ఆన్‌లైన్ బూతు వీడియోలతో ఆరోగ్య సమస్యలు!
హెల్త్ ల్యాబ్
విచ్చలవిడిగా బూతు వీడియోలు లభ్యం అవుతూ ఉండటం, టీన్స్ వయసులో ఉండే పిల్లలు వాటిని విపరీతంగా చూస్తూ ఉండటం వారికి కొన్ని రకాల శారీరక, మానసిక ఇబ్బందులు తెచ్చిపెడుతోందంటున్నారు డాక్టర్ యాంజెలా గ్రెగరీ. పైగా ఇప్పుడు సెల్‌ఫోన్‌లోనే వీటి లభ్యత పెరగడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యువత చూడగలుగుతోంది. వీటి కారణంగా కొత్తగా పెళ్లయిన యువకుల్లో పురుషాంగ స్తంభనలు కలగాల్సినంతగా కలగడం లేదని చెబుతున్నారు డాక్టర్ యాంజెలా. పదహారేళ్ల క్రితం నుంచి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదేళ్ల నుంచి అంగస్తంభన సమస్యలతో మానసిక చికిత్సకు వస్తున్న పురుషులు సంఖ్య విపరీతంగా పెరిగింది.
గతంలో డయాబెటిస్, గుండెజబ్బులు వంటి సమస్యల కారణంగా అంగస్తంభన వైఫల్యాలతో పురుషులు మానసిక నిపుణులను సంప్రదించేవారు. కానీ విచ్చలవిడిగా లభ్యమయ్యే పోర్న్ కారణంగా ఇప్పుడు యువతలో థ్రిల్ తగ్గిపోయి, అంతగా కోరికలు చెలరేగకపోవడంతో మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు డాక్టర్ యాంజెలా.
ఉదయం వేళల్లో వైరస్ సోకితే...
ఫ్లూను కలిగించే ఇన్‌ఫ్లుయెంజా గానీ లేదా హెర్పిస్‌గానీ ఉదయం వేళలో సోకినట్లయితే, ఆ వైరస్ తీవ్రత సాధారణం కంటే ఎక్కువని పరిశోధనల్లో తేలింది. ఎలుకల విషయంలో జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త విషయం తెలిసింది. ఉదయం వేళల్లో వైరల్ ఇన్ఫెక్షన్ శరీరాన్ని సోకితే, అప్పుడా వ్యాధి తీవ్రత మిగిలిన సమయాల్లో సోకినదాని కంటే 10 రెట్లు ఎక్కువని చెబుతున్నారు ప్రొఫెసర్ అఖిలేశ్ రెడ్డి. మన శరీరాల్లో నిర్ణీత వేళకు నిద్ర వచ్చేలా చేసే జీవగడియారం (సర్కాడియన్ రిథమ్) దెబ్బతిన్నవారిలో వైరస్ ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తేలింది.