
విహారం: ఆ‘హా’... ఏమి అందమిది !
మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఒత్తిడి లేని ఆధునిక జీవన శైలి పొందలేరు. ఎందుకంటే ఆ రెండూ ఒకదాంట్లో ఒకటి విడదీయలేనంతగా కలిసిపోయాయి. మనం చేయగలిగినదంతా దాన్నుంచి కాస్త విరామం తీసుకోవడమే. మరి అలాంటి విరామం కాస్త సుదీర్ఘంగా తీసుకోవాలంటే పదండి భూటాన్ పోదాం. మన పక్క దేశం. కానీ తనివితీరని ప్రదేశాలకు కొదవ లేదు. అందునా ‘హా వ్యాలీ’కి వెళ్లామంటే... అక్కడ్నుంచి తిరిగి రావడానికి మనసు ససేమిరా ఒప్పుకోదు. ఓ వారం రోజుల పాటు ఇలాంటి చోట గడిపి వస్తే.. ఆహా అద్భుతం అనిపించదూ! అందుకే వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి.. భూటాన్‌లోని ‘హా’ లోయకు బయల్దేరండి!
సముద్ర మట్టానికి దాదాపు 4 వేల మీటర్ల ఎత్తులో ఓ ప్రాంతం.. అక్కడో పెద్ద లోయ... ఆ లోయ కింది భాగంలో గ్రామం.. కొండలపై ఏటవాలుగా ఇళ్లు.. కంటికి కనిపించేంత దూరంలో హిమాలయాల అందాలు.. శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయాలు... ప్రశాంతతకు నిలయమైన ఆశ్రమాలు.. రకరకాల జంతువులు, ఎన్నో రకాల పళ్లతోటలు.. ఎప్పుడూ చల్లగా ఉండే వాతావరణం. వాహనాల రొద లేదు.. జనాల హడావుడి లేదు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలాంటి ప్రశాంతమైన సందర్శనీయ పర్యాటక స్థలం... మనకు అందుబాటులోనే ఉంది. ఆహా అనిపించేలా ఉండే ఆ సుందర ప్రదేశమే హా వ్యాలీ!
హా లోయ... భూటాన్‌లోని హా జిల్లాలో ఉంది. భూటాన్ రాజధాని థింఫు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో హా జిల్లా ఉంది. హా లోయకు పొరుగున పారో, చుఖా, సంత్సె జిల్లాలుంటాయి. భూటాన్‌లోని ఏకైక విమానాశ్రయం పారోలో ఉంది. అక్కడి నుంచి హా లోయకు 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. హా లోయ 1700 చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే దేవుడు 1700 చదరపు కిలోమీటర్ల భూ కాన్వాస్‌పై గీసిన చక్కటి ప్రకృతి చిత్రమిది. ఒకప్పుడు ఇక్కడ అనిమిస్ట్ సంప్రదాయం ఉండేది. భారత్‌కు చెందిన గురు పద్మసంభవ ఇక్కడ బౌద్ధమత వ్యాప్తి చేశాడు. ఆయన్ని ఇక్కడి వారు దేవుడిలా కొలుస్తారు.
కమర్షియలిజం తక్కువ
హా లోయ ఒక ప్రశాంతమైన బౌద్ధ వనంలా ఉంటుంది. ఇక్కడ పర్యాటకం ఇంకా పొల్యూట్ అవలేదు. ఇంతకుముందు అంటే 2002కు ముందు ఇక్కడ పర్యాటకం పరిమితం. ఇతర దేశాల పర్యాటకుల్ని అనుమతించేవారు కాదు. ఇక్కడ అద్భుతమైన అందాలున్నా ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టిపెట్టలేదు. ఐతే ఇంటర్నెట్ విస్తరించాక హా లోయ అందాల గురించి ప్రపంచానికి తెలిసింది. నెమ్మదిగా ఈ లోయకు ప్రచారం పెరగడంతో 2002 నుంచి విదేశీ పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు.
హా జిల్లాలో దాదాపు 80 శాతం అడవులే ఉంటాయి. ఎటు చూసినా కనువిందైన ప్రకృతి అందాలు పారవశ్యంలో ముంచెత్తుతాయి. పారో విమానాశ్రయం నుంచి హా లోయకు ప్రయాణించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఆ ప్రయాణమే ఒక టూర్. అతిశయోక్తి అనిపించొచ్చు గాని... స్వర్గానికి దారి ఇలానే ఉంటుందేమో అనిపించేలా ప్రకృతి దానిని తీర్చిదిద్దింది. ఆ దారిలో కొండలు, మలుపుల్ని దాటుకుంటూ చల్లని వాతావరణంలో ప్రయాణించడం హాయిగా ఉంటుంది. దారిలో అక్కడక్కడా ఆశ్రమాలుంటాయి.
టా జాంగ్ ప్రాంతంలో మూడు శతాబ్దాల నాటి భూటాన్ జాతీయ మ్యూజియం ఉంది. భూటాన్ దేశానికి చెందిన ఆయుధాలతో పాటు చరిత్రకు సంబంధించిన అనేక విశేషాలు ఇక్కడ చూడొచ్చు. చొమోల్‌హరి, జికు డ్రేక్ పర్వతాలతో పాటు కొన్ని సరస్సులు కూడా దాటుకుని హా లోయకు చేరుకోవచ్చు. హా లోయ... కొన్ని అతిచిన్న గ్రామాల సమూహం. అక్కడ గ్రామ కుటీరాల్లో విడిది పొందే అవకాశం ఉంది. హోటళ్లలో కూడా విడిది చేయవచ్చు. అవి కూడా గ్రామీణుల ఇళ్ల నిర్మాణాలను పోలి ఉంటాయి. హా లోయలో ఉండటం ఒకరకమైన అనుభూతి అయితే... లోయ చుట్టూ ఉండే ఉండే కొండల పైకి చేరుకుని లోయను చూడటం మరో అద్భుతమైన అనుభూతి. ఆ అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని ఆస్వాదించడానికి రెండు కళ్లు చాలవు.
ప్రజల జీవన శైలి
హా వ్యాలీ... ‘హా జిల్లాలో’ ఉంది. జిల్లా మొత్తం జనాభా ఎంతనుకున్నారు? కేవలం 12 వేలు. లోయకు ఆనుకుని ఉండే కొండలపై నుంచి ఏటవాలుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటారు ఇక్కడి ప్రజలు. ఆ ఇళ్లలో విడిది చేయడం కూడా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. హా లోయ నుంచి హిమాలయాల సమీపంలోకి వెళ్లేందుకు కూడా టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
హా జిల్లాలో ఎక్కువగా గోధుమలు పండిస్తారు. అక్కడక్కడా తక్కువ విస్తీర్ణంలో వరి కూడా పండుతుంది. కానీ పళ్లు వంటి వాణిజ్య పంటలపైనే స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వరి వేసే విస్తీర్ణం తగ్గింది. ప్రజలు ఎక్కువ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తారు. వారి ప్రధాన ఆదాయ వనరు అటవీ ఉత్పత్తులే. గుర్రాలు, పందులు, కోళ్లతో పాటు జడల బర్రె (యాక్)లను పెంచుతారు. ఇవి మంచు-చలి ప్రదేశాల్లో ఉంటాయి.
దేవాలయాలు... ఆశ్రమాలు
హా లోయ ఆలయాలకు, ఆశ్రమాలకు ప్రసిద్ధి. ఇక్కడ 7వ శతాబ్దంలో నిర్మించిన వైట్, బ్లాక్ టెంపుల్స్ చాలా ప్రసిద్ధమైనవి. మూడు పర్వతాల మధ్య ఎత్తయిన ప్రదేశంలో వీటి నిర్మాణం జరిగింది. అద్భుతమైన అందాల మధ్య విశాలంగా నిర్మించిన ఈ ఆలయాలను సందర్శించుకోవడం వర్ణనాతీతమైన ప్రశాంతతను, అనుభూతిని ఇస్తుంది. హా గోప్నా అనే మరో ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధమైంది. డ్రక్‌యెల్ అనే పెద్ద ఆశ్రమం కూడా హా లోయలో చెప్పుకోదగ్గది. ఇక్కడ వందల సంఖ్యలో బౌద్ధ సన్యాసులు ఉంటారు. ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. దీనికి దాదాపు నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది.
ఎలా వెళ్లాలి?
కలకత్తా నుంచి, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుంచి భూటాన్‌కు టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫ్లైట్లో వెళ్లాలి అనుకుంటే మూడు రోజుల ట్రిప్ అయినా సరిపోతుంది. లేకపోతే ఏడురోజుల ట్రిప్ అవసరం. అపుడు చిన్న దేశమైన భూటాన్ మొత్తం తిరగొచ్చు. నేరుగా పారో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి టూర్ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకైనా... మంచి పేరున్న సంస్థల ప్యాకేజీల ద్వారా వెళ్లడం మంచిది.