ఆయన పేరు ఆనందు. ఆనందు కళ్లలోకి సూటిగా చూస్తే... ‘అప్పులోనే ఆనందం ఉంది’ అని చెబుతాయి ఆ కళ్లు. ఆనందును ఆ పేరుతో కాకుండా ‘అఆ’ (అప్పుల ఆనందు) అని పిలుస్తుంటారు అందరూ. ఆ నోటా ఈ నోటా విన్న ఆయన ఆటోబయోగ్రఫీ ప్రకారం... ప్రైమరీ స్కూల్ రోజుల్లో ఆనందు పక్క సీటు వాడి దగ్గర బలపాలు అప్పు చేసేవాడు. ‘‘మొన్న నా బలపం తీసుకున్నావు. ఇవ్వు’’ అని బలపం అప్పిచ్చిన వాడు అడిగితే, ఆనందు అమాయకంగా ముఖం పెట్టి బిగ్గరగా ఏడ్చాడు. ‘‘ఏమైంది?’’ అని పంతులుగారు ఆరా తీస్తే... ‘‘ఈడు నన్ను బలపం ఇవ్వమని కొడుతున్నాడు’’ అని ఏడుపు పొడిగించాడు. వీడి ఏడుపుకు గుండె కరిగిన పంతులుగారు ఆవేశపడిపోయి ఆనందు ఫిర్యాదు చేసిన వాడిని ఓ రేంజ్‌లో బాదారు. పంతులుగారు క్లాసురూమ్ దాటి బయటికి వెళ్లగానే.... ‘బలపం కావాలట బలపం...గిల్పం కావాలట గిల్పం’ అంటూ బాధితుడ్ని వెక్కిరించాడు ఆనందు.
ఈ ఆనందు అప్పుల ఆగడాలు బలపాలతో ఆగలేదు. హైస్కూల్ రోజుల్లో టెక్ట్స్‌బుక్‌లు అప్పు అడిగేవాడు. ‘నీ సోషల్ బుక్ ఒక్కసారి ఇవ్వరా’ అని ఎవరో ఒకరి దగ్గర పుస్తకం తీసుకుంటాడు. అంతే... వారం దాటినా ఆ పుస్తకం జాడ తెలియదు. అరువు తెచ్చుకున్న పుస్తకాన్ని ఇంట్లో పాత పెట్టెలో దాచుకొని పదేపదే మురిసిపోయేవాడు. ‘అయ్యో! బుక్‌ను ఎలుకలు కొట్టేశాయి’ అంటూ స్నేహితుని చెవిలో పువ్వు పెట్టేవాడు. ఇక ఇంటర్ రోజుల్లో షర్ట్‌లు, ప్యాంట్‌లు అప్పు చేసేవాడు. ‘‘అరే మామా! నీ షర్ట్ సూపర్‌గా ఉంది. ఒకసారి వేసుకొని ఇస్తాను’’ ఎవరో ఒక ఫ్రెండ్‌ను అడిగేవాడు. ‘‘అలాగే’’ అని అమాయకంగా ఇచ్చేవాడు ఆ ఫ్రెండ్. వారం రోజులు దాటినా ఇచ్చిన షర్ట్ తిరిగి రాకపోయేసరికి... ‘‘షర్ట్ ఎప్పుడిస్తావురా?’’ అని వీలైనంత దీనంగా అడిగేవాడు షర్ట్ ఓనరు. ‘‘నీ షర్టు ఎడమజేబు మీద చిన్న చిన్న పువ్వులు డిజైన్ చేయిస్తున్నాను. పూలరంగడు సినిమాలో నాగేశ్వర్రావు షర్ట్‌లా ఉంటుందనుకో’’ అని నమ్మబలికేవాడు. ‘‘అబ్బే! నీకెందుకు అనవసరంగా ఖర్చు’’ అనేవాడు షర్ట్ ఇచ్చిన వాడు మొహమాటంగా.
‘‘ఫ్రెండ్‌షిప్ అన్నాక డబ్బు గురించి అతిగా ఆలోచించొద్దు’’ అనేవాడు ఆనందు గంభీరంగా. మంచితనం, మమకారం, ఆప్యాయత, అనురాగం, స్నేహధర్మం, త్యాగ్యనిరతి...మొదలైన వాటికి తలదాచుకోడానికి లోకంలో ఎక్కడా చోటు లేక ఆనందులో కొలువున్నవి అనుకునేవాడు షర్ట్ ఓనరు అమాయకంగా. ఒక్క వారం కాదు... ఎన్ని వారాలు గడిచిపోయినా ఆ షర్ట్ ఏమైందో తెలిసేది కాదు. పూలరంగడు ఏమయ్యాడో తెలిసేది కాదు. ‘‘మొన్న ఒక ఫంక్షన్‌లో ఆనంద్‌గాడు నీ షర్ట్ వేసుకొని కనిపించాడు!’’ అని ఎవరో ఒకరు చెవిలో వేస్తే ఏడవాలో, నవ్వాలో తెలియక రెండిటినీ మిక్స్ చేసి ఏడుపుగొట్టు నవ్వు నవ్వేవాడు షర్ట్ ఓనరు. పుస్తకాలు పెద్దగా చదవకపోయినా ముళ్లపూడి వారి ‘రుణానందలహరి’ పుస్తకం అంటే ఆనందుకు అమితమైన ఇష్టం.
అందులో ఒక పద్యం ఉంటుంది ఇలా... ‘అప్పులు చాలా చేసితిని యర్హత లేదనబోకు లోకమం దప్పులు తప్పులు న్నెరుగనేరని వారెవరైన నుందురే అప్పులస్వామి యా వరుణ, డప్పుల కుప్పలు మేఘవార్నిధుల్ తప్పగునా రుణంబు? రుణదా! శరధీ! కరుణాపయోనిధి!’ రేడియోలో సుప్రభాతం వస్తున్న టైమ్‌లో ఈ పద్యాన్ని రోజూ నిష్ఠగా చదువుకునేవాడు ఆనందు. అలాంటి ఆనందు ఒక ఉద్యోగంవాడయ్యాడు. ఆనందు మాంచి మాటకారి. ఎంత బిగుసుకుపోయిన వాడినైనా ఒక్కరోజులో ఫ్రెండ్‌గా మార్చుకోగలడు. మూడురోజుల్లో క్లోజ్‌ఫ్రెండును చేసుకోగలడు. వారం తిరిగేలోపు తనకు ప్రేమతో అప్పు ఇచ్చేలా చేసుకోగలడు. ఎన్నో ఉద్యోగాలు మారిన ఆనందు ఎందరో మహానుభావుల దగ్గర ఎన్నో అప్పులు చేశాడు. ఆ అప్పుల పుణ్యమా అని ఆనందు ఆర్థికపరిస్థితి మారిపోయింది. కొండాపూర్‌లో ఖరీదైన ఇళ్లు కట్టుకున్నాడు.
ఆ ఇంటికి ‘రుణానందలహరి’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆ ఇంటి గోడలపై అక్కడక్కడా ‘రుణానందలహరి’లో నుంచి ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. ‘సూర్యుడు సముద్రుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆయన దగ్గర నుంచి భూమి అప్పు తీసుకుంటుంది. దాన్ని సముద్రుడు వాడేసుకుంటాడు. మళ్లీ పై వాడికి అప్పులిస్తాడు’ ‘గొప్పవాళ్లలో అప్పు చేయని వాడెవడు?’ ఒకానొక రోజు ఆనందు గుండెపోటుతో గుటుక్కుమన్నాడు. ఆ ఇల్లు జనాలతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ఏడుపులే! ‘‘ఈయనకు ఇంత ఫాలోయింగ్ ఉందా?’’ అని అప్పారావు సుబ్బారావుని అడిగాడు. ‘‘ఫాలోయింగా పాడా! ఇక్కడ ఏడుస్తున్న వాళ్లంత ఆయన ఆత్మీయులు కాదు...అప్పులు ఇచ్చిన వాళ్లు! నిన్నటి వరకు తమ అప్పు ఏరోజుకైనా తీర్చకపోతాడనే చిన్న ఆశ ఉండేది. చివరికి ఆ ఆశ కూడా తుపాన్‌లో దోశలా కొట్టుకుపోయింది. అదీ విషయం’’ అని చెప్పాడు సుబ్బారావు.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment