మదిలో మెదిలే మాట... బయటకు రాదే!
నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతున్నాను. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మన ఆర్థికశాఖా మంత్రి ఎవరు అని అడిగారు. సమాధానం నాకు తెలుసు. చాలాసార్లు చదివాను. మదిలో మెదులుతూనే ఉంది. కానీ ఎంతకీ గుర్తు రాలేదు. దాంతో మాజీ మంత్రి పేరు చెప్పేశాను. ఇంటర్వ్యూ చేసే ఆయన నవ్వేశారు. ప్రతిసారీ ఇంటర్వ్యూలో ఇదే పరిస్థితి. అన్నీ తెలుసు. కానీ సమయానికి ఒక్కటీ గుర్తు రాదు. ఈ సమస్య తీరేదెలా?
- కళ్యాణ్, వైజాగ్
దీన్ని సోషల్ యాంగ్జయిటీ అంటారు. కాలేజీలో చదివే రోజుల్లో ఒక్కసారి కూడా స్టేజి ఎక్కని వారికి, తమపట్ల తమకి అపనమ్మకం ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉన్నట్టుండి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పొద్దున్నే లేవగానే అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటూ ఐదు సెకన్లు సన్నగా నవ్వండి. నవ్వినప్పుడు మెదడులో ‘సెరొటొనిన్’ అన్న రసాయనం విడుదలవుతుంది. అది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. టెన్షన్ వల్ల విడుదలయ్యే ‘కార్టిజాల్’కి వ్యతిరేకంగా పనిచేసే మందు ‘సెరొటొనిన్’. అందుకే పరీక్ష రాసే టప్పుడు, ఇంటర్వ్యూ సమయాల్లోనూ చిరునవ్వుతో ఉండాలి.
మనిషి కంగారుగా ఉన్నప్పుడు మెడ దగ్గర చెమట్లు పట్టడం, చేతివేళ్లు వణకటం, గొంతు తడారిపోవడం మొదలైన పరిణామాలు సంభవిస్తాయి. దీనికి కారణం కొన్ని ఎండార్ఫిన్స్. కొంతమందిపై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితుణ్ని తొందరగా సమాధానం చెప్పమని చెప్పి... ‘నువ్వు బ్యాచిలరా ఆన్‌మ్యారీడా’ అని అడిగి చూడండి. అతను కంగార్లో బ్యాచిలర్ అంటాడు. నిజానికి రెండూ అని చెప్పాలి. కానీ అలా చెప్పడు. కరాటే ఆటగాడు పోటీలో ప్రవేశించబోయే ముందు ఏ విధంగా గాలిలోకి పంచ్‌లు ఇస్తూ, బలంగా ఊపిరి తీస్తూ మూడ్‌లోకి ప్రవేశిస్తాడో... అదే విధంగా ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు నిమిషం పాటు కళ్లు మూసుకుని బలంగా ఊపిరి పీలుస్తూ ఉండండి.
నేను నిర్వహించే వ్యక్తిత్వ వికాస క్లాసుల్లో... సినిమాలు బాగా చూసే విద్యార్థుల్ని స్టేజి మీదికి పిలిచి, ఒక్క నిమిషం టైమ్‌లో పదిహేనుమంది తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పమంటే వారికి కూడా మీలాంటి స్థితే సంభవిస్తుంది. పేర్లు తెలియక కాదు. మానసిక వత్తిడి ఎక్కువయ్యేకొద్దీ న్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ని మెదడు శూన్యంగా చేసేస్తుంది. ఇలాంటి స్థితి నుంచి కొన్ని టెక్నిక్స్ ద్వారా సులువుగా బయట పడవచ్చు. ఇంటర్వ్యూలో ఇలాంటి పరిణామాలు సంభవించకుండా ఉండటానికి ఏం చేయాలో నా వెబ్‌సైట్ (yandamoori.com)లో వంద టిప్స్ అనే అధ్యాయంలో రాశాను. స్థలాభావం వల్ల అవన్నీ ఇక్కడ రాయలేను కాబట్టి అక్కడ చదివే ప్రయత్నం చేయండి.
నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. బాగా పాడతాను కూడా. అందుకే మ్యూజిక్‌లో డిగ్రీ చేయాలని ఉంది. కానీ మా నాన్నగారికి కళలపై పెద్ద ఇష్టం లేదు. అలాంటివేమీ అక్కర్లేదు, ఎంసెట్ రాసి మెడిసిన్ చేయమంటున్నారు. నాకు ఆసక్తి లేదు. మెడిసిన్ చేయాలంటే చాలా డెడికేషన్ ఉండాలంటారు. అసలు ఇష్టమే లేనప్పుడు నేనెలా మంచి డాక్టర్‌ని అవ్వగలుగుతాను? ఈ విషయం అమ్మతో చెప్పించినా నాన్న వినడం లేదు. ఆయనకు నా బాధ అర్థమయ్యేలా మంచి సమాధానం ఇవ్వండి. అది చూపిస్తాను. మీలాంటివారు చెబితేనైనా ఒప్పుకుంటారని నా ఆశ.
- బిందు, నిజామాబాద్
మీ సమస్య అర్థవంతమయ్యింది. నాకు అర్థమయ్యింది. పిల్లల స్టాండర్డ్ తెలుసుకోలేక పెద్ద పెద్ద ఆశలతో వాళ్లని శాసించి, అన్ని విధాలా నష్టపరిచే తల్లిదండ్రులు కోకొల్లలు. మీ నాన్నగారు కూడా అటువంటి జాబితాలో చేరడం దురదృష్టకరం. నా సమాధానం చూసి మీ నాన్నగారు మనసు మార్చుకుంటారని నేను అనుకోను. మీ బాధను అర్థం చేసుకోగలిగే పెద్దవారు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే... వారితో నాన్నకు చెప్పించండి.
అప్పటికీ వినకపోతే ఎంసెట్ రాయండి. సీట్ ఎలాగూ రాదు కాబట్టి ఆయనే మీ దారికి వస్తారని ఆశిద్దాం. అయితే ఆయన తరఫు నుంచి కూడా ఒక నిమిషం ఆలోచించాలి మీరు. కేవలం మ్యూజిక్‌లో డిగ్రీ సంపాదించడం వల్ల కచేరీలు చేసి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలరా? లేదా వివాహం చేసుకుని గృహిణిగా స్థిరపడదామను కుంటున్నారా? ఓసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. లేదంటే ప్రైవేటుగా గ్రాడ్యుయేషన్ చేస్తూ మ్యూజిక్‌లో డిగ్రీ చేయండి. ఒకవైపు చదువు, మరొకవైపు అభిరుచి. మంచి కాంబినేషన్!
- యండమూరి వీరేంద్రనాథ్