చరిత్రలో ఒక ఉదారవాది | Special story to V. S. Srinivasa Sastri | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఒక ఉదారవాది

Published Sun, Jun 3 2018 12:15 AM | Last Updated on Sun, Jun 3 2018 12:15 AM

Special story to V. S. Srinivasa Sastri - Sakshi

స్వాతంత్య్రోద్యమ చరిత్ర పేరుతో మన పాఠ్య పుస్తకాలలో కనిపించేది భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర మాత్రమే. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర (1857) మినహాయిస్తే మిగిలిన చరిత్రంతా భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రే. జాతీయ కాంగ్రెస్‌తో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సంస్థలు ఉన్నా, వాటి చరిత్రకు తగిన స్థానం కల్పించలేదు. అదే జరిగి ఉంటే జాతీయ కాంగ్రెస్‌ కంటే ముందే ఆరంభమైన గిరిజన పోరాటాలు, జాతీయ కాంగ్రెస్‌ పోరాటంతో సమాంతరంగా మైదానాలలో జరిగిన రైతాంగ పోరాటాలు, తీవ్ర జాతీయవాదంతో విదేశీ గడ్డ మీద నుంచి ఉద్యమించిన గదర్, హెచ్‌ఆర్‌ఏ వంటి సంస్థల త్యాగాలు, ఆఖరికి పూర్తి రాజ్యాంగ పంథాలో ఉద్యమానికి అంకితమైన లిబరల్‌ పార్టీ గురించి కూడా గొప్ప వివరాలు తెలియవు. కాబట్టే స్వరాజ్య సమరంలో ఎంతటì  త్యాగాలు చేసినా, వారు ఎంతటి మహానుభావులైనా కొందరి పేర్లు చరిత్ర పుస్తకాలలో కానరావు. నిజానికి ఆ సంస్థలో సర్వం త్యాగం చేసిన వారి చరిత్రకు కూడా చరిత్ర గ్రంథాలలో తగిన స్థానం కనిపించదు. ఇక గాంధీజీ సిద్ధాంతాలతో ఏదో ఒక దశలో విభేదించి తమదైన మార్గంలో పోరాటాలు చేసిన వారి పేర్లు కూడా కనుమరుగు కావడం మరొక విశేషం. అలాంటివారిలో ఒకరు వీఎస్‌ శ్రీనివాసశాస్త్రి. 

వాళంగైమన్‌ శంకరనారాయణ శ్రీనివాసశాస్త్రి (సెప్టెంబర్‌ 22,1869–ఏప్రిల్‌ 17, 1946) రాజకీయ జీవితం, ఉద్యమం, జాతీయోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనవి. శ్రీనివాసశాస్త్రి గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు. గోఖలే శిష్యులుగా ఖ్యాతి గాంచిన తేజ్‌ బహదూర్‌ సప్రూ, జిన్నాల వలెనే శాస్త్రి కూడా కానిస్టిట్యూషనలిస్ట్‌. ఉద్యమం, హక్కుల సాధన రాజ్యాంగ బద్ధంగా మాత్రమే జరగాలన్నది వీరి ఆశయం. గోఖలేను గురువుగా భావించిన గాంధీజీ శాస్త్రిని ప్రియ సోదరుడా అని సంబోధించేవారు. శ్రీనివాసశాస్త్రి తంజావూరు జిల్లాలోని వాళంగైమన్‌ అనే గ్రామంలో పుట్టారు. తండ్రి పూజారి. కాబట్టి ఎంత శోత్రియ కుటుంబమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ ఆంగ్ల భాషలో ఆయన కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడమే విశేషం. తరువాత వారి కుటుంబం కుంభకోణం తరలివచ్చింది. అక్కడే ఆయన విద్యంతా సాగింది.   ప్రతి తరగతిలోను ప్రథమ స్థానంలో నిలుస్తూ, ఉన్నత విద్య వరకు ఉచితంగా ఆయన విద్యాభ్యాసం చేశారు. కుంభకోణంలోనే బీఏ చదువుతూ ఉండగా ఇంగ్లిష్‌ పరీక్ష రాయడానికి శాస్త్రి మద్రాస్‌ నగరానికి (1887) వచ్చారు. అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సభలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడే శ్రీనివాసశాస్త్రి సురేంద్రనాథ్‌ బెనర్జీ ఉపన్యాసం విన్నారు. అప్పటికే ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ అయిన బెనర్జీ ఉపన్యాసం, అందులో ధార, ధారణ శాస్త్రిని వివశుడిని చేశాయి. బెనర్జీకి భక్తునిగా మారిపోయారాయన. తరువాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, అంచెలంచెలుగా మద్రాస్‌ ట్రిప్లికేన్‌లోని హిందూ ఉన్నత పాuý శాల ప్రధానోపాధ్యాయుడయ్యారు. 

గురుశిష్య సంబంధాన్ని ఆయన మలచి తీరు ఒక నమూనాగా మారిపోయింది. ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ఆయన స్థాపించి, వారి డిమాండ్లకు గొంతునిచ్చారు. ఎక్కడా సహకార వ్యవస్థ ఆవిర్భవించని కాలంలో సహకార వ్యవస్థను కూడా ఆయన తన సంఘంలో పరిచయం చేశారు. విద్యార్థులతో బయట ఎంత ఉదారంగా వ్యవహరించేవారో, తరగతిలో అంత కఠోర క్రమశిక్షణ అమలు జరిపేవారు. శాస్త్రి ఖ్యాతి దేశవ్యాప్తమైందంటే అతిశయోక్తికాదు. ఆంగ్లంలో సిల్వర్‌ టంగ్డ్‌ ఆరేటర్‌ అన్న పేరు వచ్చింది. అలాంటి సమయంలోనే ఆయన హఠాత్తుగా ఉద్యోగానికి స్వస్తి పలికారు. జీఏ నటేశన్‌ అనే మిత్రుడు ‘కాన్షిడెన్షియల్‌’ అనే శీర్షికతో ఉన్న ఒక చిన్న కరపత్రాన్ని శాస్త్రికి అందచేశారు. అది గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో నడుస్తున్న సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఆశయాలను, సిద్ధాంతాన్ని, నియమాలను వివరించే కరపత్రం. అందులో ఆయనను బాగా ఆకట్టుకున్న అంశం– ప్రజా జీవితాన్ని ఆ«ధ్యాత్మికం చేయాలన్న ఆశయం. ఆ క్షణంలోనే ఆయన మనసు మారిపోయింది. గోఖలేకు వెంటనే ఒక లేఖ రాశారు. తన వయసు 37 ఏళ్లు అని, మిగిలిన జీవితంలో దేశం కోసం కేటాయించడానికి  ఎంత మిగిలిఉందో తన కు  తెలియదనీ, కాబట్టి వెంటనే తాను సేవారంగంలో ప్రవేశించదలుచుకున్నానని దాని సారాంశం. గోఖలే కూడా సంతోషంగా స్వాగతం పలికారు. గోఖలే నుంచి లేఖ రావడంతోనే ప్రధానోపా«ధ్యాయ పదవికి ఆయన రాజీనామా ఇచ్చేశారు. పిల్లలకు వీడ్కోలు చెబుతూ, రాముడికి కౌసల్య చెప్పిన ధార్మిక విషయాలను ప్రస్తావించారు. ఇక్కడ ఒక విషయం విస్మరించడానికి వీలు లేదు. శాస్త్రి చిన్నతనం నుంచి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్న పేదరికం ఆయన ఉద్యోగం వదిలేసి, నిస్వార్థదృష్టితో సేవా రంగంలోకి దిగిన క్షణం వరకు వెన్నంటే ఉంది. 

 స్వాతంత్య్ర సమరంలో కనిపించే అత్యంత అరుదైన మేధావి వర్గంలో ఒకరాయన. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన రాజనీతి తత్వవేత్తల ప్రభావం ఆయన మీద కనిపిస్తుంది. ఎడ్మండ్‌ బర్క్, హెర్బర్ట్‌ స్పెన్సర్, జాన్‌ స్టూవర్ట్‌ మిల్, మార్కస్‌ అరులియస్‌ రచనల ప్రభావం ఆయన మీద ఉంది. షేక్సిపియర్, వాల్టర్‌ స్కాట్, జార్జ్‌ ఇలియెట్, టీహెచ్‌ హక్సలీ, టాల్‌స్టాయ్, థామస్‌ హార్డీ, విక్టర్‌ హ్యూగో వంటి మహోన్నత సాహితీమూర్తుల రచనలన్నీ ఆయన చదివారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, రామాయణ కావ్యం మీద ఆయనకున్న పరిజ్ఞానం మరొక ఎత్తు. ఆ కావ్యం మీద ఆయన పలు రచనలు చేయడమే కాకుండా, ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. గోఖలే అనుచరులలో ఎవరికీ దక్కని గౌరవం శాస్త్రికి దక్కింది. గోఖలే మరణం (1915) తరువాత సర్వేంట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ అధ్యక్ష పదవి శాస్త్రిని వరించింది. రాజకీయ గురువు గోఖలేను అనుసరించి శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్‌ రాజకీయాలలోకి అడుగు పెట్టారు. 1907లో అది జరిగింది. నిజానికి ఆ సంవత్సరంలో సూరత్‌లో జరిగిన వార్షిక సమావేశాలు ఆ మహా సంస్థ చరిత్రలో మాయని మచ్చ వంటివి. అతివాదులు, మితవాదులు పేరుతో కాంగ్రెస్‌ చీలిపోయింది. గోఖలే, ఫిరోజ్‌షా మెహతాల అనుచరులు లోకమాన్య తిలక్‌ను వేదిక నుంచి బలవంతంగా దించివేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సభలో ఉన్న ఎవరో ఫిరోజ్‌షా లక్ష్యం విసిరారు. అది చూసిన శాస్త్రి వేదిక మీదకు పరుగున వెళ్లి ఫిరోజ్‌షాకు అడ్డంగా నిలవాలని అనుకున్నారు. ఆ బూటు వచ్చి సురేంద్రనాథ్‌ బెనర్జీని తాకి, ఫిరోజ్‌షా మీద పడింది. ఆ తరువాత సంవత్సరం మద్రాస్‌లో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశాల నాటికే శాస్త్రి కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు.

సప్రూ, జిన్నాలతో పాటు బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకువస్తున్న రాజ్యాంగ సంస్కరణలను సమీపంగా పరిశీలించిన వారిలో శాస్త్రి కూడా ప్రముఖులు. 1919 నాటి మాంటేగ్‌–చెమ్స్‌ఫర్డ్‌ చట్టం రూపకల్పనలో శాస్త్రి తన వంతు సాయం అందించారు. బాధ్యతాయుత ప్రభుత్వం అందించడానికి ప్రభుత్వం సరేనని చెప్పడమే శాస్త్రి తదతర మేధావులను తృప్తి పరిచింది. అయితే దీనిని కాంగ్రెస్‌లో ఒక వర్గం, గాంధీజీ ఆమోదించలేదు. ఆపై సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. దీనితో శాస్త్రి కాంగ్రెస్‌కు దూరంగా జరిగారు. ఈ పరిణామంతోనే కాంగ్రెస్‌కు దూరమై, దేశ చరిత్రలో పెద్ద మలుపునకు బీజం వేసినవారు జిన్నా. అప్పుడు జరిగిన మరో పరిణామం– నేషనల్‌ లిబరల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆవిర్భావం. కాంగ్రెస్‌లోని అతి,మితవాద వర్గాలు దేనికీ చెందకుండా, అనిబిసెంట్‌ నాయకత్వంలోని హోంరూల్‌ లీగ్‌కు సమీపంగా జరిగి, బ్రిటిష్‌ పాలకులకు ఆగ్రహం రాని విధంగా వ్యవహరించిన కానిస్టిట్యూషనలిస్టుల వేదికే ఈ ఫెడరేషన్‌. ఇందులో సప్రూ, జిన్నా, శాస్త్రి ప్రముఖులు. కానీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని శాస్త్రి అంగీకరించలేదు. దేశ విభజనను కూడా. దేశంలోని ఉదారవాదుల ప్రతిని«ధిగా రెండు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో (1930–31)  ఆయన పాల్గొన్నారు. అక్కడ శాస్త్రి ఉపన్యాసం విన్న తరువాత ఇంగ్లండ్‌ ప్రధాని డేవిడ్‌ లాయిడ్‌ జార్జి ఇక తనకు ఇంగ్లిష్‌ మాట్లాడాలంటే సంకోచంగా ఉందని అన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలు, పత్రికలు కూడా శాస్త్రి ఉచ్చారణను ప్రామాణికంగా తీసుకున్నాయి. తన గ్రంథం ‘మై ఎక్స్‌పీరియన్సెస్‌ విత్‌ ట్రూత్‌’ ఆంగ్ల చిత్తుప్రతిలో భాషను సరిచూసే పనిని గాంధీజీ శాస్త్రిగారికే అప్పగించారు. 1913లో మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆయనను ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ఈ సంగతి ఎలా ఉన్నా 1918 నాటికి ఆయన ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యునిగా రౌలట్‌ బిల్లును వ్యతిరేకించారు. అక్కడ బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల తనకున్న సానుకూలతను ఆయన నిస్సంశయంగా వదిలిపెట్టారు. గాంధీజీకి కూడా రౌలట్‌ బిల్లు, దీని పర్యవసానం జలియన్‌వాలా బాగ్‌తోనే ఆంగ్లేయుల రాజనీతిజ్ఞత మీద సందేహాలు మొదలైనాయి. జిన్నా కూడా ఆ బిల్లును తీవ్రంగా విమర్శించి కౌన్సిల్‌కు రాజీనామా కూడా ఇచ్చారు. 

శాస్త్రి నాడు జరిపిన విదేశీ పర్యటనలు, వాటి ప్రాధాన్యం మరో ముఖ్యమైన అంశం. 1922లో వాషింగ్టన్‌లో జరిగిన నావికా ఆయుధ సంపత్తి పరిమితి మీద ఏర్పాటైన సదస్సుకు శాస్త్రిని ఆంగ్ల ప్రభుత్వం ప్రతినిధిగా పంపించింది. ఆ తరువాత సంవత్సరం ఇంగ్లండ్‌లో పర్యటించి కెన్యాలోని భారతీయులకు సమాన హక్కులు ఇవ్వాలని ప్రచారం చేశారు. మలేసియాలోని భారతీయ కార్మికుల బాగోగుల గురించి దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సంఘంలో కూడా శాస్త్రిని ఆంగ్ల ప్రభుత్వం సభ్యునిగా నియమించింది. ఇంగ్లండ్‌లో చాలా అరుదుగా ఇచ్చే పౌర పురస్కారం రైట్‌ ఆనరబుల్‌ను నాటి ప్రభుత్వం శాస్త్రికి (మాంటేగ్‌కు కూడా ఇదే బిరుదు ఉండేది) ఇచ్చింది. ఒకసారి నాగ్‌పూర్‌లో విద్యార్థులను ఉద్దేశించి శాస్త్రి వేసిన ప్రశ్నతో ఇది ముగించవచ్చు. 1905 నుంచి 1946 వరకు జరిగిన భారత స్వాతంత్య్రోద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయనే ఒక సందర్భంలో ఆ ప్రశ్న సంధించారు. ‘రాజకీయవేత్త జంటిల్మెన్‌ కాగలడా?’ అని. దానికి ఆయన సమాధానం సరే. అది ఎంతో ఆదర్శనీయంగా కూడా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే సమాధానం ఏమిటి?                                       ·
∙డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement