోంది.
 
మరీ తట్టుకోలేని, ఏ బలహీన క్షణంలోనైనా... ‘పోనీ త్రినాథ్ చెప్పినట్టు ఒప్పుకుంటే, ఈ నరకం తప్పుతుందిగా...’ అని శిరీషకి అనిపించాలి. కానీ అలా కూడా ఎప్పుడూ శిరీష ఆలోచన అటువైపు పోలేదు.
 ‘శిరీష ఉద్యోగం వదలదు. వదిలేసి వేరే చోట ప్రయత్నం చెయ్యాలన్నా, ఈ ఆఫీసు నుంచి మంచి రిపోర్ట్ కావాలి. అది తన దగ్గర నుంచే జరగాలి. అందువల్ల శిరీష ఇక్కడే వుంటుంది. ఉండి ఎంత కాలం తట్టుకుంటుంది. మరో దారి లేక ఈల్డ్ అవుతుంది’ అని త్రినాథ్ ఎత్తుగడ.
 ‘ఓపిక అస్సలుండటం లేదు. డిప్ప్రెస్డ్‌గా వుంటోంది. ఇలాగే గడపాలంటే ఎంతో కాలం సాధ్యం కాదు. ఏం చెయ్యాలి? క్రమేపీ సూసైడ్ టెండెన్సీ.... ఆత్మహత్య ఆలోచనలూ వస్తున్నాయి’. అదీ శిరీష పరిస్థితి.
 
ఉద్యోగం అంటే శ్రమించటం, తెలివితేటలతో పనిచేసి ఫలితం సాధించటం. అందుకు తగిన ప్రతిఫలం పొందటం. ఇది గతంలోని ఓ సామరస్య పద్ధతి. ఇప్పుడు కొన్ని రంగాలలో ఉద్యోగం అంటే రాత్రి, పగలు తేడా లేని శ్రమ. జీవితంలోని మిగిలినవాటినన్నిటినీ పక్కన పెట్టే పరుగు. భద్రత లేని నిత్య సంఘర్షణ. పుష్కలంగా ఆదాయం ఉన్నా మనశ్శాంతి లేని మనుగడ.
 
లక్షల్లో ఆదాయం. అయినా డబ్బు సరిపోని విచిత్ర స్థితి. ఓ ఆర్థిక ఇంద్రజాలం. వీటికి తోడు పంతాలు, పట్టింపులు. వింత కోరికలు. మనో వైకల్యాలు.
 అధికారం డబ్బుని, డబ్బు అహంకారాన్ని, అహంకారం ఇగోని కల్పిస్తున్న మనస్థితి. పొందటమే ధ్యేయం.
 త్రినాథ్ నమ్మకంగా ఎదురుచూస్తున్నాడు. శిరీష బలహీనపడీ పడీ లొంగి తీరుతుందని అతని ధీమా. ఆఫీసులో హింసని తట్టుకుని నిలబడటం అంత తేలిక కాదు. అందులో ఓ మగవాడు పూనుకుని అధికార బలంతో ఆడదాన్ని పెట్టే హింస. ఏదైనా జరగటానికి అన్ని రకాల అవకాశం వుంది. ఎన్నో కార్యాలయాల్లో, ఎందరెందరో ఆడవాళ్లు మౌనంగా భరిస్తున్న బాధ.
   
 నిజంగా ఆశ్చర్యమే. త్రినాథ్‌కి తల తిరిగినట్టైంది.
 శుక్రవారం ఆఫీసు నుంచి వెడుతూ, తన రాజీనామా ఇచ్చింది, శిరీష.
 త్రినాథ్‌కి షాక్ శిరీష రాజీనామా... అతని అధికార గర్వానికి తలవొంపు.
 అతనికి తెలియదు కానీ, వెంటనే సోమవారం నాడే మరో కంపెనీలో, కొత్త ఉద్యోగంలో చేరింది శిరీష.
 రిలీవింగ్ లెటర్ లేకుండా, ఏ ఎంక్వయిరీ తమని అడగకుండా, ఎవరైనా శిరీషకి ఉద్యోగం ఇస్తారని త్రినాథ్ అనుకోలేదు.
 
కొత్తచోట ఇంటర్వ్యూకి వెళ్లిన నాడే, తనున్న పరిస్థితి వివరించింది శిరీష. లోపాయికారిగా, తన గురించి వివరాలు కావాలంటే తెలుసుకోమంది.
 కొత్త కంపెనీవాళ్లు చెయ్యాల్సినది చేశారు. శిరీషని నిస్సందేహంగానే ఉద్యోగంలో చేర్చుకున్నారు. తేడా అల్లా కొత్త కంపెనీ అధికారి పేరు మనోజ్ఞ. స్త్రీగా ఆమెకి ఆ హింస, బాధ తెలుసు. త్రినాథ్ మీద గెలుపు శిరీషదే కాదు... వ్యక్తిగతమే కాదు. ఓ నిబ్బరానిది, ఓ తెగకి అందిన చేయూతది.
- వి.రాజారామ‌మోహ‌న‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement