ఆమే ప్లస్... ఆమే మైనస్!
స్టార్‌ప్లస్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘దీయా ఔర్ బాతీ హమ్’ సీరియల్ (తెలుగులో ‘ఈతరం ఇల్లాలు’గా వస్తోంది) 2011లో ప్రారంభమయ్యింది. అనతి కాలంలోనే సూపర్ హిట్ అయ్యింది. బలమైన కథ, ఆసక్తికరమైన కథనాలు సీరియల్‌ని రక్తి కట్టిస్తే... హీరోయిన్ దీపికాసింగ్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సీరియల్‌లో ఆమె పాత్ర పేరు సంధ్య. ఆమెకి పోలీసాఫీసర్ కావాలని కోరిక. అయితే అనుకోని పరిస్థితుల్లో స్వీట్స్ వ్యాపారం చేసే సూరజ్‌తో పెళ్లవుతుంది. ఓ పేదపిల్లను కోడలిగా అంగీకరించలేని సూరజ్ తల్లి, సంధ్యని నరకయాతన పెడుతుంది. అన్నిటినీ ఓపికగా భరించి అత్తగారి మనసును గెలుచుకుంటుంది సంధ్య. పోలీసాఫీసర్ అవ్వమంటూ అత్తగారు ప్రోత్సహించడంతో కష్టపడి చదివి ఐపీఎస్ పాసవుతుంది. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నదే కథ.
మూడేళ్లపాటు అత్తగారి ఆరళ్లతోనే సాగిపోయింది సంధ్య జీవితం. ఆ తర్వాత పోలీస్ అయ్యింది. అయ్యిందన్నమాటే కానీ... సంధ్యలో ఆ హుందాతనం లేదు. పోలీసులో ఉండాల్సిన కరకుదనం కాస్తయినా కనిపించడం లేదు. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఓ కోడలిగా ఉన్నప్పుడు ఇచ్చిన బేల ఎక్స్‌ప్రెషన్సే ఇస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది కానీ... అక్కడా ఆమెలో సాఫ్ట్‌నెస్ మాత్రమే కనిపి స్తోంది. దాంతో ఒకప్పుడు సీరియల్‌కి ప్లస్ అయిన ఆమే ఇప్పుడు సీరియల్‌కి మైనస్ అయ్యిందా అనిపిస్తోంది. కాబట్టి ఆమెతో ఏవేవో సాహసాలు చేయించేద్దామని చూడకుండా... దర్శకుడు వీలైనంత త్వరగా కథకు ఫుల్‌స్టాప్ పెడితే మంచిది!