చిన్నతనంలోనే కొన్ని కారణాల వల్ల తల్లి నుంచి వేరుపడిన కొడుకు, తన తల్లితో నేనే నీ కొడుకుని అని పరోక్షంగా చెప్పే సందర్భంలో పాట రాయమని పూరి జగన్నాథ్ అడిగారు. నాకు వెంటనే మహాభారతం, శకుంతలోపాఖ్యానంలో నన్నయ రాసిన పద్యం గుర్తుకు వచ్చింది. శకుంతల తన చిన్ని కుమారుడిని వెంట పెట్టుకుని దుష్యంతుడి సభకు వెళ్లి, తనను స్వీకరించమని అడిగితే, ‘నువ్వు ఎవరో నాకు తెలియదు’ అంటాడు. ఆ సందర్భంలో ‘విపరీతార్థములేటికి’... అనే పద్యం చెబుతుంది శకుంతల. కుమారుడిని ఆలింగనం చే సుకుంటే, ఆ కుమారుడు తనవాడో కాడో తెలుస్తుందని చెప్పే ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. ఇక్కడ లోఫర్ చిత్ర కథలో... తన ఎదురుగా ఉన్న వ్యక్తి తన కొడుకేనని తల్లికి తెలియదు. కాని ఆవిడ తన తల్లి అని కొడుక్కి తెలుసు. ‘అమ్మా! నేను నీ కొడుకుని, నన్ను గుర్తు పట్టు’ అనే సన్నివేశానికి తగ్గట్టు ఈ పాట రాయాలి. చిన్నప్పుడే తల్లి నుంచి వేరు పడ్డ కొడుకు పాడే పాట ఇది.
సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా
నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపులో పేగును అడుగు
మన ఇద్దరి నడుమన ముడి ఏందో
అది గొంతెత్తి సెప్పుతాది ఇనుకోవే
దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా
ఏలో ఏలో ఏలో ఏలా ఏలా
నేను ఊగింది నీ ఒడూయల్లో
ఏలో ఏలో ఏలో ఏలా ఏలా
నువ్వే సెప్పాలి అమ్మ అమ్మెవ్వరో
ఈ పల్లవిలో తాను ఆ తల్లి గీసిన బొమ్మనని ఆ తల్లి ఎదురుగా నిలబడి పాడతాడు.
మాతృత్వాన్ని ప్రతిబింబించే పాట ఇది. నా జీవితాన్ని మా అమ్మ ప్రభావితం చేసింది. నా చేత పుస్తకాలు చదివించింది. ఒక స్త్రీని నేను గౌరవంగా చూస్తున్నానంటే అందుకు మా అమ్మ కారణం. అందరిలోనూ ఆవిడను చూస్తాను. అదే ఈ పాటలో చూపాను. తల్లి పేగు బంధం చెప్పరానిది. తల్లీకొడుకుల మధ్య ఉండే బంధం చెప్పరానిది. ఆ బంధాన్ని వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. ఆ తల్లి ఒడి అనే ఊయల్లోనే పసిపాప ఊగుతూ హాయిగా నిద్రిస్తుంది. అమ్మ ఎవరు అనే విషయాన్ని అమ్మే చూపుతుంది. తన చేతితోనే తల్లి బిడ్డకు ప్రపంచాన్ని చూపుతుంది. అటువంటి తల్లికి దూరమైన కొడుకు కంటికి తల్లి కనిపిస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవు.
ఇక చరణంలో
1. కాళ్ల మీద బజ్జోపెట్టి లాల పోసినావో ఏమో
మళ్లీ కాళ్లు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు
ఎండి గిన్నెల్లో ఉగ్గుపాలు పోసి
నింగి సందమామను నువ్వు పిలవలేదా
అవునో కాదో నువ్వు అడగవమ్మా
మబ్బు సినుకై సెబుతాది నీకు ఎన్నెలమ్మ
దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా
బాల్యంలో తల్లి పసిపాపను కాళ్ల మీద పడుకోబెట్టుకుని లాల పోస్తుంది. ఆ కాళ్ల మీదే పసిపాపకు జోల పాడుతుంది. వెండి గిన్నెతో ఉగ్గుపాలు పోస్తుంది. ఆకాశంలో ఉన్న చందమామను పిలిచి కిందకు తీసుకువస్తుంది. అంతటి ఉన్నతమైన తల్లి తన చెంత ఉంటే చాలు, తనకు దునియాతో పనేమీ లేదంటాడు. తల్లి తన గర్భంలో బిడ్డకు ఒక ఆకారం తీసుకువస్తుంది. తన రక్తాన్ని పాలుగా మార్చుతుంది. అంతటి ఉన్నతమైన తల్లికి తాను దూరమయ్యానని బాధపడతాడు తనయుడు. తల్లీ కొడుకుల మధ్య ఉండే మాతృత్వపు తాత్వికత కనిపిస్తుంది
ఈ పాటలో.
2. తల్లి కోడి పిల్లనొచ్చి తన్నుకెళ్లే గద్ద లñ క్క
ఎత్తుకెళ్లినోడు నన్ను పెంచలేదు మనిషి లెక్క
సెడ్డ దారుల్లోకి నేను ఎళ్లినాక
సెంపదెబ్బ కొట్టి మార్చేసే తల్లి లేక
ఎట్ట పడితే అట్ట నేను బతికినాను
ఇప్పుడిట్టా వస్తే నేను తలుపు ముయ్యబోకే
దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా
కోడి తన పిల్లల్ని ఆడిస్తుండగా ఒక గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోయిన విధంగా నా తండ్రి నన్ను ఎత్తుకుపోయాడు. నన్ను సరిగా పెంచలేదు. తప్పు చేస్తే చెంప మీద కొట్టే తల్లి నా దగ్గర లేదు. అందుకే నేను ఎలా పడితే అలా బతికాను. ఇప్పుడు నీ దగ్గరకు నేను వస్తే, తలుపులు వెయ్యకమ్మా అని తల్లిని వేడుకుంటాడు ఈ చరణంలో. సొంత కొడుకును, తల్లి దగ్గర నుంచి తండ్రి వేరు చేసి తీసుకుÐð ళ్లిపోతాడు. ఏ మాత్రం క్రమశిక్షణతో పెంచకపోవటం వల్ల తప్పుదారి పడతాడు కొడుకు. ఈ చరణంలో చిత్ర కథ అంతా చెప్పాను. తప్పు చేసిన కొడుకు తాను చెడు మార్గంలో ఉన్నానని తెలుసుకుని, తల్లి దగ్గరకు వస్తాడు. తాను తప్పు చేస్తే ఆ తల్లి తన చెంప మీద ఒక దెబ్బ వేస్తుంది. ఆ దెబ్బతో తాను మారగలననుకుంటాడు నాయకుడు. తల్లి గొప్పదనాన్ని వివరించే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.
సంభాషణ: డా. వైజయంతి
దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా
Published Sat, Mar 4 2017 11:59 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement