ఆ సమయంలో నొప్పి ఎందుకు?!
సందేహం
నా వయసు 31. నేను కొన్ని నెలల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల నాలుగవ నెలలో అబార్షన్ చేయించుకున్నాను. ఆ తర్వాతి నుంచి నా వక్షోజాలు కాస్త బాధ పెడుతున్నాయి. నిజానికి అబార్షన్ అయ్యేవరకూ అవి చాలా నొప్పిగా ఉన్నాయి. అబార్షన్ అయ్యాక నొప్పి తగ్గింది కానీ ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటున్న ఫీలింగ్. నిపుల్స్ కూడా లాగుతున్నట్టు, మండుతున్నట్టు అనిపిస్తోంది. ఇదేమైనా అనారోగ్యమా? క్యాన్సర్ లాంటి వ్యాధుల లక్షణమా? నాకు చాలా భయంగా ఉంది. కలయిక సమయంలో నేను వాటిని ముట్టుకోనివ్వడం లేదని మావారు విసుక్కుంటున్నారు కూడా. ఇప్పుడు నన్నేం చేయమంటారు?
- సౌజన్య, భద్రాచలం
గర్భం దాల్చిన రెండు మూడు నెలల వరకు చాలామందిలో హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ములు బరువుగా, నొప్పిగా ఉండటం అన్నది సాధారణమే. అబార్షన్ తర్వాత కొంతమంది రొమ్ముల్లో పాలు తయారయ్యే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొన్ని రోజులు నొప్పిగా ఉంటాయి. తర్వాత పాలు బయటికి వచ్చేస్తాయి. కొందరిలో లోపలే కరిగిపోతాయి. కాబట్టి మీ నొప్పి కొన్ని రోజులు ఉండి తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కొందరిలో పీరియడ్స్ వచ్చే పది, పదిహేను రోజుల ముందు నుంచి ప్రొజెస్టరాన్ మరియు ఇతర హార్మోన్లలో మార్పుల వల్ల రొమ్ముల్లో నీరు చేరుతుంది.
దానివల్ల రొమ్ములు బరువుగా, నొప్పిగా, సలపరంగా ఉండవచ్చు. కొందరిలో ఫైబ్రో అడినోమా అనే చిన్న చిన్న హాని లేని గడ్డలు ఉండవచ్చు. మరికొందరిలో ఇన్ఫెక్షన్ లేక ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉండవచ్చు. కాబట్టి ఒక్కసారి డాక్టర్‌ని సంప్రదించండి. అవసరమైతే అల్ట్రా సౌండ్ బ్రెస్ట్, మామోగ్రామ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు. మీ ఇబ్బంది తెలియక మీవారు విసుక్కుంటున్నారేమో. ముందు ఆయనకి విషయం అర్థమయ్యేలా చెప్పండి.
నా వయసు 29. ఉద్యోగరీత్యా నేను, మావారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. నెలకి ఒకసారో రెండుసార్లో కలుస్తాం. ఒక్కోసారి రెండేసి నెలలు కూడా అవుతుంటుంది. అయితే కలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా గడుపుతాం. రోజుకు రెండు మూడుసార్లు కూడా శారీరకంగా కలుస్తాం. అయితే ఈ మధ్య నాకొక సమస్య వచ్చింది. మొదటిసారి సెక్స్ చేస్తున్నప్పుడు ఎందుకో చాలా నొప్పిగా ఉంటోంది. యోని సలుపుతున్నట్టుగా అనిపిస్తోంది. మళ్లీ రెండోసారి అలా ఉండటం లేదు. మొదటిసారే అలా అవుతోంది. దానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదేమైనా అనారోగ్యమా?
- నీరజ, విజయవాడ
ఏ వస్తువు అయినా చాలా రోజులు వాడకపోతే ఎలా బిగుతుగా అయిపోతుందో... యోని కూడా అలాగే అయిపోతుంది. చాలా రోజులు కలవకుండా ఉండటం వల్ల కొందరిలో యోని కండరాలు బిగుసుకున్నట్లు అయిపోతాయి. లోపల తడి కూడా తగ్గిపోతుంది. దాంతో కలయిక సమయంలో మొదట కాస్త నొప్పిగా ఉంటుంది. తర్వాత కండరాలు వదులయ్యి నొప్పి తగ్గుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. కలిసిన ప్రతిసారీ నొప్పి ఉండటం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరమూ లేదు.
నా వయసు 38. ఏడేళ్ల క్రితం నా భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లని పెంచడానికి నేనేవో తంటాలు పడుతుంటే మా బంధువు ఒకాయన సాయంగా నిలిచారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాకూ తనంటే అభిమానమే. అందుకే ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. కానీ ఎందుకో ఈ మధ్య కలిసినప్పుడల్లా పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. కారణం ఏమై ఉంటుంది?
- ఓ సోదరి, నిజామాబాద్
పొత్తి కడుపులో నొప్పి రావడానికి గర్భాశంయలో ఇన్ఫెక్షన్ లేక గడ్డలు ఉండటం, అండాశయంలో గడ్డలు ఉండటం, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివేవైనా కారణం కావచ్చు. పరీక్ష చేస్తే తప్ప ఆ కారణం ఏమిటో తెలియదు. కాబట్టి ఓసారి గైనకాలజిస్టును కలిసి రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయించుకోండి. కారణం తెలిశాక చికిత్స చేయించుకోవచ్చు. అయితే ఒకటి. ఇలాంటి సంబంధాలు అంత మంచివి కావు.
ఒకవేళ ఆయనకు మీతో మాత్రమే కాక వేరేవారితో కూడా శారీరక సంబంధం ఉంటే, తద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. సుఖ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. లేక ఆయన మంచివారు, మీరు తప్ప ఆయన జీవితంలో ఎవరూ లేరు అనుకుంటే మీ వాళ్లందరినీ ఒప్పించి చక్కగా పెళ్లి చేసుకోండి. అది మీకు అన్నివిధాలా మంచిది.
నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. మేమిద్దరం సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మావారు ఆనల్ సెక్స్ కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినా ఆయన బలవంతం చేస్తున్నారు. అసలు ఆనల్ సెక్స్ చేయవచ్చా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
- మాధురి, భీమవరం
ఆనల్ సెక్స్ (మలద్వారం ద్వారా రతి జరపడం) అనేది విపరీత కోరికలకు తార్కాణం. అంటే పర్‌వెర్షన్ అన్నమాట. దీనివల్ల మొదట్లో బ్లీడింగ్, నొప్పి ఉండవచ్చు. తర్వాత కాస్త ఫ్రీ అయినా కూడా మగవారికి తప్ప ఆడవారికి పెద్దగా అనుభూతి కలగదనేది వాస్తవం. అది మాత్రమే కాక... దీనివల్ల బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకూ ఆనల్ సెక్స్ జోలికి పోకపోవడమే మంచిది. మీవారికి బహుశా దానివల్ల వచ్చే సమస్యలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనకు అన్నీ వివరించండి. కన్విన్స్ కాకపోతే ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించండి.
డా॥వేనాటి శోభ