సత్వం: కదనరంగ కార్యశూరుడు
ఏప్రిల్ 22న లెనిన్ జయంతి
లెనిన్‌కు శుభ్రంగా ఉండటం ఇష్టం. పనిచేసే బల్లను పద్ధతిగా సర్దుకోవడం ఇష్టం. పెన్సిల్స్ ఎప్పుడూ చెక్కివుండాలి, రాయడానికి రెడీగా. అలాగే మనుషులూ ఎత్తిన తుపాకుల్లా ఉండాలి, పేలడానికి సిద్ధంగా.
వ్లదీమీర్ ఇల్యీచ్ ఉల్యనోవ్ అనే అసలుపేరుకన్నా తన కలంపేరుతోనే లెనిన్ ప్రసిద్ధి. ఈ ఇరవయ్యో శతాబ్దపు ప్రముఖ రాజనీతిజ్ఞడికి మార్క్స్, ఎంగెల్స్, చెర్నీషెవ్‌స్కీలంటే ఆరాధన. మార్క్స్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పేవాడు. విప్లవం కోసమే పుట్టినవాడిగా తనను తాను నమ్ముకుని, ప్రజల్ని కూడా ఆ నమ్మకంలో భాగస్వాములను చేశాడు. వ్యాయామం, ఈత, సైక్లింగ్, షూటింగ్‌లతోపాటుగా పర్వతాలను ఎక్కడంలోనూ లెనిన్ ఆనందం అనుభవించేవాడు. తీవ్రమైన భావోద్వేగాలున్న లెనిన్‌కు జారిస్టులంటే మంట; వాళ్లను కమ్యూనిజపు కాళ్లకిందకు తేలేకపోతే సామాన్య ప్రజానీకానికి ఆనందం ఎలాగ?
విప్లవ పరిస్థితులు లేకుండా ఎంత తీవ్రమైన ఉపన్యాసాలిచ్చినా విప్లవం రాదని లెనిన్‌కు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు విప్లవ పదార్థాలన్నీ ఒకచోట చేరతాయి. సమయం రాగానే కుతకుతా పొంగుతూ విప్లవం తన్నుకొని బయటకు వస్తుంది. అదొక మాయ! ఇలాంటి రాడికల్ భావజాలానికి ప్రతిఫలంగా సైబీరియా మంచుగడ్డల్లో శిక్ష అనుభవించాడు లెనిన్. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత మార్పుకు సిద్ధంగా ఉంది రష్యా! అదే తగిన సమయం! బోల్ష్‌విక్ విప్లవం(1917) ఇప్పుడు కాక మరెప్పుడు?
లెనిన్‌కు శుభ్రంగా ఉండటం ఇష్టం. పనిచేసే బల్లను పద్ధతిగా సర్దుకోవడం ఇష్టం. పెన్సిల్స్ ఎప్పుడూ చెక్కివుండాలి, రాయడానికి రెడీగా. అలాగే మనుషులూ ఎత్తిన తుపాకుల్లా ఉండాలి, పేలడానికి సిద్ధంగా. కార్మికుల్ని ఉత్తి వర్కింగ్ మాసెస్‌గా కాకుండా విప్లవవీరులుగా మలచాలనీ, ప్రతి చిన్న జోడింపూ ఒక పెద్ద మానవహారం కాగలదనీ నమ్మినవాడై... కానీ ఎలా? అరవడం, రాయివిసరడం సులువు; ఆగి అర్థమయ్యేలా వివరించడం కష్టం. అందుకే వ్యాసాలు, పాంప్లెట్లు! స్టెనోగ్రాఫర్, సెక్రటరీ సాయం లేకుండా తనే సొంతంగా రాసేవాడు. సాటి కామ్రేడ్స్‌తోనూ, స్నేహితులు, ఆత్మీయులతోనూ రాతపూర్వకంగా సంభాషించేవాడు. అదంతా కలిపి ‘లెనినిజం’ కావడానికి ఆయన రాతలు ఒక్కోటి 650 పేజీల చొప్పున 54 వాల్యూములు ఉండటమే కారణం కాకపోవచ్చు. వాటన్నింటినీ ఆచరణలోకి తెచ్చిన ఆయన కార్యశూరత కూడా కారణం కావొచ్చు. జార్లను కూల్చడానికి రక్తపాతం తప్పదు. లెనిన్‌కు అనివార్య హింస మీద విముఖత లేదు. దానికి ఆయన దగ్గర సమాధానం ఉంది. ఒక పిల్లాడికి జన్మనిచ్చేటప్పుడు తల్లికి దాదాపుగా ప్రాణం పోయినంత పనవుతుంది. రక్తపుమరకలు అంటుకుంటాయి. వేదన అనుభవిస్తుంది. పండంటి విప్లవబాబుకు జన్మనివ్వడానికి ఇవన్నీ భరించక తప్పదు!
రాసుకునేప్పుడు పూర్తి నిశ్శబ్దం కావాలి లెనిన్‌కు. రష్యాలో కూడా నిశ్శబ్ద విప్లవం పనిచేయడం ప్రారంభించింది. రష్యా తొలినాళ్ళ నూతన ఆర్థిక విధానం లెనిన్ ప్రవేశపెట్టినదే. ఏ అధికారికైనా చెమటోడ్చే కార్మికుడి వేతనం కన్నా ఎక్కువెందుకుండాలి! కార్మిక నియంతృత్వంలో అసలైన కమ్యూనిజానికి దారులు వేయడానికి నడుం బిగించింది ఆయనే.
లెనిన్ దృష్టి రష్యాకే పరిమితం కాదు. రేప్పొద్దున మొరాకో ఫ్రాన్స్‌మీద యుద్ధం ప్రకటించినా, భారత్ ఇంగ్లండ్ మీద కాలుదువ్వినా... అందులో ఎవరు ముందు దాడిచేశారన్నదానితో సంబంధం లేకుండా ప్రతి సామ్యవాదీ అణిచివేయబడ్డవారిపైపు నిలబడాలి! అదిమాత్రమే నిజమైన సామ్యవాదుల విజయం అవుతుంది. తప్పుల్ని దిద్దుకుంటూ, నిరంతరం నేర్చుకుంటూ, వర్గాలు అంతరించి, భుజాలు కలుపుకుని, మనుషులూ మనుషులూ దేశాలూ దేశాలూ ఏకమై సమానమై... లెనిన్ కలలు గొప్పవి!