సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు.
‘మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే వ్యక్తి ఎంత నీతిమంతుడైనా ఒక సామాన్య మనిషిగా ఆయనకూ బలహీనతలు ఉంటాయి. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఎంత సత్యసంధుడనుకున్నా, ముక్కుసూటి మనిషనుకున్నా ఆయనకు సంపూర్ణాధికారాలను మాత్రం కట్టబెట్టకూడదు.’
– డా. బీఆర్ అంబేడ్కర్ (రాజ్యాంగ రూపకల్పన సందర్భంగా)
‘ప్రధాన న్యాయమూర్తి సహ న్యాయమూర్తులకు ధర్మాసనాలను కేటాయించే విషయంలో దాదాపు అంబేడ్కర్ భావనే ఇంగ్లండ్‌లో కూడా వ్యక్తమ యింది. అయితే కేసులు కేటాయించిన న్యాయమూర్తుల పట్టికకు ప్రధాన న్యాయమూర్తిని సారథిగా (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రకటించే సంప్రదాయం ఉంది. కానీ ఆ సంప్రదాయం వెర్రితలలు వేసి క్రమంగా అది ఇంగ్లండ్ ప్రజలు తలపెట్టిన రాజకీయ మహోద్యమాలనే శాసించే న్యాయమూర్తులు పాక్షిక ధర్మాసనాలను ఏర్పాటు చేసుకునే సంప్రదాయానికి లార్డ్ చాన్స్‌లర్లు తెరలేపారు.
ప్రధాన న్యాయమూర్తిని విశ్వసించాలన్న సూత్రం సాంఘిక ధర్మమైనా ఆ విశ్వాసం శాశ్వత సంపూర్ణ ధర్మంగా నిలవగలదని నమ్మలేం. సంప్రదాయం అనే మత్తులో పడే న్యాయవాద సోదరులందరికీ ఇంగ్లండ్ అనుభవం ఒక ఉదాహరణ. తాత్కాలికంగా న్యాయమూర్తుల మధ్య ఆంతరంగిక సర్దుబాట్లు/ పరిష్కారం కుదిరినట్టు కన్పించినా భారత న్యాయవ్యవస్థలో అంతటా సవ్యం గానే ఉందని ప్రపంచానికి చెప్పాలనుకున్నా–మహా అయితే అదంతా అతుకుల బొంత ‘పట్టీ’గానే మిగిలిపోతుంది. ఇంతకూ ఇప్పుడు జరగవలసిన అసలు చికిత్స–బహిరంగ చర్చ ద్వారా పార్లమెంట్ ప్రత్యేకమైన సుప్రీంకోర్టు చట్టాన్ని ఆమోదించడం. ఈ బహిరంగ చర్చలో సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న పౌర సమాజం, న్యాయవ్యవస్థ న్యాయవాద సంఘాలు, విభిన్న రాజకీయాభిప్రాయాలు గలవారు అంతా పాల్గొనాలి.’
– ప్రొ. అర్ఘ్యసేన్‌గుప్తా, 18–1–18 (సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్)
న్యాయవ్యవస్థకూ, ప్రభుత్వ పక్షంగా పాలకవర్గాలకూ మధ్య కొన్ని మాసాలుగా, ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లుగా ఏదో ఒక సంఘర్షణ తలెత్తడం కనిపిస్తూనే ఉంది. ఆయా సందర్భాలలో ప్రజా సమస్యల మీద, ప్రాథమిక హక్కుల రక్షణలో ప్రభుత్వాలు పక్కదారులు తొక్కినప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు అండదండలనిచ్చిన ఉదాహరణలు కూడా తక్కువేమీ కాదు. అందులో ఒకటి అత్యవసర పరిస్థితిలో సాధించిన విజయం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా తన పదవీ రక్షణ కోసం ఎమర్జెన్సీ విధించారు. బీజేపీ వారు సమయం వచ్చినప్పుడల్లా నాటి అత్యవసర పరిస్థితి ప్రకటన మీద విరుచుకుపడుతూనే ఉంటారు. కానీ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అదే రాజ్యాంగం పేరిట అనుసరిస్తున్న విధానాలు కూడా కాంగ్రెస్ పోకడలనే గుర్తు చేస్తూ, ప్రజాకంటకంగా మారిపోతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పాలకులు చేసిందీ, ఇప్పుడు బీజేపీ–ఎన్డీఏ పాలకులు కూడా చేస్తున్నదీ ఒక్కటే– రాజ్యాంగ నిబంధనలను, ఆదేశాలను, సెక్యులర్ వ్యవస్థా నిర్దేశాలను ప్రజాహితంగా అమలు చేయడంలో దారుణంగా విఫలం కావడం.
పెడధోరణులు నిజం
కార్య నిర్వాహక అధికారాల పేరిట న్యాయవ్యవస్థ నిర్వహణలో నేరుగానో, నర్మగర్భంగానో బీజేపీ పాలకులు జోక్యం చేసుకునే స్థితికి చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి సుప్రీంకోర్టు, ధర్మాసనాలు, ప్రధాన న్యాయమూర్తి, కొందరు న్యాయమూర్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిళ్లకు లోనవుతున్నట్టు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని కేసుల విచారణ, కొన్ని ధర్మాసనాలు, వాటికి కొన్ని కేసుల కేటాయింపు తీరుతెన్నులు ప్రజాక్షేత్రంలో చాకిరేవుకు అవకాశం కల్పించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న ‘పాక్షిక ధోరణి’ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జస్టిస్ చలమేశ్వర్, మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహిం చడం సంచలనం కలిగించింది.
ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ఆ నలుగురు కూడా కాదనలేదు. కానీ ఆ కేటాయింపులు న్యాయ వ్యవస్థ నిర్వహణ యంత్రాంగం కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తికి సరి సమానులైన తోటి సీనియర్ న్యాయమూర్తులను కూడా సంప్రదించాలని, తద్వారా కేసుల కేటాయింపు జరగాలని ఆ నలుగురు ఆకాంక్షించారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ నలుగురు ఒక విశిష్టమైన, విజ్ఞానదాయకమైన ప్రకటన జారీ చేశారు: ‘దేశం రుణం తీర్చుకోవడానికే మేం నలుగురు న్యాయమూర్తులం పత్రికా గోష్టిని ఏర్పాటు చేశాం. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఏ ధర్మాసనానికి బదలాయించాలన్న విషయం గురించి తలెత్తిన సమస్యే మేం పత్రికా గోష్టిని ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న కారణం’ (13–1–18).
నేతలనుబట్టి మారుతున్న న్యాయం
సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ నేత అమిత్ షాకు ప్రమేయం ఉందన్న ఆరోపణే ఈ కేసు నాలుగేళ్లు నానడానికి అసలు కారణమన్న మాట ఉంది. అమిత్ షా నిర్దోషి అని కింది కోర్టు ప్రకటించినప్పటికీ, జస్టిస్ లోయా హఠాన్మరణం పూర్వరంగంలో ఈ కేసును తిరగదోడాలని బొంబాయి న్యాయవాదుల సంఘంలో మెజారిటీ సభ్యులు, ఒక పత్రికా రచయిత, ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారు. ఇది అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామం గురించి పిటిషనర్ల తరఫున వాదించిన సుప్రీం కోర్టు న్యాయవాదులు దుష్యంత దావే, ఇందిరా జైసింగ్ ఇలా ప్రకటించారు: ‘లోయా మృతి కేసును పునర్విచారించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించడానికి చెప్పే కారణాల్లో తీవ్రమైన వైరుధ్యాలున్నాయి. జస్టిస్ లోయా మరణం విషయంలో స్వతంత్ర విచారణ జరక్కుండా నిరోధించడంలో ఆసక్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి మరెవరో కాదు, మీ కక్షిదారుడేనని, అతనే అమిత్‌షా అనీ దావే, అమిత్‌షా తరఫున వకాల్తా వహించిన సుప్రీం లాయర్ సాల్వేకు చెప్పారు’ (‘ఫ్రంట్‌లైన్’: హిందూ గ్రూపు, 16.2.18). ఇదొక్క కేసే కాదు, యూపీ, ఒరిస్సాలలోని మెడికల్ కాలేజీ వ్యవహారాల్లో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్న రిటైర్డ్ జడ్జి విషయంలో విచారణ జరపడానికి ప్రధాన న్యాయమూర్తి తాత్సారం చేశారని కూడా నలుగురు న్యాయమూర్తులూ అభియోగం మోపడంతో వ్యవస్థ పరువు బజారున పడినట్టయింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యమనేది ‘అత్యంత అభ్యుదయకర ధర్మాసన చైతన్య శక్తి’గా వర్ణిస్తూ, ఈ ‘పిల్’ సుప్రీంకోర్టు రూపురేఖలనే మార్చి, ప్రజల న్యాయస్థానంగా మారుస్తుందని ఆశించినవారు జస్టిస్ జీబీ రెడ్డి. జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ‘నా న్యాయ చట్టం మనిషి జీవితానికి విరుద్ధంగా నడిచే పక్షంలో ఆ చట్టాన్ని తుంగలో తొక్కేయడం మంచిది కాని, దాన్ని సవాలు చేయడం కాదు’ అన్నారు. అంతేగాదు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు (దాని వెనుక ఒక ముఖ్యమంత్రి, ఒక న్యాయమూర్తి నడిపిన కథ కూడా బట్టబయలయింది).
పిల్ అంటే ఎందుకు ఆగ్రహం?
తాజా పరిణామం అంత కంటే దారుణం – ఉన్నావ్‌లో జరిగిన బాలిక అత్యాచారం కేసులో న్యాయం జరగాలని కోరుతూ అడ్వకేట్ ఎం.ఎల్. శర్మ సుప్రీంలో ‘పిల్’ దాఖలు చేశారు. ‘లైంగిక వేధింపులకు గురైన బాలిక తరఫు బంధువు నీకెవరైనా ఉన్నారా? నీవు బాధితుడివి కాదు కదా! రేప్ కేసులకు నీకు సంబంధం ఏమిటి?’ అని ధర్మాసనమే ప్రశ్నించింది. ఇది సబబా? ఇంతకూ అసలు రహస్యం– ఒక బీజేపీ లెజిస్లేటర్ ఈ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బీజేపీ నాయకుడి కేసులో అనుకూల తీర్పు చెబితే రూ. 100 కోట్ల నజరానా ఇస్తారని బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహిత్ షా జస్టిస్ లోయాకు ఆశ చూపినట్టు ఒక ఆరోపణ ఉంది. తమ సోదరుడు జస్టిస్ లోయాయే తమకు ఈ సంగతి చెప్పాడని ఆయన తోబుట్టువులు అనూరాధ బియాని, సరితా మంధానీ చెప్పారు.
ఇది నిజమా? అబద్ధమా? ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లోయా కేసుకు ‘భరత వాక్యం’ పలకడంతో కథ కంచికి వెళ్లినట్లేనా? వెళ్లినా గానీ పార్లమెంటులోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి అనేక ఆరోపణలు సంధించి ప్రధాన న్యాయమూర్తిపైన చరిత్రలో తొలిసారిగా అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే దాని పర్యవసానం ఏమిటి? మిరాజ్‌కర్ కేసులో ఒకసారి సుప్రీంకోర్టు గొప్ప వ్యాఖ్యానం చేసింది: ‘రహస్యమనే కారు చీకటిలో, దుష్ట ప్రయోజనాలతో అడుగడుగునా దుర్మార్గపు ఆలోచనలు కళ్లాలు లేని గుర్రాలుగా స్వైర విహారం సాగిస్తాయి’. సరిగ్గా ఇలాంటి అంధకారంలోనే నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు పత్రికా గోష్టి నిర్వహించి వెలుతురును ప్రసాదించారు.
‘ఈ వెలుగును ఆర్పేసి, అంతర్గతంగా తమ మధ్య సర్దుబాట్లు చేసుకుంటూ సమస్యను తమలో తాము సర్దుకోవడం అంటే తలెత్తిన తీవ్రమైన మౌలిక సమస్య కోరుకుంటున్న శాశ్వత పరిష్కారానికి విరుద్ధమని గమనించాల’ని ఒక లీగల్ పండితుడు గొంతు విప్పాడు. సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల తరఫున దేశాన్ని, జాతిని ఉద్దేశించి విడుదల చేసిన (12.1.18) అపూర్వ సందేశం నిరాడంబరతకు, నికార్సయిన దేశభక్తికి అరమరికలు లేని నిండు మనస్సుకు ఉద్దీపన శక్తిగా భావిం చాలి: ‘నేటినుంచి ఇరవైయ్యేళ్ల తరువాత న్యాయమూర్తులమైన మమ్మల్ని – జస్టిసెస్ చలమేశ్వర్ రంజన్ గోగోయి/లోకూర్/కురియన్–తమ ఆత్మల్ని అమ్మేసుకుని, అత్యంత కీర్తిగన్న సుప్రీం సంస్థ ప్రయోజనాల్ని గాలికి వదిలేసి పోయారని ఏ జ్ఞాని, విజ్ఞానీ భావించకుండా ఉండేందుకే ఇప్పుడే ఈ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాం’. ఈ పరిణామాల దృష్ట్యానే ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల పదవుల్ని కూడా ప్రజాస్వామీకరించాలని, ఒక వ్యక్తి వద్దనే అధికారాలు కేంద్రీకృతమై ఉండరాదని ఇది కేసుల బదలాయింపులో, న్యాయమూర్తులకు కేటాయించే ధర్మాసనాల విషయంలో (రోస్టర్స్) చాలా అవసరమని చెప్పారు.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment