పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ‘ఏపీ పునర్విభజన చట్టం–2014’లోని అంశాలు పరిష్కరించకుండా కేంద్రం సాచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు గడిచినా విభజన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా, ఉపయోగం లేకుండా పోయింది. పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు 91 సంస్థ లను, అదేవిధంగా షెడ్యూల్ 10లోని ఏపీ స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్‌తో పాటు 142 సంస్థల్లోని ఆస్తులు, ఇతర లావాదేవీలను 48:52 ప్రకారం విభజించాల్సి ఉన్నది. కానీ కేంద్రం దేన్నీ తేల్చకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నది.
విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థల్లో షీలా భిడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను పంచింది. రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై భిడే కమిటీ చేసిన సిఫార్సులను రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్ర్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్ 64 ప్రకారం పంచుకోవా లని ఏపీ అడుగుతోంది.
ఇదీగాక తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్‌యూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల విభజన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిల్మ్ డెవలప్‌మెంట్, టీఎస్ ఎంఎస్‌ఐడీసీ, మినరల్ డెవలప్మెంట్ సంస్థ వంటి ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. 2014 నుండి, చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో మొత్తం 29 సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అయినప్పటికీ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.
గోదావరి, కృష్ణా నదీజలాల వాటాల పంపిణీలోనూ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నది. దేశంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తి నప్పుడు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, 262 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. 575 టీఎంసీల నీటి వాటా కోసం కృష్ణా నదీ జలాల పంపకం అంశాన్ని ట్రిబ్యునల్‌కు పంపాలని తెలంగాణ కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అభ్యర్థన లన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తు న్నది. తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కాగా ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేసింది. అలాగే ఏపీలోని పోలవరానికీ జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది.
ఉన్న చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నవోదయ పాఠశా లలు ఇవ్వకపోగా తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. ‘ఆస్తుల విభజన చేపట్టకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. తగు మాత్రంలో నిధులు అందకపోవడం, విభజన చట్టం ప్రకారం ఆస్తుల విభజన చేపట్టకపోవడంతో... ఆంధ్రాలోని ప్రభుత్వ సంస్థలు తీవ్రంగా ప్రభావిత మవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 1,59,096 మంది ఉద్యోగుల పరిస్థితి విభజన జరిగిన 2014 నుంచి డోలాయమానంలో ఉంది. సరిగా విభజన జరగకపోవడమే దీనికి ఏకైక కారణం. విభజన తర్వాత రిటైరైన ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పదవీ విరమణ సమయంలో వారికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆస్తులు విభజించి ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలి’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు కేంద్ర ప్రభుత్వానికీ, తెలంగాణకూ నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని
కోరింది. సహజంగా ఏ రాష్ట్రమైనా తనకు లాభం జరగాలనే చూస్తుంది. అయితే విభజన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కావాలనే సమస్యను నాన్చుతున్నది. మొత్తంగా రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధించడంలో కేంద్రం విఫలం కావడం వల్లే, సమస్య కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పటికైనా హక్కుగా ఏ రాష్ట్రానికి ఏం దక్కుతుంతో తేల్చి చట్టప్రకారం సంస్థలు, ఆస్తుల విభజన చేపట్టాలి.
బచ్చు శ్రీనివాస్
వ్యాసకర్త బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు
మొబైల్: 93483 11117
Comments
Please login to add a commentAdd a comment