అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా? | Dr. venati shoba quation to answers | Sakshi
Sakshi News home page

అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా?

Published Sun, Oct 18 2015 1:00 AM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా? - Sakshi

అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా?

సందేహం
నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా?
 - సుజీ, ప్రకాశం జిల్లా

 
అంగచూషణ చేసేటప్పుడు ఒక్కోసారి మగవారి అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీ నోటిలో, దంతాల్లో, చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీవారికి సోకే అవకాశమూ ఉంది. సాధారణంగా వీర్యంలో కొద్దిగా చీము కణాలు ఉంటాయి. కొందరిలో హర్పిస్, గనోరియల్, సిఫిలిస్, ఫంగల్ ఇంకా ఇతరత్రా సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు కూడా ఉండవచ్చు. ఆడవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు.... నోటిలో పుండ్లు, పగుళ్లు వంటివి ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వారికి కూడా సోకే ప్రమాదం ఉంది.

కొన్నిసార్లు పై కారణాలు లేకుండా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో నోటిలో పొక్కులు, కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. జ్వరంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మగవారిలో హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా సోకవచ్చు. అందువల్ల అంగచూషణ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. మీరిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, కండోమ్ వాడుకోవడం ఇద్దరికీ మంచిది.
 
నా వయసు 24. ఈమధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కూడా వాడేదాన్ని. దానివల్ల నా యోని వదులైపోయి ఉంటుందేమో, కన్నెపొర చిరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది. మొదటి రాత్రి నా భర్తతో కలిసినప్పుడు రక్తం రాకపోతే అతడు నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలి?
 - వందన, హైదరాబాద్

 
హస్తప్రయోగం వల్ల యోని వదులైపోవడం అనేది ఉండదు. కాకపోతే కొన్ని వస్తువులు వాడారు కాబట్టి కన్నెపొర చిరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొందరిలో కన్నెపొర చిన్నతనంలో ఆటలాడేటప్పుడు, సైకిల్ తొక్కడం లాంటివి చేసినప్పుడు చిరిగిపోతుంది. మరికొందరి కన్నెపొరకు సాగే గుణం ఉంటుంది. అలాంటివారికి మొదటిసారి కలిసినప్పుడు రక్త రావడం జరగదు. అయినా మొదటిరాత్రి అందరికీ రక్తం రావాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడకండి. పెళ్లి చేసుకోబోతున్న ఆనందాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, సంతోషంగా ఉండండి.
 
నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి పెళ్లయ్యాక చాలా ఇబ్బందులు వస్తాయని, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా? నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరానా?
 - పూర్ణిమ, డోర్నకల్

 
కొంతమందికి నెలసరి సమయంలో ఎలాంటి సమస్యా లేకపోయినా కూడా నొప్పి వస్తుంది. ఆ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవడం వల్ల, బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయంలోని కండరాలు కుదించుకున్నట్లు అయ్యి... పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇవి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి వారిలో పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

వేరే ఏ సమస్యలూ లేనప్పుడు పిల్లలు పుట్టడంలోనూ సమస్యలు ఏర్పడవు. అయితే కొందరిలో మాత్రం గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, అడినోమయోసిస్ వంటి కొన్ని సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్‌తో పాటు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోండి. సమస్య ఏంటో తెలిశాక తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే కనుక, నొప్పి తగ్గడానికి పీరియడ్స్ సమయంలో రెండు నుంచి మూడు రోజులు మందులు వాడితే సరిపోతుంది.
 
నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కలయిక సమయంలో అంగప్రవేశం జరిగినట్టు కూడా తెలియడం లేదు. మావారు కూడా విసుక్కుంటున్నారు. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి?
 - సునీత, చాదర్‌ఘాట్

 
కొందరి శరీర తత్వాన్ని బట్టి... సాధారణ కాన్పు సమయంలో బిడ్డ బరువు, సైజును బట్టి యోని కండరాలు సాగి, బిడ్డను బయటకు నెట్టుతాయి. కొందరిలో మాత్రం యోని కింది భాగంలో కొద్దిగా కట్ చేసి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. కొందరికి కాన్పు తర్వాత యోని కండరాలు పూర్తిగా కాకపోయినా, చాలావరకు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొందరిలో, సాగిన యోని కండరాలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల యోని వదులవుతుంది.

మీకు కలయిక సమయంలో మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఓసారి గైనకాలజిస్టును కలవండి. పెరినియోరఫీ అనే ఆపరేషన్ ద్వారా కండరాలను దగ్గరగా లాగి కుట్టేస్తారు. తద్వారా యోని మళ్లీ బిగుతుగా అయిపోతుంది.
 
నా వయసు 32. పెళ్లై అయిదేళ్లు అయ్యింది. మూడు నెలల క్రితం మావారు అనారోగ్యం బారినపడితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. హెచ్‌ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఆయన చెడ్డవారు కాదు. కాకపోతే కాలేజీలో చదువు కున్నప్పుడు ఎవరో అమ్మాయికి దగ్గరయ్యారట. అలా వచ్చిందేమో అంటున్నారు. ఇన్నాళ్లూ కాపురం చేశాను కాబట్టి నాకూ ఎయిడ్స్ వచ్చి ఉంటుందా? వెంటనే తెలియాలంటే ఏ పరీక్ష చేయించుకోవాలి? ఒకవేళ నాకు వచ్చి ఉండక పోతే ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 - పార్వతి, విజయనగరం

 
మీవారికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంది అంటే, ఆయన రక్తంలో హెచ్‌ఐవీ వైరస్ ఉందన్నమాట. ఈ వైరస్ రక్తం ద్వారా లేదా కలయిక ద్వారా మీకు వచ్చివుండే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే హెచ్‌ఐవీ రక్తపరీక్ష చేయించుకోండి. దానివల్ల మీకు హెచ్‌ఐవీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అదృష్టం కొద్దీ లేకపోతే... కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీకి మందులు అందుబాటులో ఉంటున్నాయి. మీవారికి ఆ మందులు ఇప్పించండి. కలయిక సమయంలో మాత్రం తప్పనిసరిగా కండోమ్ వాడండి. అలాగే ఈ పరీక్షలో హెచ్‌ఐవీ లేదని తేలినా... ఆరు నెలల తర్వాత మరోసారి హెచ్‌ఐవీ పరీక్ష తప్పకుండా చేయించుకోండి.
 
నా వయసు 18. చదువుకుంటున్నాను. ఎందుకో మొదట్నుంచీ నా వక్షోజాలు చాలా వదులుగా ఉంటాయి. మొన్నీమధ్య ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఒక మాట అంది. జారిపోయినట్టుగా ఉండే వక్షోజాలను చూస్తే మగవాళ్లకు అనుమానం వస్తుందట. అంతకుముందే ఎవరితోనో సంబంధం ఉందని అనుకుంటారట. అది నిజమేనా? రేపు నా భర్త కూడా నన్ను అలానే అనుమానిస్తే నా పరిస్థితి ఏమిటి? పరిష్కారం చెప్పండి.
 - మీనా, విజయవాడ

 
మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. వక్షోజాలు వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరికి బిగుతుగాను, బలహీనత వల్ల కొందరిలో వదులుగాను ఉంటాయి. అంతేకానీ ఎవరితోనో సంబంధం ఉండటం వల్ల అవి వదులు కావు. అనవసరమైన మాటలు విని కంగారు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వక్షోజాల్లో పాలగ్రంథులు, కనెక్టివ్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. కొవ్వు సరిపడినంత లేకపోవడం వల్ల కూడా పటుత్వం లేక వక్షోజాలు వదులుగా ఉండ వచ్చు. ఒకవేళ మీరు బరువు తక్కువగా ఉంటే... పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పండ్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోండి. దానివల్ల అవి మళ్లీ బిగుతుగా తయారయ్యే అవకాశం ఉంది.
 
నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. ఈ మధ్యనే డాక్టర్‌కి చూపిస్తే... నా గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. అయితే ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా?
 - వనజ, గుంటూరు

 
గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు... ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు.

సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి.

అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే... లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.  
- డా॥వేనాటి శోభ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement