కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోతే ఎలా? | Aakar Patel Writes On CBI Investigation | Sakshi
Sakshi News home page

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోతే ఎలా?

Published Sun, Mar 11 2018 4:04 AM | Last Updated on Sun, Mar 11 2018 4:04 AM

Aakar Patel Writes On CBI Investigation - Sakshi

అవలోకనం
భారత్‌లో నిఘా సంస్థలు ‘చేసింది కొంత కూసేది మాత్రం చాలా’ అనే రకంగా ఉంటున్నాయి. అరెస్టులు చేస్తారు, సంచలన వార్తలు వ్యాపింప చేస్తారు. మరిన్ని సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి నిందితులను మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానానికి విన్నవిస్తారు. భారీ స్థాయి కుంభకోణాలు ఇలాగే మరుగున పడుతుంటాయి. అంతా ముగిశాక కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవని, సీబీఐ చేసిన నిర్ధారణలు అతిశయించాయని చెబుతూ కేసు కొట్టివేస్తుంది. 2జి స్కాంలో జరిగిన ప్రహసనం ఇదే మరి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌... నేరాలకు వ్యతిరేకంగా పనిచేసే మన అత్యున్నత సంస్థ. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐలాగా, సీబీఐ కూడా నిర్దిష్టమైన అంశాలను పరిష్కరించే లక్ష్యంతో ఏర్పడింది. కమ్యూనిజం పని పట్టేందుకు ఎఫ్‌బీఐని ప్రారంభించగా, అవినీతి నివారణకు సీబీఐని నెలకొల్పారు.

కానీ, సీబీఐ వాస్తవానికి ఎంత సమర్థత కలిగి ఉంది? వార్తల్లో ప్రత్యేకంగా ఏదైనా నిలిచిన ప్రతిసారీ ‘కేసును సీబీఐకి అప్పగించాలి’ అనే డిమాండును మనం తరచుగా  వింటూంటాం. దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదించే పోలీసు శాఖలా కాకుండా సీబీఐ ఒక కేంద్ర సంస్థగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. నేడు ఎఫ్‌బీఐ ఉగ్రవాదంపై, మరెన్నో విషయాలపై పనిచేస్తోంది. సీబీఐ కూడా పలు విభిన్న నేరాలపై తలపడుతోంది. సీబీఐ ఎలాంటి కేసులపై పని చేయాలి? ఇది స్పష్టం కావడం లేదు. అది దేనిమీదైనా పని చేయవచ్చు.

అది హత్య కావచ్చు, ఎందుకంటే టీవీ వార్తల్లో పెద్ద ఘటనగా నిలిచింది కాబట్టి (ఆరుషి కేసు లేదా షీనా హత్య ఘటన) సీబీఐ చేపడుతుంది. కుంభకోణాలకు (2జి స్కామ్, నీరవ్‌  మోదీ కుంభకోణం) సంబంధించిన వివిధ సమస్యలను అది చేపట్టవచ్చు. లేదా ప్రభుత్వ అవినీతిపై విచారణను కూడా అది చేపట్టవచ్చు. సీబీఐలో దాదాపు 6,000 మంది పనిచేస్తుంటారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి జాతి పొందుతున్నదేమిటి అని ప్రశ్నించుకుంటే ఉపయోగకరమైనది చాలా తక్కువే అని  సమాధానం వస్తుంది.

నేర నిర్ధారణలో సీబీఐ విజయాల శాతం 2005లో 65.6 శాతం, 2006లో 72.9 శాతం, 2007లో 67.7 శాతంగా ఉండగా 2009లో 64.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 2014లో సీబీఐ నేర నిర్ధారణ రేటు 69.02గా ఉండగా, 2015లో 65.1 శాతం, 2016లో 66.8 శాతంగా నమోదైనట్లు 2017లో  కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభలో ప్రకటించింది. కానీ ఈ శాతాలు, సంఖ్యలు పక్కతోవ పట్టిస్తున్నాయి. ‘కర్బింగ్‌ కరప్షన్‌ ఇన్‌ ఆసియన్‌ కంట్రీస్‌ : యాన్‌ ఇంపాజిబుల్‌ డ్రీమ్‌?’ అనే పుస్తకంలో రచయిత జాన్‌ ఎస్‌టి కీవాహ్‌.. సీబీఐ డేటా గురించి భారతీయ రచయిత ఎస్‌ఎస్‌ గిల్‌ రాసిన దాన్ని ఉల్లేఖించారు. ‘ఘోరమైన నేరాలకు సంబంధించి 30 కేసులు, చిన్నపాటి దొంగతనాలకు సంబంధించి 70 కేసులు ఉన్నప్పుడు.. దొంగతనం కేసుల్లో 60 శాతం మేరకు నేర నిర్ధారణ చేయగలిగినప్పుడు మొత్తం నేరాల్లో 60 శాతం నేరాలను నిర్ధారించినట్లు చెప్పుకోవడం వంచన మాత్రమే’.

ఆయన ఉల్లేఖనలకు అర్థం ఏమిటి? అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎయిమ్స్‌ సిబ్బందిని అరెస్టు చేసింది అనే శీర్షికతో మార్చి 8న ఒక రిపోర్టు వచ్చింది. పెండింగ్‌ బిల్లులను  పరిష్కరించడానికి సివిల్‌ వర్క్స్‌ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 19,500లు లంచం డిమాండు చేసి తీసుకుంటుండగా కె.డి. బిస్వాల్‌ అనే వ్యక్తిని పట్టుకున్నామన్నది ఆ వార్తా  నివేదిక సారాంశం. బిస్వాల్‌ ఎయిమ్స్‌లో ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌. సీబీఐ నిందితుడి నివాసం, కార్యాలయంలో కూడా శోధించిం దట. సీబీఐ నుంచి మనం ఆశించవలసింది ఇలాంటి పనులేనా? విజిలెన్స్‌ కమిషనర్‌ ఆర్‌. శ్రీ కుమార్‌ కథనం ప్రకారం పెద్ద పెద్ద నేరాలకు సంబంధించి సీబీఐ కేవలం 3.96 శాతం నేరాలను మాత్రమే నిర్ధారిస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీఐలో మరొక సమస్య సంస్థాగత వంచన. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డీపీ కోహ్లీ 55 ఏళ్ల క్రితం తన టీమ్‌తో ఏం చెప్పారో చూద్దాం. ‘సమర్థత, సమగ్రత విషయంలో ప్రజలు మీనుంచి అత్యున్నత ప్రమాణాలను ఆశిస్తున్నారు. ఆ నమ్మకం మీరు కొనసాగించాలి. కఠిన శ్రమ, నిష్పాక్షికత, సమగ్రత అనేది సీబీఐ లక్ష్యం : మీ సమస్త కార్యాచరణను ఇదే మార్గనిర్దేశనం చేయాలి. సర్వ కాలాల్లో, సకల పరిస్థితుల్లోనూ మీరు విధి పట్ల విశ్వాసం అన్నిటికంటే ముందువరుసలో ఉంచాలి’.

కానీ సీబీఐ ఈ అత్యున్నత ప్రమాణాలను అందుకోలేకపోయింది. నిజానికి, ఇది సమస్యలో భాగమే కానీ పరిష్కారంలో భాగం కాదు. ‘స్కామ్‌: ఫ్రమ్‌ హర్షద్‌ మెహతా టు గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌’ అనే తమ పుస్తకంలో దేబాషిస్‌ బోస్, సుచేతా దలాల్‌ ఇలా రాశారు: ‘సత్వరం పరిశోధన పూర్తి చేసి నేరారోపణ పత్రాన్ని దాఖలు చేయడానికి బదులుగా సీబీఐ ప్రభుత్వ చేతిపనిముట్టుగా వ్యవహరిస్తూ, ప్రమోషన్‌ రాని కారణంగా సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ కె. మాధవన్‌ రాజీనామా చేశారు, మాదక ద్రవ్యాల వ్యాపారంలో హర్షద్‌ మెహతా పెట్టుబడులు పెట్టాడు వంటి వార్తలను వండి వడ్డిస్తూ పోయింది. పైగా సంయుక్త పార్లమెంట్‌ కమిటీకి కీలక సమాచారం ఇవ్వకుండా పదే పదే తొక్కిపెడుతూ వచ్చింది.

కుంభకోణాలకు పాల్పడిన వారి విదేశీ ఖాతాలపై దర్యాప్తు చేయాలని తానిచ్చిన సూచనను పెడచెవినపెట్టారంటూ మాధవన్‌ జేపీసీకి చెప్పడం నాటి సీబీఐని, దాని చీఫ్‌ని ఇబ్బందిపెట్టింది. ఆ తర్వాతే సీబీఐ 1993 ఫిబ్రవరి 14 ఆదివారం రాత్రి ప్రభుత్వ వార్తా సంస్థలైన దూరదర్శన్, పీటీఐ, యూఎన్‌ఐ వంటి వాటికి నివేదిస్తూ, హర్షద్‌ మెహతా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు ప్రకటించింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దీనిపై స్విస్‌ అధికారులను సంప్రదించి, సీబీఐ చేసిన ప్రకటన వాస్తవం కాదని తేల్చేసింది. దీంతో సీబీఐ మళ్లీ మరొక ముతక ప్రయత్నం చేస్తూ హర్షద్‌ ఖాతాల్లో కొన్నింటిని అంతకుముందే స్తంభింపచేశామని, తర్వాత వాటిపై ఆంక్షలు ఎత్తివేశామని ప్రకటించింది. ఇది కూడా అబద్ధమేనని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

ఈరోజుకీ సీబీఐ పనివిధానం ఇలాగే కొనసాగుతోంది. భారత్‌లో చట్టాన్ని అమలు చేసే సంస్థలు– ‘చేసింది కొంత కూసింది మాత్రం చాలా’ అనే రకంగా ఉంటున్నాయి. అరెస్టులు చేస్తారు, సంచలన వార్తలు వ్యాపింప చేస్తారు. మరిన్ని సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి నిందితులను మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ న్యాయస్థానానికి విన్నవిస్తుంటుంది. భారీ స్థాయి కుంభకోణాలు ఇలాగే మరుగున పడుతుంటాయి.అంతా ముగిశాక కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవని, సీబీఐ చేసిన నిర్ధారణలు అతిశయించాయని చెబుతూ కేసు కొట్టివేస్తుంది. 2జి స్కాంలో జరిగిన ప్రహసనం ఇదే మరి. పాఠకులు ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. సీబీఏ కేసును ఛేదించిందంటూ ఈసారి కూడా వార్తాపత్రికలు, టీవీ చానల్స్‌ మోత మోగిస్తాయని వారు గుర్తుంచుకోవాలి మరి.

ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement