
తలాక్ విషయంలో ముస్లిం దేశాలే మారుతున్నప్పుడు మనం మాత్రం మారకూడదా? అని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. కానీ, ముస్లిం సమాజంలో ‘సంస్కరణ’కు ఉద్దేశించినట్టు చెబుతున్న ‘తలాక్’ రద్దు బిల్లును సివిల్ చట్ట పరిధుల్లో పరిష్కరించకుండా క్రిమినల్ చట్టపరిధుల్లోకి ఎందుకు తీసుకొచ్చినట్లు? హైందవ సమాజాన్ని అన్ని కోణాలనుంచి సంస్కరించడం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లును నేటికీ సంస్కరించరేం? విడాకుల సమస్యను మన ధర్మశాస్త్రాలు సివిల్ తగాదాలుగా పరిగణించాయి. కాని వాటిలోని మంచిని పక్కనబెట్టిన బీజేపీ పాలకులు మన ఇంటి గుట్టును పట్టించుకోకుండా మతప్రాతిపదికపైన సమస్యలను జటిలం చేయబోవడం సమర్థనీయం కాదు. హిందూ సమాజం ఇంతగా పరివర్తనకు వ్యతిరేకంగా ఎందుకు స్తబ్దతను చేజేతులా కొని తెచ్చుకుని వందల ఏళ్లుగా కుంటుకుంటూ రావలసి వస్తోంది?
‘‘ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పేసి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని పౌర చట్టం కింద నేరంగా మాత్రమే కాకుండా క్రిమినల్ లా కింద నేరంగా పరిగణిస్తూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా ఆమోదించడంతో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది’’
– పత్రికా వార్త (30–07–2019)
‘‘మనదేశంలో లౌకిక రాజ్య వ్యవస్థ (సెక్యులరిజం) మౌలిక సూత్రా లను ఉల్లంఘించడమంటే, ప్రజాస్వామ్య జీవనం మూలాలనే ఉల్లంఘిం చడమని మరవరాదు’’
– ప్రముఖ రాజకీయ శాస్త్రాచార్యులు నీరా ఛందోక్
‘తలాక్’ పద్ధతిని రద్దు చేస్తూ ప్రతిపాదించిన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాదా మన ఇంటిగుట్టును విప్పకుండా దాచిపెడుతూ ఒక ప్రకటన చేశారు. ‘తలాక్ విషయంలో ముస్లిం దేశాలే మారుతున్నప్పుడు మనం మాత్రం మారకూడదా? అందులోనూ ఇప్పటికే 20 ముస్లిం దేశాలు తలాక్‌ను నియంత్రించా య’ని మంత్రి చెప్పారు. అంటే మార్పు, లేదా పరివర్తన అనేది మన సొంతమే కాదు, అన్ని ప్రపంచ దేశాలలోనూ తరతమ వ్యత్యాసాలతో వివాహ వ్యవస్థల్లోనూ, సామాజికంగానూ కాలానుగుణంగా అనివార్య పరిణామమే. అయితే బీజేపీ పాలకులు చట్టంగా రూపొందిస్తున్న ‘తలాక్’ రద్దు బిల్లుకు నైతికమైన బలం కొరవడుతోంది. ఎందుకంటే ఆ బిల్లుకు లేదా రేపటి చట్టానికి వివిధ కోణాలనుంచి బలం చేకూరాలంటే, సుమారు డెబ్బై ఏళ్లుగా వెలుగు చూడకుండా రాజకీయ పాలకులు కట్టిన ముళ్ల కంచెల నుంచి ఈ రోజుకీ వెలుగు చూడని ‘హిందూ కోడ్ బిల్లు’ను కూడా, హైందవ సమాజాన్ని అన్ని కోణాలనుంచి సంస్కరించడం కోసం బయటకు లాగవలసిన అవసరం ఉంది.
బీజేపీ పాలకులు ముస్లిం సమాజంలో ‘సంస్కరణ’ పేరిట ఉద్దే శించినట్టు చెబుతున్న ‘తలాక్’ రద్దు బిల్లును సివిల్ చట్ట పరిధుల్లో పరి ష్కరించకుండా క్రిమినల్ చట్టపరిధుల్లోకి ఎందుకు తీసుకురావల్సి వచ్చిందో సమాధానం చెప్పగలగాలి! నేనొక ముస్లిం పెద్దకు ఒక ప్రశ్న వేశాను. మూడుసార్లు ‘తలాక్’ చెప్పి, ఆకస్మికంగా ముస్లిం పురుషుడు భార్యకు విడాకులివ్వడం న్యాయమా అని. దానికి ఆ ముస్లిం పెద్ద చెప్పిన సమాధానం హిందూ సంప్రదాయంలో భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు, తగాదాలు, ఘర్షణల ఫలితంగా విసుగెత్తి భార్యను భర్త, లేదా భర్తను భార్య వదిలించుకోవాలన్నప్పుడు వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత బంధువులు ముందు ఏ పద్ధతి అనుసరిస్తారో అదే సంప్ర దాయం ముస్లిం కుటుంబాలలో కూడా ఉంటుందని, ఆయన చెప్పాడు. అంటే మూడుసార్లు ‘తలాక్’ చెప్పడమంటే తెగతెంపులకు ముందు తమ కాపురాన్ని చక్కదిద్దుకోడానికి మరోసారి ప్రయత్నించమని, ఆ ప్రయత్నం మూడుసార్లు కొనసాగాలన్నదే అసలు ఉద్దేశమని, ఇదే ‘షరియత్’ నిబంధనల సారాంశమని ఆ ముస్లిం పెద్ద వివరించారు.
మనకూ తెలుగులో భార్యాభర్తల తగాదాలు, కుమ్ములాటలు, తెగే దాకా ఎవరో ఒకరు సమస్యల్ని సాగలాగడం గురించి నీతిపాఠాలన దగిన సామెతలున్నాయి: ‘ఆలు మగల మధ్య తగాదాలు’ నిలిచేది ‘పీటమీద ఆవగింజంత సేపే’ (అంటే జారిపోవడం)నని, మొగుడి మీద భార్యకు, భార్యమీద భర్తకు ‘కోపతాపాలు పొద్దుగుంకేవరకే’ననీ లౌక్యంగా మందలించడం. కనుకనే విడాకుల సమస్యను ధర్మశాస్త్రాలు సివిల్ తగాదాలుగా పరిగణించాయి. హైందవ సంస్కృతిలో ఈ మాత్రం మంచి సంప్రదాయాన్ని మరిచిపోయి పక్కనబెట్టిన బీజేపీ పాలకులు మతప్రాతిపదికపైన సమస్యలను జటిలం చేయబోవడం సమర్థనీయం కాదు.
తలాక్ రద్దు బిల్లు ద్వారా భార్యాభర్తల మధ్య విడాకుల సమస్యలను సివిల్ తగాదా పరిధి నుంచి తప్పించి క్రిమినల్ దావాగా మార్చడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య తగాదాల పరిష్కారాన్ని క్రిమినల్ దావాగా మార్చి నిందితుడైన భర్తను మూడేళ్లదాకా జైల్లో నిర్బంధించి, అతనికి బెయిల్ ఇచ్చే సమస్యను మేజిస్ట్రేట్ విచక్షణకు వదలడంవల్ల ఆ దంపతులు సమాధానపడటానికి లేదా రాజీ పడటా నికి గల అవకాశాల్ని కూడా తోసిపుచ్చడమవుతుంది ఒక సామాజిక దురాచారాన్ని పరిష్క రించడానికి ఇదే మార్గమా? అలాగే, ఇప్పుడు ‘తలాక్ రద్దు’ బిల్లు ఇటు పార్లమెంట్ ఆమో దం పొందిన 24 గంటల్లోనే, ఆ మరునాడే ఈ బిల్లు పేరిట మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణలలో కేసులు, అరెస్టులు ప్రారంభమయ్యాయి.
అందాకా ఎందుకు, అసలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1950 దాకా రాజ్యాంగ నిర్మాత హోదాలోనేగాక కాంగ్రెస్ నాయకత్వంలోని జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఆయన క్యాబినెట్‌లో ఉండి, దేశానికి వర్తించే ఉమ్మడి హిందూ కోడ్ బిల్లును స్వయంగా ఎందుకు ప్రవేశ పెట్టించ వలసి వచ్చింది? హిందూ సమాజంలో తరతరాలుగా కుల, మత, వర్గ, వర్ణ చట్రంలో మగ్గుతూన్న దళిత బహుజన, అణగారిన నిరుపేదల, మైనారిటీల మౌలిక ప్రయోజనాలను సహితం కాపాడగల సమగ్రమైన ‘హిందూ కోడ్ (సివిల్ కోడ్)’ బిల్లును పండిట్ నెహ్రూచే ప్రధానమంత్రి హోదాలో రూపకల్పన చేసి, ప్రవేశపెట్టించారు. అయితే సమాజంలో దగాపడిన, పడుతున్న దళిత బహుజనుల్ని, మహిళా లోకాన్ని సమగ్ర మైన హిందూ కోడ్ బిల్లు ద్వారా బయటపడవేయాలన్నది అంబేడ్కర్ తపన.
అయితే ఈ మార్పు హిందూ సమాజంలోని సంపన్న వర్గాలకు నచ్చదు కాబట్టి, ఎంతగా సోషలిస్టు సెక్యులర్ భావాలతో తొలి దశలో ప్రేరేపితుడైనప్పటికీ పండిట్ నెహ్రూ ‘హిందూ కోడ్ బిల్లు’ లోని ‘వివా హాలు, విడాకులు’ అన్న విభాగానికే కుదించాలని, మిగతా విషయాలు ప్రస్తావించరాదనీ పట్టుబట్టడంతోనే అంబేడ్కర్ నెహ్రూ మంత్రి వర్గం నుంచి తప్పుకోవలసి వచ్చిందని మరవరాదు. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో శాస్త్రాల్ని, వాటి పాఠ్యాన్ని కూడా తొక్కిపట్టేలా దుష్ట సంప్రదాయాన్ని పెంచి, పోషిస్తూ వచ్చారు. నిజానికి ఈ శాస్త్రాలన్నీ సవ్యమైన వివాహ సంబంధాలకే అనుకూలం’ అని కూడా అంబేడ్కర్ అన్నారు.
శాస్త్రాలు నిర్ణయించిన ‘స్త్రీ ధనాన్ని’ కూడా కాజేయడానికి విడాకుల రాయుళ్లు ఎత్తులు వేస్తూ అరాచకాన్ని నేటి సమాజంలో సృష్టించడం మనం చూస్తున్నాం. పైగా గతంలో ఎన్నడూ లేనంత అరాచక ప్రవ ర్తనను చదువుకున్న మగధీరుల్లో కూడా గమనిస్తున్నాం.
వీరి ప్రవర్తన చివరికి బజారు మూకలకు, ‘ఆవారా’గాళ్లకూ ఆదర్శం కావడమూ చూస్తున్నాం. ఏ రోజునా స్త్రీల హత్యలు, వివాహిత స్త్రీల పైన, బాల బాలి కలపైన మనం ఎన్నడూ ఎరుగని అత్యాచారాలను రోజూ వింటున్నాం, వీడియోల పుణ్యమా అని ఇంతకుముందెన్నడూ ఎరుగని వింతలూ, దుర్భర ఘటనలూ వింటున్నాం. దేశానికి ఆదర్శప్రాయమైన పౌరస్మృతి (సివిల్ కోడ్) రావడానికి సామాజిక, ఆర్థిక రంగాలలో సమగ్ర సంస్క రణలు తొలిమెట్టు అని అంబేడ్కర్ భావన. ఈ మౌలిక ప్రతిపాదనలను చేసినందుకే, తనకు కాంగ్రెస్ ప్రతిబంధకాలు సృష్టించింది. చివరికి నెహ్రూయే బిల్లును అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడానికి నిర్ణ యించి, మళ్లీ మనసు మార్చుకోవలసి వచ్చింది. ఇంతకూ హిందూ సమాజం ఇంతగా పరివర్తనకు వ్యతిరేకంగా ఎందుకు స్తబ్దతను చేజే తులా కొని తెచ్చుకుని వందల సంవత్సరాలుగా కుంటుకుంటూ రావ లసి వస్తోంది? ‘దాయభాగ– మితాక్షర’ న్యాయమార్గాల కుమ్ములాటల మధ్య వందల ఏళ్లుగా ఆడపిల్లల జీవితాలు నలిగిపోవలసి వచ్చిందని గుర్తించాలి. అందుకే దోపిడీ సమాజ వ్యవస్థలో మహిళలు కూడా ‘దళిత జీవులే’నని అంబేడ్కర్ ప్రకటించాల్సి వచ్చింది.
ఋగ్వేదం పురుష సూక్తంలో (10వ మండలం– 19వ సూక్తం) ‘పురుషుడు పరమ స్వార్థపరుడు’ అని వర్ణించింది. ఎందుకని? ఆ పురు షుడు ఎలా ఉంటాడు? ముఖం చూస్తే బ్రాహ్మణుడు, చేతులు క్షత్రియు లని, తొడలు వైశ్యులని, శూద్రులు తదితరులు మాత్రం కాళ్లనుంచి పుట్టుకొచ్చారట. బహుభార్యత్వానికి కూడా ఋగ్వేద కాలంలోనే శాంక్షన్ పొందారు. పెళ్లి, తదితర విందు గుడుపుల కోసం గుర్రాలు, గోవులు, గొర్రెల మాంసం విస్తారంగా వాడారు. (10వ మండలం– 91 శ్లోకం) ఆ మాటకొస్తే ‘మాంసం లేకుండా విందు భోజనం ఉండరాద’ని ఫర్మానా ఆనాడే విడుదల చేశారు (‘నా మంసో మధు పర్కం భవతి’) మరొక్క మాటలో చెప్పాలంటే, ఋగ్వేదంలోని తొలి 9 మండలాల్లో లేని నాలుగు కులాలు (చాతుర్వర్ణాలు) నాలుగు వర్ణాలుగా అవతరించినా చాలక దళితులన్న పేరిట అయిదో కులావతరణకు ప్రారంభోత్సవం చేశారు.
‘ఎద్దు లేదా ఆబోతు మాంసోదనం నేతిలో వండుకుని తినాల’న్న బృహ దారణ్యకానికి టీక రాసినవారు శ్రీమాన్ శంకరాచార్యులు. బహుశా అందుకే ‘రామచరితమానస్’ రాసిన తులసీదాసు (15వ శతాబ్ది) ఋగ్వేద పురుషులకు, వారి ప్రాచీనులకు నిష్కామ కర్మలతో పనిలేదు, కోర్కెలను సాధించుకోవడమే వారి పని– అందుకే వారు కాముకులే గానీ నిష్కాములు కారు అన్నాడు. కనుకనే వేదం ‘కోరికే మనస్సులో పుట్టిన ప్రథమ రేతస్సు’ అన్నాడు. అది చచ్చే కోరిక కాదు, మీకైనా, నాకైనా, మోదీ, అమిత్‌షాల కైనా. ఈ అనంత ‘కోరిక’ల మధ్య ఎవరిని దృష్టిలో పెట్టుకొని మహాకవి మనల్ని మసలమంటున్నాడో చూడండి: ‘అతణ్ణి జాగ్రత్తగా చూడండి/స్వతంత్ర భారత పౌరుడు/అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి/ అతని యోగ క్షేమాలకు అంతా పూచీ పడండి/అతికించండి మళ్లీ అతని ముఖానికి నవ్వు’!!
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment